Monday, July 23, 2018

షష్టిపూర్తి పుస్తకానికి ఎంత దూరం?

అయ్యా, అమ్మా - 59వ పుస్తకం పబ్లిషుడు

అందువలన ఆ విషయం మీకు సవినయంగా తెలియచేయటమైనది

ఈ 59వ పుస్తకంలో - మీరు తేల్చాల్సిన సంగతులు కొన్ని

  • తను చేసిన పనికి యముడే కారణమని మృత్యువు యముడి మీదకు ఎందుకు ఎక్కినాడు ? చివరికి తేలిందేమిటి?
  • ఒకానొక ముసలమ్మ తనకు తాంబూలం తెచ్చిచ్చిన చిచోరుడు అనే పిల్లవాడిని ఎందుకు అతలాకుతలం చేసింది?
  • ఈగల మీద యుద్ధం ప్రకటించిన తేనెటీగల వల్ల అడవిలో ఏం జరిగింది?
  • తొర్రలోని రామచిలుక ఊరిలోని ముసలమ్మకు సంబంధించిన జీవిత సత్యాన్ని ఒక్క మాటతో ఎలా ఛేదించింది?

ఇలా ఇంకా ఇంకా మీకు మీరుగా తెలుసుకోవాల్సిన సంగతులు,  మీ పిల్లలకు తెలపాల్సిన సంగతులు ఉన్నవి

పుస్తకం కొని, చదివి, మీరు పై సంగతుల్లో అన్ని సంగతులు తేలిస్తే మీ జీవితపడవ ప్రయాణం సాఫీగా సాగుతుందన్న హామీతో !

కొనాలనుకుంటే, సంగతులు తేల్చాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చునండోయ్

https://www.amazon.com/author/vamsimaganti/

హరి ఓం తత్ సత్!

షష్టిపూర్తి పుస్తకానికి, అనగా అరవయ్యవ పుస్తకానికి ఇంకొక్క అడుగే దూరం!

జై బోలో పాఠకా!

జై బోలో పరమేశ్వరా!

మీరంతా పిల్లాపాపలతో వారాంతం సంతొషంగా గడిపినారన్న ఆశతో, ఆకాంక్షతో - హరి ఓం తత్ సత్

పోతే ఇంకొక విషయం కూడా

షష్టిపూర్తి పుస్తకం అన్నాను కాబట్టి దాని సంగతి కూడా చెప్పేస్తా ఇక్కడే :-

హైదరాబాదుకు మొన్న వచ్చినప్పుడు కాక ఆ క్రితంసారి, అంతక్రితంసారి మా అమ్మ దగ్గర, పిన్ని దగ్గర, చిన్న అమ్మమ్మల దగ్గర ఉజ్జాయింపుగా ఒక వంద వంటకాయలు కొట్టించుకున్నా

వంటకాయలు అంటే మొట్టికాయలలాంటివే

వారు చేసే వంటలు నా బుర్రలోకి ఎక్కటానికి కొట్టించుకున్న బొప్పికాయలే ఈ వంటకాయలు

జగదిదితనలభీముడినైన నేను, వారి వద్ద - వారి చిన్నప్పుడు వారి అమ్మ, అమ్మమ్మల కాలంలో వారి వారి నాయనమ్మలు, అమ్మమ్మలు రాచ్చిప్పల్లో ఏం చేసే వారో అవన్నీ, వాళ్ళకు గుర్తున్నంతమటుకు కాగితాల మీద నాలుగైదు లైన్ల చొప్పున, ఉజ్జాయింపు లెక్కల్లో రాయించి తెచ్చినాను

ఆ ఒరిజినల్ రెసిపీలే కాక, వాటికి ట్విష్టులిచ్చి నా పరాక్రమం చూపిస్తూ ఇప్పటి వంటలు రాచ్చిప్పలోకి ఎక్కించినాను

ఈ రోజు దేనికో లెక్క వేయగా అన్నీ కలిపి దాదాపు 500 దాకా దేకినాయని, ఆ సంఖ్య చూసినాక కళ్ళు విచ్చుకోవటం అయినదని తెలియచేసుకుంటున్నాను

ఆ పైన ఒక ప్రతిజ్ఞ చేసినాను

ఏమా ప్రతిజ్ఞా?

అవన్నీ ఒక పుస్తకంలోకెక్కించాలన్న భీషణమైన ప్రతిజ్ఞ అది

టైటిలు, బొమ్మలు అన్నీ తయారు చేయుచుంటిని

వచ్చే వారానికి అన్నీ పుస్తకరాచ్చిప్పలోకి పడితే, విడుదలకు సంధించెద - లేనిచో ఆ పై వారం ప్రయోగించెద

ఈ రాచ్చిప్ప 60వ పుస్తకం అవుతుంది

అందుకని జయ జనార్దనా అని పాడుకొనుచున్నాను

ఇది మీకు ప్రకటనా ఫలకం (నోటీసు బోర్డు) కావునన్నూ, వచ్చే వారం దాకా మీరు చొంగకాయలు సవరించుకుంటూ ఉంటారనిన్నూ ఆశిస్తూ

మరియొకసారి ఓం తత్ సత్!

Monday, July 16, 2018

రోజూ ఇలా ఎవరో ఒకరు ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి పోతే....

అనగనగా

ఒక రోజు

ఆ రోజు ఎప్పటిదో కాదు

నిన్నటిదే, నిన్నటి ఆదివారపు రోజు

నేను బే ఏరియా వెడదామనుకొనగా - అత్యంత విచారకరంగా నేను వెళ్ళి కలవాల్సిన కుటుంబం వారికి తెలిసినవాళ్ళ పిల్లవాడిదో భర్తదో బర్తడే కావటమ్మూలాన వెడుతున్నామని, అందువలన ఉండమని నిక్కచ్చిగా , ఆనందంగా చెప్పినారు - దానితో వారి ఆనందములో బొగ్గులు పొయ్యటం ఎందుకని అనుకోని ఇంటియందు కూర్చొని "2037లో" అన్న పుస్తకం కూర్పు చేసి Circa 2037 అన్న టైటిలు పెట్టి పబ్లిషు చేసెదమని కూర్చొనినాను.

కుర్చీయందు కూర్చొనగానే, అంతకు ముందు రోజు చంద్ర రెంటచింతల వారికి అటు వచ్చినపుడు కలుస్తానని చెప్పిన సంగతి గుర్తురాగా, అయ్యా - నా ప్లాను పటాపంచలు అయినది - అందువలన వచ్చుట లేదు అని చెపుదామని ఫోను చేసినాను

ఎన్నో ఏళ్ళ నుంచి తెలిసిన వారే అయినా ముఖపరిచయమూ, వాక్పరిచయమూ లేకపోవటంతో ఇదే వారితో మొదటిసారి మాట్లాడటంగా చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయింది

చక్కగా, చాలా మర్యాదగా, వినయంగా, పరమశ్రోత్రియంగా మాట్లాడినారు వారు. సోషలు మీడియానందు ఎట్లాగున ఉండెదరో అట్లాగునే మాటలాడినారు. ఆనందము వేసినది

నేను విషయం చెప్పిన పిదప - ఫరవాలేదండి, నేను ఖాళీనే, నేనే వచ్చేస్తా మీ వద్దకు మీకేమన్నా అభ్యంతరమా అని అడిగినారు

తప్పించుకు తిరిగే మనుషులున్న కాలంలో అయ్యా మీ ఇంటికి రావచ్చా అని అడిగేవారుండటం నా అదృష్టం. నాలోని సప్తసముద్రాలు ఉప్పొంగినాయి. వచ్చెయ్యండి భోజనానికి అనినాను. వారు భోజనం అనగానే సిగ్గుపడినారు. వద్దండి అని వంకరలు తిరిగినారనిపించినది. ఫోను కావటం వల్ల కళ్ళకు కనపడలేదు కాని.

వచ్చెయ్యండి ఆలస్యం చేయకుండా అని ఒత్తిడి చేయటంతో వారు ఆఘమేఘాల మీద బయలుదేరినారు.

నేను ఇంతలో వంకాయ ఉల్లిపాయ టమాట మసాల కూర, బెల్లపు కొత్తిమీర చారులతో నాకు వచ్చిన దిక్కుమాలిన వంట ఏదో చేసినాను.

రెండు గంటలు అయినది

బెల్లు మోగినది

తలుపు తీసినాను

చక్కగా బాలచంద్రుడి వలె స్వచ్ఛమైన నవ్వుతో కళ్ళలో మెరుపులతో ఒక సుందరాకారుడు

వెంటనే మనసుకు చాలా ఆనందమయినది

అంత నిర్మలంగా నవ్వుతూ ఇంటికి వచ్చే వాళ్ళను చూస్తే ఆనందమేగా మరి

లోపలికి వస్తూనే చక్కని పుస్తకం ఒకటి చేతిలో పెట్టినారు

రాములవారి బొమ్మ అట్ట మీద ఉన్న పుస్తకం అది

రాములవారంటే నాకు మనసు ఆగదు

ఆ బొమ్మ చూసి తన్మయమయినాను

ఆ పుస్తకం తెచ్చిచ్చిన చంద్రుల వారికి ధన్యవాదాలు తెలుపుకొనినాను

పైన రెండు గంటలు అనినాను కదా? రెండు గంటలు అనగా మధ్యాహ్నము రెండు గంటలు కాదు - వారికి ఫోను చేసిన పిదప జాలువారిన గంటల సంఖ్య అది....

వారి రాక సమయము సుమారు 12 గంటలకు


ఆ తరువాత ఒక అరగంట పిచ్చాపాటీ

ఆ తరువాత భోజనానికి లేచినాము

వంకాయ కూర నచ్చినదో లేదో తెలియదు కానీ, నేను రెండు సార్లు వారి పళ్ళెంలో వెయ్యటంతో గుడ్ల నీరు కుక్కుకొని లొట్టలు వేసుకుంటూ తినినారు... సీమ వారయ్యుండటం మూలాన , మా ఉసరి పచ్చడి, ఆవకాయ కారం నసాళానికి అందలేదనుకుంటా - ఆ ఇదీ ఒక కారమేనా అనుకొంటూ పచ్చడి ఒక ముద్ద నలిచినారు అనిపించినది... ఆ తరువాత బెల్లపు చారు పోయగా ఇబ్బంది పడినారు.. అసలే వంకాయ కూర కాస్త తీపిగా చచ్చినది - నాకే నచ్చలేదు.... ఎందుకనగా - మొన్న ఉల్లిపాయలు తెచ్చునపుడు ఉత్త ఉల్లిపాయలు, తీపి ఉల్లిపాయలు (రెండూ ఒకే రకముగా ఉంటవి మా దరిద్రపు పచారీ కొట్లయందు....) పక్క పక్కగా ఉండగా పొరపాటున తీపి ఉల్లిపాయాలు తెచ్చి తగలడినాను .... అది వంటలో గుప్పెడు వంకాయల కూరమూకళ్ళో వేసినాక ఎనిమిది కిలోల కారం వేసిన ఆ తీపి పోలేదు.... చింతపండు వేస్తే కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుందేమోనని ఊరకుంటిని....దానికి తోడు ఈ తీపి చారేందిరా నాయనా , ఇదేమి కృష్ణా జిల్లా వంటలో ఏమో రా నాయనా అనుకున్నారో ఏమో - అయ్యో వద్దండి, వద్దండి అని చేతులు అడ్డము పెట్టినారు.... ఆ తరువాత గడ్డపెరుగు వేసుకొని భోజనము పూర్తించినారు

ఆ భోజన సమయమందు ఎన్ని కబురులో ?

మహామహోపాధ్యాయ శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి సంగతుల నుంచి - బే ఏరియాలో ఉన్న కథకుల దాకా ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడుకొనినాము

చివరకు భోజనము పూర్తి అయినది

ఇక తరువాత ఆనందకరంగా ఎన్నో విశేషములు, సంగతులు, ఫేసుబుకింగులు ఇలా ఒకటీ రెండు కాకుండగా ఎన్నో విషయాల మీద చక్కగా కబుర్లతో సమయము గడిచినది

వయసులో చిన్నవారే కానీ మనసు చాలా పెద్దది ఆయనది. నా పుస్తకాల మార్కెటింగు విషయంలో ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చినారు వారు! వాటిలో కొన్ని ఇంతకుముందు గురువుగారు షాడో మధుబాబు గారితో, సత్య పామర్తి గారితో మాట్లాడిన విషయాలు ఉన్నవి. మరికొన్ని కొత్తకొత్త పుంతలు తొక్కే సలహాలు ఇచ్చినారు. అందుకు వారికి ధన్యవాదాలు. అవన్నీ ఎప్పటికి ఆచరణలోకి పెట్టగలనో ఏమో, కానీ ప్రయత్నం చేస్తానని వారికి మాట ఇచ్చినాను...ఒకసారి మాట ఇచ్చినాంటే చేసి తీరతాను కనక - చేస్తాను ....

చంద్రగారూ - చేస్తాను... కాస్త ఓపిక పట్టి నా బద్ధకాన్ని భరించండి

ఆ తరువాత సుమారు నాలుగు గంటలు అవుతూండగా ఇక శలవు పుచ్చుకొనినారు వారు

రోజూ ఇలాటి మంచివారు, మన గోలే కాకుండగా అవతలి మనుషుల గురించి, మనసుల గురించి ఆలోచించే మనుషులు ఎవరో ఒకరు ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి పోతే, మనసులు మనుషులు బాగుంటారు

తెలుగు దేశంలో ఇంటిలో ఎంతోమంది మనుషులు అలవాటు అయిన ప్రాణం... ఈ దేశంలో చాలా మటుకు ఒంటికాయ శొంఠికొమ్ము బతుకు అయినాక ఆ తీపి గుర్తులు పోయినాయి.... కానీ చంద్ర గారి లాంటి వారు ఉన్నంతమటుకు, ఇక్కడ ఈ దేశంలో ఆ గుర్తులు నిత్యం చిగురిస్తూనే ఉంటాయ్. నాకు ఆనందం కలిగిస్తూనే ఉంటాయ్.

ఏదేమైనా సీమ వారి ప్రేమలు ఆప్యాయతలు వేరండి....

చక్కగా భేషజం లేకుండా నిజమైన మనుషుల్లా ఉంటారు....

నాకు నా చిన్నప్పటి ఆడిటింగుల జమానా నుంచి తెలుసు ఆ సంగతి, పైగా మా ఇంటి పక్కన పోర్షనులో సీమ వారే ఉండేవారు - ఎంత ఆప్యాయంగా ఉండేవారో... 

చివరిగా - ఈ వారం వారి హైదరాబాదు ప్రయాణం చక్కగా సాగి, క్షేమంగా లాభంగా తిరిగిరావాలి అని కోరుకుంటూ

ఓం తత్ సత్!

Saturday, July 7, 2018

అవకాశం చిక్కటం అదృష్టం !హైదరాబాదు నందు ఒకానొక అద్భుతమైన సాయంత్రం పూట , అదృష్టం జెర్రిపోతులా పాకుతూండగా ముగ్గురు సాహితీ మాంత్రికులతో అర్భక పిపీలకం ( నేనే ఆ పిపీలకాన్ని - ఇటు చివర బట్టతల మరియు తెల్ల మీసాలతో ఉన్న శాల్తీని).... రవి ఇ.ఎన్.వి గారి ఫోనులో బంధించబడి నాకు వచ్చిన పిదప బ్లాక్ & వైటు చేసి ఇక్కడ పోష్టినాను

ఇటు చివర, నాకు ఎదురుగుండా కళ్లజోడుతో తెలుగు సాహితీ లోకానికి లభ్యమైన మరో ఆచార్య తిరుమల రామచంద్ర గారిలాటి మహావ్రాతకర్త రవి ఇ.ఎన్.వి గారు

ఆయన పక్కనే ఆలోచనల్లో, క్రియేటివిటీలో, వ్రాతలో వందమంది ఐన్స్టీనులకు సాటైన షాడో గారు - ఆయనతో, ఆ మా గురువుగారితో కూర్చుంటే సమయమే తెలియదని చెప్పటం - చదివేవాళ్ళు అతిశయోక్తి అనుకుంటారేమో కానీ, ఆ మాట ఆయన షాడో పుస్తకాలు రాసినంత నిజం!

ఆయనకు ఎదురుగా,నా పక్కన సాహిత్యానికి, ఆప్యాయతకు, మానవతకు మారుపేరైన అట్లూరి వంశోద్భవుడు అనిల్ అట్లూరి గారు - ఇలా ఆ ముగ్గురితో గడిచిన సాయంత్రం నా జీవిత డైరీలో ఒకానొక అత్యంత ఆనందకరమైన పేజీ ...******


ఈ పై భేటీలో, పిచ్చాపాటిలో - రవి ఇ.ఎన్.వి గారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచనకు రాసిన అద్భుతమైన వ్యాఖ్యానం - పుట్టపర్తి నాగపద్మిని గారు అచ్చువేయగా - ఆ పుస్తకం కాపీ మా అందరికీ అందచేసినారు********


అదే హైదరాబాదు నందు ఇంకొక అద్భుతమైన సాయంత్రం పూట , అదృష్టం ఇంకొకసారి జెర్రిపోతులా పాకుతూండగా అన్నగారు, మా పెద్దన్నగారు, సినీ గేయ బాహుబలి శ్రీ చైతన్యప్రసాదు గారితో ఒక రెండు గంటలు గడిపే సమయం చిక్కింది.... ఆ ఆనందాన్ని వారి అబ్బాయి ప్రణవ్ ఫోనులో ఇలా బంధించినారుఅప్పుడే సహస్రవర్ష అందించి నన్ను ఆయన రాతలో తడిపేసారు, గుండెలను తడిమేసారు .....

బ్రహ్మాండంగా ఉన్నది ఆ పుస్తకం....

కవరు పేజీ కళ్ళు తిప్పుకోనీకుండా కట్టిపడేసింది ...
లోపల రాత గుండె వేగాన్ని తగ్గనివ్వకుండా పరుగెత్తించింది...
**********

ఆ తర్వాతి రోజు రెండు చేతులతో, పది వేళ్ళతో ఎడాపెడా తెలుగు సాహిత్యాన్ని పరుగెట్టించే సవ్యసాచి కస్తూరి మురళీకృష్ణగారు మా ఇంటికొచ్చి ఆతిథ్యం స్వీకరించినారు... నవ్యసాహిత్య విపణివీధి, ప్రచురణల అచ్చువీధి ఎలా ఉన్నదీ అన్న సంగతుల మీద చక్కగా మంచి లాజిక్కుతో అనర్గళంగా ఉపన్యసించినారు.

వీడ్కోలు తీసుకుంటూ వారు ఈ మధ్య అచ్చు వేసిన రైలు కథల సంకలనం ఆదరంగా, ప్రేమతో ఇచ్చి వెళ్లినారు....ఆ పుస్తకంలోని కథలు బావున్నవి... కొన్ని నాకు బాగా నచ్చినాయి.... వాటి గురించి వివరంగా తర్వాత రాస్తాను 

వారితో కూడా ఒక ఫుటో తీసి ఉంటే బాగుండేది కాని, ఎందుకో ఆనందంలో ఇద్దరమూ గొళ్ళెము మరచితిమి


********


ఆ తర్వాతి రోజు ఏడువందల తొంభై తొమ్మిది చేతులతో, మున్నూరు కోట్ల అంశాల మీద ఎడాపెడా రాసేస్తూ తెలుగు బ్లాగులను పరుగెట్టించి, ఆ తర్వాత ప్రచురణా రంగంలో తనదైన ఖచ్చిత, రత్నఖచిత ముద్ర వేసిన సవ్యసాచీమణి వలబోజు జ్యోతి గారు మా ఇంటికొచ్చి ఆతిథ్యం స్వీకరించినారు...

నవ్యసాహిత్య విపణివీధి, ప్రచురణల అచ్చువీధి ఎలా ఉన్నదీ అన్న సంగతుల మీద చక్కగా మంచి లాజిక్కుతో అనర్గళంగా వారు కూడా ఉపన్యసించినారు.

వీడ్కోలు తీసుకుంటూ రెండు పుస్తకాలను ఆదరంగా అందించినారు...ఒకటి జ్యోతి గారు పుస్తక శతప్రచురణలు పూర్తి చేసిన సందర్భంగా అచ్చేసిన పుస్తకం కాగా, రెండవది కొవ్వలి సత్యసాయి మాష్టారు గారి పదనిసలు పుస్తకం (ఇదీ జ్యోతి గారు అచ్చువేసిందే!)

రెండూ చాలా బ్రహ్మాండంగా ఉన్నవి...

ఆ పుస్తకాలు రెండిటినీ ఫోటోలు తీసినాను కాని, ఇక్కడ వేద్దామని చూస్తే అత్యంత విచారకరంగా File is corrupted అని వస్తున్నది ...

వారితో కూడా ఒక ఫుటో తీసి ఉంటే బాగుండేది కాని, ఎందుకో  కస్తూరి వారితో జరిగినట్టే ఆనందంలో ఇద్దరమూ కెమెరా గొళ్ళెము మరచితిమి !


**********

అలా హైదరాబాదులో ఉన్న కొద్ది రోజుల్లో అనుకోకండా ఇంతమందిని ముఖీనంగా కలవగలిగిన అవకాశం చిక్కటం నిజంగానే అదృష్టం

పోతే - కలవటానికి కుదరక కొద్దిమందితో ఫోనులో మాట్లాడే అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడినాను - శ్రీ బాలాంత్రపు హేమచంద్ర గారు, సోదరి అయ్యలసోమయాజుల మాధవి, కొవ్వలి సత్యసాయి మాష్టారు గార్లతో మాట్లాడటం ఒక మంచి అనుభూతి

ఉన్న కొద్ది రోజుల్లో మా ఇంటర్నెట్టు, ఆ పైన జీమెయిలు సతాయించడంతో, అందులో ఉన్న సోదరి చంద్రలత ఫోను నంబరు తెలవక ఆవిడతో మాట్లాడటం కుదరక చాలా చింతించినాను! అలాగే మా పెద్దగురువుగారు డాక్టర్ కె.బి.గోపాలం గారిని కలవలేకపోవటం కూడా చాలా చింతించే వార్త !

ఇంకో ఇద్దరు ముఖ్యమైన మనుషులు, నా జీవితానికి ఒక రకంగా చుక్కాని లాంటి వాళ్ళు శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు, పామర్తి సత్యనారాయణ గార్లను ఈ సారి కూడా కలవటం కుదరలా - అది కూడా అత్యంత విచారకరం

మరల వచ్చే జనవరి-ఫిబ్రవరిలో హైదరాబాదు వచ్చినపుడు  మరింత మందిని ముఖాముఖీగా కలిసే అదృష్టం కలుగుతుందని ఆశిస్తూ

ఓం తత్ సత్!