Friday, May 13, 2022

నల్లచిరుత - పార్ట్ 8

 #నల్లచిరుత - పార్ట్ 8


***************


ప్రస్తుతం - నల్లదమయంతి ఉన్న ప్రదేశం


**************


నల్లసీమ అనగానే అదిరిపడ్డ పసుప్పచ్చబట్టల మేచకుడు "ఆ నల్లదేబె ను ఇటు పిలవండి" అన్నాడు


హుటాహుటిని పోయి నల్లదేబెను పిలుచుకునివచ్చారు అక్కడి పరిచారకులు 


వచ్చీ రాగానే నల్లదేబెను చెంప ఛెళ్లుమనిపించాడు 


"మూర్ఖపుమొండరి,  సంవత్సరాలుగా మనం హద్దులు దాటని నల్లసీమలోకి అడుగుపెట్టి వీళ్ళను తీసుకువచ్చావా?" అని ఇంకో సారి ఛెళ్ళుమనిపించాడు 


నల్లదేబె వాచిపోయిన బుగ్గలు తడుముకుంటూ "దొరా! నల్లకాలిక ఎక్కడ ఉన్నా తీసుకురమ్మని మీదే కదా ఆజ్ఞ. కష్టపడి కనుక్కుని ఈడుచుకు వస్తే ఇదా నాకు బహుమతి" అని ఏడుపు మొహం పెట్టాడు


"నల్లకాలిక నల్లసీమకు పారిపోయిందా!" అని మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు మేచకుడు  


వెంటనే కుడిచెయ్యి పైకి ఎత్తి ఎడమచేతి బొటనవేలితో కుడిచేయి ఉంగరం వేలును తాకి అక్కడే పక్కన నిలబడుకుని ఉన్న నల్లజెముడుకి సైగ చేశాడు 


నల్లజెముడు వెంటనే 


మాతి భరమణ ఇస్స

హంతా మారిసి నూక్క 


అంటూ మంత్రాలు మొదలుపెట్టి చేతులు నాగుపాములా మెలివేసి దమయంతి వద్దకు రావటం మొదలుపెట్టాడు


దమయంతి యుద్ధవిద్యల్లో ఆరితేరిన పిల్ల, కానీ ఈ నాగబంధం ఏమిటో ఎప్పుడు చూడలేదు 


ఎందుకైనా మంచిదని శరీరాన్ని ఉత్తేజపరిచి యుద్ధానికి సిద్ధమైపోయింది


దగ్గరకు వచ్చిన నల్లజెముడు దమయంతి మొహం దగ్గర ఒక్కసారిగా నాగబంధం సడలించాడు


దమయంతి అసంకల్పితంగా చప్పున రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకున్నది


నాగబంధం విడచిన నల్లజెముడు చేతిలోంచి వచ్చిన ఏదో పసుప్పచ్చ విభూతి దమయంతి మొహాన పడవలసింది, అడ్డుపెట్టిన చేతులు మీద పడింది  


ఆవెంటనే నల్లజెముడు నోట


హెక్క వాచి హక్క

హక్క పోవ ఛక్కి 


అన్న మాట వినపడటం, ఆ వెంటనే ఒక పసుప్పచ్చ బిలం తెరుచుకోవటం, దమయంతిని ఆ బిలం లాగేసుకోవటం జరిగిపోయింది


దమయంతి అదృశ్యం అయిన వెంటనే నల్లదేబె "దొరా! మాయా విభూతి ఆమె మొహాన కాకుండా చేతుల మీద పడ్డది. ఇక్కడ జరిగిందంతా ఆమె మర్చిపోదు" అన్నాడు


అందరూ ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు ************


ఎర్రజఘన రాజ్యం - రభి, మేచకుడు, చిన్నా 


************


"ఆకునుదురు వాళ్ళా?" అని ఈసారి ఆశ్చర్యపడటం నల్లమేచకుడి వంతు అయ్యింది 


"వాళ్ళను ఎన్నో సంవత్సరాల క్రితమే అంతర్గ్రహమ్మీద పాతిపెట్టేసాంగా? వాళ్ళతో మీకు తలకాయనొప్పులేమిటి రభీ?" అని అడిగాడు 


కత్తి తీసి రక్తభిషకుడి తల నరికి తీసుకునిపోదామనుకున్న చిన్నాకు ఏమీ అర్థం కావట్లా


రక్తభిషకుడు చిన్నాను పట్టించుకోకుండా "మేచకా! అనుమానం లేదు వాళ్ళే! బతికే ఉన్నారు. గత అయిదు రోజుల్లో అనూహ్యంగా ఎవరూ ఊహించని సమయంలో ప్రత్యక్షమై నా రాజ్యంలో ఎంతోమందిని ఎత్తుకుపోయారు. మూడు రోజుల క్రితమే మీ వదినను..." అంటూ గొంతు గద్గదమవగా ఆగిపోయాడు 


"ఆఁ వదిన.... ఏమయ్యింది? చెప్పు" అని మేచకుడు ఏదో ఉపద్రవం శంకిస్తూనే అడిగాడు 


"మీ వదినను పొట్టనబెట్టుకున్నారు..." అని బావురుమన్నాడు    


మేచకుడి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయ్యింది


రక్తభిషకుడిని కావలించుకుని సముదాయించాడు 


"ఇంత పాపానికి ఒడిగడతారా? అయితే మీ నాన్నను, మా పెద్దదొరను....." అంటూ ఆగిపోయాడు


"మీ వదినను హత్య చేసినట్టే మా నాన్నను హత్య చేసింది కూడా వాళ్లే అయ్యుంటారు..... ఇంతకు ఇంతా ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు రక్తభిషకుడే కాదు" అన్నాడు 


"నువ్వు నిశ్చయంగా చెప్పగలవా వాళ్ళు ఆకునుదురు వాళ్ళేనని?" అని మళ్ళీ అడిగాడు మేచకుడు రభి ని


"ఇదిగో సాక్ష్యం" అంటూ నడుముకు ఉన్న పట్టాలోనుంచి తీసి మేచకుడి చేతిలో ఒక శివకంతం పెట్టాడు


అయిదు మూలలతో ఉండే ఆ శివకంతాన్ని చూసి మేచకుడి భృకుటి ముడిపడింది 


"అనుమానం లేదు! వాడిదే ఇది. ఎక్కడ ఉన్నాడో పట్టుకుని ఇంతకు ఇంతా తీర్చుకోవాలి" అన్న మాట వచ్చింది మేచకుడి నోతినుంచి


"వేగులను పంపాను. వాడు, వాడి వాళ్ళు అంతర్గ్రహం మీద లేరు. ఇంకెక్కడికో స్థావరం మార్చారు. అది పట్టుకోవాలి ఇప్పుడు" అన్నాడు రక్తభిషకుడు 


"చిన్న దొరా! ఇది మనం అనుకున్నదానికి భిన్నంగా మారిపోయింది! కాస్త ఆలోచించి చేయల్సిన పనులు వేరే ఉన్నాయ్. ఇప్పటికి వెనక్కి వెళ్ళిపోదాం! అక్కడ నానమ్మను ఒక్కదాన్ని వదిలేసి వచ్చాం! ఆవిడను కూడా ఏమన్నా చేస్తారేమో! వెళ్ళిపోదాం పదండి" అని చిన్నాకు వివరించాడు మేచకుడు 


"అయితే తాతను పొట్టన పెట్టుకున్నప్పుడు ఒకడి ఒంటి మీద నుంచి జారిన ఈ రక్తపింజరవస్త్రం వీళ్ళది కాదా?" అని అడిగాడు చిన్నా


"ఏదీ చూడనీ" అని ఆ వస్త్రం లాక్కుని చూసి "ఇది మా రాజ్యం నుండి ఎత్తుకుపోయిన వాళ్ల ఒంటి మీద ఉండే వస్త్రం. ఇది ఉపయోగించి, అనుమానం మా మీదకు వచ్చేట్టు చేశాడన్నమాట" అంటూ రౌద్రాకారం దాల్చాడు రభి 


"రభీ! ఇప్పుడు మేము వెళ్ళిపోతాం! వచ్చే పదిరోజుల్లో వదిన గారి అంతిమ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని, మా సీమకు రా! అక్కడ మాట్లాడుకుందాం!" అంటూ మేచకుడు చిన్న నల్లెజెముడు ఇచ్చిన విభూతి గాల్లోకి విసిరి ఏదో మంత్రం చదివాడు 


వందల్లో ధవళబిలాలు తెరుచుకున్నాయ్


చిన్నా సైగతో మేచకుడి ఆజ్ఞతో అందరూ ఆ ధవళబిలాల్లోకి దూకారు ***************


ప్రస్తుతం  


*************


పసుప్పచ్చ బిలం నుంచి నల్లసీమలోకి వచ్చిపడ్డ దమయంతి నేల మీద నుంచి లేచి దుమ్ము దులుపుకుని పరుగు పరుగున రాజభవనానికి వెళ్ళింది


అక్కడ నల్పాదేవిని చూసి "అమ్మమ్మా! నీకో సంగతి చెప్పాలి" అంటూ తను ఎదురుకున్నది మొత్తం పూసగుచ్చినట్టు నల్పాదేవికి చెప్పింది 


ఆశ్చర్యపోవటం నల్పాదేవి వంతు అయ్యింది


ఆవిడ ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా దమయంతి ప్రశ్నల మీద ప్రశ్నలు వెయ్యటం మొదలుపెట్టింది


(సశేషం....) 

No comments:

Post a Comment