Wednesday, May 10, 2017

బాహుబలికి - దీనికి అసలు సంబంధమేదన్నా ఉన్నదా?

గీతం

సంగీతం

వాయిద్యం

సప్తస్వరాలు

ఇవన్నీ వ్యర్థాలే

పూర్తి వ్యర్థాలే

స్వరం లేకుంటే

తీయని స్వరం లేకుంటే

అంతా వ్యర్థమే

గాత్రం, గానం

తంత్రులు లేకుంటే

స్వరతంత్రులు లేకుంటే

అంతా వ్యర్థం

అంత అపురూపం

ఆ అపురూపాన్ని దేహం మరింత అపురూపంగా చూసుకుంటుంది

దానికో పేటిక ఏర్పాటు చేసుకొన్నది

స్వరపేటిక

తంత్రులు అన్నీ ఆ పేటికలోనే

దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంటాయ్

ఏడుపు వచ్చినప్పుడు ఒకలా

ఆనందం వచ్చినప్పుడు ఒకలా

గద్గదమైనప్పుడు ఒకలా

కోపం వచ్చినప్పుడు ఒకలా

ఇలా ఎన్నో దాగుడు మూతలు

అమ్మా అని పిలవాలన్నా ఆ తంత్రులే

దాగుడుమూతా దండాకోర్ అనాలన్నా ఆ తంత్రులే

ఏవమ్మా అన్నం పెట్టు అనాలన్నా ఆ తంత్రులే

ఆ తంత్రులు జగద్వ్యాపకం

తంత్రులన్నీ ఆ భగవంతుడి వరం

ప్రతి ప్రాణికి ఇచ్చినాడు

ఆయా జాతిని బట్టి, వాటి కర్మను బట్టి వాడుకుంటవి

ఆనేకపస్వరం పలికే తంత్రులు ఏనుగుకు అలంకారం

దీనికే నిషాదమని పేరు

సంగీతపు సప్తస్వరాలలో ఒకటి

సరిగమపదని లో ని అదే

తీయని తంత్రులు కోకిలకు అలంకారం

చిరుచిగుళ్ళు పూయగానే పులకింత దానికి

ఓండ్రస్వరాలు గర్దభానికి అలంకారం

సరే, దీని సంగతి చెప్పనే అక్కరలా

ప్రపంచంలోని అన్ని తంత్రులకు ఒక ప్రత్యేకత

దేని ప్రత్యేకత దానిదే

దేనికవి విడిగా వినిచూడాలి అంతే

అప్పుడే దాని సౌందర్యం బోధపడుతుంది

ఆపుడే ఆ భగవంతుడి సృష్టి బోధపడుతుంది

ఈ తంత్రులకు గతులు, గోతులు, ఎత్తులు

ఫలిత గతి స్వరం
వక్రిత గతి స్వరం
స్ఫుటిత గతి స్వరం
స్ఖలిత గతి స్వరం
జ్వలిత గతి స్వరం
ధ్వంసమాన గతి స్వరం
సుషుప్త గతి స్వరం
అస్తమయ గతి స్వరం

ఇవి అష్టగతి స్వరాలు

పెద్దగా మాట్లాడేవాడు ఉచ్చైశ్వరుడు

మంద్రంగా మాట్లాడే అమ్మ మంద్రస్వరి

మధ్యమంగా మాట్లాడేవాడు మధ్యమస్వరుడు

వాక్ రూపాలు ఈ తంత్రుల సొంతం

వ్యాకరణం వీటిని నాలుగు రూపాలుగా విభజించింది

పర
పశ్యంతి
మధ్యమ
వైఖరి

అని

పరిమితమైన వ్యాకరణం తన పరిమితులకు లోబడి విభజించిన రూపాలవి

సాహిత్యం కన్నా ఒక మెట్టు పైనుండే సంగీతం మూడు రకాలుగా విభజించింది

మంద్ర, మధ్యమ, తార స్వరాలు అని

ఇపుడు కాస్త వాయిద్యాల వైపు వెళదాం

వాయిద్యాలలో రారాజు వీణ

ఆ వీణాతంత్రులు పలికే గమకాలు కొన్ని కోట్లు

అందులో ముఖ్యమైనవి ఇరవై రెండు

దీర్ఘము
లాలితము
దీర్ఘిక
ఆదీర్ఘము
దీర్ఘోల్లసితము
దీర్ఘ కంపితము
ఉల్లసితము
సమోల్లసితము
ఉల్లాసితము
ఉచ్చరితము
స్ఫురితమూర్ధ్నిక్షిప్తము
కోమలము
ఆక్షిప్తము
భ్రమితము
ఆహతము
లలితోత్తమము
లలితము
ప్రస్తుతము
గుంఫితము
సూక్ష్మాంతము
కుంచితము
కరస్థితము

వీటిని ద్వావింశతి వీణానాద గమకాలు అంటారు

ఈ గమకాలకు మళ్ళీ గతులు ఉన్నవి

వాటిలో ముఖ్యమైనవి మళ్ళీ ఇరవై రెండు

అణువు
తిరువు
జయ
అనుజయ
కొంకు
వుణవూణ
వళి
భజవణ
పాంపు
సెవణ
వహణి
సవ్యాంగుళ వహణి
అధరవహణి
ఆలాప
హేలన
వ్యాప్తి
బెడంగు
చాలన
సుళికె
చరము
ఇంపు
సొంపు

వీటిని ద్వావింశతి వీణానాద గతులు అంటారు

స్వరం ఇంపుగా ఉన్నది అని ఎక్కడైనా వినపడితే అది ఆ వీణా తంత్రుల స్వరంలా ఉన్నది అని అర్థం

ఎంత సొంపుగా ఉన్నది ఆ అమ్మాయి అంటే - ఇక యువకులు అయిన మీరంతా అర్థం చేసుకోవటమే

స్వరతంత్రులు ఒకోసారి అపిరి తిపిరి అవుతాయి

ఎందుకు ?

దానికో కథా కమామీషు ఉన్నది

ఆ కథకే నత్తి అని పేరు

తంత్రికి మెదడుకు అనుసంధానం అంబికా దర్బార్ బత్తి లాటి నాలుక

ఆ అంబికా దర్బార్ బత్తి లాటి నాలుక ఆరిపోయినపుడు గోల గోల అవుతుంది

అర్థం కాలేదా?

సరే ఒక రెండు వాక్యాల్లో చెప్పుకుందాం

ఏ కారణం చేతనన్నా ఆ నాలుక, లోపలి తంత్రి వేగానికి సమానంగా నడవలేకపోయినపుడు ఒకదాని వెంట ఒకటిగా పరుగులెత్తుకుంటూ వచ్చే ఆ శబ్దాలు ఆగిపోయి గందరగోళానికి గురి అవుతాయ్

ఆ కారణం నరాల వల్ల కావచ్చు

ఆ కారణం మానసిక వికాసం వల్ల కావచ్చు

ఆ కారణం ఇంకేదన్నా కావొచ్చు

అందువల్ల వచ్చిన ధ్వనే మళ్ళీ రావటం, ఒక దాన్ని మర్చిపోయి ఇంకోటి రావటం ఇలాటి వాటి వల్ల శబ్దాలు కాస్త ఇదిగా వినపడతాయ్

ఆ కారణాలు అర్థం చేసుకోని దుర్మార్గులు ఆ కారణానికి నత్తి అని పేరు పెట్టి కసి తీర్చుకుంటున్నారు

భగవత్ ప్రసాదితమైన ఆ తంత్రులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత ఇంపుగా సొంపుగా మీ స్వరం ఉండగలదు

ఇష్టం వచ్చినట్టు వాడేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటవి

ఈ విషయం కర్నాటక సంగీతం పాడేవారిని కాని, అసలుగా ఏ పాటలన్నా పాడేవారిని అడిగి చూడండి

చెపుతారు

కష్ట సుఖాలు మాట్లాడుకోటానికి సమయమూ చిక్కుతుంది

బంధాలు బలపడతాయి

స్నేహ బంధాలు బలపడతాయి

భగవత్ ప్రసాదితమైన ఆ వరాన్ని మంచికే వాడుకోండి

ఆ తంత్రుల నుండి మంచి మాటలు పంచండి

మంచి పాటలు పంచండి

మానవులుగా మిగలండి

అట్లా తంత్రులను ఉపయోగించుకుని మీ మానవత్వం కూడా మెరుగుపరచుకోండి

*******

సరే, నిజం చెప్పొద్దూ - ఈ సోదంతా రాయటానికి కారణం బాహుబలి

బాహుబలిలో అయిదు చోట్ల పిండి పారేసినాడు ఆ సంగీత దర్శకుడు

ఆయన పేరు కీరవాణి

మిమ్మల్ని పిండకపోతే నాకు సంబంధం లేదు కానీ, నాకైతే రోమాలు నిక్కబొడుచుకున్నాయ్

ఎక్కడ?

1) ఒక ప్రాణం పాట అందుకుంటున్నప్పుడు

2) గిటారు తంత్రీస్వరంతో మొదలయ్యే దండాలయ్యా పాట మొదటి నిముషం

3) హంస నావ పాటలోని కొన్ని గమకాలు, గతులు విన్నప్పుడు

4) భల్లాలదేవుని పట్టాభిషేకమప్పుడు, బాహుబలి సర్వసైన్యాధ్యక్షుడి  ప్రమాణస్వీకారమప్పుడు

5) మహేంద్ర బాహుబలి భల్లాల దేవుడి మీదకు ఆకాశ మార్గాన ఒకసారి ఈటెతోనూ, ఒకసారి కట్టప్ప ఇచ్చిన కత్తి తోను  జంపింగులు చేసినప్పుడు

కంపించిపోయాను, పులకించిపోయాను

అది ఆ తంత్రీ మహత్యమే

వాద్య తంత్రి కానీ, స్వర తంత్రి కాని - బావి దగ్గర చన్నీటి స్నానం చేసిన తర్వాత కట్టుకున్న తువ్వాలును పిండి పారేసి ఆరేసినట్లైపోయింది ఆ బిట్లతో

తస్సాదియ్యా - సంగీతం అంటే అట్లా ఉండాల

ఐదు సార్లు చూసినాను ఇప్పటికి

డబ్బులు పోతే పోయినాయ్ సిగదరగ, అన్నిసార్లు కంపనమే! అన్ని సార్లు వందనమే

అదీ సంగతి

ఇక్కడికి ఆపేస్తానండి

ఈవేళ్టికి బాహుబలి సంగతులు చాలు

****

బాహుబలికి - దీనికి అసలు సంబంధమేదన్నా ఉన్నదా? ఈయన రాసుడు ఈయన - తస్సాదియ్యా! 

1 comment:

  1. సినిమా చూసినా మీరు చూసినట్టు చూడలేదు కాబట్టి సంగీతం గురించి నో కామెంట్స్. కానీ మీరు శబ్దం, దాని పుట్టుక, అది సంగీతంగా మారిన పరిణామం గురించి ఇచ్చిన వివరణ బావుంది.

    ReplyDelete