Monday, May 22, 2017

బిచ్చాన్ని చీత్కరిస్తావా... ?

అక్షరంబే తల్లి
అఖిల విద్యలకు
అక్షరంబు లేనివాడు
ఇలలోన అబలుండు
బిచ్చమైనను పుట్టదు
వానికి పృథివిలోన
నా గులాబీ అక్షరంబే
నవలా లోక రక్షకంబు


-- ఇది నేను మా చల్లపల్లిలో గులాబీ పూల మీద నవల ఎప్పటికైనా రాస్తానని శపథం పట్టిన ఆనందు నోట కొన్ని వందల సార్లు విన్న మాట, పాట

దానికి మాతృక ఈ చాటువు అని తర్వాత, కాస్త పెద్దయినాక, తెలిసింది నాకు

అక్షరంబు తల్లి యఖిల విద్యల కెల్ల
నక్షరంబు లోకరక్షకంబు
అక్షరంబు లేని అబలున కెందును
భిక్ష పుట్టబోదు పృథివిలోన

ఈ పై చాటువు అసలుగా మొన్న అక్షరం అని రాసినదానికి ఉపోద్ఘాతంగా పడవలసిన సంగతి, ఎందువలనో మరచితిని

సరే, అదలా పక్కనబెడితే, ఈ చాటువుకు, కింద రాయబోయే దానికి ఆట్టే సంబంధం లేకపోయినా ఆ చటువు రగిలించిన ఆలోచన ఈ రాత

అంతే అంతకు మించి ఏమీ లేదు

భిక్ష

ఆదిభిక్ష

అనాది భిక్ష

ఎన్నో వందల సంవత్సరాలుగా మన జంబూద్వీపంలో తిష్ట వేసుకున్న వరం

కొన్ని జీవితాలకు శాపం

యాయవారం

అమ్మా కబళం

అయ్యా ఏదన్నా ఉంటే పెట్టండయ్యా

అమ్మా ఒక పైసా దానం చెయ్యండమ్మా

ఇది - ఈ భిక్ష - ఎన్నో జీవితాలకు మానవత్వంగా ప్రాణం పోసిన వ్యవస్థ

మానవులను మానవులుగా బతకనిచ్చిన రూపం

సాక్షాత్ పరమశివుడే భిక్షుకుడు

చేతిలో కపాలంతో ఆదిభిక్షువు అని పిలిపించుకోవటం ఆయనకు అత్యంత ప్రీతికరమట

ఈ మాట ఎప్పటినుంచో ఉన్నా, చలనచిత్ర మాధ్యమంగా సీతారామశాస్త్రి ప్రచారములోకి తెచ్చినారు

సర్వదమనుడికి, ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టిన భిక్ష పాట అది

ఈ భిక్షకు ప్రధాన కారణాలు - ఆకలి, సోమరితనం, పరిస్థితులు

ఆకలి గొన్న వాడికి భిక్ష వెయ్యటం ఉత్తమం

పుణ్యలోకాలకు మణిమయరత్న దారి అది

పరిస్థితుల మూలాన భిక్షకు వచ్చినవాడికి సాయం చెయ్యటం మధ్యమం

పుణ్యలోకాలకు రాళ్ళు రప్పలతో కూడిన దారి అది

సోమరితనం మూలాన భిక్షకు వచ్చినవాడికి సాయం చెయ్యటం పాపం

పాపలోకాలకు ముళ్ళ కంచెలతో కూడిన దారి అది

అపాత్ర దానం నరకలోకాలకు ఆరోహణపర్వం

భిక్షలో ఆత్మాభిమానం చాలా ఎక్కువ పాలు పనిచేస్తుంది

తన మీద తనకు గౌరవం, నమ్మకం ఉన్నవాడు చస్తే బిక్షకు పోడు

ఉపవాసమన్నా ఉంటాడు కాని, భిక్షకు పోడు

అలాటి వారిని, వారి మన:స్థైర్యాన్ని చూసి మనవారు ఒక సామెత కూడా చెప్పినారు

భిక్ష కన్న ఉపవాసము మేలు అని

ప్రాణాలకు ప్రమాదము వచ్చినపుడు మటుకు బిచ్చమెత్తవచ్చును

అక్కడా ఈ పై సామెతనే తిరవేసి చెప్పినారు పూర్వీకులు

ఉపవాసము కన్న బిచ్చము మేలు అని

ఎందులకు ?

ఏదన్నా సాధించాలంటే మనిషి బతికుండవలె కద

అందులకు

బిచ్చము కొరకు బయలుదేర్న సొంత జీవితానికి బిచ్చము వేసి బతికించుకొనవచ్చును

అందులకు

అన్నిటికన్నా బతుకుట ముఖ్యము

ఇక్కడో పిట్టకథ చెప్పుకొనవలె

అనగనగా ఒక ఊరు

ఆ ఊరిలో ఒక కుటుంబం

ఇంటాయన పరమ పిసినారి

ఇంటావిడ ఔదార్యాస్వభావురాలు

బిచ్చగాళ్ళు వచ్చేవారు

ఆవిడ కొద్దో గొప్పీ భిక్ష వేసేది ఆయన చూడకుండా

ఒక రోజు చూడనే చూసినాడు

ఉగ్రుడైపోయినాడు

ఆవిడకు పెట్టే తిండిలో కోత విధించినాడు

అయినా తన కోతలోనే అప్పుడప్పుడు ఇతరుల కడుపు కోత, ఆకలికోత తీర్చేది

అది చూసి ఆవిడను పస్తులుంచాడు

ఆ సంగతి తెలిసిన భిక్షకులు ఉగ్రులైనారు

ఆ తల్లి బిచ్చమేసిన భిక్షకులు ఆ ఇంటిని ముట్టడించినారు

తమ జోలెలలో ఉన్నదంతా ఆయమ్మ కాళ్ళ ముందు పెట్టి అమ్మా అని ఆప్యాయంగా తినిపించినారు

పిసినారిని చావచితక బాదినారు

అట్లా తమ ఋణం తీర్చుకొనినారు

ఆరోజటి నుంచి పిసినారి మారినాడు

మానవత్వంతో మెలగినాడు

సరే, అదలా పక్కనబెడితే భిక్షువులు నాల్గు రకములని ఉవాచ

కుటీచకుడు
బహూచకుడు
హంస
పరమహంస

ఇవియన్నీ విష్ణుస్మృతిలో వివరించబడినవని పండితుల మాట

ఈ విష్ణుస్మృతికి, 16వ శతాబ్దిలో టీక రాసినవారు కాశీ నివాసి శ్రీ నాదపండితులని ప్రతీతి

అద్దానియందు వైష్ణవుల దైనిక జీవనము, వైష్ణవిక బిక్షాటన మొదలగునవి వివరించబడి ఉన్నవి

ఈ భిస్ఖుకులు చేయునవి ఐదు రకములట

మాధుకరము
అసంక్లప్తము
పాక్ ప్రణీతము
అయాచితము
తాత్కాలికము అని

అన్ని భిక్షలు ఈ ఐదిట్లోకి చేరవలసిందే

ఎక్కడిదాకో ఎందుకు మన మహాభారతమే సాక్షి

శకుని మామే సాక్షి

కారాగారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్క మెతుకు బిచ్చమెయ్యగా, ఆ మెతుకులే కలిపి ఒక్క ముద్దగా చేసి బతికించినారు మామము

రగిలిపోయిన మామ తన ప్రతీకారం తీర్చుకొన్నాడు

వంశాలు వంశాలే సర్వనాశనం ఒనరించినాడు

ఆ కోపాగ్నిలో మహాసమిధిలను పెర్చినాడు

మహాభారతమే జరిగించినాడు

మహాభారతంలో మహావ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది ఆ కృష్ణ పరమాత్మ తర్వాత శకుని మామే

ఆయన లేకుంటే వినాశనానికి మార్గముండదని పరమాత్మ ఆ జీవన్నాటకము వేయించినాడు

భిక్ష చేత అంత పని చేయించినాడు ఆ జగన్నాథుడు

ఇదే భిక్ష ప్రాణాలకు పెడితే క్షమాభిక్ష

ఎన్నో వందల సంవత్సరాల నుంచి, రాజుల కాలం నుంచి ఉన్నది ఈ పద్ధతి

తప్పు చేసి సిక్ష పడినవాడు సత్ప్రవర్తకుడిగా మారిపోయినపుడు వానికి క్షమాభిక్ష ప్రసాదించబడును

కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం వలన క్షమాభిక్ష ప్రసాదించబడును

శిశుపాలుడికి క్షమాభిక్ష పెట్టినాడు

వందతప్పుల వరకు క్షమాభిక్ష పెట్టినాడు

వాడు బిచ్చమే కదానని అలుసు చేసినాడు

బిచ్చాన్ని చీత్కరిస్తావా అని ఆ పరమాత్మ వాని తల తీసినాడు

ఆ పరమాత్మే అరివీర భయంకరుడైన అశ్వత్థామకు క్షమాభిక్ష పెట్టినాడు

కేవలం గురుపుత్రుడన్న కారణంతో

శివాజ్ఞ మీరరాదన్న కారణంతో

పుత్రభిక్షలు మన చరిత్రలో, ఇతిహాసాలలో కోకొల్లలు

భవతీ భిక్షాందేహి అన్న మాట లేని ఇతిహాసమే లేదు

రావణుడి ఆ మాటతోనే అమ్మను తీసుకొనిపోయినాడు

వాని చావు వాడే కొనితెచ్చుకొనినాడు

ఆ మాట లేకున్న రామాయణమే లేదు కద

అంత శక్తి ఉన్నది భిక్ష అను పదమునకు

భవతీ భిక్షాందేహి అన్న మాట లేని చరిత్రే లేదు

భవతీ భిక్షాందేహి లేకపోతే మనకున్న స్తోత్రాలు, పంచకాలు సర్వ భక్తిప్రపంచమే ఉండేది కాదు

శంకర భగవత్పాదులు ఆ మాట పుచ్చుకునే కదా అంతటి భక్తి సామ్రాజ్యాన్ని మనకు బిచ్చము వేసినారు

అన్నమయ్య ఆ వెంకన్న పాదముల బిచ్చము కొరకే కదా అంత సాహిత్యము మనకు బిచ్చము వైచినాడు

త్యాగరాజు ఆ రాములవారి సాక్షాత్కార బిచ్చము కొరకు మన కర్నాటక సంగీతాన్ని సుసంపన్నం చేసి మనకు బిచ్చముగా వదలినాడు

రాజులు సామంతులకు బిచ్చము పెట్టిన ఉదాహరణలు లెక్కకు మిక్కిలి

ఇట్లా ఎన్ని చెప్పుకొనవచ్చును, ఇంకెన్ని రాయవచ్చును

బిచ్చమే కదానని తీసిపడవేస్తే, చీత్కరిస్తే నీవు మానవుడిగా మిగలవు

మానవత్వమే నిను మరవదు

ఓం తత్ సత్!

--

నిన్న రాత్రి రాసుకొన్న వ్యధ...

"మనం" షో చూసివచ్చిన పిదప, వారు ఆ స్త్రీ సంఘం ఆర్తి కోసం ఎంతో కష్టపడి - గంపెడాశతో మా ఊరికి వచ్చి ఓలలాడిస్తే - మన తెలుగు సభికుల చేత మోసపోయిన విధానం చూసి మనసు మెలిపడ్డది. చివరకు స్టేజి మీద భవతీ భిక్షాందేహి అని ఎన్నోసార్లు జోలె చాచినారు పాపం. వారి కోసమా? కాదు - ఒక మహోన్నత కారణం కోసం. చాలా బాధపడినాను. అప్పుడు రాసుకొన్నది ఇది..


జయమాలిని విలాస్ - అనగా నాశం లేనిది

అక్షరం అనగా నాశం లేనిది

అదే ఓంకారం

అదే జీవాత్మ

అదే పరమాత్మ

అదే పరబ్రహ్మం

అదే మోక్షం

నిత్యమైన బ్రహ్మతత్త్వాన్ని బోధించేది అదే

అదే వేదం

అదే ప్రామాణికత

అదే నీరు

అదే ఆకాశం

అదే యజ్ఞం

అదే జపం

అదే పుణ్యం

అదే ఖడ్గం

ఈ అక్షరం చేత ఉన్నవాడు అక్షరచణుడు

"అక్షరేణ విత్త:" అని వాక్యం

అక్షరాన్ని నమ్ముకొన్నవాడికి ధనలోటుండదని అన్వయం

ఒక అక్షరానికే అంత శక్తి ఉంటే, రెండు కలిస్తే ఆ శక్తిని ఆపతరమా?

పదులు వందలు కలిస్తే ఉప్పెనలే

ప్రపంచమే తలకిందులు

అలాటివారు, ఉప్పెనలు తెచ్చినవారు మన తెలుగు దేశంలో ఒకప్పుడు కోకొల్లలు

ఈనాటికీ అక్కడక్కడ ఉన్నారు

రేపటికి అసలెవరైనా, ఎక్కడైనా ఉంటారో ఎవరికీ తెలవదు

అలాటి అక్షరాలు బంధిస్తే ఛందం

అలాటి అక్షరాలను స్వేచ్ఛగా వదిలేస్తే వచనం

బంధించు వాడు అక్షరచ్ఛందుడు

వదిలేయువాడు వచనోచ్ఛందుడు

అక్షరచ్ఛందుడు దృఢనినిశ్చయము కలవాడు

వానితో సహవాసము చేయు అక్షరములు మరింత దృఢముగానుండును

వచనోచ్ఛందుడు స్వేచ్ఛాస్వాతంత్ర పిపాసి

వానితో సహవాసము చేయు అక్షరములు వాయువేగ గమకాలే

ఆ  అక్షరములకు జనని, అమ్మ, తల్లి - ఆ బ్రహ్మదేవుని పత్ని వాణి

ఆ దయగల తల్లి, ఆ వాణి వరము వలన గంటము దొరికె మానవులకు

ఆ తల్లిని తలచుకొంటూ గంటమునకు కూడా అక్షరజనని అని పేరిడినారు పూర్వీకులు

ఆ వాణి కృప వలన జ్ఞానము అబ్బును

అక్షరమే ఆ జ్ఞానానికి మూలం

అక్ష్రరమును జ్ఞాననాళికకు ఎక్కించుకొనినవాడు పండితుడు

వానికి అక్షరజ్ఞుడు అని పేరు ఖరారు

అక్షరమును జ్ఞాననాళికకు ఎక్కించుకొననివాడి పామరుడు

వానికి అక్షరఖరుడు అని పేరు తకరారు

అక్షరం ఆధారం

ఎన్నిటికో ఆధారం

అక్షరమే ఆధారము

ఎన్నో తంత్రాలకు

ఎన్నో మంత్రాలకు

ఎన్మో శాస్త్రాలకు

రుద్రము చదువునప్పుడు శరీపు అతిముఖ్య భాగాలని స్పృశించి దిగ్బంధనము చేయుట నేత్రానందకరం

జపతపాలు చేసేటప్పుడు ఆయా అవయవాల వద్ద మంత్రాక్షరాలను ఉంచడం న్యాసం

అక్షరాన్ని ఉచ్చరించి శరీరాన్ని స్ప్రశించటం న్యాసం

అంగన్యాస, కరన్యాసం అని వివిధమైన పేళ్ళు

ఇంకా ఎన్నో ఉన్నవి

మంత్ర పఠనంతో ఆయా అవయవాల దేవతలను ఆవాహన చేయటం అక్షరం బాధ్యత

అక్షరానికి అంత శక్తి ఉన్నది 

ఈ న్యాసాన్నే సభకు ఇస్తే స్వాగతోపన్యాసం

ఈ న్యాసాన్నే విశ్వవిద్యాలయానికి ఇస్తే స్నాతకోత్సవ ఉపన్యాసం

ఈ న్యాసాన్నే నివాళికి ఉపయోగిస్తే స్మారకోపన్యాసం

మరి సన్న్యాసానికి ఈ న్యాసానికి సంబంధమేమన్న ఉన్నదా అని సన్నాసులు అడగవచ్చును

అక్షరం బయటకు పలకకుండా లోపలే ఉంటే అదే సన్న్యాసం

అలా ఎన్నిటినో తన నెత్తిన మోస్తూ ఉండేది అక్షరమే

ఈ అక్షరాలను పంక్తుల్లో పేరిస్తే అది అక్షరపంక్తి

అదే అక్షరాలను మాలగా పేరిస్తే అక్షరమాల

అదే మన వర్ణమాల

ఈ అక్షరాలను రాయటానికి ఉపయోగించే దానికి అక్షరభూమిక అని పేరు

అది పలక కావొచ్చు, అది కాకితం కావొచ్చు, అది కీబోర్డు కావొచ్చు

ఏదైనా కావచ్చు

అక్షరానితో అనుబంధం ఉన్నదంటే అక్షరంతో మొదలవ్వాల్సిందే

పిల్లవాండ్లకు అక్షరం పరిచయం చేయటం అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం చేసి అక్షరం మరచిన పెద్దవాండ్లు నిరక్షరకుక్షులు

అక్షరములు నిలబెట్టుకొనినవాడు అక్షరాస్యుడు

అక్షరాలను నెత్తిన పెట్టుకొనినవాడు విద్వాంసుడు

వాడే అక్షరముఖుడు

నిలబెట్టుకోలేనివాడు అక్షరమూఢుడు

వాడే అక్షరవిముఖుడు

అక్షరాలు షడ్రూపాలు

అవే పంచాక్షరీ మంత్రాలు

గాయత్రీ మంత్రం 24 అక్షరాల సమాహారం

ఓం తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యో న: ప్రచోదయాత్


చతుర్వింశతి  అక్షరాలు ఇవి

వాటిని పఠించినవాడికి, పాటించినవాడికి మోక్షమే అక్కరలేదు

సరాసరి ఆ పరమాత్మే మనలో కొలువైపోతాడు

జనగణమన అధినాయక అన్నా అక్షరమే

వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ దెల్పుడీ అన్నా అక్షరమే

తాటాకు మీద అక్షరమే

శాసనాలలోనూ అక్షరమే

అక్షరాలలో తెలుగు అక్షరాలు గొప్పవి

అక్షరానికి చావు లేదు

కాని మార్పు ఉన్నది

ఏనాటిదో ఱ ఇపుడు అగపడదు

ఏనాటిదో ఌ ఇపుడు అగపడదు

తొమ్మిదవ శతాబ్దము నాటి మూడవ చాళుక్య వర్ధనుని అహదన కరతామ్ర శాసనమూ అక్షరాల నిధే

అందులోని తెలుగు అక్షరాలతోనిండిన వాక్యం ఒకటి చూడుడు

-- మహాసత్థవల కొండుకలో నిరవద్య ప్రిధివి కవడిరజుళ్ గునవన నభియుళ్

ఈనాటి వారికి ఆ అక్షరక్రమం అర్థం కాకపోవచ్చును

కానీ ఆ నాటికి ఆ అక్షరం గొప్పది

శాసనముకెక్కినదంటే గొప్పది కాక ఏమి ?

ఆ శాసనం ద్వారా సమాజానికి, ఆనాటి సమాజానికి, ఈనాటి సమాజానికి ఉపయోగం కలిగింది

ఆనాడు ప్రజలను ఉత్తేజితులను చేసిన అక్షరాలు అవి

ఈనాడు పండితుల ఉత్సుకతను ఉత్తేజం చేసిన అక్షరాలూ అవే

ఆ శాసనం వల్ల చరిత్ర అక్షరబద్ధం అయిపోయింది

అంత శక్తీ ఆ అక్షరాలదే

ఈనాటి చరిత కూడా అక్షరబద్ధమే

రేపటి పండితులకి ఉత్సుకతే

ఈనాటి అక్షరాల భావభయభీతులేమిటో తెలుసుకోవటానికి

తెలియాలంటే అక్షరమే ఆయుధం

మృదుమధుర భావం పలికాలంటే అక్షరం కావాలి

ఆవేశం కట్టలు తెంచుకోవాలంటే అక్షరం కావాలి

కరుణతో పొంగి పొర్లాలంటే అక్షరం కావాలి

నవరసాలు ఆ అక్షరానికి సొంతం

అన్నమయ్య అక్షరాలు ఈనాడు చాలామందికి తెలియవు

ఈనాటి అక్షరాలు ఏ నాటికి ఎవరికీ తెలియవు

అదొక వింత

అన్ని భాషలయందు తెలుగుభాష గొప్ప

గొప్పదని మనవారే కాక ఎందరెందరొ చెప్పినారు కావున అది నిజమేనను మాట సత్యము

అటువంటి భాషకు ఆ సంపదను ప్రసాదించినవి వర్ణాలు

ఆ వర్ణాలు యాభైయ్యారు

వానిలో పరుషాలు, సరళాలు, సవర్ణాలు, తాలవ్యాలు, దంత్యాలు, ద్రుతాలు, కళలు, లఘువులు, ద్వివిధాలు, సంధులు ఇలా ఎన్నో ఎన్నెన్నో

ఇవన్నీ కలిసి వ్యాకరణంలో భాగమైనవి

వీనిని ఉపయోగించుకొని జయమాలిని విలాస్ అని రాయవచ్చును ఆదిదేవమ్మ పూటకూళ్ళ ఇల్లు అని రాయవచ్చు

ఏ రకము రాసుకొనుటకైనా ఈ అక్షరములు ఉపయోగపడును

అక్షరము ఖడ్గము అని చెప్పుకొనినాము కద పైన?

ఆ కత్తిని ఉపయోగించువాని మీద అక్షర శక్తి ఆధారపడియుండును

ఎవని చేతియందు చాకచక్యముగ తిప్పబడునో వాడు పండితుడు

ఎవని చేతియందు అయోమయముగ తిప్పబడునో వాడు పామరుడు, మూర్ఖుడు

అక్షర సమూహములకు లింగములు ఏర్పరచినారు వైయాకరుణులు

స్త్రీ లింగమని, పుం లింగమని, నపుంసక లింగమని విభజించినారు

వాడుకలో ఏ లింగము ఏ లింగమైనను చివరకు అక్షరమే పరమ లింగం

జగజ్జ్యోతి లింగం

పరమేశ్వర లింగం

పరమాత్మక లింగం

అందువలన అక్షరమును పట్టుకొని యుండుము

వినాశనానికి ఉపయోగించక మంచికి ఉపయోగించు

అదియే నిన్ను వైతరణి దాటించును

ఓం తత్ సత్!

-- ఇంకా ఎంతో రాయవచ్చు, ఒక మహాభారతమే రాయవచ్చు కాని ఇక్కడికి ఆపితే ఇంకొక పని చేసికొనవచ్చునని 

( A Repost from 2015)

Monday, May 15, 2017

కుండ లేకపోతే బాహుబలి సినిమానే లేదు !

కుండ

కడవ

భాండం

ఇవన్నీ ఒకేదానికి పేళ్ళు

కుండ తయారు కావాలంటే ఒక నేర్పరి కావాలె

ఆయన నేర్పరితనం కావాలె

ఆయనే కుమ్మరి

ఆయన తయారు చేసే కుండలు రకరకాలు

వంట చెయ్యటానికి ఉపయోగించే కుండలు

నీళ్లు పట్టిపెట్టుకోటానికి ఉపయోగపడే కుండలు

అట్లా ఎన్నో రకాలు

కుండలో వండిన అన్నానికి సాటి ఈ ప్రపంచకంలోనే లేదు

వేసంకాలంలో కుండనీళ్ళను మించిన చల్లనీరు దొరకటమ్ అసంభవం

ఆవిరి మీద దసిలికాయలను ఉడకపెట్టాలంటే కుండ తర్వాతే ఏదైనా

పెళ్ళిళ్లలో వాడేవీ కుండలే

అట్లా ఎన్నో ఉపయోగాలు, అనుభూతులు, రుచులు ఆ కుండ సొంతం

వంట చేసాక కడకుండా వదిలేసినదానికి అంటుకుండ అని పేరు

దాన్లో అడుక్కు మిగిలిన అన్నాన్ని తరవాణిలో ఉపయోగించేవారు

పెళ్ళిలో వాడే కుండలకు నాగవల్లి కుండలని పేరు

అందంగా చేతపని ఉండే ఆ కుండలకు అయిరేని కుండలు అని పేరు కూడా

సామెతల్లో కూడా కుండలకు చోటున్నది

ఓటికుండకు మోతెక్కువ

ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు

మంగలం అంటే ఓటికుండ, చట్టి

ఇంకా చాలా ఉన్నవి కుండ సామెతలు

వ్యావహారికంలో కూడా వ్యవస్థాపితమైపోయింది

తాగటానికి ఒక బోలైనా లేదంటాడొకాయన

ఇప్పుడే బోలెడు అన్నం తిన్నా అంటాడొకాయన

బోలె అంటే పగిలిన పెద్ద కుండ ముక్క

మానవ పుర్రె సైజులో ఉండే కుండబొచ్చె

దీన్నే ఇంగ్లీషులో Bowl అంటారు

ఉట్టిలోకెక్కె కుండల ఉపయోగాలు చెప్పనక్కరలా

కుండలతో తంపులకు సంబంధం ఉన్నది

వేసంకాలంలో నీళ్ళు పట్టుకునేప్పుడు అమ్మలక్కలు తంపులు పాతకాలంలో కుండలతోనే

ఇప్పుడు బిందెలతో కొట్టుకుంటున్నారు కాని అప్పుడు ఎన్నో కుండలు పగిలిపోయేవి

కుమ్మరాయనకు రోజూ ఆనందభైరవే

ఆయన తన ఆధారకుండం తయారుగా ఉంచుకునేవాడట

ఆధార కుండం అంటే కుండలు అవీ కుదురుగా ఉంచే కుదురు

సరే, పోట్లాటలకు వచ్చేస్తే - అట్లా పగిలిపోయే విధంగా కొట్టుకునే దుర్మార్గులను బోలెవాళ్ళు అనటం కద్దు

ఇంకా వాడుకలలో అహికుండల న్యాయం అని ఒక వాడుక

చుట్టలా చుట్టేసుకునే స్వభావం కల మనిషి కుండలా ప్రవర్తిస్తాడని న్యాయం

సరే మనిషి మాట వచ్చింది కాబట్టి ఒక రెండు ముక్కలు చెప్పుకొని ముగించుకుందాం

మనిషి దేహం ఎట్లాటిదో బ్రహ్మాండం కూడా అట్లాటిదే

మనిషి దేహం కుండతో పోల్చినపుడు బ్రహ్మాండమూ కుండలాటిదే

ఆ కుండకే భాండమని పేరు

బ్రహ్మాండం భాండమే

భాండమే బ్రహ్మాండం

ఆ భాండాన్ని తయారు చేసేదెవ్వరు

మనిషికి అమ్మ, నాన్న కుమరులు

బ్రహ్మాండానికి బ్రహ్మదేవుడు కుమ్మరి

మనిషి పోయినాడు

శవసంస్కారం జరుగును

అపుడు కుండ పగలగొట్టే ఆచారం ఒకటి ఉండును

అది ఎందుకు వచ్చినదొ తెలుసునా?

అది ఎట్లా వచ్చినదో తెలుసునా ?

దేహం కుండలాటిదని పైన చెప్పుకున్నాంగా

మరి దేహం విడవటమంటే కుండ పగిలినట్టే

ఆ కుండ పగలగొట్టే ఆచారం అలా వచ్చింది

ఆ భాండ బ్రహ్మాండ రహస్యం అదీ

పెద్దవారు పిచ్చివారై పెట్టలేదోయ్ అట్లాటివి

అందువలన ఓ మనిషీ నీ సంప్రదాయాన్ని గౌరవించుకో

నీ పెద్దవారిని నెత్తిన పెట్టుకో

తా.క - ముగించేముందు సరదాగా ఒకటి రెండు సినిమా మాటలు చెప్పుకుని -

1) అట్లాటి కుండ ఒకటి అమ్మాయి చేతిలో పగిలిపోవటం చూసి బాహుబలి కుండలు పగలకుండా తాటిచెట్లను ఒంచేసినాడు. అది చాలా కీలకమైన ఘట్టం. ఆ తర్వాత ఆ తాటిచెట్లే పట్టుకుని ఊగి, మాహిష్మతిని జయించినాడు. ఘటం (కుండ) ఆ సినిమాకు చాలా కీలకమైపోయింది

2) రాఘవేంద్దర్రావు సినిమాలో కుండలు ఎందరొ యవ్వనవతుల యవ్వనాన్ని కుర్రోళ్ళ గుండెల్లో పేలాలుగా పండించినాయ్. కుండలను తన డైరెక్షనులో బాగా పిసికాడాయన


3) కుండ లాటి గుండున్న కట్టప్ప లేకపోతే బాహుబలి చచ్చిపొయ్యేవాడు కాదు

అలా ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు

Wednesday, May 10, 2017

బాహుబలికి - దీనికి అసలు సంబంధమేదన్నా ఉన్నదా?

గీతం

సంగీతం

వాయిద్యం

సప్తస్వరాలు

ఇవన్నీ వ్యర్థాలే

పూర్తి వ్యర్థాలే

స్వరం లేకుంటే

తీయని స్వరం లేకుంటే

అంతా వ్యర్థమే

గాత్రం, గానం

తంత్రులు లేకుంటే

స్వరతంత్రులు లేకుంటే

అంతా వ్యర్థం

అంత అపురూపం

ఆ అపురూపాన్ని దేహం మరింత అపురూపంగా చూసుకుంటుంది

దానికో పేటిక ఏర్పాటు చేసుకొన్నది

స్వరపేటిక

తంత్రులు అన్నీ ఆ పేటికలోనే

దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంటాయ్

ఏడుపు వచ్చినప్పుడు ఒకలా

ఆనందం వచ్చినప్పుడు ఒకలా

గద్గదమైనప్పుడు ఒకలా

కోపం వచ్చినప్పుడు ఒకలా

ఇలా ఎన్నో దాగుడు మూతలు

అమ్మా అని పిలవాలన్నా ఆ తంత్రులే

దాగుడుమూతా దండాకోర్ అనాలన్నా ఆ తంత్రులే

ఏవమ్మా అన్నం పెట్టు అనాలన్నా ఆ తంత్రులే

ఆ తంత్రులు జగద్వ్యాపకం

తంత్రులన్నీ ఆ భగవంతుడి వరం

ప్రతి ప్రాణికి ఇచ్చినాడు

ఆయా జాతిని బట్టి, వాటి కర్మను బట్టి వాడుకుంటవి

ఆనేకపస్వరం పలికే తంత్రులు ఏనుగుకు అలంకారం

దీనికే నిషాదమని పేరు

సంగీతపు సప్తస్వరాలలో ఒకటి

సరిగమపదని లో ని అదే

తీయని తంత్రులు కోకిలకు అలంకారం

చిరుచిగుళ్ళు పూయగానే పులకింత దానికి

ఓండ్రస్వరాలు గర్దభానికి అలంకారం

సరే, దీని సంగతి చెప్పనే అక్కరలా

ప్రపంచంలోని అన్ని తంత్రులకు ఒక ప్రత్యేకత

దేని ప్రత్యేకత దానిదే

దేనికవి విడిగా వినిచూడాలి అంతే

అప్పుడే దాని సౌందర్యం బోధపడుతుంది

ఆపుడే ఆ భగవంతుడి సృష్టి బోధపడుతుంది

ఈ తంత్రులకు గతులు, గోతులు, ఎత్తులు

ఫలిత గతి స్వరం
వక్రిత గతి స్వరం
స్ఫుటిత గతి స్వరం
స్ఖలిత గతి స్వరం
జ్వలిత గతి స్వరం
ధ్వంసమాన గతి స్వరం
సుషుప్త గతి స్వరం
అస్తమయ గతి స్వరం

ఇవి అష్టగతి స్వరాలు

పెద్దగా మాట్లాడేవాడు ఉచ్చైశ్వరుడు

మంద్రంగా మాట్లాడే అమ్మ మంద్రస్వరి

మధ్యమంగా మాట్లాడేవాడు మధ్యమస్వరుడు

వాక్ రూపాలు ఈ తంత్రుల సొంతం

వ్యాకరణం వీటిని నాలుగు రూపాలుగా విభజించింది

పర
పశ్యంతి
మధ్యమ
వైఖరి

అని

పరిమితమైన వ్యాకరణం తన పరిమితులకు లోబడి విభజించిన రూపాలవి

సాహిత్యం కన్నా ఒక మెట్టు పైనుండే సంగీతం మూడు రకాలుగా విభజించింది

మంద్ర, మధ్యమ, తార స్వరాలు అని

ఇపుడు కాస్త వాయిద్యాల వైపు వెళదాం

వాయిద్యాలలో రారాజు వీణ

ఆ వీణాతంత్రులు పలికే గమకాలు కొన్ని కోట్లు

అందులో ముఖ్యమైనవి ఇరవై రెండు

దీర్ఘము
లాలితము
దీర్ఘిక
ఆదీర్ఘము
దీర్ఘోల్లసితము
దీర్ఘ కంపితము
ఉల్లసితము
సమోల్లసితము
ఉల్లాసితము
ఉచ్చరితము
స్ఫురితమూర్ధ్నిక్షిప్తము
కోమలము
ఆక్షిప్తము
భ్రమితము
ఆహతము
లలితోత్తమము
లలితము
ప్రస్తుతము
గుంఫితము
సూక్ష్మాంతము
కుంచితము
కరస్థితము

వీటిని ద్వావింశతి వీణానాద గమకాలు అంటారు

ఈ గమకాలకు మళ్ళీ గతులు ఉన్నవి

వాటిలో ముఖ్యమైనవి మళ్ళీ ఇరవై రెండు

అణువు
తిరువు
జయ
అనుజయ
కొంకు
వుణవూణ
వళి
భజవణ
పాంపు
సెవణ
వహణి
సవ్యాంగుళ వహణి
అధరవహణి
ఆలాప
హేలన
వ్యాప్తి
బెడంగు
చాలన
సుళికె
చరము
ఇంపు
సొంపు

వీటిని ద్వావింశతి వీణానాద గతులు అంటారు

స్వరం ఇంపుగా ఉన్నది అని ఎక్కడైనా వినపడితే అది ఆ వీణా తంత్రుల స్వరంలా ఉన్నది అని అర్థం

ఎంత సొంపుగా ఉన్నది ఆ అమ్మాయి అంటే - ఇక యువకులు అయిన మీరంతా అర్థం చేసుకోవటమే

స్వరతంత్రులు ఒకోసారి అపిరి తిపిరి అవుతాయి

ఎందుకు ?

దానికో కథా కమామీషు ఉన్నది

ఆ కథకే నత్తి అని పేరు

తంత్రికి మెదడుకు అనుసంధానం అంబికా దర్బార్ బత్తి లాటి నాలుక

ఆ అంబికా దర్బార్ బత్తి లాటి నాలుక ఆరిపోయినపుడు గోల గోల అవుతుంది

అర్థం కాలేదా?

సరే ఒక రెండు వాక్యాల్లో చెప్పుకుందాం

ఏ కారణం చేతనన్నా ఆ నాలుక, లోపలి తంత్రి వేగానికి సమానంగా నడవలేకపోయినపుడు ఒకదాని వెంట ఒకటిగా పరుగులెత్తుకుంటూ వచ్చే ఆ శబ్దాలు ఆగిపోయి గందరగోళానికి గురి అవుతాయ్

ఆ కారణం నరాల వల్ల కావచ్చు

ఆ కారణం మానసిక వికాసం వల్ల కావచ్చు

ఆ కారణం ఇంకేదన్నా కావొచ్చు

అందువల్ల వచ్చిన ధ్వనే మళ్ళీ రావటం, ఒక దాన్ని మర్చిపోయి ఇంకోటి రావటం ఇలాటి వాటి వల్ల శబ్దాలు కాస్త ఇదిగా వినపడతాయ్

ఆ కారణాలు అర్థం చేసుకోని దుర్మార్గులు ఆ కారణానికి నత్తి అని పేరు పెట్టి కసి తీర్చుకుంటున్నారు

భగవత్ ప్రసాదితమైన ఆ తంత్రులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత ఇంపుగా సొంపుగా మీ స్వరం ఉండగలదు

ఇష్టం వచ్చినట్టు వాడేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటవి

ఈ విషయం కర్నాటక సంగీతం పాడేవారిని కాని, అసలుగా ఏ పాటలన్నా పాడేవారిని అడిగి చూడండి

చెపుతారు

కష్ట సుఖాలు మాట్లాడుకోటానికి సమయమూ చిక్కుతుంది

బంధాలు బలపడతాయి

స్నేహ బంధాలు బలపడతాయి

భగవత్ ప్రసాదితమైన ఆ వరాన్ని మంచికే వాడుకోండి

ఆ తంత్రుల నుండి మంచి మాటలు పంచండి

మంచి పాటలు పంచండి

మానవులుగా మిగలండి

అట్లా తంత్రులను ఉపయోగించుకుని మీ మానవత్వం కూడా మెరుగుపరచుకోండి

*******

సరే, నిజం చెప్పొద్దూ - ఈ సోదంతా రాయటానికి కారణం బాహుబలి

బాహుబలిలో అయిదు చోట్ల పిండి పారేసినాడు ఆ సంగీత దర్శకుడు

ఆయన పేరు కీరవాణి

మిమ్మల్ని పిండకపోతే నాకు సంబంధం లేదు కానీ, నాకైతే రోమాలు నిక్కబొడుచుకున్నాయ్

ఎక్కడ?

1) ఒక ప్రాణం పాట అందుకుంటున్నప్పుడు

2) గిటారు తంత్రీస్వరంతో మొదలయ్యే దండాలయ్యా పాట మొదటి నిముషం

3) హంస నావ పాటలోని కొన్ని గమకాలు, గతులు విన్నప్పుడు

4) భల్లాలదేవుని పట్టాభిషేకమప్పుడు, బాహుబలి సర్వసైన్యాధ్యక్షుడి  ప్రమాణస్వీకారమప్పుడు

5) మహేంద్ర బాహుబలి భల్లాల దేవుడి మీదకు ఆకాశ మార్గాన ఒకసారి ఈటెతోనూ, ఒకసారి కట్టప్ప ఇచ్చిన కత్తి తోను  జంపింగులు చేసినప్పుడు

కంపించిపోయాను, పులకించిపోయాను

అది ఆ తంత్రీ మహత్యమే

వాద్య తంత్రి కానీ, స్వర తంత్రి కాని - బావి దగ్గర చన్నీటి స్నానం చేసిన తర్వాత కట్టుకున్న తువ్వాలును పిండి పారేసి ఆరేసినట్లైపోయింది ఆ బిట్లతో

తస్సాదియ్యా - సంగీతం అంటే అట్లా ఉండాల

ఐదు సార్లు చూసినాను ఇప్పటికి

డబ్బులు పోతే పోయినాయ్ సిగదరగ, అన్నిసార్లు కంపనమే! అన్ని సార్లు వందనమే

అదీ సంగతి

ఇక్కడికి ఆపేస్తానండి

ఈవేళ్టికి బాహుబలి సంగతులు చాలు

****

బాహుబలికి - దీనికి అసలు సంబంధమేదన్నా ఉన్నదా? ఈయన రాసుడు ఈయన - తస్సాదియ్యా! 

Monday, May 1, 2017

తెలుగువాళ్ళు - బాహుబలి

ఐఫోన్
మోసగాళ్ళకు మోసగాడు

ఐపాడ్
అల్లూరి సీతారామరాజు

ఐపోడ్
సింహబలుడు

థాంక్సు గివింగు
బ్లాక్ ఫ్రైడే

ఇలాటివన్నీ ఒక కోవకు చెందినవే
దేని రికార్డులు దానివే

అందులో ఇప్పుడు బాహుబలి కూడా వచ్చి చేరింది

తెలుగువాళ్ళు
బాహుబలి

అన్నది ఇప్పుడు సంతోషంగా పైలిష్టులో కలుపుకోవచ్చు

ఐఫోను 7, 8, 9, 500 వచ్చేదాక దాని మీద క్రేజు పోదని చాలా మందికి గట్టి నమ్మకం
అందులో చాలా నిజమూ ఉన్నదీ

అది నిర్దాక్షిణ్యంగా ప్రూవు చెయ్యటానికి నాలుగు రోజుల ముందే శారీరకంగా అవసరమైన కాలకృత్యాలను కూడా పట్టిచ్చుకోకుండా ఆ ఫోను అమ్మే దుకాణం ముందు గుడిసెలేసుకొని అదో రకమైన జీవితం గడిపేవారు చాలా మంది ఉన్నారు, ఉంటారు

అది పిచ్చా, వెర్రా అన్న సంగతి పక్కనబెడితె, అంత గుడిసెల జీవితమూ అర్ధాంతరంగా ముగిసిపోయి డాటాప్లానని, దాని తద్దినమని నెలకొచ్చే జీతాన్ని మొత్తం పణంగా పెట్టి క్షవరం చేయించుకునే ముచ్చట ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది

కట్ చేస్తే...

బాహుబలికి అన్వయించి మాటాడుకుందాం కాసేపు

ఐఫోను బాహుబలి లాటిది
డాటాప్లాను కట్టప్ప లాటిది

రాజమౌళి సెల్లు టవరు లాటోడు
కీరవాణి సిగ్నల్ ఎమిటర్ లాటోడు

కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడో తెలుసుకోవాలన్న ఆత్రం, డాటాప్లానుతో ఎంత డబ్బు క్షవరమైనా ఐఫోనును చిద్విలసంగా చేతిలో ఊపుకుంటూ తిరిగే ఆనందం - ఈ రెండూ ఒకదానిని ఒకటి వెంబడిస్తూనే ఉంటాయ్

పోతే డాటాప్లాను 1 GB, 5GB, 15GB, Unlimited GB అన్న రకాలుగా విభజించబడి ఉంటుంది

నువ్వు 1GB కి డబ్బులు కట్టి, అన్లిమిటెడ్ ఆనందం కావాలంటే బిల్లొచ్చేప్పటికి పృష్టమంతా జేగురు రంగుకు తిరిగి ఎర్రముడ్డి కోతివైపోయే ప్రమాదం చాలా హెచ్చు

అందువల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషనూ అవీ లేకుండా, అసలు నీకు ఐఫోనే లేదనుకుని వెళితే ఐఫోను విలవ, అందులోని ఆనందం తెలిసివచ్చును

మరి సాంసంగు ఫోను ఉన్న వాళ్ళేం చెయ్యాలి అని అడుగుతున్నావా?

ఓ సారి ఉత్తరానికి తిరుగు
తలపెట్టు
పండుకో

సరే, సినిమాలోకి వచ్చేస్తే సామాన్యుని లాజిక్కుకు లాజిక్కు ఉండదు అన్న సూత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఆ సూత్రాన్ని స్క్రీను మీద బర బరా బరికేసిన ఘనత రాజమౌళిది

మొదట్లో చెప్పుకొన్న సినిమాలన్నీ ఆ సూత్రమ్మీద స్క్రీనుకెక్కినవే

అప్పుడు వేళ్ళతో తిప్పుకునే ఫోనులుండేవి కనక ప్రపంచానికి మన సినిమా విలువ తెలవలా

ఇప్పుడు ఐఫోను వచ్చింది కనక వేలితో అలా తాకగానే అమ్మా మన్నుతినంగ అంటూ ప్రపంచమ్మొత్తం కనపడె కాబట్టి మన సినిమా విలువ ప్రపంచానికి తెలిసొచ్చె

ఒకటి రెండూ ముచ్చట్లు చెప్పుకొని ఈ పోష్టు ముగిద్దాం, లేకపోతే బిగినింగు, కంక్లూషను కాక జంక్లూషను అని ఇంత బారు భాగవతం రాయాల్సి వస్తుంది

పోతే ఈ కింది వాటికి నీ లాజిక్కులు నీకుండొచ్చు

అవి నీ దగ్గరే పెట్టుకో

కట్టప్ప ఎందుకు చంపాడు అన్న దానికి ఒక తిక్క లెక్క వేసి బంతాట ఆడాడు రాజమౌళి

కుక్కలా రాజమాతను చంపే వాసన కనిపెట్టిన కట్టప్ప, గుండె మీద చెయ్యి వేసుకున్న కట్టప్ప - రాజమాతకు అపాయం కలుగుతుందని ఆవిడకు సూత్రప్రాయంగానైనా చెప్పకుండా కొబ్బరికాయ దొరికిన కోతిలా ఇక ఇక నవ్వులు పక పక పూయించాలని చూచి జనాలను వాయించినాడు

అమరేంద్ర చేత మామా, అమ్మా అంటు భారీ డైలాగులు చెప్పించి ప్రేక్షకులను, దుర్యోధనుడి లాంటి వాళ్ళ మనస్సులోని సెంటిమెంటును మయసభలో కొలనులోకి విసిరేసినాడు మౌళి

ఆ తర్వాత మల్లెపువ్వుకు దవనం కలిపినట్టుగా వాసన ఎక్కువ చేసి మత్తులో ముంచుతూ అమ్మా తప్పంతా నాది - కొడుకు అనగానే బాహు అనుకున్నా - అని అంతా నెత్తినేసుకుని గుండు తడుముకుంటూ ఏడ్చినాడు

అందాకా కుతంత్రం కాదురా రాజతంత్రం, రక్తంతో కడిగెయ్ అంటూ చిందులేసిన అమ్మ శివగామి మొగుణ్ణి, కొడుకుని ఏదో తేడా ఉన్నా పట్టిచ్చుకోకండా బాహుని నువ్వేస్తావా, నన్నేసెయ్యమంటావా అని నిలదీయటంతో గుండు బాబాయ్ ఏడుపాపి వెర్రిపుష్పం ప్లానొకటేసి బాహుని బలి తీసుకొనినాడు

ఈ లాజిక్కు లేని లాజిక్కు చాకచక్యానికి దండలు వేసి బస్కీలు తీయవచ్చును

ఇంతకీ ఇక్కడ విషయమేందంటే లాజిక్కు ఉన్నదా, అది సరిగ్గా ఉన్నదా అని కాదు ప్రశ్న - సినిమాను లజిక్కుల కోసం చూస్తే, థియేటరు వెళ్ళటం కన్నా సొషల్ స్టడీస్ లాబరేటరీకి వెళ్ళి అక్కడ సోడియం హైడ్రాక్సైడు ఎట్లా చెయ్యాలన్న సూత్రం కనిపెట్టినట్టె. సినిమా సినిమాగా చూడాల.

ఖర్చు పెట్టిన డబ్బుకు మాహిష్మతి, ఏనుగులు, ఎద్దులు - ఇవన్నీ ప్రిమిటివ్ టాం అండు జెర్రీ ఆనిమేషనులా అనిపించినవి నాకు - ఇంకా బాగా, అనగా చాలా బాగా చెయ్యవచ్చు ఆ మాత్రపు డబ్బుకు - అదీ భారద్దేశంలో అంతమంది పనీ పాట లేని సాఫ్టువేరు ఇంజనీరులను పెట్టుకొన్నాక.... 

సినిమాకు హైలైటు - హంస నావ పాటకు కుట్టిన గ్రాఫిక్సు... సినిమా అంత అట్లా తీసుంటే బ్రహ్మలోకం దాటేసి ఆ పైనున్న సత్యలోకానికి చేరువలో నిలబడి ఉండేది సినిమా - ఎవరూ ఎత్తవలసిన అవసరం లేకుండా. అయితే ఇదేదో మిత్రులు చైతన్యప్రసాదు గారు రాసింది కదాని చెపుతున్న మాట కాదు. నిజంగానే అద్భుతంగా ఉన్నది నామటుకు. ఈ మధ్య కాలంలో హాలీవుడుతో పోటీ పడిన తెలుగు సీను ఏదన్నా ఉన్నది అంటే ఈ పాట మాత్రమే!

ఇక సంగీతం - ఒకటో భాగంలో ఉన్న వశీకరణం ఈ రెండో భాగంలో అక్కడక్కడ తప్ప ఇంకెక్కడా మచ్చుకి కూడా కానరాలా... కీరవాణన్న - మొదటి దానికి మంచి సెలక్షను చేసి, ఉన్న ఆవిరంతా ఆక్కడ ఎగరగొట్టేసుకొనినాడు... రెండో భాగం వచ్చేప్పటికి ఏం చెయ్యాలో తెలవక క్లాసికలును డప్పు డమారం స్థాయికి తీసుకొని వచ్చినాడు.. అయితే అందులో ఆయన తప్పేమీ లేదు... నా చెవులదే అంతా తప్పు. ఈలాటి సంగీతానికి అలవాటు లేని పిండాన్ని అవటం వల్ల అలా అనిపిస్తోంది అంతే.

అనుష్క దేవసేనగా అపురూపం. ఓ చోట సన్నగా, ఓ చోట లావుగా - సాఫ్టువేరు ఉపయోగించి మొత్తానికి ఆ అమ్మాయిని - లావును కనపడకుండా ఏదో మాయ చేసినడు మౌళి

మిగిలిన వారిని తీసుకుంటే - రానా 500 ఏళ్లకు కూడా ఇంచు తగ్గని కండలతో మహేంద్రుణ్ణి ఎదుర్కోటం బాగున్నది

ఆ బిజ్జలదేవుణ్ణి రిటైరు అయిపోమని చెప్పటం మంచిది

దేవసేన పిన్నిగా వేసిన అమ్మమ్మ జింగుచకా అని గంతులు వెయ్యటం చూస్తే ఇక్కడి తెలుగు అసోషియేషన్ల ప్రెసిడెంట్ల పెళ్ళాలు గంతులు వెయ్యటం గుర్తుకు వచ్చిందని ఒకాయన అన్నాడు సినిమా హాల్లో

ప్రభాసుకు టవరు నుంచి సిగ్నల్ స్ట్రాంగుగా అందినప్పుడు విరగదీసినాడు, లేనప్పుడు బ్లడ్డు, బాణాలతో కాలం గడిపినాడు

ఇక ముగించేద్దాం....

దీన్ని భారతంతో ముడిపెట్టి అనవసరమైన చర్చలు, దిక్కుమాలిన తద్దినమూ పెట్టుకోకుండా రాజమౌళి సినిమాగా చూస్తే మంచిది

అయితే నూటికో కోటికో ఒక సారి వచ్చే ఇలాటి తెలుగు సినిమాను రెండో సారి చూట్టం చాలా అవసరమైన పని

రెండో సారి చూస్తే వచ్చే సినిమాలో గ్రాఫిక్సుకు డబ్బులు ఇంకాస్త ఖర్చు పెట్టి, హాలివుడులోని నైపుణ్యాన్నంతా హైరు చేస్కొని ఇరగగా సినిమాలు తీయవచ్చు

భారద్దేశం అణుబాంబు తయారు చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది
భారద్దేశం మార్సుకు మాం ను పంపించినప్పుడు ప్రపంచం నోరు వెళ్ళబెట్టింది

రాజమౌళి బాహుబలి తీసినప్పుడు తెలుగు సినిమానే కాక ప్రపంచమే ఒళ్ళు, కళ్ళు అప్పగించింది

అదీ ఘనత

ఇదంతా నా సొంత అభిప్రాయాలే.... మీ మీ ఆలోచనలు వేరుగా ఉండవచ్చు... బాధపడితే మీ ప్రాప్తం అంతే అని సరిపెట్టుకోండి...