Monday, May 22, 2017

జయమాలిని విలాస్ - అనగా నాశం లేనిది

అక్షరం అనగా నాశం లేనిది

అదే ఓంకారం

అదే జీవాత్మ

అదే పరమాత్మ

అదే పరబ్రహ్మం

అదే మోక్షం

నిత్యమైన బ్రహ్మతత్త్వాన్ని బోధించేది అదే

అదే వేదం

అదే ప్రామాణికత

అదే నీరు

అదే ఆకాశం

అదే యజ్ఞం

అదే జపం

అదే పుణ్యం

అదే ఖడ్గం

ఈ అక్షరం చేత ఉన్నవాడు అక్షరచణుడు

అక్షరేణ విత్త: అని వాక్యం

అక్షరాన్ని నమ్ముకొన్నవాడికి ధనలోటుండదని అన్వయం

ఒక అక్షరానికే అంత శక్తి ఉంటే, రెండు కలిస్తే ఆ శక్తిని ఆపతరమా?

పదులు వందలు కలిస్తే ఉప్పెనలే

ప్రపంచమే తలకిందులు

అలాటివారు, ఉప్పెనలు తెచ్చినవారు మన తెలుగు దేశంలో ఒకప్పుడు కోకొల్లలు

ఈనాటికీ అక్కడక్కడ ఉన్నారు

రేపటికి అసలెవరైనా, ఎక్కడైనా ఉంటారో ఎవరికీ తెలవదు

అలాటి అక్షరాలు బంధిస్తే ఛందం

అలాటి అక్షరాలను స్వేచ్ఛగా వదిలేస్తే వచనం

బంధించు వాడు అక్షరచ్ఛందుడు

వదిలేయువాడు వచనోచ్ఛందుడు

అక్షరచ్ఛందుడు దృఢనినిశ్చయము కలవాడు

వానితో సహవాసము చేయు అక్షరములు మరింత దృఢముగానుండును

వచనోచ్ఛందుడు స్వేచ్ఛాస్వాతంత్ర పిపాసి

వానితో సహవాసము చేయు అక్షరములు వాయువేగ గమకాలే

ఆ  అక్షరములకు జనని, అమ్మ, తల్లి - ఆ బ్రహ్మదేవుని పత్ని వాణి

ఆ దయగల తల్లి, ఆ వాణి వరము వలన గంటము దొరికె మానవులకు

ఆ తల్లిని తలచుకొంటూ గంటమునకు కూడా అక్షరజనని అని పేరిడినారు పూర్వీకులు

ఆ వాణి కృప వలన జ్ఞానము అబ్బును

అక్షరమే ఆ జ్ఞానానికి మూలం

అక్ష్రరమును జ్ఞాననాళికకు ఎక్కించుకొనినవాడు పండితుడు

వానికి అక్షరజ్ఞుడు అని పేరు ఖరారు

అక్షరమును జ్ఞాననాళికకు ఎక్కించుకొననివాడి పామరుడు

వానికి అక్షరఖరుడు అని పేరు తకరారు

అక్షరం ఆధారం

ఎన్నిటికో ఆధారం

అక్షరమే ఆధారము

ఎన్నో తంత్రాలకు

ఎన్నో మంత్రాలకు

ఎన్మో శాస్త్రాలకు

రుద్రము చదువునప్పుడు శరీపు అతిముఖ్య భాగాలని స్పృశించి దిగ్బంధనము చేయుట నేత్రానందకరం

జపతపాలు చేసేటప్పుడు ఆయా అవయవాల వద్ద మంత్రాక్షరాలను ఉంచడం న్యాసం

అక్షరాన్ని ఉచ్చరించి శరీరాన్ని స్ప్రశించటం న్యాసం

అంగన్యాస, కరన్యాసం అని వివిధమైన పేళ్ళు

ఇంకా ఎన్నో ఉన్నవి

మంత్ర పఠనంతో ఆయా అవయవాల దేవతలను ఆవాహన చేయటం అక్షరం బాధ్యత

అక్షరానికి అంత శక్తి ఉన్నది 

ఈ న్యాసాన్నే సభకు ఇస్తే స్వాగతోపన్యాసం

ఈ న్యాసాన్నే విశ్వవిద్యాలయానికి ఇస్తే స్నాతకోత్సవ ఉపన్యాసం

ఈ న్యాసాన్నే నివాళికి ఉపయోగిస్తే స్మారకోపన్యాసం

మరి సన్న్యాసానికి ఈ న్యాసానికి సంబంధమేమన్న ఉన్నదా అని సన్నాసులు అడగవచ్చును

అక్షరం బయటకు పలకకుండా లోపలే ఉంటే అదే సన్న్యాసం

అలా ఎన్నిటినో తన నెత్తిన మోస్తూ ఉండేది అక్షరమే

ఈ అక్షరాలను పంక్తుల్లో పేరిస్తే అది అక్షరపంక్తి

అదే అక్షరాలను మాలగా పేరిస్తే అక్ష్రరమాల

అదే మన వర్ణమాల

ఈ అక్షరాలను రాయటానికి ఉపయోగించే దానికి అక్షరభూమిక అని పేరు

అది పలక కావొచ్చు, అది కాకితం కావొచ్చు, అది కీబోర్డు కావొచ్చు

ఏదైనా కావచ్చు

అక్షరానితో అనుబంధం ఉన్నదంటే అక్షరంతో మొదలవ్వాల్సిందే

పిల్లవాండ్లకు అక్షరం పరిచయ్మ్ చేయటం అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం చేసి అక్షరం మరచిన పెద్దవాండ్లు నిరక్షరకుక్షులు

అక్షరములు నిలబెట్టుకొనినవాడు అక్షరాస్యుడు

అక్షరాలను నెత్తిన పెట్టుకొనినవాడు విద్వాంసుడు

వాడే అక్షరముఖుడు

నిలబెట్టుకోలేనివాడు అక్షరమూఢుడు

వాదే అక్షరవిముఖుడు

అక్షరాలు షడ్రూపాలు

అవే పంచాక్షరీ మంత్రాలు

గాయత్రీ మంత్రం 24 అక్షరాల సమాహారం

ఓం తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యో న: ప్రచోదయాత్

చతుర్వింశతి  అక్షరాలు ఇవి

వాటిని పఠించినవాడికి, పాటించినవాడికి మోక్షమే అక్కరలేదు

సరాసరి ఆ పరమాత్మే మనలో కొలువైపోతాడు

జనగణమన అధినాయక అన్నా అక్షరమే

వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడొ దెల్పుడీ అన్నా అక్షరమే

తాటాకు మీద అక్షరమే

శాసనాలలోనూ అక్షరమే

అక్షరాలలో తెలుగు అక్షరాలు గొప్పవి

అక్షరానికి చావు లేదు

కాని మార్పు ఉన్నది

ఏనాటిదో ఱ ఇపుడు అగపడదు

ఏనాటిదో ఌ ఇపుడు అగపడదు

తొమ్మిదవ శతాబ్దము నాటి మూడవ చాళుక్య వర్ధనుని అహదన కరతామ్ర శాసనమూ అక్షరాల నిధే

అందులోని తెలుగు అక్షరాలతోనిండిన వాక్యం ఒకటి చూడుడు

-- మహాసత్థవల కొండుకలో నిరవద్య ప్రిధివి కవడిరజుళ్ గునవన నభియుళ్

ఈనాటి వారికి ఆ అక్షరక్రమం అర్థం కాకపోవచ్చును

కానీ ఆ నాటికి ఆ అక్షరం గొప్పది

శాసనముకెక్కినదంటే గొప్పది కాక ఏమి ?

ఆ శాసనం ద్వారా సమాజానికి, ఆనాటి సమాజానికి, ఈనాటి సమాజానికి ఉపయోగం కలిగింది

ఆనాడు ప్రజలను ఉత్తేజితులను చేసిన అక్షరాలు అవి

ఈనాడు పండితుల ఉత్సుకతను ఉత్తేజం చేసిన అక్షరాలూ అవే

ఆ శాసనం వల్ల చరిత్ర అక్షరబద్ధం అయిపోయింది

అంత శక్తీ ఆ అక్షరాలదే

ఈనాటి చరిత కూడా అక్షరబద్ధమే

రేపటి పండితులకి ఉత్సుకతే

ఈనాటి అక్షరాల భావభయభీతులేమిటో తెలుసుకోవటానికి

తెలియాలంటే అక్షరమే ఆయుధం

మృదుమధుర భావం పలికాలంటే అక్షరం కావాలి

ఆవేశం కట్టలు తెంచుకోవాలంటే అక్షరం కావాలి

కరుణతో పొంగి పొర్లాలంటే అక్షరం కావాలి

నవరసాలు ఆ అక్షరానికి సొంతం

అన్నమయ్య అక్షరాలు ఈనాడు చాలామందికి తెలియవు

ఈనాటి అక్షరాలు ఏ నాటికి ఎవరికీ తెలియవు

అదొక వింత

అన్ని భాషలయందు తెలుగుభాష గొప్ప

గొప్పదని మనవారే కాక ఎందరెందరొ చెప్పినారు కావున అది నిజమేనను మాట సత్యము

అటువంటి భాషకు ఆ సంపదను ప్రసాదించినవి వర్ణాలు

ఆ వర్ణాలు ముప్ఫైయ్యారు

వానిలో పరుషాలు, సరళాలు, సవర్ణాలు, తాలవ్యాలు, దంత్యాలు, ద్రుతాలు, కళలు, లఘువులు, ద్వివిధాలు, సంధులు ఇలా ఎన్నో ఎన్నెన్నో

ఇవన్నీ కలిసి వ్యాకరణంలో భాగమైనవి

వీనిని ఉపయోగించుకొని జయమాలిని విలాస్ అని రాయవచ్చును ఆదిదేవమ్మ పూటకూళ్ళ ఇల్లు అని రాయవచ్చు

ఏ రకము రాసుకొనుటకైనా ఈ అక్షరములు ఉపయోగపడును

అక్ష్రరము ఖడ్గము అని చెప్పుకొనినాము కద పైన

ఆ కత్తిని ఉపయోగించువాని మీద అక్షర శక్తి ఆధారపడియుండును

ఎవని చేతియందు చాకచక్యముగ తిప్పబడునో వాడు పండితుడు

ఎవని చేతియందు అయోమయముగ తిప్పబడునో వాడు పామరుడు, మూర్ఖుడు

అక్షర సమూహములకు లింగములు ఏర్పరచినారు వైయాకరుణులు

స్త్రీ లింగమని, పుం లింగమని, నపుంసక లింగమని విభజించినారు

వాడుకలో ఏ లింగము ఏ లింగమైనను చివరకు అక్షరమే పరమ లింగం

జగజ్జ్యోతి లింగం

పరమేశ్వర లింగం

పరమాత్మక లింగం

అందువలన అక్షరమును పట్టుకొని యుండుము

వినాశనానికి ఉపయోగించక మంచికి ఉపయోగించు

అదియే నిన్ను వైతరణి దాటించును

ఓం తత్ సత్!

-- ఇంకా ఎంతో రాయవచ్చు, ఒక మహాభారతమే రాయవ్వచ్చు కాని ఇక్కడికి ఆపితే ఇంకొక పని చేసికొనవచ్చునని 

No comments:

Post a Comment