Wednesday, January 12, 2022

అనగనగా

 #అనగనగా


ఎప్పటిదో కాలం


పరమాత్ముడు మహాశివుడు కైలాసంలో నిర్మలంగా ఒకానొక ఉదయం బాసిపట్టు వేసుకుని ధ్యానించుకుంటున్న కాలం


ఆ సమయంలో కాపలా కాస్తున్నాడు


ఎవరా కాసేది?


ఇంకెవరూ? 


నందీశ్వరుడు


ఎవరు వచ్చి మహాదేవుడి ధ్యానం భగ్నం చేస్తారోనని అతిజాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు


ఇంతలో అక్కడికి ఒక ముసలి సన్యాసి వచ్చాడు


కాపలాగా ఉన్న నందీశ్వరుడి దగ్గరకు వచ్చి - "అయ్యా! ఆ పరమాత్ముణ్ణి దర్శించుకోవాలని వచ్చాను. చూడవచ్చా? దారి వదులుతావా?" అని వినమ్రంగా అడిగాడు


"కుదరదయ్యా! పెద్దాయన ధ్యానంలో ఉన్నాడు. ఇప్పుడు నిన్ను లోపలికి పంపిస్తే ఆయన ధ్యానం భగ్నం అయిపోతుంది. వెళ్ళిపోయి సాయంత్రం రా! అప్పుడు ఖాళీగా ఉంటె పంపిస్తా లోపలికి" అన్నాడు నంది


సన్యాసి ఒక్కసారిగా ఉసూరుమన్నాడు


"అయ్యా నేనెక్కడినుంచో, అంధక దేశం నుంచి వస్తున్నాను. చాలా దూరం. ఇక్కడ ఎవరూ నాకు తెలియదు కూడాను. వెళ్ళిపోయి సాయంత్రం రమ్మంటే ఎలా వచ్చేది. బాబ్బాబు, కొంచెం దయ ఉంచి ఆయన దర్శనం ఇప్పిస్తే నా గోడు చెప్పుకుని వెళ్లిపోతా" అన్నాడు ఆ ముసలాయన


"కుదరదని చెప్పానా!" అని కసిరాడు నంది 


ఇక ముసలాయనకు దారి లేక, "సరే, సాయంత్రం దాకా ఇక్కడే ఈ పక్కల మూలకు కూర్చుంటానులే" అని ఆ ద్వారం పక్కనే ఉన్న అరుగు మీద కూలబడ్డాడు


నంది పట్టించుకోకుండా తన కాపలా పని తను చేసుకుంటున్నాడు


ఇంతలో ఈ హడావిడి, ఈ మాటలు అవీ వినపడి పరమాత్ముడు కళ్ళు తెరిచి "నందీ" అని సౌమ్యంగా పిలవటం జరిగింది


హుటాహుటిన పరుగులెత్తాడు నంది పరమాత్ముడి వద్దకు


అక్కడకు పోయి చేతులు కట్టుకుని నిలబడ్డాడు - "ఆజ్ఞ ఏమిటి దొరా?" అంటూ


మహాదేవుడన్నాడు - "ఎవరాయన, ఎందుకు వచ్చాడు? వయసులో పెద్దాయన కదా, అలా ఆయన క్షేమ సమాచారాలు కనుక్కోకుండా, తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా అలా అక్కడ కూర్చోపెట్టావేమి. ఇలా రమ్మను ఆయన్ని" అని


నందికి చెమటలు పట్టినాయ్ ఒక్కసారిగా


"తప్పు జరిగింది మహప్రభూ!" అంటూ పరుగెత్తి ముసలాయన దగ్గరకు పోయి ఆయనను తోడుకొని తెచ్చాడు నంది


ముసలాయన పరమాత్ముణ్ణి చూడగానే కన్నీరు మున్నీరయ్యాడు. ఒళ్ళు జలదరించింది. మైమరచిపోయాడు ఆ సుందరమూర్తిని చూడగానే. ఒక రెండు నిమిషాలు మాట లేకుండా అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయాడు


పరమాత్ముడు ఆయన రెండు నిమిషాలు ఆయనకిచ్చి, ఆ తర్వాత నెమ్మదిగా "ఏమండీ! అంత దూరం నుంచి, ఎక్కడో దేశానికి కిందనున్న దేశం నుంచి ఇలా వచ్చారు. ముందు ఈ నీళ్ళు తాగండి" అంటూ జటాజూటంలోంచి గంగమ్మను కాస్త నీటిని విడవమని చెప్పి ఆ నీళ్ళు ఇచ్చి ఆయన్ని సేద దీర్చాడు


ఆయన సేదదీరింతర్వాత, తను వచ్చిన పని చెప్పుకున్నాడు


ఏమని?


"పరమాత్మా, మా రాజ్యంలో భాష అంతా నాశనమైపోతోంది. అందరూ భ్రష్టు పట్టిపోయారు. ఎంత చక్కనైన భాష మాది. ప్రపంచంలోనే అతి తియ్యనైన భాష. మాట్లాడినా, రాసిన తేనెలు కురిపించే భాష. అట్లాటి దానిని, ఆ తెలుగును ఎంతగానో నిర్లక్ష్యం చేసి నాశనం చేసేస్తున్నారు. ఎట్లాగైనా ఒక దారి చూపిస్తావని వచ్చాను" అని తన పని వివరించాడు 


పరమాత్ముడు నవ్వి ఆ ముసలాయనతో ఒక పద్యం చెప్పాడు 


ఏమా పద్యం?


ఇదిగో

    

శేషశాయి 'అ ' కారమై చెల్వుగులుకఁ

బద్మభవుడు 'క్ష ' కారరూపము ధరింపఁ

నగ్ని బీజ రేఫము రుద్రుఁడై వెలుంగ

'నక్షర ' పదమ్ము మూర్తిత్రయాత్మకమగు


ఆ పద్యం చెప్పి, "మన దేశంలోని ఏ భాషకైనా సరే "అక్షరం" మూల ఆయువు. ప్రధాన వాయువు.ఆ అక్షరాన్ని త్రిమూర్తులమైన మేము ఆవరించి ఉంటాం. ఏ శరీరానికైనా ఆయువు వాయువులో ఉంటుంది. ఆ వాయువును కలుషితం చేసిననాడు, ఆ శరీరం భ్రష్టు పట్టిపోవాల్సిందే! అగ్నిలో మసి అయిపోవాల్సిందే! ఒకనాడు దేవభాష అయిన సంస్కృతాన్ని దూరంగా పారత్రోలి, అక్షరానికి మూలస్తంభాలైన మహావిష్ణువుకు బ్రహ్మకు స్వస్తి పలికారు. దానితో నా వంతు బాధ్యతగా ఆ భాషను మానవులకు అందకుండా అగ్ని పాలు చేసేసాను. అగ్నిలో కాలి పునీతమైన ఆ దేవభాష మా వద్ద ప్రశాంతంగా బతుకుతోంది ఇక్కడ. మీ వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు. దానిని మార్చగలిగేది మేము కాదు. మీరే! అది మీ బాధ్యతే! ఇవ్వటం వరకే మా ఇది. రక్షించుకునేది మీరే. తప్పులు హద్దు మీరితే ఇచ్చినదానిని తిరిగి పునీతంగా మా వద్దకు తెచ్చేసుకుంటాం" అని ఆ ముసలాయనకు వివరణ ఇచ్చాడు


ఆ వివరణ విన్న ముసలాయనకు ఏం చెప్పాలో తెలియక, వేరే దారి లేక, అక్కడినుంచి తెలుగు దేశానికి తిరిగి వచ్చి ఆ సందేశం అంధక రాజ్య ప్రజలకు వినిపించాడు


అంధక రాజ్యంలోని ఆ అంధకులు, ఆ అంధులు విని బాగుచేసుకున్నారో, నిర్లక్ష్యం చేసారో తెలియదు కానీ తెలుగు భాష మటుకు అగ్నిలో పునీతం అవ్వటానికి పాడె ఎక్కి సిద్ధంగా ఉన్నదని తెలియవచ్చింది 


అట్లా ఓం తత్ సత్ జరిగింది 


-- ఓనాడు 2017లో వానమామలై వరదాచార్యుల వారు రాసిన పద్యం చదివినాక (ఈ అనగనగాలో పరమాత్ముడు చెప్పిన పద్యమే అది) రాసుకున్న కథ

No comments:

Post a Comment