Friday, September 6, 2019

పెండ్లాములను వర్ణించలేదు!

పెండ్లాము

అనగా తాను పెండ్లి చేసుకున్న ఆడుది

ఆలి, ఆలు, ఉగ్మలి, ఊఢ, అహలియ, కళత్రము, గరిత, గేహిని, జని, జాయ, ప్రోయాలు, బసాలు, అర్థాంగి ఇలా ఎన్నో పేర్లు ఉన్నవి పెండ్లామునకు

అది కాక ఒక్కొక్కని పెండ్లామునకు ఒక్కొ పేరు

అనగా ఒక్కొక్క కులములోని స్త్రీకి ఒక్కొక్క పేరు ఉన్నది అని నిఘంటువులు చెపుతున్నాయ్

అర్యి అంటే కోమటివాని పెండ్లాము ట

ఆచార్యాణి అంటే ఆచార్యుని పెండ్లాము ట

ఆభీరి అంటే గొల్లవాని పెండ్లాము ట

ఉపాధ్యాయాని అంటే ఉపాధ్యాయుని పెండ్లాము ట

ఇలా నానారకాలు

పోతే అనూఢ అంటే పెళ్ళికాని అమ్మాయ్ ట

ఇప్పుడు ఇంకాస్త దూరం వెడదాం

ఎక్కడిదాకా?

కవుల దాకా!

కవులు అనగా ఎవరు ?

కవిత్వము చెప్పువాడు

కవిత్వము ప్రధానముగా పాండిత్యాన్ని ప్రదర్శించేందుకు ఉపయోగపడునది

పాండిత్యము ప్రదర్శించాలనంటే కవి చెప్పేవాటికి అర్థము ఉండుట ముఖ్యము

కవి పిల్లవానికి జోల పాట పాడుతూ జో అచ్యుతానంద అంటూ రాయవచ్చును

ఆ కవే పిల్లవాని అల్లరిని దూషిస్తూ వీని దెవసము చెయ్య, ప్రాణాలు తోడివేయుచున్నాడు అంటూ రాయవచ్చును

ఒక కవి పిండాకూడు మీద, శ్మశానాల మీద, రక్తాల మీద, ఏడుపు కవిత్వము చెప్పవచ్చును

ఇంకొక కవి షడ్రసోపేతమైన భోజనము మీద ఆనంద కవిత్వము చెప్పవచ్చును

అందులోనూ పాండిత్యము ఉన్నది

ఇందులోనూ పాండిత్యము ఉన్నది

అందువలన అర్థవంతమైన పాండిత్యము ప్రదర్శించేవాడు కవి

సరే ఎక్కడిదాకా వెళదాము అని ప్రశ్న వేసుకుని ఇక్కడిదాకా అని సమాధానం చెప్పుకున్నాం

ఇప్పుడు ఎందుకు అక్కడిదాకా అన్న ప్రశ్న వేసుకుందాం

జవాబు దొరుకుంతుందేమో చూద్దాం

ఎందుకూ?

కవుల దాకా ఎందుకు వెళ్ళినాము?

పెండ్లాము అనే పదము వలన

అదేమి?

మోకాలికి బోడిగుండుకు లంకెలా ఉన్నది

తమరికి ఉన్న బోడిగుండువలన, అందులోని బోడి ఆలోచనల వలన అటుల అనిపించవచ్చును

అందుకు తమరిని తప్పు పట్టనక్కరలేదు

మీ జన్యువులు అటువంటివి

ఎవరేమి చెయ్యగలరు?

సరే, వెనుకకు వచ్చెదము

ఇప్పుడూ - పెండ్లాము అను పదము గొప్పది

మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవడికీ నష్టమూ లేదు

అటువంటి పదమును కవులు పట్టించుకొనరు

ఉదాహరణకు కాళిదాసును తీసుకొనుము

కాళిదాసు శకుంతలను తిమ్మిబమ్మిగా అతలాకుతలంగా వర్ణించినాడు

కానీ వాని పెండ్లామును అంత అందముగ వర్ణించలేదు

వాని కవిత్వములో అసలు ఆమె ఊసే లేదు

ఏమి రోగము వానికి?

ఒక కావ్యమునైనా - వాని పెండ్లాము మీద, వాని మీద రాసికొనవచ్చును కద?

శ్రీనాథుడు కన్యలను వర్ణించినాడు

వాని పెండ్లామును గూర్చి వర్ణించలేదు

వాని కవిత్వములో అసలు ఆమె ఊసే లేదు

ఎందుకో ఏమో!

సామాన్యముగ ఆనంద స్థితిలో కవిత్వము ఉద్భవించును

కాళిదాసుకు, శ్రీనాథునకు పెండ్లామును వర్ణించతగిన ఆనందస్థితి లభించలేదేమో, అందువలన తీరుమానము ఏమనగా కాళిదాసుకు, శ్రీనాథునకు వారి వారి పెండ్లాముల వలన ఆనందస్థితి లభించలేదు కనక వారి మీద కవిత్వము రాయలేదని

బ్రహ్మానందస్థితి లేక ఆ కసిని, ఆ లోటును కవిత్వము వైపు మరలించి ఇతరుల వర్ణించి పిండి పిసికి ఆరవేసినారని కూడా తీరుమానము చేయవచ్చునేమో

ఏమో!

పూటకూళ్ల అవ్వలను వర్ణించినారు

బిచ్చము వేసిన అమ్మలను వర్ణించినారు

కానీ ఇంటిలో అత్యంతాద్భుతమంచి భోజనము ఆ కవి మొఖమున తగలేసిన పెండ్లాములను దూరముపెట్టి ఆ కవులు వర్ణించలేదేమో

ఏమో!

పెండ్లాములను వర్ణించలేదు

అవ్వలు, అమ్మలు కూడా ఎవరో ఒకనికి పెండ్లాము కనక ఫరవాలేదని సరిపెట్టుకొనినారేమో!

ఈ అవ్వలను, అమ్మలను వర్ణించి ఒక రాజుగారికి అంకితమిచ్చు పద్ధతి పూర్వకాలములో ఉండెడిది కదా?

ఆ అంకితమిచ్చునప్పుడు ఆ రాజుగారిని, వాని పెండ్లామును, కొండొకచో స్వీయ వర్ణనము చేసికొనినారు కాని తమ సొంత పెండ్లాము గురించి ఊసు ఎత్తలేదు

పోనీ ఆవిడ చూడటానికి అంతగా బాగులేదే అనుకొందము

ఆవిడ వంట బాగుండవచ్చును కద?

ఆవిడ ఇల్లు సద్దుకొనుట బాగుండవచ్చును కద?

ఏదో ఒకటి బాగుండని మనుషులు ఎలా ఉంటారు?

అది వర్ణించి ఒక కవిత కానీ, కావ్యమును కానీ రాయలేదు మన ప్రముఖ కవులలో ఒకడు కూడా

కవిగారికి వాని పెండ్లామును బయట వేసుకొనుట ఇష్టము లేదేమో!

ఏమో!

కవిగారికి దూరపు కొండలు బాగా నునుపుగా కనిపించుట వలన ఇంటిలోని వజ్రము గరుకుగానుండెనేమో!

ఏమో!

లేక తన పెండ్లామే శకుంతల, తన పెండ్లామే వరూధిని, తన పెండ్లామే ఊర్వశి అన్న ఆలోచనతో నర్మగర్భముగా పుంఖానుపుంఖాల కవిత్వం రాసినారేమో!

ఏమో!

పెండ్లామును ప్రపంచమునకు పరిచయము చేయలేని మూర్ఖులా వారు?

ఏమో నాకు తెలవదు నాయనా!

నీకు తెలుసును అన్న సంగతి మటుకు నాకు తెలియును

అందువలన తీరుమానము మీది తీర్పు నీకు వదలివేయుచున్నాను 

మరి ఇందులోని చిక్కువిడని, అంతుచిక్కని రహస్యము ఏమిటో విజ్ఞులు గ్రహింతురు గాక!

ఏమో!

రహస్యము కనిపెడతారో లేదో

ఏమో!

ఓం తత్ సత్!

8 comments:

 1. ఎత్తుకుపోతారేమోనని భయమేమో! పొ ప న

  ReplyDelete
 2. కాదు కాదు మీ తీరుమానములన్నియు కడుంకడు తప్పై ఒప్పుచున్నటుల తోచుచున్నది.కవిగారి పేరుమీద అరుగుదెంచిన రాతలన్నియు అలనాడు పోతన వ్రాయలేక వదిలిన పద్యభాగమును రామభద్రుండు వ్రాసినట్లు కవిగారి పెండ్లామే వ్రాసి యుండనొపు.తనను తాను వర్ణించుకొనుట భావ్యముగాదు కావున ఇతరులమీద తన కల్పనా ప్రతిభను ప్రదర్శించి యుండి యుండవచ్చునని నాదు అభిప్రాయము. సహృదయులు గమనింతురుగాక.

  ReplyDelete
  Replies
  1. హహ.... ఏమో సార్! నిజమే అయ్యుండవచ్చు...

   Delete

Note: Only a member of this blog may post a comment.