Saturday, November 20, 2021

రాసిన 750 తెలుగు కథల్లో ఒకానొక కథ

 #అనగనగా

అనగనగా

ఎప్పటిదో కాలం

పరమాత్ముడు పరమశివుడు కైలాసాన్ని సృష్టించుకున్న కాలం

కైలాసంలో గృహప్రవేశం చేయటానికి ముహూర్తం నిశ్చయించాడు

ఏమా ముహూర్తం?

ప్రదోష సమయం

ప్రదోష సమయం అంటే మునిమాపు వేళ

మునిమాపు వేళ అంటే సూర్యుడు అస్తమించడానికి ముందు, వెనుక మూడేసి ఘడియలు కలిపి మునిమాపు వేళ అంటారు

ఎందుకు ఆ ముహూర్తం నిర్ణయించాడు?

గృహప్రవేశానికి వచ్చేవారికి సౌకర్యంగా ఉంటుందని

రోజువారీ పనులు చక్కబెట్టుకుని ప్రశాంతంగా వస్తారని ఆ ముహూర్తం నిశ్చయించాడు

సరే, ఆ గృహప్రవేశానికి  శ్రీమహావిష్ణువు కూడా వెళదామనుకున్నాడు

గృహప్రవేశానికి వెళుతూ ఒట్టి చేత్తో వెళితే ఏం బాగుంటుందని ఆలోచిస్తూ ఉండగా మంచి బహుమానం తయారు చేసి ఇచ్చేవాళ్ళు కనపడక, చప్పున విశ్వకర్మను సృష్టించాడు

ఆ విశ్వకర్మకు సమస్త విద్యలు ప్రసాదించాడు

ప్రసాదించి - "ఏమోయ్ నాకు కొత్త రకపు బహుమానం ఏదన్నా చేసివ్వవయ్యా త్వరగా, అక్కడ పరమశివుడు కైలాస ప్రవేశానికి తయారైపోతున్నాడు" - అని తొందరపెట్టాడు

విశ్వకర్మకు గబుక్కున ఏమీ తోచలా 

"ఉండండి బాబూ, అన్నీ దడిలో పెట్టి తడిలో పెట్టి అన్నట్టుగా నాకేదన్నా ఇచ్చెయ్, నాకేదన్నా ఇచ్చెయ్ అంటే ఎట్లా చచ్చేది? ఆలోచించాలి కదా, ఉండండి ఒక్క నిమిషం" అని సమాధానమిచ్చి ఆలోచించటం మొదలెపెట్టాడు

విష్ణువుకు చిర్రెత్తింది ఆ సమాధానం విని

"సరే, నే వెళ్ళిపోతున్నా కైలాసానికి, నువ్వు ఏం ఆలొచిస్తావో, ఏం తయారు చేస్తావో నాకు తెలియదు. లక్ష్మి తయారు అవటానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఆవిడను తీసుకుని సరిగా నేను అక్కడికి చేరుకునేప్పటికి నువ్వు ఏదో ఒకటి తయారు చేసి అక్కడికి తీసుకొచ్చెయ్" అని లోపలికి లక్ష్మి దగ్గరకు వెళ్ళి "పదవమ్మా, పద పద" అంటూ ఆవిణ్ణి తొందర పెట్టటం మొదలుపెట్టాడు

ఇదంతా జరుగుతుంటే విశ్వకర్మకు ఆలోచన వచ్చింది

అమలులో పెట్టి ఒక బహుమానం తయారు చేసేసాడు

ఆ తయారీ అయ్యేలోపల లక్ష్మి అమ్మవారు తయారు అవ్వటం, వాళ్ళాయనతో కలిసి కైలాసానికి వెళ్ళటం జరిగింది

విశ్వకర్మ కూడా ఉరుకులు పరుగులు మీద కైలాసానికి చేరాడు

అక్కడ లక్ష్మి అమ్మవారి చేతిలో పెట్టాడు 

అమ్మవారి కళ్ళు జిగేల్ మన్నాయి

అంత బావుంది ఆ బహుమానం

సంపదల తల్లికే నచ్చేసింది ఆ బహుమానం

దాన్ని తీసుకుని పరమాత్ముడి దగ్గరకు వెళ్ళి - "అన్నయ్యా, ఇదిగో మా తరఫున గృహప్రవేశపు బహుమానం" అని ఆయన చేతిలో పెట్టింది

"ఏమిటి వదినా ఇది, చాలా బావుందే!" అని పార్వతి అమ్మవారు అడిగింది ఆ బహుమానాన్ని చూసి

విశ్వకర్మ అందుకుని "దాని పేరు తులాకోటి అమ్మా. అది ఆయన పాదాలకు ఒకసారి అలంకరించి చూడండి" అన్నాడు

అది విని పార్వతి అమ్మవారు దాన్ని పరమశివుడి పాదాలకు అలంకరించింది దాన్ని

అక్కడున్న అందరి కళ్ళు జిగేల్ మన్నాయి

కళ్ళు బైర్లు కమ్మినాయి ఆ తులాకోటి మెరుపులతో

ఆ ప్రాంతం అంతా ధగధగలాడిపోయింది 

పరమాత్ముడు ఆ పాదాలంకారం అయ్యాక, ఏమిటో చూద్దామని ఒక అడుగు వేసాడు

అంతే! 

ఠప్పున ఆ బహుమానం భూమి మీదకు జారి పదహారు శబ్దాలు చేసింది

ఏమిటా శబ్దాలు?

కి

రి

కి

ధి

గి

ణు

ఝం

అంటూ పదహారు శబ్దాలు వినిపించాయి

ఎంతో శ్రావ్యంగా వినిపించాయి

ఇంతకీ ఏమయ్యింది ఆ బహుమానానికి?

విశ్వకర్మ చేతిలో బహుమానం పట్టుకుని పరుగులు పరుగులు పెట్టటం మూలాన ఆ బహుమానం కాస్తా తన చుట్టులోంచి కాస్త వదులయ్యింది

ఆ వదులు కావటం కావటం తులాకోటిలోని తులలు జారిపోయినాయి

అలా జారినవి భూమి మీద పడి ఆ శబ్దాలు చేసినాయ్

ఆ శబ్దాలే ఈ ప్రపంచానికి తాళ భిక్ష

ఆదితాళ భిక్ష

పదహారు తులలు పదహారు శబ్దాలు చేసిన కాలపు సమయం కాకపాదం అయ్యింది  

ఆ కాకపాదమే సంగీతంలో అనంతమైన తాళములకు ఆది పాదం, ఆదితాళం

అలా అందాకా నిశ్శబ్దమయమైన ఈ భూమి మీద సంగీతోత్పత్తి జరిగింది

తర్వాత తర్వాత తండుడు (నందికేశ్వరుడు) ఆ తాళాలను విస్తృత పరచి వాటికో రూపం కల్పించి పరమశివుడికి నివేదించగా, ఆయన మెచ్చి తాను ప్రతి ప్రదోషవేళ చేసే నృత్యానికి ఆ తండుడి పేరు పెట్టి "తాండవం" అనే దానికి నాంది పలికాడు

అలా ఓం తత్ సత్ అయ్యింది

- ఈవేళ ఏదో ఒక కథ రాద్దాం అనుకొని మొదలుపెట్టగా, వైష్ణవి వేసుకున్న గజ్జెల శబ్దం విని, అందెల మీద ఒక కథ రాసుకుందామని పర్యాయపదం చూడగా తులాకోటి అని కనపడింది. ఇదేదొ బాగుందే అని మా ఆవిడ సంగీతం పుస్తకం తీసి అందులోని తాళాలకు అన్వయించి రాసుకున్న కథ...ఇది డ్రాఫ్టు కథేనండోయ్..దీనికి కొన్ని పద్యాలు అవీ చేర్చి పూర్తి చేస్తా తర్వాతెప్పుడైనా! 

#అనగనగా 

Gopireddy Srinivas Reddy - మొన్నామధ్య మీరు చిన్నపిల్లల కథలు బాగుంటాయని ఎక్కడొ అన్నారు... ఇది చిన్నపిల్లలకు చెప్పటానికి బాగుంటుందని అనుకుంటూ మీకు అంకితం చేసేస్తున్నా... 🙂

Sreenivasa Rao Pappu saar - Oh btw - Audio is here - This old audio presentation of this story by you is here -  http://www.maganti.org/audiobooks/kidstories/tulakoti.mp3 and looking at the stats it has reached 6,894 clicks (probably downloads too) already... so your voice rocks and people love it...so keep doing it for any story you like! 

No comments:

Post a Comment