Monday, November 21, 2016

సొబగులద్దుకొన్న కొన్ని తెలుగక్షరాలు .... (2)

సొబగులద్దుకొన్న కొన్ని తెలుగక్షరాలు ....

వేసుకొన్న గీసుకొన్న బోలెడు అక్షరాలలో కొన్ని ఇక్కడ ఇప్పుడు

మరిన్ని వరుసగా...


కపివరునకు కొబ్బరి చిక్కెన్ తీరున ఉన్నది తతంగమంతా!

కపివరునకు కొబ్బరి చిక్కెన్ తీరున ఉన్నది తతంగమంతా!

గుడ్లగూబ తాను పగటిపూట చూడలేనందులకు సూర్యుని నిందించినా పాపము లేదనునట్లు - కొందరు కఠినాత్ములు మనసును ఉద్దరువుగా సున్నిపిండియంత సున్నితముగా చేసుకొని మీటలను బరబర బరకుకొనుచు తమ పోష్టులతో నల్లధన పోషణ, మోదీ దూషణ చేసినా పాపము లేదనునది నైతిక సూత్రముగానెత్తుకొని పిడకలు కొట్టుకొనుచున్నారు ...

ఇక కవివరుల సంగతి చెప్పనే అక్కరలేదు...

అసలే కవులు, కపిపుంగవులు - అద్దాని మీద కపివరునకు కొబ్బరి చిక్కెన్ తీరున ఉన్నది తతంగమంతా!

మనవారి తీరు ఏమి అనగా - కొలది ఉదాహరణములు మననము చేసుకొనెదము

1) విమానమెక్కిన బాతురూములను నాశనమొనరించుట
2) అన్నమెక్కిన విస్తరులను వీధులయందు పారద్రోయుట
3) మదమెక్కిన మంచి చేయువానిని బూతులు తిట్టుట

ఇటుల ఎన్నియో ఎన్ని కోటానుకోట్ల పనులు పన్నాగములు ఉన్నవి

ఈ అరాచకము కూడా అందిటియందు ఒకటియే అనుకొనవలె

ఓం తత్ సత్!

Friday, November 18, 2016

ఉరకరా! ఊదరా! కొరకరా! తాగరా! తీర్చరా!

ఉరకరా! ఊదరా! కొరకరా! తాగరా! తీర్చరా!

***************

ఉరకరా! ఉరకరా! ఉరకరా! సోదరా
జఠరాగ్నుల దుంప తెంప ఇడ్డెనలపై ఉరకరా!


ఊదరా! ఊదరా! ఊదరా! సోదరా!
కుడుములుప్పొంగు వేడి ఆవిరి మూతితో ఊదరా!

కొరకరా! కొరకరా! కొరకరా! సోదరా
మూతి ముక్కు నోట కొట్టునటుల ఇడ్డెనులు కొరకరా!

తాగరా! తాగరా! తాగరా! సోదరా
గంగాళ సమానురాల మది తలచి సాంబారు కుడితి తాగరా!

తీర్చరా! తీర్చరా! తీర్చరా! సోదరా
కూసింత నెమ్మదించి వాలుకుర్చియందు భుక్తాయాసపు సేద తీర్చరా!

-- (సెప్టెంబరు 21, 2011)

-- ఆ రోజుల్లో, రాయప్రోలును ఒకరోజు చదువుతూ ఆయన రాసిన ఒకానొక మహోన్నత గీత కవిత చదివి, కూడనిదైనా - ఈ పేరడీ రాస్తిని ....

తప్పు చేసినానన్న గిల్టు ఫీలింగు ఉన్నది కాని, చేసిన తప్పు చెపితే పోతుందని ఇక్కడ వెయ్యటం

సొబగులద్దుకొన్న కొన్ని తెలుగక్షరాలు ....

సొబగులద్దుకొన్న కొన్ని తెలుగక్షరాలు ....

వేసుకొన్న గీసుకొన్న బోలెడు అక్షరాలలో కొన్ని ఇక్కడ ఇప్పుడు

మరిన్ని వరుసగా...


వంకాయ పచ్చిపులుసో మాయమ్మ ....

వంకాయ పచ్చిపులుసో మాయమ్మ

**************************

పులుసో మాయమ్మ నిన్ను మరువజాలనే
రాచిప్పలో వంకాయ పచ్చిపులుసో మాయమ్మ 


వంకాయ పచ్చిపులుసో మాయమ్మ

అమ్మ నీదు పేరు బహు కమ్మగున్నాదే మాయమ్మ
ఈ మహిలో నిను బోలు వారలెవరున్నారే ఓయమ్మ

వంకాయ పచ్చిపులుసో మాయమ్మ

చల్ల పెరుగు పాలు శాకంబరాలు నీకు సాటిరావమ్మ ఓయమ్మ
నీ సారమేమొ కాని భళా భళీయని చిందులేస్తినమ్మ మాయమ్మ

వంకాయ పచ్చిపులుసో మాయమ్మ

బంతిలో నిండు విస్తళ్ళకు కలిసి వెళ్ళేము మాయమ్మ
నాకంటె నాకెక్కువెయ్యమని గాండ్రులాడేము ఓయమ్మ

వంకాయ పచ్చిపులుసో మాయమ్మ

వడియాలు వేయించి పచిమిరప తగిలించి ఓయమ్మ
పోపు ఝాడించి జుర్రు జుర్రుతుంటేను సొరగమే మాయమ్మ

వంకాయ పచ్చిపులుసో మాయమ్మ

గొంతు దిగినాక మాకు వళ్ళు తెలియదే మాయమ్మ
వళ్ళంత పులకించి ఒడలి పోతీనే మాయమ్మ

వంకాయ పచ్చిపులుసో మాయమ్మ

-- (మార్చి 16, 2010)

Wednesday, November 16, 2016

నరేంద్ర మోదీ గారి మీద ఒక......

నరేంద్ర మోదీ గారి మీద ఒక......

*********************

విశ్వంతర వినువీధులలో
వినిపించిన పొలికేకకు
మేల్కొన్నది ప్రపంచమంతా

యుగయుగాలుగా నిదురిస్తున్న
నల్లడబ్బును పలుకరించింది
స్వప్నంలో నరేంద్రుడి చర్నాకోల

నిదురమైకం వదిలిపోయిన
స్వార్థపూరిత స్పర్ధయాత్రా
అంతిమాంకంలో
ఆశాపూరిత వీణావాద్యం
వినిపించింది ప్రజాజగాన

శుభోదయంలో వికసిస్తున్న
పుష్పరాగంలాగా
లేస్తున్నారు జనమంతా

పూరించారు శంఖం
సాగిస్తున్నారు సమరం

కష్టాలకు వెరవక
నిలబడినారు పంక్తులలో

బారులు బారుల వరుసలో
మిలటరీ కవాతులు ఎడదలో

జమచేస్తున్నారు ధనమంతా
బేజారెత్తినారు బినామీలంతా

గాలిలో తెరచాపలెత్తి
సాగుతుంది సమాజం

విస్తుపోయి చూస్తుంది
రాజరికపు బానిసత్వం

విషపు కాట్లతో వ్యధ చెందిన
ఘడియలు...

నరేంద్రుని శాసనాలు
రేచులలా వేటాడుతున్నయ్
అమానుష అత్యాచారాలను
అహంకారపు అవినీతిపరులను

తీవ్రతరమవుతోంది నానాటికి
ఐక్యసంఘట నోద్యమభావం

వుదయించిన మోదీరావం
యిక సహియించదు
అహంకారం!

అణగారిన ఆవేశపు
అగ్ని పర్వతం
వర్షించింది లావాద్రవం

ప్రతిమానవ హృదయంలో
ఆలోచనా తరంగాలు
ధరించినయ్ కిరీటాల్ని

చింతించినయ్
గతదీర్ఘపు మౌఢ్యానికి

పూలరధం చేరుకున్నది
పరిపాలన యంత్రాంగపు
సరిహద్దులు

వత్సరాల తరబడి
వెచ్చించిన రక్తానికి
కార్చిన కన్నీటికి
ముడుతున్నది ప్రతిఫలం నేడు!


-- (1950 మొదటిభాగంలో ఒకానొక ఏప్రిల్ మాసంలో ఒకానొక ఆదివారం విడుదలైన విశాలాంధ్ర పత్రికా ప్రతిలో ఎం.ఎస్.శర్మగారని ఒకాయన రాసిన కవిత దీనికి ప్రేరణ) 
-- (2009లో దోశ కు అన్వయించి రాసుకున్న ఒకానొక రాతను ఈనాటి పరిస్థితిని చూచి కొద్దిపాటి మార్పులి చేర్పులు చేసి పబ్లిషు చేసినాను..అంతే!)

Thursday, November 3, 2016

కడుపు మంట కవితను....

********************
అనురాగం పిండే అయితే
ఆనందం అట్టే అయితే
మేం పరిగెత్తుకు వచ్చేస్తాం
కరకరగా నమిలేస్తాం


వంటిల్లొక నందనవనమై
ఇనుమే ఒక పెనమే అయితే
మేం కట్టెపేళ్ళుగా మండేస్తాం
ఆకాశానికి ఎగసేస్తాం

ఈ వలల కేళి గృహంలో
రుచులే ఒక విరిపాన్పైతే
మేం రాజఠీవితో వచ్చేస్తాం
నాల్కలు బారుగ చాపేస్తాం

మీ నిద్రా సుఖ సమయంలో
స్వాప్నిక ప్రశాంతి నిలయంలో
అట్లుగా కలలలో వచ్చేస్తాం
చొంగలు చొల్లులు కార్చేస్తాం

మీ హేమాసన పాత్రల్లో
మీ స్వప్నజగతి యాత్రల్లో
మా అట్టుధార నింపేస్తాం
మీ నాల్కను జారుడు చేస్తాం.

పానకపు అట్లగా వచ్చేస్తాం
నోట్లో అలా ఇలాగ జారిపోతాం
మా ప్రాణాలైనా విడుస్తాం
మీ కడుపును కాపాడేస్తాం.

-- బైరాగి మాష్టారు రాసిన ప్రసిద్ధ "అనురాగం అంబరమైతే" కడుపు మంట కవితను (చీకటి నీడలు కవితా సంపుటి అనుకుంటా) చదివినాక ఆయన ఏడుపును ఒక పేలవమైన ఆనందంగా మార్చే ప్రయత్నం చేస్తిని

-- ఎప్పుడు ? అట్టు ఆవేశం ఆవరించుకొనున్న 2011లో

-- చదివిన వారు ధన్యులు - చదవనివారి మరింత ధన్యులు

ఓం తత్ సత్!

రాబోకురా చందమామ - బసవరాజు అప్పారావు

1936 - రాబోకురా చందమామ - బసవరాజు అప్పారావు


ఆ శతకంలో ఈరోజటి తెలుగు సినిమా పాటలు!

జీడికంటి రామశతకము (1950) ప్రాంతాల్లో రాసింది

- ఆ శతకంలో ఈరోజటి తెలుగు సినిమా పాటలున్నాయ్....

కావాలంటే దేఖోండి
Wednesday, November 2, 2016

ఉపుమ సుఖముకై.....

*******************

ఉపుమ తినక బ్రతికి 
కులికి మురిసేకన్న
తిని రుచులనొంది
విలపింప మేలురా

ఉపుమ లేని నీ
కలిమి కాల్పనె వినుము
రుచులదీగెనె జీవఫలము
కాయునురా

ఉపుమకన్నను యెక్కు వే
ముందిరా యెల్ల
భోగభాగ్యముల కన్న
ఉపుమ యెక్కువరా

ఉపుమ సుఖముకై
ఉపుమ ముక్తికై
ఉపుమ ప్లేటుకై
యే మింక వలయురా?

-- జనవరి 16, 2011 (కనుమ రోజు టమాట జీడిపప్పు ఉపుమ తినినాక రాసుకొనిన పారడీ - మాతృక : దేవులపల్లి సాబు గారి ఒకానొక ప్రేమ కవిత)