Saturday, September 8, 2018

జై కాకమాని మూర్తి కవి

కాకమాని మూర్తి కవి

15వ శాతాబ్దంలో జీవించినాడు ఈయన అని అంటారు

ఈయన రచనలు చదివిన వారికి వంకాయ వంటి సంస్కృతాన్ని పట్టుకొని దాన్ని నిప్పుల మీద కాల్చి అందులోని సారాన్ని గ్రహించి తెలుగు కుంపట్లో వండి వార్చి పోపు పెట్టి ఘుమఘుమలాడించాడు ఈయన అని అనిపించటం సహజమే అయినా, ఆయన సొంత ఆలోచనలనే నిప్పులో పడేసి మధించాడు అనిపిస్తుంది నాకు

శబ్దాన్ని ధాంధూం గా వాడినాడు

అక్షరాలను పట్టుకొని ఢంకా మీదకెక్కించి దడదడలాడించినవాళ్ళు - ఈ తెలుగు ప్రపంచకంలో ముగ్గురే

తిక్కన, పోతన, శ్రీనాథుడు

అందరివీ విభిన్న ధోరణులు

వైవిధ్యమైన శిల్పాలు

వీరిలో తిక్కనకు సాటిరాగలవాడు ఈ కాకమాని కవి

గరుత్మంతుణ్ణి వర్ణిస్తూ

జంభారి దంభోళి ఝళిపించి నిప్పుకల్
రాల్చిన నొకయీక రాల్చినాడు
జగములెక్క నడంగ జరియించు నల్లని
మోపవలీలమై మోచినాడు
బరువు తానెఱిగిన శరముచుల్కగజేసి
మృడునకు బుర జయం బిచ్చినాడు
ద్విరసనాళికి వేల్పు వెనుసూటి సుధనాచి
రెల్లులో నట పార జల్లినాడు
......
.......
.......
....... పులుగుఱేడు


అంటూ సాగిపోతుంది ఇంద్రుడు, నాగులు, శివుడు ఆధారంగా ఒక పద్యం

పద్యాలే అనుకుంటే అంతకు మించిన వచనం

శేషాద్రిని వర్ణిస్తూ

అట్టి చుట్టు కైదువ జగజెట్టికి విడిదిపట్టయిన పెట్టె బెట్టు దిట్ట గట్టు కట్టుమట్టు దిట్టతనం బెట్టిదనిన.. అంటాడు

చుట్టుకైదువ జగజెట్టి - చక్రాయుధం కల మహావీరుడు (ఇంకెవరు ? ఆ శ్రీమహావిష్ణువు)
పెట్టెబెట్టు దిట్టగట్టు - శేషాద్రి
కట్టుమట్టు - మాంచి దృఢమైన
దిట్టతనం - అంటే తెలిసిందే

అలాగే ఇంకొన్ని...మచ్చుకి

1) ఏవం విధ గుణ నిధికిన్
ధావ నీధనాశ ధామ ధామ దవీయో
దేవానాంప్రియ దానవ
భావనా ద్యప్రమోద పధో నిధికిన్


2) ధాటీ ఘోట ఖురాగ్ర నిర్దళిత గో
త్రా ధూళికా గంధ చూ
ర్ణాటో పాళి పరిస్ఫుర త్ప్రదిత స
ర్వాశా వధూటీ కుచా
ఘాటా చ్ఛాచ్చద రాగ శాటిత అస్మా
ఖ్య విక్రమ ప్రక్రమా
త్యాటీకా హిత రాజహంసుడగు నా
హా రాజహంసుండిలన్


ఇంకొన్ని వర్ణనలు చూద్దాం

ఒక చోట సూర్యాస్తమయం ఎలా ఉన్నదీ? అంటూ కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు....

శివుడు ప్రదోష తాండవ వేళ కాలుజాడిస్తే ఊడిపడ్డ అందె లాగ సూర్యుడు పొద్దుగుంకిపోయాడట

ఆయన తాండవం చేస్తున్నప్పుడు నెత్తి మీదనున్న గంగ కదలగా చిందిన నీటి బిందువులే నక్షత్రాలట

అంతా పట్టలేక శివుడు నోటి నుంచి బయటకొచ్చిన హాలాహలమే చీకటి అట

వీటిలో కొన్ని పూర్వకవులను అనుసరించినట్టు కనపడ్డా - ఆ ఆలోచనలను తెలుగించడంలో ఉన్నది ఈయన శక్తి

ఈయన ఆదిశేషువు మీద రాసిన ఒక పద్యంలోని ఒక పంక్తి ఆధారంగా ఒక అనగనగా కథ అల్లుకొని రాసినాను 2015వ సంవత్సరంలో

ఆనాడు రాసుకున్న డ్రాఫ్టును యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాను, చదువుకోండి

*******

అనగనగా

అనగనగా ఒక రోజు

ఆ రోజు ఇప్పటిది కాదు

ఎప్పటిదో

ఆదిశేషుడికి, భారం మొయ్యవయ్యా అంటూ భూమిని ఆయన నెత్తి మీదకు ఎక్కించిన రోజు

ఆదిశేషుడు మోస్తూ ఉన్నాడు ఆ నాటి నుంచి ఆ భూమిని

ఇంతలో బ్రహ్మ మానవ సృష్టి మొదలుపెట్టాడు

ఇంతలో వేరే పనులు కూడా ఎక్కువైపోవటంతో ప్రజాపతులను సృష్టించాడు

వాళ్ళను సృష్టించి - ఒరే నాయనా మనుషులను వాళ్ళ సంతను తామరతంపర చేసే బాధ్యత మీదేనన్నాడు

ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయాడు

ఆయన మడమ అటు తిప్పటం తరువాయి, ఇచ్చిన పని తొందరగా వదిలించుకుంటే కాస్త సుఖంగా కూర్చోవచ్చు కదానన్న ఆలోచనతో ఆ ప్రజాపతులు రెచ్చిపోయి మనుషులను వృద్ధి చేసారు

ఆ తర్వాత వదిలేసారు

ఆ మనుషులు అసలే బుద్ధిశాలులు

అందుకని తమను తాము, దానితో పాటు తమ సంతతిని ఇంతింతగా అంతంతగా వృద్ధి చేసారు

దాంతో భూమి బరువు పెరగటం మొదలుపెట్టింది

మొదట్లో సన్నగా నాజూకుగా ఉన్న భూమి, ఈరోజు భరించలేనంత బరువు ఉన్నది

దాంతో ఆదిశేషుడికి తలనొప్పి మొదలయ్యింది

మరి అంత బరువు నెత్తి మీద మోయాలంటే సులభమా?

కాదు

అందుకని తలకాయనొప్పి వచ్చింది

ఇలా ఉండగా నారదుడు వచ్చాడు ఆయన వద్దకు

నారదుణ్ణి చూసి కూడా ఆదిశేషువు ముభావంగా ఉన్నాడు

తలనొప్పి ఉన్నప్పుడు ఎవరన్నా పలకరిస్తే తిక్క రేగిపోతుంది కదా!

అందుకని మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు

నారదుడేమో అసలే వాగుడుకాయ

మాట్లాడకుండా ఉంటే ఆయనకు నడవదు

అందుకని ఆయనే పలకరించాడు శేషుణ్ణి

ఏమయ్యా - చూసి కూడా చూడనట్టు ఉన్నావే! ఏమయ్యింది అని అడిగాడు

శేషుడు - అయ్యా, తలకాయనొప్పిగా ఉన్నది మీ వద్ద ఏదన్నా మందు ఉన్నదా అని అడిగాడు నారదుణ్ణి

నారదుడు తన అంగవస్త్రం వంక చూసాడు

క్రితం వారం తను దగ్గు, కఫంతో, తలనొప్పితో బాధపడుతూ ఉంటే, అమ్మ సరస్వతి శొంఠి కషాయం కాచి ఇచ్చి, శొంఠి నూరి తలపట్టు వేసి ఉపశమనం అందించి, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుందని తన అంగవస్త్రం చివర ఒక శొంఠి ముక్కను కట్టి ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది

చప్పున ఆ శొంఠి ముక్క తీసి చూసాడు

ఇదిగో ఇది ఉంది - చూడు ఉపయోగపడుతుందేమో అని అన్నాడు

శేషుడికి అంత బాధలోనూ నవ్వు వచ్చింది

అయ్యా మీకు ఉన్నది ఒక తల - దానికి సరిపోతుంది ఆ ముక్క... నాకు వెయ్యి తలలు... ఇదెక్కడ సరిపోతుంది ? మంచి ఉపాయమే చెప్పారు అని ఎత్తిపొడిచాడు

నారదుడికి ఏం చెయ్యాలో తెలియలా

సరే, నీ తలనొప్పి తీర్చలేకపోయినందుకు బదులుగా ఒక వరం ఇస్తా - నేను వెళ్ళిపోయాక తూర్పు వైపు చూడు.. ఆ దిశలో నీకు కనపడ్డ మొదటి ప్రాణికి నీ తలనొప్పి సంగతి చెప్పు... నేను తీర్చలేకపోయినాను కాని ఆ ప్రాణి నీ తలనొప్పి తగ్గిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు

నారదుడు వెళ్ళిపోయాక శేషువు తల ఎత్తి చూసాడు

తూర్పు దిక్కు వైపు

అక్కడ కనపడ్డది ఒక ప్రాణి

ఏ ప్రాణి అది?

ఏనుగు

ఐరావతం లా ఉన్నది

చక్కగా నిగనిగ మెరిసిపోతూ

శేషుడు పిలిచాడు ఆ ఏనుగును

పిలిచి అడిగాడు - ఏమయ్యా - నాకు తలనొప్పిగా ఉన్నది నువ్వు తీర్చగలవా అని

ఏనుగు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది

ఆదిశేషువేమిటి, నాకు కనపడటమేమిటి? పైగా నన్ను సలహా సాయమూ అడగటమేమిటి? అని అపిరితిపిరి అయిపోయింది

ఆయన ముందు వణికిపోతూ నిలబడ్డది

అయ్యా నేను మీ తలకాయనొప్పి తీర్చగలటమేమిటి , నా తలకాయనొప్పే నేను తీర్చుకోలేను - తల చెట్లకేసి బాదుకుంటూ ఉంటా - అట్లాటిది మీ తలనొప్పి నేనెట్లా తీర్చేది అన్నది ఆయనతో

బాదుకోవటం అన్న మాటతో శేషుడికి వెలిగింది

ఏదీ నా తల మీద బాదు ఒకసారి చూద్దాం అన్నాడు

ఏనుగు నెమ్మదిగా కాళ్ళతో ఆయన తల తొక్కటం మొదలుపెట్టింది

ఇదేదో కాస్త ఉపశమనంగానే ఉన్నది, అయినా అంత మృదువుగా చేస్తే ఎట్లా? కాస్త గట్టిగా తొక్కు అన్నాడు

గట్టిగా తొక్కటం మొదలుపెట్టింది

అయినా శేషుడికి ఆనట్లా

అందుకని - ఏం చేస్తే బాగుంటుందోనని ఆలోచించాడు

ఏనుగు వంక చూశాడు. ఏనుగేమో పుల్లలా ఉన్నది. ఇలా పుల్ల కాళ్ళు వేసుకుని ఎంత తొక్కితే ఏం లాభం అనుకున్నాడు

ఆలోచించి - ఏనుగు బరువును అమాంతంగా  పెంచేసాడు

అప్పటిదాకా సన్నగా పుల్లలా ఉండే ఏనుగు ఏనుగంత అయ్యింది

కాళ్ళు ఏనుగు కాళ్ళంత లావు అయినాయి

ఇప్పుడు తొక్కు అన్నాడు

ఇంత లావైపోయానేమిటి అనుకుని ఆశ్చర్యపోతున్న ఏనుగు - అంత బరువున్న కాళ్ళతో తొక్కటం మొదలుపెట్టింది

అప్పుడు ఆనింది ఆదిశేషువుకు

ఆ బరువు ఆని, కాస్త ఉపశమనం లభించింది

అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలా

ఉపశమనం హరించుకుని పోయింది

ఇలా లాభం లేదని మళ్ళీ ఏనుగు వంక చూసాడు

తొండం కనపడ్డది

ఆ తొండం అటు ఇటూ ఊగుతోంది

అది చూసి ఆ తొండానికి అపరిమితమైన శక్తి ఇచ్చాడు

ఆ తొండంతో ఒక్కొక్క తలని చుట్టి మర్దన చెయ్యమన్నాడు

ఒక పక్క తొక్కుతూ, ఇంకోపక్క తొండంతో తలను చుట్టి మర్దన చెయ్యటం ప్రారంభించింది

అప్పుడు పూర్తిగా ఉపశమనం లభించింది ఆదిశేషువుకు

ఉపశమనం లభించింది కానీ - చెమటలు పడుతున్నాయి

ఆ మర్దన వల్ల

ఆ తొక్కుడు వేడి వల్ల

మళ్లీ ఏనుగు వంక చూసాడు

చెవులు కనపడ్డవి ఈసారి

వెంటనే వాటిని పెద్దవి చేసాడు

చిన్న చెవులుగా ఉన్నవి కాస్తా ఏనుగు చెవులంత అయినాయి

చేటలంత అయిపోయినాయి

ఇదిగో ఆ చెవులు ఊపి కాస్త గాలి విసురు అన్నాడు

ఏనుగు తన చేట చెవులను చూసుకుని మురిసిపోయింది

ఆయన అడిగినట్టే ఊపింది

అంతే!

రివ్వున వీచింది గాలి

చెట్టూ పుట్టా అన్నీ ఊగిపోయినాయి ఆ విసురుకు

అంత ఉద్ధృతంగా ఉన్నది ఆ గాలి

ఆ గాలి తగిలి శేషువు చెమటలు తగ్గినాయి

అలా ఏనుగు కాళ్ళతో తొక్కుతూ, తొండంతో మర్దిస్తూ, చెవులతో గాలి వీచుతూ శేషువుకు పూర్తి ఉపశమనం కలిగించింది

ఆ రోజటి నుంచి శేషువుకు తలనొప్పి ఎప్పుడు వచ్చినా సరే - ఏనుగు కాళ్ళు, తొండం, చెవులు ఉపయోగిస్తూనే ఉన్నది

ఆయనకు ఉపశమనం కలిగిస్తూనే ఉన్నది

ఆ మహానాగరాజుకు సేవకుడిగా ఉన్నానన్న ఆనందంతో ఘీంకరిస్తూ ఉన్నది

అలా ఓం తత్ సత్ జరిగింది

*****

జై కాకమాని మూర్తి కవి