Wednesday, December 14, 2016

Dhruva Movie Review - అది నాకు తప్ప వేరెవరికీ తెలియదు...

Dhruva Movie Review

***********

నాకు ఆ సినిమా 0.00001% నచ్చిందా లేదా అన్నది ప్రశ్న

రామచరణం అనే అబ్బాయి సినిమా చూట్టం ఇదే మొదలు నాకు

కొన్ని కొన్ని సినిమా విడుదలలు మా ఆవిడకు చెప్పకుండా దాచిపెడుతూ ఉండటం వల్ల చాలా వారాంతాలు ప్రాణం ప్రశాంతంగా ఉన్నా, కొన్ని కొన్ని వారాంతపు రోజులు మా ఆవిడకు న్యూసు తెలిసిపోతూ ఉంటుంది...

వీళ్ళ దోస్తుస్నేహితం బంగారంగాను... నోట్లో ఆవగింజన్నా దాచిపెట్టుకుంటారు కానీ, రామచరణం సినిమా న్యుసు దాచుకోలేరు మాయావిడ స్నేహితురాండ్రు

ఏనాటి పుణ్యము వలనో అలాటి వారంతాలలో ఈ వారంతం ఒకటిగా చరిత్రలో మిగిలిపోయింది

అందువల్ల ఈరోజు ఆర్డరేసింది టికెటు తెచ్చెయ్యండి స్వామీ, ఐదింటికే అన్నం గిన్నం జన్నం వండేస్తా, కావాలంటే సమోసాలు కొనిస్తా హాల్లో తిందురు గాని - ఆ తర్వాత ఇంటికొచ్చి మళ్ళీ అన్నం తిందురు గాని అని...

సరే అని "ధ్రువ" అనబడు "ధృవ" అనే సినిమా చూస్తిని

మొదటి భాగములో ఆయన అందచందాలు, ఆ అందాల చందాల చాటున దోబూచులాడిన హావభావాలు చూచి అమెరికను స్క్రీనులోని చైనా పోగులు చెలగి చిరిగి పులకించినట్లు నా మదిలోని తంత్రులు కూడా ఊడలు తెంచుకుని పాతాళము వైపు పరుగులు తీసినవి. స్క్రీనుప్లే అను పదార్థము జిగురుగా పట్టి నన్ను సీటుకు ఆంచి ఉంచకపోతే మహిరావణ మర్దన జరిగెడిది

ఇంటర్వెల్లు తరవాత అందుకున్నది సినిమా

రామచరణమూ, ఆవిడెవరో రాకురాకు ప్రీతి ట - ఇద్దరూ కలిసి పాడుకున్న పాటలో రామచరణం - జేంసుబాండు సినిమాలో సముద్ర స్నానం చేస్తూ బికినీలో బయటకొచ్చిన కండల హాలీబెర్రీలా ఈయనా సముద్రంలోంచి లేచివచ్చినాడు. ఆ పాటయందలి ఫోటోగ్రఫీ సినిమా అంతా ఉండిన బాగుండెడిది.

పోతే విచిత్రముగా అన్ని పాటలు ఒక చరణము, సున్నా పల్లవులతో సరిపెట్టినారు. ఆ ప్రయోగము బాగున్నది ఎందుచేతనో

కండల రామచరణాన్ని చూచి ఈమధ్య మిడిగుడ్ల అమీరుఖాను స్టెరాయిడు కండల గురించి ఎక్కడో ఏ గోడ మీదో చదివిన సంగతి గుర్తుకు వచ్చి పట్టి చూస్తిని. అనుమానం వచ్చినది. పైగా ఆయన రెండు బస్కీలు తీసి ఆయాసపడుతున్నటుల యాక్షను చేశినాడు. అంత కండలు పెట్టుకొని రెడు బస్కీలకు ఆయాసము రావుటేమి ? ఏమో ఆ కండలకే తెలియవలె

గౌతము అని ఒకానొక రామచరణం మిత్రుడు - ఒక పిల్లి కళ్ళాయనను - నోట్లో భస్మము కొట్టి మరీ చంపినారు ఈ సినిమాలో. ఆయన చచ్చిన ప్రదేశము ఫార్మసూటికల్ కంపనీకు కొత్త ఆఫీసు అని విలను వాండు చెప్పినడు. ఆ పిల్లికళ్ళాయనేమో డెక్కను ఆటోమొబైల్సుకు రమ్మని రామచరణాన్ని రమ్మని ఫోనుయందు పిలిచినాడు . అది ఎందుచేతనో మరియొకసారి అర్థము కాలేదు

ఆ తరువాయి గుండెలో బుల్లెటు దిగగా, కాపాడిన డాక్టరు చేత రామచరణానికి స్పై బగ్గు పెట్టి రామచరణం ప్లానులన్ని తెలుసుకుంటాడు విలను. ఇక్కడ ఈ విలను గురించి ఒక మాట చెప్పవలె. ఒకప్పుడు రోజా పువ్వేలే అంటూనో, రోజా నువ్వేనో అంటూనో అదేదో మట్టిమాణిక్యాలాయన తీసిన సినిమాలో మంచుకొండల్లో పొగమంచులో నిలబడి మొహం కనపడకుండా పాడిన ఈయన, ఈ రోజు అదే పొగమంచు కప్పబడిన మొహముతో, అందు హావభావాలు పలికించ ప్రయత్నము చేయుచు విలనుగా పూర్తిగా విఫలమయినాడు.

ఆయన సినిమాల నుంచి విశ్రాంతి తీసుకొని ఉన్నపుడు ఊరుకున్నవారు ఊరుకొనకుండ ఆయనను సినిమాకు తీసుకొని వచ్చి మనకు పొగ పెట్టినారు, పొగ మంచుతో కప్పి దగ్గించినారు. అదియే విలనిజము అనుకొనిన యెడల తూరుపు తిరిగి ఏదో చెయ్యవలెను

రామచరణం నాట్యము బాగుగా చేశినాడు. కండలు ఉబ్బి ఉన్నను, నాట్యమునకు సహకరించినవి. స్వరము తండ్రిగారైన చిరంజీవి స్వరము వచ్చినది. కళ్ళకు ఆ తురకవారి వలె దట్టమైన కాటిక పెట్టినాడెందులకో మొదట తెలియరాలేదు. ఆ తరువాత పరీక్షగా చూచిన పిదప అది మేకపు కాదని, ఆయన కనుపాపల రెప్పలే అటుల ఉన్నవని తెలియవచ్చి సంతసించితిని

అలా మొత్తానికి శుభం కార్డు పడినది. మా ఆవిడ సంతోషంతో గావుకేక పెట్టినది. గావుకేకకు కారణము సినిమా ఆవిడకు నచ్చినదట. వైషుకు కూడా నచ్చినదట. దానిని కూడా గావుకేకలు పెట్టుమని ప్రోత్సహించుచుండటముతో ఇద్దరి భుజముల చెరియొక చేయి వేసి థియేటరు బయటకు లాగుకొని వస్తిని

ఇంతకీ నాకు 0.00001% నచ్చినదా లేదా?

అది నాకు తప్ప వేరెవరికీ తెలియదు...

ఓం తత్ సత్!

No comments:

Post a Comment