Thursday, September 15, 2016

ఎందుకో ఇది గుర్తొచ్చిందయ్యోయ్!

ఎందుకో ఇది గుర్తొచ్చిందయ్యోయ్!

**************

ఏమిటోయ్ కొత్త కొత్త వ్యాసాలు రాస్తున్నావట

ఆం , ఏదో - బసవడు శ్రీశ్రీ మీద రాస్తున్నాను

బసవడెప్పటివాడు ? శ్రీశ్రీ ఎప్పటివాడు ? ఇద్దరికీ సాపత్యం ఎట్లా కుదుర్తుంది ? దేనిలో కుదురుతుంది

ఇదిగో చూడు, సాపత్యాలు చూపించాలంటే బోల్డుంటాయ్. ఆయనకు రెండు చేతులున్నాయ్, ఈయనకు రెండు చేతులున్నాయ్, అది చాలదూ రాయటానికి ?

అదొక్కటి రాస్తే మిగిలినవి ?

అవే ఆ మిగిలినవే, రెండు కాళ్ళు ఓ ముక్కు ఓ నాలిక ఎట్లా ఉన్నాయో ఏమిటోనని ఒక 50 పుస్తకాలు ముందేసుకుని రాస్తున్నాను

ఆ సరీపోయింది. తోక సాపత్యం కూడా ఉన్నదేమో చూడు. 50 పుస్తకాలు ముందేసుకుని రాస్తే అదేదో కతుందే అట్లా అవుతుంది

ఎట్లా ? ఏ కత?

ఓ కెమిష్టు, ఓ ఫిజిసిష్టు, ఓ ఎకనామిష్టు ఓ పాడుబడ్డ ద్వీపంలో ఇరుక్కుపోయారట.

ఎట్టెట్టా! ఏం రోగమొచ్చిందీ అందరూ కట్టకట్టుకొని అక్కడికి పోటానికి ? సరే పడుబడ్డదంటున్నావుగా, బేతాళుడున్నాడా అక్కడ?

చెప్పెది ఇనకుండా ఎదవ దిక్కుమాలిన ప్రశ్నలు నువ్వూనూ - బేతాళుడి సంగతి తర్వాత చెప్తా కానీ, ముందు వాళ్ళ తిండిగోల చూద్దాం, వాళ్ళు బతికుంటేనే మన కత

సరే చెప్పు

అలా పాడుబడ్డ ద్వీపంలో ఆకలైకి మలమలమాడిపోతూ కింద మీదా కందమూలాలేవన్నా దొరుకుతయ్యేమోనని తవ్వి పారేశారు

బావుంది, వేరే చెట్లూ గిట్లూ పిట్టలూ ఏమీ లేవా అక్కడ?

లేవు. ఆముదం చెట్టొక్కటే ఉందిట నువ్వెళ్ళి ఆముదం తాగటానికి

ఆ, ఓ సారి తాగి చచ్చేపనయ్యింది మరుగుదొడ్డిని వదలాలలంటే. ఆ గోడలకే కరుచుకుపోయా

తవ్వారు తవ్వారు కందలు దొరకలా, మూలాలు దొరకలా, కానీ ఓ బిందె దొరికింది. మాట్లేసి మూత గాట్టిగా బిర్రుగా ఉన్నా దానికో చిన్న చిల్లు ఉంటం వల్ల అందులో ఏదో తినే పదార్థం ఉన్నదని వాసన ద్వారా కనిపెట్టారు వాళ్ళు

ఆ ఆ తర్వాత...

కెమిష్టు గాడన్నాడు - బిందె కింద మంటెడితే ఈలావున గాసొచ్చి ఆ ప్రెషరుకు మూతూడిపోద్ది అప్పుడు అందులో ఉన్నది చక్కా తినొచ్చు అని

ఎకనామిష్టు గాడన్నాడు - ఓ ముళ్ళచక్రం తయారు చేసి దాంతో మూత మీద తిప్పి తిప్పి దాన్ని ఊడగొట్టొచ్చు

ఫిజిషిష్టు గాడన్నాడు - ఛస్! ఆ కొండ మీంచి కింద పడేస్తే దెబ్బకు పగిలి అన్నీ బయటకొస్తాయ్ అని ఛటాలున లాక్కుని పరిగెత్తి కొండ మీంచి విసిరేశాడు

అట్లా విసరగానే ఆ బిందె ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందన్న సంగతి అర్థమై ఇక తిండి లేదన్న సంగతి ఎరికలోకొచ్చి కెమిష్టు, ఎకనామిష్టు లబోదిబోమని ఫిజిషిష్టు గాడిని చావగొట్టి చెవులు మూసి ఏడుస్తూ కూర్చున్నారు

ఆ తర్వాత ఏమయ్యింది

మిగిలిన కత నీ ముందున్న పుస్తకాల్లో ఉన్నది, వ్యాసం రాస్తూ ఉంటే నీకే తెలిసిపోతుంది

ఆ ఊర్కో! నేనేదో ఆ పుస్తకంలోదొక లైను, ఈ పుస్తకంలోదొక లైను ఎత్తి కాపీ చేసి ఇంతబారున రాస్తున్నా కానీ, అందులో సంగతేమిటన్నది నాకు తప్ప ఇంకెవడికీ తెలీదు

మరి అట్లాటి దానికి రాయటం ఎందుకు ?

రాయకపోతే ఊరుకోరుగా ?

ఎవరు ?

నా మనసు, ఆ బేతాళుడు వాళ్ళు

ఓ! సరి సరి. బాగుంది బాగుంది ఆ విధంగా ముందుకు పోతూ ఉండాలి అధ్యక్షా!

(ఫిబ్రవరి 26, 2013)

No comments:

Post a Comment