Friday, May 13, 2022

నల్లచిరుత - పార్ట్ 7

 #నల్లచిరుత - పార్ట్ 7


*************


పెద్ద నల్లచిరుత చనిపోయిన రెండవ రోజు


*************


ధవళ బిలాల్లోకి దూకి మాయమైన చిన్నా, మేచకుడు, సైన్యం అంతా ఎర్రజఘన సామ్రాజ్యంలో వెలిసారు 


అంతమంది చేతుల్లో ఎన్నో ఆయుధాలు 


కఠోరకుఠార గదాదండ భిండివాల కరవాల ముసల ముద్గర తోమర భల్లాంగ ప్రాస పట్టిస కోదండ శర చక్ర ముష్టిసంబగళ గదా త్రిశూల పరశు లవనిలాంగోష్ఠ్యసి క్షురి కౌతళ వంకుళీ యమదండ నారసజముదాళ శక్తిప్రముఖ ఆయుధాలు ధగధగ మెరిసిపోతున్నాయ్ (* ఛేంజ్ ఇఫ్ నీడెడ్) 


దిగటం దిగటం కనపడినవాడిని కనపడినట్టు ఊచకోత కోసేసారు


మేచకుడి రథం శరవేగంగా రాజభవనం వైపు పరుగుతీసింది 


ఆ రథచక్రాల కింద వందలాది మంది నలిగిపోయారు


చిన్నా అధిరోహించిన నల్లగుర్రం కూడా మేచకుడి వెనకాలే పరుగులు తీసింది 


ఉన్నట్టుండి దిగిన ఈ రుద్రగణ సమాన మేచక సేన సాగిస్తున్న మారణకాండ కోలాహలం విని భవన సింహద్వారం వద్ద సైనికులు అప్రమత్తులైపోయారు 


వేలల్లో గుమిగూడారు 


మేచకుడు భీకరోత్సాహంతో, చింతనిప్పుల్లాంటి కళ్ళతో, అత్యంత ఉగ్రరూపంతో సింహద్వారం చేరాడు 


ఆ రూపం చూడగానే అక్కడి సైనికుల్లో బెంబేలు మొదలయ్యింది


ఇంతకుముందు ఒకసారి చుట్టపు చూపుగా వచ్చినప్పుడు సభ జరుగుతుండగా రాజముఖ్యుల్లో ఒకరు ఏదో మేచకుడి మీద నోరు జారాడని ఒకే ఒక్క వేటుకి తలతీసి శూలానికి తగిలించి "ఇంకెవరన్నా మాట్లాడతారా?" అని హుంకరించిన వీరభద్ర రూపం గుర్తుకువచ్చింది కొంతమందికి


అసలు ఈ అకస్మాత్తు దాడి ఏమిటీ అన్న ఆలోచనలో పడిపోయారు కొంతమంది 


ఈ మేచకుడి ముందు నిలవటం కన్నా ఇప్పుడు పారిపోయి బతికితే, బలుసాకు తిని కాలం గడపవచ్చు అని పారిపోయారు చాలామంది 


కొందరు చచ్చి పడిపోయినారు


కొందరు ఎక్కడ చోటు కనపడితే అక్కడ కనపడకుండా దాక్కున్నారు 


కొందరి అవయవాలు కదలటం మానేసినాయి


కొంతమందికి గుండెలు ఝల్లుమన్నాయి


అయినా ధైర్యం కూడగట్టుకుని యుద్ధహెచ్చరిక నగారా మోగించారు


రక్తభిషకుడికి చేరేలా


రక్తభిషకుడు ఆ ఎర్రజఘన రాజ్యానికి రాజు


గొప్ప బలశాలి, మహాయోధుడు 


రాజ్యమంటేనూ, అందులోని ప్రజలంటేనూ గొప్ప అభిమానం ఉన్నవాడు


వాళ్ళ మీద చీమ కూడా వాలనివ్వని మనస్తత్త్వం ఉన్నవాడు  


ఏడడుగుల ఎత్తు 


మెడనిండా కపాలమాలలు 


అట్లాటి రక్తభిషకుడు ఆ నగారా వినీ వినగానే ఉన్నపళంగా ఆయుధం అందుకుని సింహద్వారం వైపు బయలుదేరాడు 


అతని వెనకాల ఉరుకులు పరుగులుగా సేన 


ఇంతలో మేచకుడి రథవేగాన్ని అందుకుని దాటేసి వచ్చేసాడు చిన్నా


వచ్చీరావటంతోటే సింహద్వారం వద్ద ఉన్న సేన అంతా చెల్లాచెదరు చేసేసాడు 


ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు విల్లును సారిస్తున్నాడో తెలియనంత వేగం


కన్నుమూసి కన్ను తెరిచేలోగా వందమంది హతం 


అది చూసి సింహద్వార కాపలా సైనికులు బెంబేలెత్తి పోయి తప్పించుకునే వీలు లేక సింహద్వారం తెరిచేసి లోపలికి పరుగులు పెట్టారు 


బతికుంటే ఎన్నో సింహద్వారాలు మళ్ళీ కాపలా కాయవచ్చని 


అంతే! 


మేచకుడి మిగతా సేన అంతా లోపలికి చొరబడింది


ఊచకోత అనే పదం కూడా మ్రాన్పడిపోయింది ఆ విధ్వంసం చూసి 


"ఏయ్! ఎవడ్రా అదీ" అని ఇంతలో ఒక కేక!


అందరూ అటుచూశారు 


రక్తభిషకుడు వాయువేగంతో వచ్చేసాడు


అతన్ని అతని రూపాన్ని చూసి ఒక నిమిషం ఆగారు మేచకుడి సేన అంతా


మేచకుడి రథం ముందుకు వచ్చింది 


మేచకుణ్ణి చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు రక్తభిషకుడు


"మేచకా! నువ్వా! ఏమిటీ దారుణం? ఎందుకింత విధ్వంసం" అని అన్నాడు


"మా రాజ్యానికొచ్చి మా తాతను హత్య చేసింది కాక ఎందుకని అడుగుతున్నావా సిగ్గులేక! నీ పుచ్చె లేపేసి ఈరోజు నాతో తీసుకొనిపోకపోతే నా పేరు నల్లచిరుత కాదు" అన్న సమాధానం వచ్చింది ఇటు పక్కనుంచి 


ఎవరా అని అటువైపు చూసి చిన్నా ను గుర్తించి మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు రక్తభిషకుడు 


"మీ తాతను మేం చంపటమేమిటి? మతి ఉండే మాట్లాడుతున్నావా పిల్లకుంకా?" అని అన్నాడు


"నంగి మాటలతో తప్పించుకోవాలని చూడకు, నరకానికి నగ్నంగా పరిగెత్తిస్తా!" అన్న సమాధానం వచ్చింది చిన్నా నుండి


మేచకుడు ఒక నిమిషం ఆగాడు


ఆలోచనలో పడ్డాడు


రక్తభిషకుడితో చిన్నప్పటినుంచి స్నేహం - చెడ్డ పనులు చేసేవాడని తెలుసు కానీ ఏ నాడు అబద్ధం చెప్పడని కూడా తెలుసు. చేసే చెడ్డపనులు కూడా నిర్భయంగా బయటకు చెప్పే చేసేవాడనీ తెలుసు. ఇప్పుడు తను హత్య చేయించలేదని అంటున్నాడంటే అందులో అబద్ధం ఉండదు అని తన సేనకు సైగ చేశాడు 


"రభీ! నువ్వు హత్య చేయించలేదా?" అంటూ తన చిన్ననాటి స్నేహితుణ్ణి అప్పటి ముద్దుపేరుతో ప్రశ్నించాడు 


"లేదు! నాకేం అవసరం? మా తలనొప్పులే మాకు చాలా ఎక్కువగా ఉన్నవి ఆ ఆకునుదురు వాళ్ళతో! అసలేం జరిగింది?" అన్నాడు రభి 


(సశేషం... ) 


No comments:

Post a Comment