Tuesday, September 15, 2020

మానిశి సంతతిలోని వాళ్ళని మనుషులు అని పిలవటం మొదలుపెట్టారు!

 #అనగనగా


అనగనగా

అనగనగా ఒక ఊరు

ఆ ఊళ్లో అందరూ గంధర్వులే

ఆ ఊరి పక్కనే అడవి

ఆ అడవిలో ఎన్నో జంతువులు

అన్ని జంతువులుంటే మరి రాజు గారు ఉండాలిగా?

ఉన్నాడు

అన్నిటికీ రాజుగారు ఉన్నాడు

ఎవరా రాజుగారు?

ఇంకెవరూ?

ఎలుగుబంటిగారు

ఆయన పేరు జాంబుడు

మహా తెలివి కలవాడు

మహా బలవంతుడు

మహా శాంతం కలవాడు

ఏదైనా ఇట్టే పట్టేసేవాడు

ఆయన పాలనలో అంతా సరిగా జరిగిపోతోంది

అడవికి సంబంధించినంతమటుకు సరిగా జరిగిపోతోంది

అంతా మంచి మర్యాదగా సాగిపోతోంది

అయితే మంచివాళ్ళు ఉన్న అన్ని చోట్లా మూర్ఖులూ ఉంటారు

అలాటి మూర్ఖుడు ఆ అడవికి ఒక కోతి రూపంలో దొరికాడు

వాడి పేరు మానిశి

ఏదైనా బావున్నదంటే కడుపు ఉబ్బరించిపోయేది

బావున్నదేదీ బావుండకుండా చెయ్యడమే వాడి పని

చిందులు, గంతులు, వికారాలు ఒకటేమిటి అంతా నాశనమే

వాడి చేతిలో పడ్డదేదైనా నాశనమే

ఒకరోజు ఆ కోతి బాధలు పడలేక జంతువులన్నీ రాజుగారి దగ్గరకు వెళ్ళినాయ్

ఆయనతో మొరపెట్టుకున్నాయ్

"అయ్యా ఆ కోతితో వచ్చే బాధలు పడలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలి మీరు" అని మొరపెట్టుకున్నాయ్

ఆయనేం మాట్లాడకుండా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు

మిగిలిన వారికి ఏం అర్థం కాలా

"ఏమిట్రా, మనం ఇంత బాధ చెపుతూ ఉంటే ఆయనకు నవ్వులాటగా ఉందే!" అని గుసగుసలాడుకున్నారు

ఆ గుసగుసలు విన్నాడాయన

విని, "సరే నాతో రండి, మీకు కొన్ని చూపించాలి" అని అన్నాడు

"ఏమిటి చూపిస్తానంటున్నాడు?" అని ఆశ్చర్యపోతూ అన్నీ ఆయన వెంబడి పడి పోయినాయి

ముందుగా అగ్గికుంపటి దగ్గరకు తీసుకుపోయాడు

అక్కడ వాళ్ళందరినీ ఆపి - "ఈ అగ్గికి విరుగుడు ఏమిటి?" అన్నాడు

"నీళ్ళు" అని జంతువులు సమాధానం చెప్పినాయ్

"ఊ! బావుంది, పదండి" అంటూ ఆ తర్వాత అడవిలో చెట్లు లేని ప్రదేశానికి తీసుకెళ్ళాడు

అక్కడ చెట్ల నీడ లేదేమో, ఎండ భగ భగ మండిపోతోంది

అంతా ఉస్సురస్సురంటు ఉంటే - "దీనికి విరుగుడు ఏమిటి?" అన్నాడు రాజుగారు

"గొడుగో, నీడో" అన్నాయ్ జంతువులన్నీ

"ఊ! ఇదీ బావుంది, పదండి" అంటూ ఆ తర్వాత అడవిదున్న, గాడిదలు గుంపులుగా తిరిగే ప్రదేశానికి తీసుకెళ్ళాడు

అక్కడ అంతా కంగాళీగా ఉంది

గాడిదలు, దున్నలు అంతా ఒక దిశ, నిర్దేశం లేకుండా అటు ఇటు కాళ్ళు బోర్లాచాచుకొని కొన్ని, వెనక కాళ్ళెత్తి తన్నుతూ కొన్ని, కొమ్ములతో దుమ్ము రేపుతూ కొన్ని, ఓండ్ర పెడుతూ కొన్ని అంతా గందరగోళంగా ఉన్నది

"దీనికి విరుగుడు ఏమిటి?" అన్నాడు రాజుగారు

సమాధానం రాలా ఎవరిదగ్గరినుంచి

అప్పుడు రాజుగారు ఒక పెద్ద ముళ్ళకర్ర పుచ్చుకొచ్చాడు

అంతే, కర్ర చూడగానే అన్ని దున్నలు, అన్ని గాడిదలు చుప్ చాప్ అయిపోయినాయ్

ఒక వరసలోకొచ్చేసినాయ్

అది చూసి "ఓహో! కర్రలు చేతిలో పట్టుకోవటమేనన్నమాట" అన్నాయి జంతువులన్నీ

"ఊ! ఇదీ బావుంది, పదండి" అంటూ ఆ తర్వాత నెమ్మదిగా దారిలో నడుస్తూ ఉండగా ఒక మత్తగజం ఎదురయ్యింది

మదంలో ఉన్నప్పుడు దాన్ని పట్టటం ఎవరి తరం?

మదపు స్రావాలు కణుపుల నుంచి, కుంభస్థలం మీద నుంచి కారిపోతూ ఉంటే రచ్చ రచ్చ చేసిపారేస్తోంది

"దీనికి విరుగుడు ఏమిటి?" అన్నాడు రాజుగారు

"సింహం కానీ, అంకుశం కానీ" అన్నాయ్ జంతువులన్నీ

"ఊ! ఇదీ బావుంది, పదండి" అని ఆ తర్వాత పాములు ఉన్నచోటికి తీసుకెళ్ళాడు

ఆ పాములున్న చోట అప్పుడే ఒక పాము ఒక చిన్న బుజ్జి కుందేటి పిల్లను కాటేసింది

అది చూసి "అయ్యో, అయ్యో, ఆ పసరు ఇట్లా తీసుకురండి" అని అక్కడున్న కంతువులన్నీ ఆ బుజ్జి కుందేలుకు పసరు పట్టించి, మర్దించి దాన్ని కాపాడినాయ్

రాజుగారన్నాడు అప్పుడు "ఓ దీనికి విరుగుడు మీకు నేను చెప్పనక్కరలేదన్నమాట" అని ఆ పళాన అందరినీ తీసుకుని కోతి ఉన్న చోటికి వచ్చాడు

అక్కడ మానిశి చేసే పనులు, అల్లరి పట్టలేకుండా ఉంది

వాణ్ణి చూసి జంతువులన్నీ అన్నాయ్ - "చూసారా, చూసారా ఇదీ వీడి తతంగం. ఏదో ఒకటి చెయ్యాలి మీరు" అని

రాజుగారు అన్నాడు - "ఈ ప్రపంచంలో దేన్నైన బాగుచెయ్యవచ్చు కానీ మూర్ఖుణ్ణి బాగుచెయ్యటం, ఒకరు వీడిని దారిలోకి తేవటం , ఒకరు ఈ మూర్ఖత్వానికి విరుగుడు కనిపెట్టటం ఉండదు. వీడు పరమ మూర్ఖుడు. వీణ్ణి బాగుచెయ్యటం ఎవరి వల్లా కాదు. అందుకే మీరు ఇందాక వాణ్ణి బాగుచెయ్యమని అడిగినప్పుడు నవ్వాను" అని

అది విని జంతువులన్నాయీ - "అయ్యా! మరి ఎలా ఇది భరించటం?" అని

రాజుగారన్నాడప్పుడు - "ఉంది, విరుగు ఉన్నది. నేను ఒకరు కనిపెట్టలేరని అన్నాను కాని, అసలు విరుగుడే లేదని అనలేదుగా" అని

జంతువులన్నీ ఆశ్చర్యపోయినాయ్

"ఎలా ఎలా త్వరగా చెప్పండి" అన్నాయి

"ఇంకో రెండు నిమిషాలు ఆ కోతి వైపే చూస్తూ ఉండండి" అంటూ ఆయన కూడా మానిశి వైపు చూట్టం మొదలుపెట్టాడు

ఇన్ని జంతువులు తననే చూస్తూ ఉండేప్పటికి మానిశికి పైత్యం ఇంకా ఎక్కువైపోయింది

అప్పటిదాకా నెమ్మదిగా, చిన్నగా ఓ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మకు ఊగుతున్నవాడు కాస్తా పెద్ద పెద్ద ఊగులాటలు చెయ్యటం మొదలుపెట్టి, ఇంకా రెచ్చిపోయి పై పైకి వెళ్ళిపోయి అక్కడినుంచి గభాల్న ఒక అరమైలు దూరన ఉన్న చెట్టు వైపు దూకటంతో , అక్కడి కొమ్మలందక అంత ఎత్తు నుంచి కింద పడి నడుం విరిగి ముక్కలు చెక్కలై ఊరుకుంది

అది చూసి జంతువుల్లన్నీ అన్నాయ్ "ఓ! మూర్ఖుడికి వాడి మూర్ఖత్వమే విరుగుడన్నమాట" అని రాజుగారికి దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయినాయ్

అలా ఆ అడవిలో మళ్ళీ ప్రశాంతత లభించింది

అవమానం పాలైపోయిన ఆ మానిశి గాడు ఇక అడవిలో ఉండలేక కొద్దిసేపటి తర్వాత విరిగిన నడుముతో నెమ్మది నెమ్మదిగా దేక్కుంటూ పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్ళిపోయాడు

అక్కడ ఆ ఊళ్ళో నివసించే గంధర్వుల, జాలి, దయ వల్ల, సేవల వల్ల మళ్ళీ మామూలు కోతి అయ్యి అక్కడే ఎన్నో సంవత్సరాలు నివసించాడు

నెమ్మదిగా వాడి సంతతి అభివృద్ధి చెంది తర్వాత తర్వాత కోతి నుంచి మారి ఒక రూపం సంతరించుకొన్నది

ఆ మానిశి సంతతిలోని వాళ్ళని మనుషులు అని పిలవటం మొదలుపెట్టారు

వాళ్ళకు వాళ్ల తాత జన్యువులు మిగిలిపోవటం వల్ల ఆ మూర్ఖపు కోతి బుద్ధులు పోక ఇంకా మూర్ఖపు పనులు చేస్తూ సమాజానికి, ఈ భూమికి తలవంపులు తెస్తూనే ఉన్నారు

(కథ రాసుకొన్న తేదీ: 26 డిసెంబరు 2017)

****

దీనికి ప్రేరకం: భర్తృహరి శతకంలోని ఒక పద్యం/శ్లోకం.

ఈ క్రిందిదే అది


జలముల నగ్ని ఛత్రమున
జండమయూఖుని దండతాడనం
బుల వృషగార్దభంబులును
బొల్పగు మత్తకరీంద్రమున్ సృణిన్
జెలగెడు రోగమౌషధము
చే విషమున్ దగు మంత్ర యుక్తిని
మ్ముల దగ జక్క జేయ నగు
మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే!

ఇలా దీనికే కాక ఇంకో నలభైనాలుగు కథలకు కూడా ఆ భర్తృహరి శతకం కారణం....

ఆ నలభైనాలుగు కథలు 2018 ఆగష్టు వరకు రాసినాను భర్తృహరి గారి శతకభిక్ష మూలాన - సరిగ్గా - అన్నీ కలిపి ఒకటో రెండో పుస్తకాలుగా అచ్చు వేద్దామని అనుకున్న సమయానికి (డిసెంబరు 2018) ఈ గుండు బెజోస్ , వాడి అమెజానులో ప్రపంచంలోని చాలా భాషల పుస్తకాలను బాన్ చేస్తున్నాను అంటూ అందిట్లో తెలుగును కూడా కలిపి తెలుగు పుస్తకాలు తీసుకోవటం మానేసాడు. దాంతో హరి హర నారాయణ అయ్యింది. ఒక మంచి విషయమేమంటే గుండు బేజోసుడు ఆల్రెడి అమెజానులో ఉన్న తెలుగు పుస్తకాలు ఉంచుకోవచ్చు కానీ కొత్తవి మటుకు తీసుకునేది లేదన్నాడు...అలా అప్పటికే ఉన్న తెలుగు పుస్తకాలు ఇంకా జీవిస్తున్నాయ్... కొసప్రాణంతో!...

Prasuna Balantrapu, Vasantha Lakshmi Ayyagari - :)


No comments:

Post a Comment