Thursday, May 31, 2018

ఆ ఆకాశవాణి ఫోల్డరులో.....

సన్నిధానం శ్రీనివాసరావు గారనే వారు ఎవరో నిన్న రాత్రి ఈమెయిలు పంపించి హేమలత లవణం గారి పాత బొమ్మలు ఏవన్నా ఉన్నవా అని అడిగినారు

వారికి ఈమెయిలు పంపించినాక ఆ చిత్రంతో పాటు ఆ ఆకాశవాణి ఫోల్డరులో, ఆ సంవత్సరంలో ఉన్న మరి కొన్ని ఇక్కడ వేస్తే పని అయిపోతుందని అనిపించి వెయ్యటం! అంతకు మించి ఇంకేమీ లేదు...

ఇవి ఇంతకుముందు ఎన్నో ఏళ్ళ క్రితం, నా ఫేస్ బుక్ అక్కవుంటు బతికి ఉన్నప్పటి సంగతి లెండి. అప్పుడు అక్కడ కూడా పంచుకున్న గుర్తు

Btw - these are from 1973/74Saturday, May 26, 2018

బాహుబలి పుస్తకం

అనగనగా

అవి బాహుబలి మొదటి భాగం విడుదలైన రోజులు. ఆ సినిమా ఎన్ని సార్లు చూసానో లెక్కలేదు. అప్పుడు, నన్ను ఎరిగున్న వాళ్ళు, నేను ఒకానొక సమయంలో తెలుగు సినిమా అత్యంత దయనీయ స్థితిని చూసి ఆశ వదులుకొని ఒక 20 ఏళ్ళు తెలుగు సినిమాలే చూడలేదన్న విషయం ఎరిగున్న వాళ్ళు - విపరీతంగా ఆశ్చర్యపోయినారు.  ఎందుకండి అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ సినిమాకు అని అడగని వాళ్ళు లేరు, అడగని రోజు లేదు.

వాళ్ళ ప్రశ్నలు విని - మీకేమి తెలుసునండి సినిమా అంటే? నిజమైన తెలుగు సినిమా అంటే ఇంత ఠీవిగా ఉండాలని, ఇంత రాజసంగా ఉంటుందని - అది రాచ హృదయం ఉన్నవాళ్ళకు మాత్రమే తెలిసిన సంగతి అని అన్న రోజులు, అనుకున్న రోజులు ఎన్నెన్నో.

ఆ సమయంలో, ఆ సినిమా విడుదలైన సమయంలో ఎన్నో రాతలు రాసుకున్నాను. ఆ రాతలన్నీ గుమికూడిన పుస్తకమే ఇది.

ఈ పుస్తకం, ఈ నా 55వ పుస్తకం, 150 పేజీల  పుస్తకం - ఘనమైన బాహుబలి సినిమా బృందానికి, ప్రత్యేకించి దర్శకులు రాజమౌళి గారికి, పెద్దన్నగారూ అని నేను పిలుచుకునే ఆత్మీయ సోదరులు బాహుబలి గేయరచయిత శ్రీ చైతన్యప్రసాద్ గారికి కృతజ్ఞతలతో సమర్పిస్తున్నాను.

అమెజానులో ఇక్కడ కొనుక్కొనవచ్చును

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్ 

Cover Page Image here -


Saturday, May 19, 2018

వీరే! వీరే! వీరే!

అనగనగా

అనగనగా అంటూ కథలు మొదలుపెట్టినాను

ఎన్నో సంవత్సరాల క్రితం

ఆ కథలు రాతపూర్వకం చేయటానికి కారణం ఉన్నది

స్వతహాగా భయం

స్వాభావిక భయం

దేనికి?

వచ్చిన భాష మర్చిపోతానేమోనని

ఎందుకంటే - ఈ దేశం కాని దేశంలో ఉంటూ - ఇతర వ్యాపకాల్లో పడి, ఇతర పనుల్లో పడి - వచ్చిన భాష, వచ్చిన తెలుగు అడుక్కుతినిపోయింది

అయితేనేం బద్ధకం బతుకంచైవ నాశనం జీవితమేవచ అన్న నానుడి నిజం చేసేవాళ్ళల్లో ఒకడినవ్వటం వల్ల, ఇతర వ్యాపకాల వల్ల (వెబ్సైటు వగైరా వగైరా అన్న మాట) కలిగిన సమయాభావం వల్ల రోజువారీ జీవితం జారుడు బల్లలా ఉండేది

ఎక్కటం, జారటం

ఎక్కటం జారటం 

ఒక రోజు మా అమ్మాయి అడిగింది - నాన్నా డు యు హావ్ అ తెలుగు వర్డ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ? అని

ఆ రోజు తడబడ్డాను

గబుక్కున గుర్తుకురాలా

నాలుక అంచు మీదే ఉన్నది కానీ బయటకు రాలా

కాసేపు తన్నుకున్నాక బయటకు వచ్చింది

సిగ్గుపడ్డాను

నామోషీ అయిపోయింది

ఛస్, జీవితం అనుకున్నా

ఇంకొన్ని రోజులు ఇట్లానే ఉంటే పూర్తిగా ఆంగ్లీకుడనైపోతానని అనిపించింది

అనిపించింది సరే, ఏదన్నా చెయ్యాలి కదా?

ఉహూ!

చెయ్యలా...

ఏమీ చెయ్యలా...

ఈడ్చా

బతుకు అట్లానే మార్పు లేకుండా ఈడ్చా ఇంకొన్ని నెలలు - ఇంతకు ముందు లానే

లోపల భయమున్నా - ఉహూ చెయ్యలా

అంతలో ఒక సంఘటన జరిగె

బయటివారి మూలాన

పరిచయం లేని వారి మూలాన

క్లుప్తంగా చెపుతా

నా వెబ్సైట్లో , మాగంటి డాట్ ఆర్గ్ లో వారెవరో ఒకావిడ కొన్ని చిన్నపిల్లల కథలు పంపించి మీ వెబ్సైటులో అందరికీ అందుబాటులో ఉంచండి అని చెప్పగా - సైటులో పబ్లిషు చేసినాను

అది జరిగిన కొన్ని నెలలకు ఆ కథల కాపీరైటు ఓనరు గారు - మా కథలు మీ సైటులో పెట్టుకునేందుకు వీలు లేదు అని, వెంటనే తీసివేయాలని హెచ్చరించినారు

దానితో - చక్రం తిరిగిపోయింది

నామోషీని అగ్గి మీద గుగ్గిలం చేస్తూ,  అందాకా భయం ఉన్నా కూడా బద్ధకంతో ఏ చర్యా తీసుకోకుండా నలగకొట్టుకుంటూ ఆ స్వాభావిక చర్యలను ద్విగుణం బహుళం చేసి నడుపుకొస్తున్న జీవిత చక్రాన్ని ఆ సంఘటన పరిగెత్తుకొచ్చిన ఉపద్రవంలా కుదిపేసింది

ఆ రోజు ఒక గట్టి నిర్ణయం తీసుకొన్నాను!

ఉన్న భయాన్ని తగ్గించేసుకుంటే పోలా, ఉన్న తెలుగును బతికించేసుకుంటే పోలా , ఎవరిదో ఎందుకు మనమే రాసేసుకుంటే పోలా అని గట్టి నిర్ణయం తీసుకొన్నాను

అంతే!

రాతపూర్వకం చేయటం మొదలుపెట్టినాను

మౌఖికంగా మా అమ్మాయికి చెప్పినవి రాతపూర్వకం చేయటం మొదలు పెట్టినాను

అది ఆ భగవంతుడు చూపించిన దారే

ఆ సంఘటన జరగటానికి ఆ పెద్దాయనే కారణం

అది నా గట్టి నమ్మకం

సరే! ఆ రాసిన వాటిలో, రాసుకున్న కొన్ని, తీరిక ఉన్నప్పుడు, ఇక్కడే ఈ బ్లాగులోనే వేసినాను

ఇక్కడ వేయనివి ఎన్నో ఎన్నెన్నో!

ఇంతలో మా తలిదండ్రుల 50వ వివాహ వార్షికోత్సవం

అప్పుడు వారికి అంకితమిస్తూ ఒక 625 పేజీల పుస్తకం అచ్చు వేసినాను

అన్నీ అనగనగా కథలే

నాకొచ్చిన చిన్న మాటల్లో, నాకొచ్చిన భాషలో రాతపూర్వకం చేసిన కథల్లోంచి ఒక 80 కథలు ఆ పుస్తకంలో అచ్చు వేసినాను

ఆత్మీయ సోదరులు, బాహుబలి గేయ రచయిత శ్రీ చైతన్య ప్రసాద్ గారికి / గురువుగారు , తెలుగులో నవీన సాహిత్యంలో ప్రభంజనమైన షాడో సృష్టికర్త శ్రీ మధుబాబు గారికి / రేగడి విత్తులు నవలా రచయిత్రి, ఆత్మీయ సోదరి శ్రీమతి చంద్రలత గారికి / ఆత్మీయ సోదరి, సంగీత సరస్వతి శ్రీమతి పంతుల రమ గారికి / ఆత్మీయ సోదరుడు బహుముఖ ప్రజ్ఞాశాలి పంతుల రఘు గారికి పుస్తకం ప్రతి పంపించి అభిప్రాయం చెప్పమని అడిగా

వారు నన్ను ఆశీర్వదించి, అభినందిస్తూ ఇంత బారున నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తే విధంగా ఎన్నో మంచి మాటలు రాసి పంపించినారు

వారు అవి పంపించిన రోజు కన్నీళ్ళలో మునిగిపోయా

అవన్నీ, ఆ అభిప్రాయాలన్నీ కలిపి మొదటి పుస్తకం, ఆ 600+ పేజీల పుస్తకంలో అచ్చు వేసినాను

అభిమానం సంపాదించుకోవడం ఒక ఎత్తు

అది నిలబెట్టుకోవటం ఒక ఎత్తు

నా ప్రవృత్తి తెలిసి, నన్ను నన్నుగా అభిమానిస్తూ ఆ ఎత్తుల్లో నిలబెట్టినారు వారంతా

వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో తెలియదు కానీ, సభాముఖంగా, మన:పూర్వకంగా కొన్ని కోట్ల  సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూనే ఉన్నా, ఉంటా

ఆ మొదటి పుస్తకం తరువాత - అచ్చు వేసిన పుస్తకాలు 54

అలా చిత్తుకాగితాల నోటుపాడు రూపంలో రాతపూర్వకం చేసిన ఎన్నో కథలను ప్రూఫ్ రీడింగు చేసుకుంటూ నెమ్మదిగా, వెంటవెంటనే, నిమ్మళంగా, త్వర త్వరగా, వీలైనప్పుడల్లా - ఎన్నో సమయాల్లో - అలా ఎన్నో సమయాల్లో, మూడును (Mood) బట్టి , చేతిలో ఉన్న సమయం బట్టి సంపుటాలు వెలువరించగా ఈనాటికి 54 పూర్తయినాయి

ఈ రోజటికి 54 పుస్తకాలు - అమెజానులో లభ్యం

అవును 54 పుస్తకాలు - గర్వంగా చెప్పుకోగలను

అయితే ఆ గర్వం తలకు ఎక్కించుకోలేదనే నమ్ముతున్నా

ఎక్కించుకోకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటా

ఆ విషయంలో భీష్ముడే నాకు ప్రేరకం

ప్రతిజ్ఞ చేసేసాను - ఆ గర్వం తలకెక్కించుకోనని

అవి, ఆ 54 పుస్తకాలు  - అందులో ప్రతిదీ బయటకు వచ్చినప్పుడల్లా - నాలోని ఈ అనగనగా అగ్గిని ఆరిపోనీకుండా, నిలబెట్టిన ప్రతి మనిషికి నమస్కారాలు అర్పిస్తూనే ఉన్నా!

మరొక్కసారి

నా కథలు నన్ను రాసుకోనిస్తూ, నా ఈ యజ్ఞానికి అండగా నిలబడిన భార్య శ్రీదేవికి అభినందనలు

పట్టుదల అనే పదానికి పర్యాయపదంగా నిలిచి ఎన్నో ఎన్నెన్నో కలలను సాకారం చేసుకున్న, ఎంతో మంది కలలు నిజం చేస్తున్న మా బావగారు, భార్య శ్రీదేవికి అన్నగారు అయిన కూచిభొట్ల ఆనంద్ గారిని, అక్కయ్య శ్రీమతి శాంతి గారిని తలుచుకోకుండా ఈ పోష్టు పూర్తి చెయ్యలేను

మావయ్యలు డి.హెచ్.ఆర్ శర్మ, ద్వా.నా.శాస్త్రి అందించిన స్ఫూర్తి కూడా మరువలేనిది

ప్రింట్ ఆన్ డిమాండ్ అనే విధానం ఉన్నదని - పుస్తకాలు అచ్చు వేసే విధానం తెలియచేసి వెన్నంటి నిలబడి - ఆ విధానంలో ఇన్ని పుస్తకాలు నాతో అచ్చు వేయించిన చిన్న గురువుగారు శ్రీ పామర్తి సత్యనారాయణ గారికి కోటి దండాలు

వారి జీవనవిధానంతో నాకు ఆదర్శంగా నిలచి, నాకు ఆలోచనావకాశం కలిపించిన ఆచార్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు, నాన్నా అని నన్ను ఆప్యాయంగా పిలిచే ఆచార్యులు డాక్టర్ శ్రీ పారనంది లక్ష్మీనరసింహం, నేను అపరిమితంగా అభిమానించే డాక్టర్ గారు - శ్రీమతి లైలా యెర్నేని గార్లకు కృతజ్ఞతల హారాలు

వారి రచనలతో నాకు ప్రేరణగా నిలిచిన గురువులు శ్రీ డాక్టర్ కె.బి.గోపాలం, శ్రీ జె.కె.మోహనరావు, శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు, శ్రీ పామర్తి సత్య, శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ - ఇతరంగా, రోజువారీ విషయాలతో ఆలోచనలు రేకెత్తించిన మరి కొంతమంది మిత్రులు - సర్వశ్రీ - బాలాంత్రపు హేమచంద్ర దంపతులు , చంద్ర రెంటచింతల గారు, రొంపిచర్ల భార్గవి గారు, మండా కృష్ణమోహన్ గారు, నండూరి శశిమోహన్ గారు, శీలా వీర్రాజు దంపతులు, రవి ఇ.ఎన్.వి గారు, భరద్వాజ్ వెలమకన్ని గారు, కిరణ్ ప్రభ గారు, తాటిపామల మృత్యుంజయుడు గారు, భాస్కర్ కొలచన గారు, విజయభాస్కర్ రాయవరం గారు, సినీ గేయ రచయిత శ్రీమణి గారు, రామజోగయ్య శాస్త్రి గారు, అనిల్ అట్లూరి గారు, శ్రీ అట్లూరి గారు, సురేశ్ కాజ గారు, డాక్టర్ సావిత్రి గారు, అంజని యలమంచిలి గారు, సోదరి మాధవి అయ్యలసోమయాజుల, సోదరి సీత కుమారి, సౌమ్య వి.బి గారు  - ఇంకా లెక్కకు మిక్కిలిగా ఎందరో, ఇక్కడ స్థలాభావం వల్ల పేర్కొనని మరెందరో ఆత్మీయ మిత్రులు, గురుసమానులు, శ్రేయోభిలాషులందరకు లక్ష కోట్ల కృతజ్ఞతల వందనాలతో

ప్రత్యేకించి చంద్ర రెంటచింతల, విజయభాస్కర్ రాయవరం గారికి సహస్రకోటి కృతజ్ఞతలు - ఎన్నో పుస్తకాలు కొని, ఎంతో మంది పిల్లలకు కానుకగా ఇచ్చి, వాళ్ళను కూడా కథలు రాయటానికి ప్రేరేపిస్తూ వాళ్ళు చేయగలిగినంతలో భాషను పరవళ్ళు తొక్కిస్తూ ఉన్న వారిద్దరికీ ధన్యవాదాలు


అచ్చు వేసిన ఆ పుస్తకాలు ప్రతి నెలా కొన్ని పదుల సంఖ్యలో కొంటూ - నా దానపు డిబ్బీకి సాయం చేస్తున్న పాఠకులందరికీ కృతజ్ఞతలు

వారే లేకపోతే పరిస్థితి ఏమిటో ఊహించుకోలేను

ఇంకా చెప్పేది చాలా ఉన్నది, కానీ మాటల్లో పెట్టగలిగినప్పుడు, రాతల్లో రాయగలిగినప్పుడు మరల ఇక్కడే వేస్తాను

అందాకా ఓం తత్ సత్!
Monday, May 14, 2018

మహానటి - My 2 cents!

అనగనగా

అనగనగా - Once Upon A Time

అనే దానితో ఒక కథ ముగిసింది

ఆ కథ ఒక అమ్మాయిది

అందమైన అమ్మాయిది

అసామాన్యమైన అమ్మాయిది

జగమొండి అమ్మాయిది

అమాయకమైన అమ్మాయిది

మంచి మనసున్న అమ్మాయిది

మద్రాసు నగరాన్ని ఒక ఊపు ఊపేసిన అమ్మాయిది

చౌదరి ఇంట పుట్టి, అందరి దరి చేరుకున్న అమ్మాయిది

ఆకర్షణా వ్యామోహంలో తప్పటడుగు వేసిన అమ్మాయిది

విధి చేతిలో మోసపోయిన అమ్మాయిది

క్రూరమైన మానవత్వం చేతిలో మరణించిన మంచి అమ్మాయిది

ఆ అమ్మాయిదీ ఈ కథ

ఆ కథ పేరు "మహానటి"

మహానటి సావిత్రి గారిది

ఒక్కటే మాట - సినిమా బాగున్నది

సరే! సినిమాలోకి, సినిమాలో పాత్రలు వేసిన వారి వద్దకు వెళిపోదాము

జెమిని గణేశనుగా చేసిన అబ్బాయి మమ్ముట్టి గారి కొడుకని తెలిసి ఆశ్చర్యపోయినాను

దుల్కర్ సల్మాన్ అనబడు ఆ అబ్బాయి, యాక్షను చెయ్యలేని సూపర్ స్టార్ మమ్ముట్టి గారి అబ్బాయా అని ఆశ్చర్యపోయినాను

విరామ సమయంలో - దుల్కర్ సల్మానా - మీకు సన్మానా చెయ్యాలి - వహ్ వహ్ అని అనుకున్న మాటా, మేక ఇంట పులి పుట్టిందిరా అని ఎవరో మనసులో అనుకున్న మాట బయటకు వినపడటమూ సత్యహరిశ్చంద్రుడి నిజమంత నిజం

చక్రపాణి గారి పాత్రలో ప్రకాశరాజ్యం గారు అనబడు వ్యక్తి చేయటం, అవసరాల గారు అనే ఆయన ఎల్.వి.ప్రసాదు గారిలా వేయటం, క్రిష్ గారు అనే ఆయన కె.వి.రెడ్డి గారి పాత్ర చేయటం - విధి చాలా బలీయమైనది అని నిరూపించినది

నాగచైతన్యం గారు తన తాతగారి పాత్రలో ...... 

తులసి అమ్మ వారు మధురవాణి తల్లిగా విరగదీసినారు

దివ్యవాణి గారు, భానుప్రియ గారు తమ తమ పరిధిలో చేసినా, వారిద్దరికీ మకుటంలా నిలబడి ఛాయానీడ కలిపించిన రాజేంద్రప్రసాదు గారు స్క్రీనును చించి ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుని ఫిరంగులు పేల్చుకుంటూ కలకాలం నిలిచిపోయే ప్రయత్నం చేసి పోయినారు

డయలాగులనేవాటిని మానవబాంబుల్లా వదిలే మోహనబాంబు గారిని కట్టడి చేయటం సాధ్యమైన పనేనని, ఆ బాంబుల నుంచి ప్రేక్షకులను కాపాడవచ్చని నిరూపించారు ఈ అమ్మాయి పుట్టింటివారు   

ఈ సినిమాకు వెళ్ళక ముందు, అనగా క్రితం వారం కాకతాళీయంగా ఒక యూట్యూబు వీడియో చూచినాను

అద్దానిలో నాగేశ్వరరావు గారిని సన్మానమో ఏదో చేయుచుంటిరి

సభావేదిక మీద బాబు వారు మైకు ముందు నుంచొని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకొనినారు

ఆ జ్ఞాపకాలలో ఒకటి - నాగేశ్వరరావు గారి భార్య మోహనబాబు గారిని - బాబూ నువ్వు మా ఆయన కన్నా బాగా చేస్తావు అని అన్నారని, నేను నిజంగానే నాగేశ్వరర్ రావు కన్నా బాగా చేయగలను అంటూ ఒక బాంబు పేల్చినారు

ఆ దాడితో నిశ్చేష్టులైన వారిని ఇంకొకాయన రక్షించే ప్రయత్నం చేసినారు

ఆయన పేరు చిరంజీవో, ఏదో అనుకుంటా

ఆయనను కూడా ఏదో సినిమాలో చూసినాను

ఆ సినిమా ధాటితో నేను 20 ఏండ్లు మరల తెలుగు సినిమా చూడలేదు

ఆ సినిమా పేరు పులి

తన సొంత సినిమా ప్రేక్షకులను రక్షించలేని ఆయన, నాగేశ్వర రావు గారి సన్మాన సభాసదనంలోని ప్రేక్షకులని బాంబు దాడి నుంచి కాపాడే ప్రయత్నం చేసినారు

సరే, అది అలా వదిలిపెట్టినచో - ఆ వీడియోలో చేసినట్టే, ఈ సినిమాలో కూడా రంగారావుగారిని మించిపోతారేమో మోహనబాబు గారు అనుకున్నా

అయితే - నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యము వలన, వారు రంగారావు గారిని అనుసరించి, అనుకరించే ప్రయత్నం చాలా సాధువుగా చేసినారు

సినిమాలలో, తెలుగు సినిమాలలో,  సినిమా వారిలో మానవత్వం చచ్చిపోలేదని - సినిమా డైరెక్టరు వారు నటుల నుంచి మంచి నటన రాబట్టుకునే ఒక పద్ధతి ఉన్నదని, అది ఇంకా బతికే ఉన్నదని నిరూపించబడినది

బుర్రా సాయి మాధవ్ గారు అనే ఆయన డయలాగులు ఎప్పటిలానే తన స్థాయికి తగ్గకుండా చాలా బాగా రాసుకొచ్చారు

సినిమా మొదట్లో నరేశ్ గారి చేత వయసులో పెద్దవాళ్ళను సంబోధించటం ఎట్లానో తెలియని మధురవాణికి కాల్చిన కడ్డీతో వాతలు పెట్టించారు బుర్రా వారు

అక్కడ నా మనసును తొక్కి నారదీశారు

ఏమంటే - చిన్నవాళ్ళెవరైనా, కుటుంబ సభ్యులు కానివాళ్ళు ఎవరైనా, వాళ్ళకు సంబంధం లేని వాళ్ళను, వయసులో పెద్దవాళ్ళను (అది ఒక సంవత్సరమైనా సరే) సంబోధించేప్పుడు పేరు పక్కన 'గారు' లేకుండా పిలిస్తే ఆ రోజు వారికి అచ్చంగా నరేశ్ గారిలా నేను క్లాసు పీకటమో , ఇంకొకసారి వారిని దగ్గరకు రానివ్వకపోవటమో చేస్తానన్నది జగద్విదితం

నాలా ఆలోచించే, ప్రవర్తించే నరేశ్ పాత్రను చూసి నా నార నేనే తీసుకుని సంతోషించినాను

ఇక సంగీతం

మిక్కి జె మెయెర్ అనే ఆయన నన్ను బుల్ డోజరు పెట్టి కుమ్మేసినారు

అది బాక్ గ్రవుండు మ్యూజిక్కా?

కాదు కాదు - ఒక అద్భుతం

టైటిలు సాంగుకు ఇచ్చిన ట్యూను నభవిష్యతి

చాలా బాగున్నది

అది భూతకాలంలో ఎవరన్నా వాయించినారేమో నాకు తెలియదు కానీ - ఇది, ఈ సినిమా టైటిలు సాంగు మటుకు చాలా బావున్నది

విరామ సమయం తర్వాత ఒక నిమిషమే వస్తుంది ఆ బిట్టు

ఆయన నాకు బ్రహ్మోత్సవంతో పరిచయం

ఆ దానియందు ఇచ్చిన సంగీతము కర్ణకఠోరముగా ఉండుటతో పేరు కనపడగనే ఆశలు వదలుకుంటిని

కాని, కొద్ది నిమిషాలకే విభ్రమం ఆవరించినది

ఆయన ఈ ప్రాజెక్టును ఛాలెంజిగా తీసుకొని చేసి నిరూపించుకొనినారు అని తెలిసి వచ్చింది

ఎందుకు తమ ప్రతిభను దాచుకొంటారో, ఊకో సినిమాకు ఒక్కో ముసుగు ఎందుకు వేస్తారో అర్థం కాని సంగతే

అన్నిటికీ అదరహ సంగీతం ఉండవలె

ఈ ప్రపంచకంలో తెలుగు సినిమాల సంగీతం మారుమోగిపోవలె

దిగ్దిగంతాలు దద్దరిల్లిపోవలె

ఈ సినిమా వలె, బాహుబలి వలె, జనతా గారేజు వలె

అయినా ఎవరి ప్రాప్తం ఎవరికెరుక?

ఆ భగవంతుడికి, ఆ సంగీత దర్శకుడికి

సరే అది వదిలివేసెదము

ఆ పైన సినిమాటోగ్రఫీ

స్పానిషుడు - డానీ సాంచెజ్ లోపెజ్ అనబడు ఈ వ్యక్తి ఈ సినిమాను స్వర్గలోకంలో ఉన్న సావిత్రిగారి పాదాల దగ్గరకు తీసుకొని పోయేంత ఇదిగా చేసినాడు

బయటివారు మన సినిమాలకు పని చేసినపుడు మన సినిమాలు ఎలివేటు అవుతాయన్న నిజం తెలియచేసిన చిత్రం ఇది


ఇక మహానటి పాత్ర వేసిన అమ్మాయి - కాదు కాదు - ఆ పాత్రలో ఒదిగిపోయిన అమ్మాయి గురించి చెప్పవలసిందేమీ లేదు

తోట తరణి గారిని తలచుకోకపోతే ఈ సినిమా స్థాయిని దించినట్లే


సరే, చివరిగా ఒక రెండు ముక్కలు

ఏ పూటా, ఏ తెలుగు సినిమాకైనా ఇతర ప్రేక్షకుల లెక్క లేకుండా రాక్షసమూకల్లా ప్రవర్తించే మా ఊళ్ళోని తెలుగు వారు ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న సమయంలో సాధువులై పోవటం అచ్చంగా ఆ అమ్మాయి మహత్యమే

ఇక్కడ పుట్టిన పిల్లలను తీసుకొచ్చి సావిత్రి గారిని చూపించే ప్రయత్నం చేసినారు కొంత మంది

అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదని మటుకు చెప్పవచ్చును

ఏమని అడిగితే - ఎన్నో కారణాలు విరామ సమయంలో వారి ముఖాల యందు కనపడ్డవి

మీరు సావిత్రి గారి తరం వారైతే, సావిత్రి గారు తెలిసిన తరం అయితే చాలు - ఈ సినిమా మీరు చూడవలసిందే

మీ పిల్లలకు, తర్వాతి తరాలకు చూపిస్తే మంచిదే - కానీ వారికి సావిత్రి గారి పట్ల మీకున్నంత ప్రేమ వారికి ఉండాలన్నంత ఎక్కువ ఆశలు మటుకు పెట్టుకోకండి

ఎందుకంటే వారికి దుల్కర్ సల్మాన్ గారు , కీర్తి సురేశ్ గారు ఉన్నారు 

ఈ తరం స్థాయికి చాలా ఎక్కువలో, ఎత్తులో వారిద్దరూ ఉన్నారు

ఈ తరానికి కె.వి.రెడ్డిగారిలా - నాగ్ అశ్విన్ గారు ఉన్నారు

ఈ తరానికి మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు గారిలా - బుర్రా సాయిమాధవ్ గారు ఉన్నారు

పోష్టు ముగించబోయేముందు ఆఖరాఖరి మాట

ఈ సినిమా కథ చాలా మంది ఆడవాళ్ల కథే

సినిమా ప్రపంచంలో ఉన్న ఎంతోమంది ఆడవాళ్ల కథే అని అనిపించకపోతే అది ఆశ్చర్యకరం

అయితే ఆ ఎత్తుపల్లాలు సావిత్రి గారి జీవితంలో తుఫానులా అనూహ్యంగా ఉండటంతో సినిమా తీరాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది

ఈ సినిమా ఎవరి మీదనన్నా తీయవచ్చు

పాకుడు రాళ్ళు
పాకుడు రాళ్ళు
అంటూ పాట ఎత్తుకోవచ్చు

అది జవం ఉన్న సావిత్రి గారి మీద తీయటంతో జీవం వచ్చింది

మనిషి జీవితానికి కష్టం శరీరమైతే, సుఖం చర్మం లాంటిది

కష్టాలను సుఖంతో కప్పేసి ఆనందపడడం మనసుకి అవసరం

తట్టుకోలేని, కోలుకోలేని దెబ్బలు తగిలి చర్మం ఎన్నో చోట్ల విడిపోతే, ఆ శరీరం చూడటానికి అసహ్యమవుతుంది

మరి ఆ సమయంలో ఆదుకునే వారుంటే చర్మం మళ్లీ చిగురించి శరీరాన్ని తనంతట తనే మళ్ళీ అందంగా తయారు చేసుకుంటుంది

ఆ ఆదుకునేవారు లేక, తోడు లేక ఈ చరిత్రలో ఎన్నో జీవితాలు నాశనమయినాయ్

సినిమా ప్రపంచమూ అందుకు అతీతం కాదు

అందులో సావిత్రి గారిది ప్రథమ స్థానం

ఇలాటి వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి, కానీ మానవత్వం మరచిపోకూడదు

సావిత్రి గారిలా మానవత్వంతో మిగిలిపోవాలి

మహోన్నతంగా మిగిలిపోవాలి

ఎన్నేళ్ళైనా అందరి గుండెల్లో మిగిలిపోవాలి


ఇక చెప్పవలసిన ఇంకో మాట లేదు

ఓం తత్ సత్!