Monday, May 1, 2017

తెలుగువాళ్ళు - బాహుబలి

ఐఫోన్
మోసగాళ్ళకు మోసగాడు

ఐపాడ్
అల్లూరి సీతారామరాజు

ఐపోడ్
సింహబలుడు

థాంక్సు గివింగు
బ్లాక్ ఫ్రైడే

ఇలాటివన్నీ ఒక కోవకు చెందినవే
దేని రికార్డులు దానివే

అందులో ఇప్పుడు బాహుబలి కూడా వచ్చి చేరింది

తెలుగువాళ్ళు
బాహుబలి

అన్నది ఇప్పుడు సంతోషంగా పైలిష్టులో కలుపుకోవచ్చు

ఐఫోను 7, 8, 9, 500 వచ్చేదాక దాని మీద క్రేజు పోదని చాలా మందికి గట్టి నమ్మకం
అందులో చాలా నిజమూ ఉన్నదీ

అది నిర్దాక్షిణ్యంగా ప్రూవు చెయ్యటానికి నాలుగు రోజుల ముందే శారీరకంగా అవసరమైన కాలకృత్యాలను కూడా పట్టిచ్చుకోకుండా ఆ ఫోను అమ్మే దుకాణం ముందు గుడిసెలేసుకొని అదో రకమైన జీవితం గడిపేవారు చాలా మంది ఉన్నారు, ఉంటారు

అది పిచ్చా, వెర్రా అన్న సంగతి పక్కనబెడితె, అంత గుడిసెల జీవితమూ అర్ధాంతరంగా ముగిసిపోయి డాటాప్లానని, దాని తద్దినమని నెలకొచ్చే జీతాన్ని మొత్తం పణంగా పెట్టి క్షవరం చేయించుకునే ముచ్చట ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది

కట్ చేస్తే...

బాహుబలికి అన్వయించి మాటాడుకుందాం కాసేపు

ఐఫోను బాహుబలి లాటిది
డాటాప్లాను కట్టప్ప లాటిది

రాజమౌళి సెల్లు టవరు లాటోడు
కీరవాణి సిగ్నల్ ఎమిటర్ లాటోడు

కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడో తెలుసుకోవాలన్న ఆత్రం, డాటాప్లానుతో ఎంత డబ్బు క్షవరమైనా ఐఫోనును చిద్విలసంగా చేతిలో ఊపుకుంటూ తిరిగే ఆనందం - ఈ రెండూ ఒకదానిని ఒకటి వెంబడిస్తూనే ఉంటాయ్

పోతే డాటాప్లాను 1 GB, 5GB, 15GB, Unlimited GB అన్న రకాలుగా విభజించబడి ఉంటుంది

నువ్వు 1GB కి డబ్బులు కట్టి, అన్లిమిటెడ్ ఆనందం కావాలంటే బిల్లొచ్చేప్పటికి పృష్టమంతా జేగురు రంగుకు తిరిగి ఎర్రముడ్డి కోతివైపోయే ప్రమాదం చాలా హెచ్చు

అందువల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషనూ అవీ లేకుండా, అసలు నీకు ఐఫోనే లేదనుకుని వెళితే ఐఫోను విలవ, అందులోని ఆనందం తెలిసివచ్చును

మరి సాంసంగు ఫోను ఉన్న వాళ్ళేం చెయ్యాలి అని అడుగుతున్నావా?

ఓ సారి ఉత్తరానికి తిరుగు
తలపెట్టు
పండుకో

సరే, సినిమాలోకి వచ్చేస్తే సామాన్యుని లాజిక్కుకు లాజిక్కు ఉండదు అన్న సూత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఆ సూత్రాన్ని స్క్రీను మీద బర బరా బరికేసిన ఘనత రాజమౌళిది

మొదట్లో చెప్పుకొన్న సినిమాలన్నీ ఆ సూత్రమ్మీద స్క్రీనుకెక్కినవే

అప్పుడు వేళ్ళతో తిప్పుకునే ఫోనులుండేవి కనక ప్రపంచానికి మన సినిమా విలువ తెలవలా

ఇప్పుడు ఐఫోను వచ్చింది కనక వేలితో అలా తాకగానే అమ్మా మన్నుతినంగ అంటూ ప్రపంచమ్మొత్తం కనపడె కాబట్టి మన సినిమా విలువ ప్రపంచానికి తెలిసొచ్చె

ఒకటి రెండూ ముచ్చట్లు చెప్పుకొని ఈ పోష్టు ముగిద్దాం, లేకపోతే బిగినింగు, కంక్లూషను కాక జంక్లూషను అని ఇంత బారు భాగవతం రాయాల్సి వస్తుంది

పోతే ఈ కింది వాటికి నీ లాజిక్కులు నీకుండొచ్చు

అవి నీ దగ్గరే పెట్టుకో

కట్టప్ప ఎందుకు చంపాడు అన్న దానికి ఒక తిక్క లెక్క వేసి బంతాట ఆడాడు రాజమౌళి

కుక్కలా రాజమాతను చంపే వాసన కనిపెట్టిన కట్టప్ప, గుండె మీద చెయ్యి వేసుకున్న కట్టప్ప - రాజమాతకు అపాయం కలుగుతుందని ఆవిడకు సూత్రప్రాయంగానైనా చెప్పకుండా కొబ్బరికాయ దొరికిన కోతిలా ఇక ఇక నవ్వులు పక పక పూయించాలని చూచి జనాలను వాయించినాడు

అమరేంద్ర చేత మామా, అమ్మా అంటు భారీ డైలాగులు చెప్పించి ప్రేక్షకులను, దుర్యోధనుడి లాంటి వాళ్ళ మనస్సులోని సెంటిమెంటును మయసభలో కొలనులోకి విసిరేసినాడు మౌళి

ఆ తర్వాత మల్లెపువ్వుకు దవనం కలిపినట్టుగా వాసన ఎక్కువ చేసి మత్తులో ముంచుతూ అమ్మా తప్పంతా నాది - కొడుకు అనగానే బాహు అనుకున్నా - అని అంతా నెత్తినేసుకుని గుండు తడుముకుంటూ ఏడ్చినాడు

అందాకా కుతంత్రం కాదురా రాజతంత్రం, రక్తంతో కడిగెయ్ అంటూ చిందులేసిన అమ్మ శివగామి మొగుణ్ణి, కొడుకుని ఏదో తేడా ఉన్నా పట్టిచ్చుకోకండా బాహుని నువ్వేస్తావా, నన్నేసెయ్యమంటావా అని నిలదీయటంతో గుండు బాబాయ్ ఏడుపాపి వెర్రిపుష్పం ప్లానొకటేసి బాహుని బలి తీసుకొనినాడు

ఈ లాజిక్కు లేని లాజిక్కు చాకచక్యానికి దండలు వేసి బస్కీలు తీయవచ్చును

ఇంతకీ ఇక్కడ విషయమేందంటే లాజిక్కు ఉన్నదా, అది సరిగ్గా ఉన్నదా అని కాదు ప్రశ్న - సినిమాను లజిక్కుల కోసం చూస్తే, థియేటరు వెళ్ళటం కన్నా సొషల్ స్టడీస్ లాబరేటరీకి వెళ్ళి అక్కడ సోడియం హైడ్రాక్సైడు ఎట్లా చెయ్యాలన్న సూత్రం కనిపెట్టినట్టె. సినిమా సినిమాగా చూడాల.

ఖర్చు పెట్టిన డబ్బుకు మాహిష్మతి, ఏనుగులు, ఎద్దులు - ఇవన్నీ ప్రిమిటివ్ టాం అండు జెర్రీ ఆనిమేషనులా అనిపించినవి నాకు - ఇంకా బాగా, అనగా చాలా బాగా చెయ్యవచ్చు ఆ మాత్రపు డబ్బుకు - అదీ భారద్దేశంలో అంతమంది పనీ పాట లేని సాఫ్టువేరు ఇంజనీరులను పెట్టుకొన్నాక.... 

సినిమాకు హైలైటు - హంస నావ పాటకు కుట్టిన గ్రాఫిక్సు... సినిమా అంత అట్లా తీసుంటే బ్రహ్మలోకం దాటేసి ఆ పైనున్న సత్యలోకానికి చేరువలో నిలబడి ఉండేది సినిమా - ఎవరూ ఎత్తవలసిన అవసరం లేకుండా. అయితే ఇదేదో మిత్రులు చైతన్యప్రసాదు గారు రాసింది కదాని చెపుతున్న మాట కాదు. నిజంగానే అద్భుతంగా ఉన్నది నామటుకు. ఈ మధ్య కాలంలో హాలీవుడుతో పోటీ పడిన తెలుగు సీను ఏదన్నా ఉన్నది అంటే ఈ పాట మాత్రమే!

ఇక సంగీతం - ఒకటో భాగంలో ఉన్న వశీకరణం ఈ రెండో భాగంలో అక్కడక్కడ తప్ప ఇంకెక్కడా మచ్చుకి కూడా కానరాలా... కీరవాణన్న - మొదటి దానికి మంచి సెలక్షను చేసి, ఉన్న ఆవిరంతా ఆక్కడ ఎగరగొట్టేసుకొనినాడు... రెండో భాగం వచ్చేప్పటికి ఏం చెయ్యాలో తెలవక క్లాసికలును డప్పు డమారం స్థాయికి తీసుకొని వచ్చినాడు.. అయితే అందులో ఆయన తప్పేమీ లేదు... నా చెవులదే అంతా తప్పు. ఈలాటి సంగీతానికి అలవాటు లేని పిండాన్ని అవటం వల్ల అలా అనిపిస్తోంది అంతే.

అనుష్క దేవసేనగా అపురూపం. ఓ చోట సన్నగా, ఓ చోట లావుగా - సాఫ్టువేరు ఉపయోగించి మొత్తానికి ఆ అమ్మాయిని - లావును కనపడకుండా ఏదో మాయ చేసినడు మౌళి

మిగిలిన వారిని తీసుకుంటే - రానా 500 ఏళ్లకు కూడా ఇంచు తగ్గని కండలతో మహేంద్రుణ్ణి ఎదుర్కోటం బాగున్నది

ఆ బిజ్జలదేవుణ్ణి రిటైరు అయిపోమని చెప్పటం మంచిది

దేవసేన పిన్నిగా వేసిన అమ్మమ్మ జింగుచకా అని గంతులు వెయ్యటం చూస్తే ఇక్కడి తెలుగు అసోషియేషన్ల ప్రెసిడెంట్ల పెళ్ళాలు గంతులు వెయ్యటం గుర్తుకు వచ్చిందని ఒకాయన అన్నాడు సినిమా హాల్లో

ప్రభాసుకు టవరు నుంచి సిగ్నల్ స్ట్రాంగుగా అందినప్పుడు విరగదీసినాడు, లేనప్పుడు బ్లడ్డు, బాణాలతో కాలం గడిపినాడు

ఇక ముగించేద్దాం....

దీన్ని భారతంతో ముడిపెట్టి అనవసరమైన చర్చలు, దిక్కుమాలిన తద్దినమూ పెట్టుకోకుండా రాజమౌళి సినిమాగా చూస్తే మంచిది

అయితే నూటికో కోటికో ఒక సారి వచ్చే ఇలాటి తెలుగు సినిమాను రెండో సారి చూట్టం చాలా అవసరమైన పని

రెండో సారి చూస్తే వచ్చే సినిమాలో గ్రాఫిక్సుకు డబ్బులు ఇంకాస్త ఖర్చు పెట్టి, హాలివుడులోని నైపుణ్యాన్నంతా హైరు చేస్కొని ఇరగగా సినిమాలు తీయవచ్చు

భారద్దేశం అణుబాంబు తయారు చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది
భారద్దేశం మార్సుకు మాం ను పంపించినప్పుడు ప్రపంచం నోరు వెళ్ళబెట్టింది

రాజమౌళి బాహుబలి తీసినప్పుడు తెలుగు సినిమానే కాక ప్రపంచమే ఒళ్ళు, కళ్ళు అప్పగించింది

అదీ ఘనత

ఇదంతా నా సొంత అభిప్రాయాలే.... మీ మీ ఆలోచనలు వేరుగా ఉండవచ్చు... బాధపడితే మీ ప్రాప్తం అంతే అని సరిపెట్టుకోండి...

1 comment:

  1. చాలాకాలమైంది మీ దగ్గర నుంచి పోస్టు వచ్చి. అమెరికా తెలుగు ప్రేక్షక దేవుళ్లంటే మీకు కినుక. సినిమా బాగోలేదంటూనే, రెండో సారి వెళ్లి చూడమంటున్నారు.

    ReplyDelete