Tuesday, November 23, 2021

ఈ పాట వింటే తాతయ్య గుర్తుకొస్తాడు

ఈ పాట వింటే తాతయ్య గుర్తుకొస్తాడు

తాతయ్య గుర్తుకొస్తే ఈ పాట గుర్తుకొస్తుంది

వేసంకాలంలో ఇంటిబయట ఉన్న చెట్టు కింద పడకలు

బావి చప్టాకు కాస్త ఆవలగా ఒక వసారా

చలికాలంలో ఆ వసారాలో వరసగా పడకలు 

పిల్లలకు చిన్న మంచాలు వేసి పడుకోబెట్టేది అమ్మమ్మ

తాతయ్య పొద్దున్నే కాలంతో, ఋతువుతో సంబంధం లేకుండా నాలుగున్నరకల్లా లేచి బావి దగ్గర స్నానం చేసేవాడు

నాకు బొక్కెన బావిలో పడే చప్పుడికి మెలకువ వచ్చేసేది

మిగతావాళ్ళు బండనిద్ర వాళ్ళు కనక పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు

అలా బండనిద్ర పోయేవాళ్ళు సుఖజీవులు

సుఖజీవుల సంగతి పక్కనబెడదాం

బొక్కెన తీసి ఆ ఎత్తునుంచి, అంటే ఆయన ఆరడుగుల మనిషి, అంత ఎత్తునుంచి చక్కగా నున్నగా ఉన్న గుండు మీద నుంచి జారిపోతూ గోచీ మీదనుంచి కింద పాదాలదాకా వచ్చేప్పుడు ఆ నీళ్ళు చేసే చప్పుడు భలే విచిత్రంగా ఉండేది ఆ నిశ్శబ్ద వాతావరణంలో 

అమ్మమ్మ అప్పటికే స్నానం పూర్తి చేసుకుని ఆయన స్నానం పూర్తి అయ్యే సమయానికి తుడుచుకేందుకు తువ్వాళ్ళు, కట్టుకునేందుకు పంచె, అంగవస్త్రం, మిగతావి అన్నీ పక్కనే ఉన్న దణ్ణెం మీద వేసి పెట్టేది 

తువ్వాలుతో ఆయన తుడుచుకునే విధానం గమ్మత్తుగా ఉండేది

తువ్వాలు అటు ఇటూ చివర్లు పట్టుకుని చేతులు వెనక్కి పెట్టి ముందు మెడ, వీపు, నడుము దాకా సరళరేఖలో తుడిచేవాడు - సరిగా కన్ను మూసి కన్ను తెరిచేలోగా నీటిచుక్క లేకుండా తుడుచుకుని పోయేది

తర్వాత పొడి వస్త్రం ఒకటి కట్టుకుని లోపల తడిసిన గోచీ తీసేసి మళ్ళీ తువ్వాలుతో కాళ్ళ దాకా తుడుపు

చివరికి తువ్వాలుతో పాదాలను మటుకు పామాల్సిందే 

తువ్వాలుతో బరబర రుద్ది పారేసి పైపైన కాస్త కొబ్బరి నూనె పూసుకునేవాడు 

అదంతా అయ్యాక బావికి అటువైపున చిన్న తడిక ఉన్న గది ఉండేది, అక్కడ పొడిబట్టలు అవీ కట్టుకుని పూర్తిగా విభూతులు అవీ రాసేసుకుని చేయవలసిన శాస్త్రీయ కార్యక్రమాలు చేసి, బయటకు వచ్చేవాడు

అప్పుడు చూడాల్సిందే ఆ ఆరడుగుల అందం 

రోజూ చూసినా ఈ రోజు ఇంకా భలేగా ఉన్నాడే అనిపించేది 

ఆ విభూతి కుంకం మహత్యమో, ఆ బట్టల మహత్యమో, ఆ నిర్మలమనస్తత్త్వమో తెలియదు కానీ ఒక రకమైన తేజస్సు మస్తుగా ఉండేది 

మంచం మీద లేవకుండానే ఇవన్నీ చూస్తూ ఉండేవాణ్ణి 

ఆయన లేచిన టయముకే మాలో ఎవరన్నా లేస్తే ఆయన మడికి ఎక్కడ అడ్డం పడతామో అని అమ్మమ్మ వార్నింగ్ ఇచ్చేది రాత్రి పడుకోబెట్టబోయేముందే 

తర్వాత సైకిలెక్కి 7, 8 మైళ్ళు తొక్కుకుంటూ మోపిదేవి వెళ్ళిపోయేవాడు 

ఆ సుబ్రహ్మణ్యానికి స్నానాలు, అలంకారం చేయించటానికి 

మధ్యాహ్నంకల్లా మళ్ళీ సైకిలు తొక్కుకుంటూ ఇంటికి

ఆయన జీవితంలో 95 శాతం సుబ్రహ్మణ్యానికి అంకితం

డెబ్భై ఏళ్ళు ఇదే రొటీను నాకు తెలిసి 

సంవత్సరంలో 360 రోజులు సుబ్రహ్మణ్యం దగ్గర హాజరీ 

మిగిలిన అయిదు రోజులు తనకోసం అట్టిపెట్టుకునేవాడు

పిల్లలను చూట్టానికో, అలా వేరే ఏదన్నా ఊరు వెళ్ళిరాటానికో

అట్లాటి తాతయ్య, ఆయన ఇది గుర్తుకువస్తుంది నాకు ఎందుకో ఈ పాట విన్నప్పుడల్లా 

ఇంతకీ ఏం పాట అది?

ఇదిగో ఈ కింద లంకెలో ఉన్నది

ఇది ఇంతకుముందు పంచుకోలా

ఎందుకంటే నాకున్న మాయరోగం వల్ల

ఈ పాట మూడు విధాలుగా పాడవచ్చు

అతి నెమ్మదిగా, మధ్యస్థంగా, వేగంగా 

పాడేవాళ్ళు ఉన్నారు

నాకు మధ్యస్థానికి వేగానికి మధ్యలో ఉండి వినపడాలి ఈ పాట

అప్పుడే కళ్ళు మూసుకుని ఆ లోకానికి వెళ్ళిపోయి వింటా

ఈ పాటలో స్వరం నన్ను కళ్ళు మూసుకోనివ్వకుండా కిందుగా ఉంటుంది

అందుకని పంచుకోలా

నెమ్మదిగా పాడటం వల్ల వచ్చే కొన్ని లోటు పాట్లను పూడ్చటానికి గమకాలు పాడాల్సి వస్తుంది

ఆ గమకాలు సరిగా పడవు ఒక్కోసారి

నేను పాడి తగలడలేకపోయినా అపశ్రుతి చప్పున పట్టుకు చావగలను

అదో దరిద్రమైన అలవాటు నాకు

ఇక్కడ మొదటి చరణం వచ్చేదాకా అపశ్రుతులు పడ్డాయి

అందుకని పంచుకోలేదన్నమాట

అయితే నాకు తాతయ్య కనక ఈ పాట పాడిన ఆవిడకూ తాతయ్యే అవుతాడు కనక, ఈరోజెందుకో పొద్దున్నుంచి ఆయనే ఎందుకో ఏ కారణం లేకుండా గుర్తు వస్తూండటం మూలాన బయటివారెవరో పాడిన పాట పంచుకోవటం ఎందుకని మా ఆవిడ పాడిన పాటే పంచుకుంటున్నా 

ఇదే పాట నాకు నచ్చే విధంగానే పాడేది ఇంతకుముందు 

ఛానలు పెట్టాక, మిగతా వాళ్ళు పాడిన ఇదే పాట వాళ్ళ గొంతుల్లో యూట్యూబు నిండా అలా నెమ్మదిగా శోకసంద్రంలా ఉండటం మూలాన పీర్ ప్రెషరులో పడిపోయి తను కూడా అలానే పాడి పబ్లిష్ చేసింది

సరే, ఇక ఇక్కడికి ఆపేసి - ఇదిగో ఇక్కడ పాటకు లంకె - https://youtu.be/ltT9P2BRto8 

వినండి 

నాయనా సుబ్రహ్మణ్యం, పైకొచ్చేసిన మా తాతయ్య నీ దగ్గరే ఉన్నాడని, నువ్వు ఆయన చేతే అలంకారం చేయించుకుంటున్నావని తలుస్తూ, ఆశిస్తూ

ఓం తత్ సత్!

No comments:

Post a Comment