Friday, July 19, 2019

ఒక పెరుగుపచ్చడి గురించి చెప్పుకొని ఇక్కడికి ముగిద్దాం...

టమేటో
టొమేటో
టమాట
రామ్ములక్కాయ్
టమాటర్
పుల్లొంకాయ్
తక్కాలిపండు

ఇవన్నీ దానికే పేళ్ళు

ఎన్నిట్లో వేసినా ఎంత వేసినా రుచి అదరహా

ఈ టమాట చరిత్రను పరికిస్తే - ఒక పిట్ట కథ కూడా చెప్పుకొనవలె

అనగనగా ఒక ఊరు

ఆ ఊళ్ళో ఒక ఆడకూతురు

దంటమాట అని ఆవిడ పేరు

నా అన్నవారు ఎవరూ లేక పూటకూళ్ళమ్మగా కాలం గడిపెది

అయితే ఆవిడ అన్నిటా చాలా మంచిది

వంట కూడా బ్రహ్మాండంగా చేశేది

ఆ రోజుల్లో అప్పటికింకా టమాట అని పేరు రాలేదు టమాటాకు

దాన్ని రామ్ములక్కాయ అని, పుల్లొంకాయ్ అని పిలిచేవాళ్ళు

ఆవిడకు ఆ రామ్ములక్కాయకు అవినాభావ సంబంధం ఉండేదా అన్నట్టు ఉండేది

ఏ కూర చేసినా పుల్లొంకాయ ఒక చిన్న రోట్లో వేసి దం దం అని దంచి పారేసి దాన్ని ఆ కూరలో కలిపేసేది

ఏ పప్పు చేసినా పుల్లొంకాయ ఒక చిన్న రోట్లో వేసి దం దం అని దంచి పారేసి దాన్ని ఆ పప్పులో కలిపేసేది

ఏ పులుసు చేసినా పుల్లొంకాయ ఒక చిన్న రోట్లో వేసి దం దం అని దంచి పారేసి దాన్ని ఆ పులుసులో కలిపేసేది

పెరుగులో కూడా కలిపేసి తిరగమోత పెట్టేది

జనాలు చచ్చిపోయేవాళ్ళు ఆ రుచికోసం

నాలికలు వేళ్ళాడుతూ ఉండేవి లాలాజలం కారిపోతూ

అట్లా ఆ పుల్లొంకాయతో ఆవిడ పేరు మారుమోగిపోయింది దేశదేశాల్లో

కాలం తీరిపోయి ఒకానొక రోజు పోయింది

ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆవిడ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని, ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించగా చించగా ఒక తెలివైన వాడికి తట్టిన ఉపాయంతో, ఆ పుల్లొంకాయ పేరు - ఆవిడ దం దం అని చప్పుడు చేస్తూ కచ్చా పచ్చా చేసిపారేసే ఆ పదార్ధానికి - "టమాట" గా నామకరణం అయిపోయింది

ఆ రోజటి నుంచి ప్రపంచం ఏ మూలకెళ్ళినా టమాట అనే పిలుస్తున్నారు

అదీ సూక్ష్మంగా టమాట చరిత్ర

పోతే, అనగా పిట్టకథ పక్కనబెడితే దంటమాటలు అని వ్యవాహారికమునుంచి పీకుకొని వచ్చి దీనికి టమాట అని పేరు పెట్టినారని నా ఉవాచ

దంటమాటలు అంటే ప్రౌఢంగా ఉండే మాటలు అని అర్థం

ఈ పండు, కాయ దేనిలో కలిపితే అది రుచిలో ప్రౌఢంగా మారిపోతుంది

తెలుగు వాడు ఎక్కడికి వెళ్ళినా ప్రౌఢంగా ఉంటాడు

కొంతమంది ప్రత్యేకంగా తెలుగువాళ్ళు ఆ ప్రౌఢాన్ని అహంకారం అనుకుంటారు

కాని అసలు సంగతి జన్యువులు తెచ్చే ప్రౌఢత్వం

ఎవణ్ణైనా యెహా అని తోసి రాజనే ప్రౌఢత్వం

యమా మానసిక బలం

తిట్టుకొన్నా తిమ్ముకొన్నా తెలుగువాణ్ణి, వాడి ప్రౌఢత్వాన్ని మించింది ఈ ప్రపంచకంలోనే లేదన్న మాట సమస్త తెలుగువారు ఒప్పుకొనవలసిందే

అంత ప్రౌఢంగా ఉండేవాడికి తిండి కూడా అంతే ప్రౌఢంగా ఉండాలి కాబట్టి టమాటాను సృష్టించుకొనినాడు

ఇంత బారు సోది చెప్పుకున్నాం కాబట్టి ఒక పెరుగుపచ్చడి గురించి చెప్పుకొని ఇక్కడికి ముగిద్దాం

కావలసినన్ని టమాటాలు తీసుకో

చక్రాల్లాగా తరిగెయ్

రాత్రి తోడేసిన పెరుగు ఒక స్టీలు గిన్నెలోకి తీసుకో

ఒక ఆరడుగుల దూరం వెనక్కి జరుగు

చక్రం ఒకటి తీస్కో

కన్ను ఒకటి ముయ్

ఇంకో కన్నుతో పెరుగు గిన్నెను చూడు

చెయ్యి వంక - చక్రం వంక ఒక సారి చూడు

చక్రాన్ని గురిగా వదులు

పెరుగు గిన్నెలో పడిందా నీ దురదృష్టం

పెరుగంతా చింది అదంతా సుబ్బరం చేస్కోలేక ఆపసోపాలు పడతావ్ కనక

పెరుగు గిన్నెలో పడలేదా అదీ నీ దురదృష్టమే

చిన్నప్పుడు నువ్వు గోళీలాటలు, కాలాపత్తా లాంటి గురి చూసి ఆడుకునే ఆటలు ఆడలేదని అది నీ కర్మ అని వంటింటికి కూడా తెలిసిపోతుంది కనక

ఇప్పుడు గిన్నె చేతిలోకి తీసుకో

చక్రాలు అందులో సుతారంగా వేసి గిర గిర తిప్పి కలిపెయ్

పచ్చిమిరపకాయ తీస్కో

పరపర తరుగు

పక్కనపెట్టుకో

కావలసినంత ఉప్పు తీస్కో

పెరుగులో కలుపు

ఇనప గరిటె తీస్కో

నెయ్యి తీస్కో

నీకు కొలెస్టరాలు గొడవ ఉంటే నెయ్యి బదులు నూనె తీస్కో

గరిటె వెడి చెయ్

నెయ్యి పొయ్

మిరపకాయలు తీస్కో, ఆవాలు తీస్కో, జీలకర్ర తీస్కో, మెంతులు తీస్కో

ఆ వేడి నెయ్యిలో వెయ్

చిటపట అనగానే ఇంగువెయ్

ఓ మూత తీస్కో

ఇనపగరిటెలో పోపు అంతా పెరుగులో కలుపు

పోపు పెరుగులో పడుతూండగానే మూతపెట్టు

అంతే టమాట పెరుగు పచ్చడ్ రెఢీ

కుంభం అంత అన్నం తీస్కో

మధ్యలో గుంట చెయ్

గిన్నె ఎత్తు

అంత పెరుగ్ పచ్చడ్ పొయ్ ఆ గుంటలో

తినెయ్, పూరాగా తినెయ్

స్వర్గానికెళ్ళు

అంతే

ఓం తత్ సత్

-- నిన్న రాతిరి మాయావిడ చేసిన టమాట పెరుగు పచ్చడ్ తిన్నంక , స్వర్గం నుంచి దిగొచ్చినంక రాస్కున్న కత
-- an old FB post from 2016 that came into light for no reason! I don't think I ever posted this here!

No comments:

Post a Comment