Wednesday, August 15, 2018

శ్రీనివాస కళ్యాణం - ఒక మంచి సినిమా!

ముద్దపప్పు

అనగా ఉత్తగా ఉడికించిన పప్పు - కారం వేయకుండా, పోపు పెట్టకుండా ఉడికించిన పప్పు

ఇప్పుడు విస్తరి తీసుకోండి

వేడి అన్నం వడ్డించుకోండి

ముద్దపప్పు కలపండి

దానికి చెయ్యి జారేంత నెయ్యి జతచెయ్యండి

ఒక ముద్ద నోట్లో పెట్టండి

స్వర్గం కనపడిందా?

అందులోకి వెళ్ళిపోయారా?

ఇప్పుడు ఆ స్వర్గం నుంచి కిందకు రండి ఓ సారి

మీ అమ్మనో, అమ్మమ్మనో, నాన్నమ్మనో కాస్త ఆవకాయ్ వెయ్యండి అన్నపూర్ణమ్మలూ అని అడగండి

వారు దయ ఉంచి మీ విస్తట్లో వేసిన ఆవకాయను నెయ్యి కలిపిన ముద్దపప్పుతో కూడిన రెండో ముద్దలో కలపండి

ఆ రెండో ముద్ద ఇప్పుడు నోట్లో పెట్టండి

పది స్వర్గాలు కనపడతవి

పది స్వర్గాలు చాలనుకునుటే అక్కడే ఉండిపోండి

వంద స్వర్గాలు కావాలంటే మళ్ళీ కిందకొచ్చెయ్యండి

అలా మూడో ముద్ద, నాలుగో ముద్ద... పదో ముద్ద... ఇరవయ్యో ముద్ద లాగించెయ్యండి

అంతే!

చాలా చింపులు

అలాటి స్వర్గాలే - గోంగూర పచ్చట్లో మజ్జిగపులుసు కలుపుకున్నా కనపడతవి, మాగాయలో వెన్న వేసుకుని తిన్నా కనపడతవి, వేడన్నంలో ఉసిరి పచ్చడి కలుపుకొని తిన్నా కనప్డతవి , పెసరట్టు ఉప్మాతో తిన్నా కనపడతవి, ఇంకా ఇలాటి తెలుగు వారికే ప్రత్యేకమైన వంటకాలు తిన్నా కనపడతవి

సరే! అదలా పక్కనబెడితే - తెలుగులో సినిమాలు రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు అని మాట్లాడేవారు చూడవలసిన సినిమా ఒకటున్నది

అట్లాటి సినిమా ఈ వారంలో నేను రెండు సార్లు చూసి వచ్చినాను

అవును తెలుగు సినిమానే

మొన్న ఒకసారి, నిన్న ఒకసారి

నా దురదృష్టం కొద్దీ మా ఊళ్ళో ఈ సినిమా ప్రదర్శనకు నిన్ననే చివరిరోజుట

లేకుంటే ఇంకో రెండు సార్లు చూసే పని

దానితో కాస్త మన:క్లేశం కలిగిన మాట నిజం

ఆ క్లేశాన్ని ఇలా పోష్టు రూపంలో రాసుకునన్నా తీర్చుకుందామని ప్రయత్నం

ఆ మంచి సినిమా పేరు "శ్రీనివాస కళ్యాణం"

దీని దర్శకులు సతీశ్ వేగేశ్న గారట

కథ వారిదే

మాటలు వారివే

స్క్రీన్ ప్లే వారిదే

దర్శకత్వం కూడా

ఆ సినిమా నాకు నచ్చటానికి ఎన్నో కారణాలు

- మా అమ్మమ్మకు నాకు మానసికంగా ఉన్న అనుబంధమే ఈ సినిమాలో హీరోకు వాళ్ళ నాయనమ్మకు ఉండటం

- ఈ దేశంలో ఎవరూ లేక ఒంటికాయ శొంఠికొమ్ములా బతుకీడుస్తూ బయటకు మేకపోతు గంభీరంగా ఉన్నా లోపల ఎంతోమంది మనుషులు నా చుట్టూ ఉండాలని, రోజూ ఆ దేవుడిని కోరుకునేవాడిని కనక, ఈ సినిమా నన్ను ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్ళి విహరింపచేసింది కనక

- ఏం చేసినా సరే, ప్రపంచం ఎటు పోతున్నా సరే మన సంప్రదాయాలు బతకాలని తాపత్రయపడే నాకు, అదే తపన ఈ సినిమా దర్శకుడి గారికీ ఉన్నదని ఆయన తీసిన విధానంతో తెలిసింది కనక. సంప్రదాయం ఒక్కొక్కరికీ, ఒక్కొక్క ఇంట్లో, ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండవచ్చును. కానీ సామాజికంగా కొన్ని సంప్రదాయాలు ఉంటవి. అవి సార్వజనీనమైనవి. ఎన్నో వందల ఏళ్ళుగా కొద్ది కొద్ది మార్పులతో ఆట్టే తేడా లేకుండా ఉనికి సాగిస్తూ వచ్చినవి అవే! అలాటి వాటిల్లో, ఆ జాబితాలో పెళ్ళి కూడా ఒకటి. అలాగే పెద్దవాళ్ళను గౌరవించుకుంటూనే మనం మనలా బతకటం ఒకటి. అలాటి సంప్రదాయాల గురించి నేను మాట్లాడుతుంది. అలాటి సంప్రదాయాల గురించే సతీశ్ గారు చూపించింది. అందువలన నచ్చేసింది

- నే రాసుకొన్న అనగనగా కథల్లో, ఒకనాడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం రాసుకున్న కథలో ఒక చెరువు ఒడ్డున కాపరం పెట్టుకున్న రామచిలుక, చెరువు ఎండిపోయినా, చెట్టు మోడువారినా, మిగతా పక్షులు, చివరకు తన కుటుంబంలోని వారు కూడా ఊరు, చెరువు, తొర్ర వదిలేసి ఏకాకులుగా ఎక్కడో బతుకుతూ ఉండగా, ఆ చెట్టు వద్దకు విశ్రాంతి తీసుకుందామని వచ్చిన ఒక ముసలమ్మతో తాను ఎందుకు ఆ చెట్టు వదలలేదు అన్నదానిని చెపుతూ ఆ చిలక పలికిన సంభాషణలు ఈ చిత్రంలోని సంభాషణల సారంతో సరిపోవటం వలన. అందువలన నచ్చేసింది

- నేను మా ఆవిడతో ఎప్పుడూ అంటూ ఉంటాను.. దాదాపుగా ఇరవైయేళ్ళ అనుబంధం మాది. డబ్బుల సంగతి ఎప్పుడు వచ్చినా సరే, డబ్బులు ముఖ్యం కాదమ్మా మనకు, మనుషులు ముఖ్యం అని చెపుతూ ఉంటాను. ఆ ఇది, మా నాన్నగారి దగ్గరినుంచి వచ్చింది నాకు. ఆయనా అంతే. ఏనాడు డబ్బులది ప్రథమస్థానం కాలా మా ఇంట్లో. మనుషులే ఆ వరసలో ముందు. అలాటి సంభాషణాలే సతీశ్ గారి కలంలో జాలువారి హీరో తండ్రి రాజేంద్రప్రసాదు గారి నోట బయటకు వచ్చినాయి. ఒకేలా ఆలోచించే వ్యక్తులు ఈ ప్రపంచకంలో ఒకరికి మించి ఉంటారన్న సత్యం నిజం చేసినారు సతీశ్ గారు. అందువలన నచ్చేసింది

- హీరో శ్రీనివాస్ ప్రతిరోజు ఇంటికి ఫోను చేసి క్షేమం కనుక్కుంటూ ఉంటాడు. ఆ శ్రీనివాసు నేనే! ఏనాడు కూడా, నాకు జ్వరం రోగం రొష్టు రొప్పు వచ్చి మీదపడిన రోజున కూడా ఇంటికి ఫోను చేసి, పెద్దవాళ్ళ రోజు ఎట్లా గడిచింది అని అడుగుతాను కనక. సతీశ్ గారు నన్ను శ్రీనివాసును చేసారు కనక. అందువలన నచ్చేసింది

- చిత్రంలోని ఏ పాత్ర అనవసరంగా గొంతు పెంచి అరుచుకోకుండా, వెకిలితనం లేకుండా, చాలా బద్ధులై, ఓవర్ యాక్షను చెయ్యకుండా నటించారు. అది సతీశ్ గారి గొప్పతనమే. యాక్షను, కొట్లాటలు, రక్తాలు లేకుండా, మంచి కథతో వినోదం పంచవచ్చని నిరూపించిన సతీశ్ గారికి నేను అభిమానినైపోయినాను. అందువలన నచ్చేసింది

- హీరోయిను పేరు శ్రీదేవి కావటం వలన. అందువలన నచ్చేసింది

- ఇంకా ఎన్నో ఉన్నవి ఇలాటి కారణాలు - వందల్లో

అయితే సినిమాలో ఒక చోట సతీశ్ గారు హీరోయిను చేత అనిపిస్తారు - ఇతన్ని ప్రేమించడానికి నీకు వంద కారణాలు ఉండవచ్చు, కానీ పెళ్ళి చేసుకోవాలని అనుకోవడానికి ఒక్క కారణం చెప్పు చాలు అని - దానికి హీరోయిను చెప్పిన మాటకు తండ్రి వద్ద ఇక సమాధానం ఉండదు

ఈ పైన నేను ఎన్నో కారణాలు చెప్పినాను - ఈ సినిమా గురించి. అయితే ఒకే ఒక్క కారణం ఇది మంచి సినిమా ఎందుకో చెప్పు అని ఎవరన్నా అడిగితే - మనుషులతో వాళ్ళ మనసులతో, వారి మధ్య ఉన్న బంధాలతో, గౌరవాలతో, ప్రేమతో, సంప్రదాయాల మీద అభిమానాలతో ఒక చక్కని కథ అల్లుకోవచ్చని, ఆ కథతో ఒక సినిమా తీయవచ్చని, అలాటి ఒక గొప్ప సినిమా నేను చూడగలనని నిరూపించబడటమే!

ఇక సంగీతం ఈ సినిమాకు ప్రాణం

మహానటితో నాకు పరిచయమైన మికి జె మెయర్ గారు అదరగొట్టేసారు

కొన్ని చోట్ల నా గుండెను పట్టి పిండేసారు

గుండెను గొంతులోకి తెచ్చేసారు

ఆ సంగీత దర్శకుడు సతీశ్ గారి గుండెను బాగా పట్టుకున్నారు

పట్టుకుని ఈ సినిమా చూస్తున్న నన్ను సాత్త్విక భావాలకు గురిచేసినారు

సాత్త్విక భావమంటే సత్వానికి సంబంధించిన భావమనే అనుకోకూడదు

సాత్త్విక స్వభావాలు ఎనిమిదని లోకోత్తరం

సాత్త్వికం అంటే ఒక భావం

భావాలు మనుషులకు కాక ఎవరికుంటయ్యి?

ఆ భావం ఏదైనా కావొచ్చు

అయితే ఆ ఏదైనా ఈ ఎనిమిదిట్లో ఇరకాల్సిందేనని లోకధర్మం, శాస్త్రసమ్మతం

ఆ ఎనిమిదినిట్లా నిర్వచించారు

“స్తంభః స్వేదః రోమాంచః స్వరభంగః వేపథుః వైవర్ణ్యం అశ్రుః ప్రళయమ్ ఇతి అష్టౌ సాత్త్వికా స్మృతాః ”

స్తంభః అంటే నిశ్చేష్టత

స్వేదః అంటే చెమటలు పట్టటం

రోమాంచః అంటే గగుర్పాటు కలగటం

స్వర భంగః అంటే గొంతు గద్గదం కావడం

వేపథుః అంటే ఒంట్లో వణుకు పుట్టటం

వైవర్ణ్యం అంటే కళ తప్పిపోవటం

అశ్రుః అంటే కళ్ళలో నీళ్ళురావటం

ప్రళయమ్ అంటే పూర్తిగా వివశుడైపోవటం

ఇవీ ఎనిమిది సాత్త్విక భావాలు

ఈ ఎనిమిదిట్లో స్వేద:,వేపథుః, వైవర్ణ్యం తప్ప మిగతా భావాలన్నిటికీ గురైనాను నేను

సోదరుడు శ్రీమణి రాసిన పాటలన్నీ ఎంత బావున్నవో!

టైటిలు పాట అయితే అదిరింది

ఆ అదరటంలో కొంత తేడా ఉన్నది కానీ బాలసుబ్రహ్మణ్యం గారు బాగా కవరు చేసుకొచ్చారు ఆ పాటను, పూర్తి న్యాయం చేసినారు ఆ గేయరచనకు

తేడా అని ఎందుకంటున్నానంటే - మికి జె మెయర్ గారు - నాకిష్టమైన కాశీకి పోతాను రామాహరి పాట ట్యూనును, అన్నమయ్యలోని ఉయ్యాల పీసు ట్యూనుతో కలిపి కాసింత మార్పు చేసి కొత్తలోకాలకు తీసుకునిపోయినారు

పెద్దన్నగారు చైతన్యప్రసాదు గారికి కూడా ఈ సినిమాలో భాగం ఉండి ఉంటే బాగుండేదనిపించిన మాట వాస్తవం

ఇలా రాస్తూ పోతూ ఉంటే ఒక 500 పేజీలు రాయవచ్చును, రాసేస్తాను కూడాను - అందువలన ఇక్కడికి ఆపేస్తా

ఒక మంచి సినిమా, అదీ తెలుగులో చూడగలను అన్న ఆశను నిజం చేసిన సతీశ్ గారికి, వారు రాసుకున్న కథకు, సంభాషణలకు వేవేల నమస్కారాలు. ఆ కథకు పూర్తి న్యాయం చేసిన నటీనటులకు, ఆ సినిమాకు పనిచేసినవారందరికీ వేల కృతజ్ఞతలు

చివరగా ఒకటే మాట - శ్రీనివాస కళ్యాణం - ఒక మంచి సినిమా - సినిమాను విపరీతమైన లాజికుతో కాక సినిమాగా చూడగలిగిన వారు, మంచి మనుషుల మీద ఇంకా నమ్మకం మిగిలి ఉన్నవాళ్ళు అందరూ, చూడవలసిన సినిమా - చూసి తీరవలసిన సినిమా

పోతే - నెల్లూరు జిల్లాలో ఒక మాట వాడతారట

ముండమోపి అని

వారు ముండమోపి అని అన్నారంటే ఇతర జిల్లాల వారి వాడుకభాషలోని అర్థం కాకుండా వేరే అర్థం ఉందట

నెల్లూరు జిల్లా వారి అర్థం - పనికిమాలిన వా(డు)(రు) అని అట

మరి ఈ సినిమా బాలేదన్న వారిని, రివ్యూలో ఈ సినిమా బాలేదని రాసినవారిని ఆ నెల్లూరు జిల్లా వారు చూస్తే ఆ మాటే ప్రయోగిస్తారేమో!

సినిమా నచ్చనివారికి ఈ సినిమా నచ్చినవారు, నేను మరో రకంగా కనపడవచ్చు

అదీ సమ్మతమే! :) 

ఓం తత్ సత్!