Monday, May 22, 2017

బిచ్చాన్ని చీత్కరిస్తావా... ?

అక్షరంబే తల్లి
అఖిల విద్యలకు
అక్షరంబు లేనివాడు
ఇలలోన అబలుండు
బిచ్చమైనను పుట్టదు
వానికి పృథివిలోన
నా గులాబీ అక్షరంబే
నవలా లోక రక్షకంబు


-- ఇది నేను మా చల్లపల్లిలో గులాబీ పూల మీద నవల ఎప్పటికైనా రాస్తానని శపథం పట్టిన ఆనందు నోట కొన్ని వందల సార్లు విన్న మాట, పాట

దానికి మాతృక ఈ చాటువు అని తర్వాత, కాస్త పెద్దయినాక, తెలిసింది నాకు

అక్షరంబు తల్లి యఖిల విద్యల కెల్ల
నక్షరంబు లోకరక్షకంబు
అక్షరంబు లేని అబలున కెందును
భిక్ష పుట్టబోదు పృథివిలోన

ఈ పై చాటువు అసలుగా మొన్న అక్షరం అని రాసినదానికి ఉపోద్ఘాతంగా పడవలసిన సంగతి, ఎందువలనో మరచితిని

సరే, అదలా పక్కనబెడితే, ఈ చాటువుకు, కింద రాయబోయే దానికి ఆట్టే సంబంధం లేకపోయినా ఆ చటువు రగిలించిన ఆలోచన ఈ రాత

అంతే అంతకు మించి ఏమీ లేదు

భిక్ష

ఆదిభిక్ష

అనాది భిక్ష

ఎన్నో వందల సంవత్సరాలుగా మన జంబూద్వీపంలో తిష్ట వేసుకున్న వరం

కొన్ని జీవితాలకు శాపం

యాయవారం

అమ్మా కబళం

అయ్యా ఏదన్నా ఉంటే పెట్టండయ్యా

అమ్మా ఒక పైసా దానం చెయ్యండమ్మా

ఇది - ఈ భిక్ష - ఎన్నో జీవితాలకు మానవత్వంగా ప్రాణం పోసిన వ్యవస్థ

మానవులను మానవులుగా బతకనిచ్చిన రూపం

సాక్షాత్ పరమశివుడే భిక్షుకుడు

చేతిలో కపాలంతో ఆదిభిక్షువు అని పిలిపించుకోవటం ఆయనకు అత్యంత ప్రీతికరమట

ఈ మాట ఎప్పటినుంచో ఉన్నా, చలనచిత్ర మాధ్యమంగా సీతారామశాస్త్రి ప్రచారములోకి తెచ్చినారు

సర్వదమనుడికి, ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టిన భిక్ష పాట అది

ఈ భిక్షకు ప్రధాన కారణాలు - ఆకలి, సోమరితనం, పరిస్థితులు

ఆకలి గొన్న వాడికి భిక్ష వెయ్యటం ఉత్తమం

పుణ్యలోకాలకు మణిమయరత్న దారి అది

పరిస్థితుల మూలాన భిక్షకు వచ్చినవాడికి సాయం చెయ్యటం మధ్యమం

పుణ్యలోకాలకు రాళ్ళు రప్పలతో కూడిన దారి అది

సోమరితనం మూలాన భిక్షకు వచ్చినవాడికి సాయం చెయ్యటం పాపం

పాపలోకాలకు ముళ్ళ కంచెలతో కూడిన దారి అది

అపాత్ర దానం నరకలోకాలకు ఆరోహణపర్వం

భిక్షలో ఆత్మాభిమానం చాలా ఎక్కువ పాలు పనిచేస్తుంది

తన మీద తనకు గౌరవం, నమ్మకం ఉన్నవాడు చస్తే బిక్షకు పోడు

ఉపవాసమన్నా ఉంటాడు కాని, భిక్షకు పోడు

అలాటి వారిని, వారి మన:స్థైర్యాన్ని చూసి మనవారు ఒక సామెత కూడా చెప్పినారు

భిక్ష కన్న ఉపవాసము మేలు అని

ప్రాణాలకు ప్రమాదము వచ్చినపుడు మటుకు బిచ్చమెత్తవచ్చును

అక్కడా ఈ పై సామెతనే తిరవేసి చెప్పినారు పూర్వీకులు

ఉపవాసము కన్న బిచ్చము మేలు అని

ఎందులకు ?

ఏదన్నా సాధించాలంటే మనిషి బతికుండవలె కద

అందులకు

బిచ్చము కొరకు బయలుదేర్న సొంత జీవితానికి బిచ్చము వేసి బతికించుకొనవచ్చును

అందులకు

అన్నిటికన్నా బతుకుట ముఖ్యము

ఇక్కడో పిట్టకథ చెప్పుకొనవలె

అనగనగా ఒక ఊరు

ఆ ఊరిలో ఒక కుటుంబం

ఇంటాయన పరమ పిసినారి

ఇంటావిడ ఔదార్యాస్వభావురాలు

బిచ్చగాళ్ళు వచ్చేవారు

ఆవిడ కొద్దో గొప్పీ భిక్ష వేసేది ఆయన చూడకుండా

ఒక రోజు చూడనే చూసినాడు

ఉగ్రుడైపోయినాడు

ఆవిడకు పెట్టే తిండిలో కోత విధించినాడు

అయినా తన కోతలోనే అప్పుడప్పుడు ఇతరుల కడుపు కోత, ఆకలికోత తీర్చేది

అది చూసి ఆవిడను పస్తులుంచాడు

ఆ సంగతి తెలిసిన భిక్షకులు ఉగ్రులైనారు

ఆ తల్లి బిచ్చమేసిన భిక్షకులు ఆ ఇంటిని ముట్టడించినారు

తమ జోలెలలో ఉన్నదంతా ఆయమ్మ కాళ్ళ ముందు పెట్టి అమ్మా అని ఆప్యాయంగా తినిపించినారు

పిసినారిని చావచితక బాదినారు

అట్లా తమ ఋణం తీర్చుకొనినారు

ఆరోజటి నుంచి పిసినారి మారినాడు

మానవత్వంతో మెలగినాడు

సరే, అదలా పక్కనబెడితే భిక్షువులు నాల్గు రకములని ఉవాచ

కుటీచకుడు
బహూచకుడు
హంస
పరమహంస

ఇవియన్నీ విష్ణుస్మృతిలో వివరించబడినవని పండితుల మాట

ఈ విష్ణుస్మృతికి, 16వ శతాబ్దిలో టీక రాసినవారు కాశీ నివాసి శ్రీ నాదపండితులని ప్రతీతి

అద్దానియందు వైష్ణవుల దైనిక జీవనము, వైష్ణవిక బిక్షాటన మొదలగునవి వివరించబడి ఉన్నవి

ఈ భిస్ఖుకులు చేయునవి ఐదు రకములట

మాధుకరము
అసంక్లప్తము
పాక్ ప్రణీతము
అయాచితము
తాత్కాలికము అని

అన్ని భిక్షలు ఈ ఐదిట్లోకి చేరవలసిందే

ఎక్కడిదాకో ఎందుకు మన మహాభారతమే సాక్షి

శకుని మామే సాక్షి

కారాగారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్క మెతుకు బిచ్చమెయ్యగా, ఆ మెతుకులే కలిపి ఒక్క ముద్దగా చేసి బతికించినారు మామము

రగిలిపోయిన మామ తన ప్రతీకారం తీర్చుకొన్నాడు

వంశాలు వంశాలే సర్వనాశనం ఒనరించినాడు

ఆ కోపాగ్నిలో మహాసమిధిలను పెర్చినాడు

మహాభారతమే జరిగించినాడు

మహాభారతంలో మహావ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది ఆ కృష్ణ పరమాత్మ తర్వాత శకుని మామే

ఆయన లేకుంటే వినాశనానికి మార్గముండదని పరమాత్మ ఆ జీవన్నాటకము వేయించినాడు

భిక్ష చేత అంత పని చేయించినాడు ఆ జగన్నాథుడు

ఇదే భిక్ష ప్రాణాలకు పెడితే క్షమాభిక్ష

ఎన్నో వందల సంవత్సరాల నుంచి, రాజుల కాలం నుంచి ఉన్నది ఈ పద్ధతి

తప్పు చేసి సిక్ష పడినవాడు సత్ప్రవర్తకుడిగా మారిపోయినపుడు వానికి క్షమాభిక్ష ప్రసాదించబడును

కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం వలన క్షమాభిక్ష ప్రసాదించబడును

శిశుపాలుడికి క్షమాభిక్ష పెట్టినాడు

వందతప్పుల వరకు క్షమాభిక్ష పెట్టినాడు

వాడు బిచ్చమే కదానని అలుసు చేసినాడు

బిచ్చాన్ని చీత్కరిస్తావా అని ఆ పరమాత్మ వాని తల తీసినాడు

ఆ పరమాత్మే అరివీర భయంకరుడైన అశ్వత్థామకు క్షమాభిక్ష పెట్టినాడు

కేవలం గురుపుత్రుడన్న కారణంతో

శివాజ్ఞ మీరరాదన్న కారణంతో

పుత్రభిక్షలు మన చరిత్రలో, ఇతిహాసాలలో కోకొల్లలు

భవతీ భిక్షాందేహి అన్న మాట లేని ఇతిహాసమే లేదు

రావణుడి ఆ మాటతోనే అమ్మను తీసుకొనిపోయినాడు

వాని చావు వాడే కొనితెచ్చుకొనినాడు

ఆ మాట లేకున్న రామాయణమే లేదు కద

అంత శక్తి ఉన్నది భిక్ష అను పదమునకు

భవతీ భిక్షాందేహి అన్న మాట లేని చరిత్రే లేదు

భవతీ భిక్షాందేహి లేకపోతే మనకున్న స్తోత్రాలు, పంచకాలు సర్వ భక్తిప్రపంచమే ఉండేది కాదు

శంకర భగవత్పాదులు ఆ మాట పుచ్చుకునే కదా అంతటి భక్తి సామ్రాజ్యాన్ని మనకు బిచ్చము వేసినారు

అన్నమయ్య ఆ వెంకన్న పాదముల బిచ్చము కొరకే కదా అంత సాహిత్యము మనకు బిచ్చము వైచినాడు

త్యాగరాజు ఆ రాములవారి సాక్షాత్కార బిచ్చము కొరకు మన కర్నాటక సంగీతాన్ని సుసంపన్నం చేసి మనకు బిచ్చముగా వదలినాడు

రాజులు సామంతులకు బిచ్చము పెట్టిన ఉదాహరణలు లెక్కకు మిక్కిలి

ఇట్లా ఎన్ని చెప్పుకొనవచ్చును, ఇంకెన్ని రాయవచ్చును

బిచ్చమే కదానని తీసిపడవేస్తే, చీత్కరిస్తే నీవు మానవుడిగా మిగలవు

మానవత్వమే నిను మరవదు

ఓం తత్ సత్!

--

నిన్న రాత్రి రాసుకొన్న వ్యధ...

"మనం" షో చూసివచ్చిన పిదప, వారు ఆ స్త్రీ సంఘం ఆర్తి కోసం ఎంతో కష్టపడి - గంపెడాశతో మా ఊరికి వచ్చి ఓలలాడిస్తే - మన తెలుగు సభికుల చేత మోసపోయిన విధానం చూసి మనసు మెలిపడ్డది. చివరకు స్టేజి మీద భవతీ భిక్షాందేహి అని ఎన్నోసార్లు జోలె చాచినారు పాపం. వారి కోసమా? కాదు - ఒక మహోన్నత కారణం కోసం. చాలా బాధపడినాను. అప్పుడు రాసుకొన్నది ఇది..


No comments:

Post a Comment