Friday, August 12, 2016

ఎండిపోయిన బావి !

బావి

గాడిబావి

చల్లపల్లి గాడిబావి

చేద

తాడు కట్టిన చేద

బొక్కెన కట్టిన చేద

సంవత్సరం

ఒకానొక సంవత్సరం

బావి నీళ్ళు పాతాళంలోకెళ్ళిపోయిన సంవత్సరం

పాతాళంలోకెళ్ళిపోయిన నీళ్ళను వెతుక్కుంటూ బయలుదేరింది చేద

రసాతలంలో ఉన్న బలిచక్రవర్తిని అడిగింది నీళ్ళెక్కడున్నాయని

ఆయనన్నాడు, ఆ నీళ్ళే ఉంటే వామనుడు నన్ను తొక్కకుండా కాపాడుకునేవాణ్ణి కద తల్లీ అని

ఆదిశేషువుని అడిగింది నాయనా భూమినే మోస్తున్నావ్, ఈ బావిలో నీళ్ళెక్కడ ఉన్నాయో చెప్పమని

ఆయనన్నాడు, నీక్కనపడితే నాకు చెప్పు, వచ్చి నెత్తిన నీళ్ళోసుకుని నా దాహం తీర్చుకుంటానని

ఇదంతా కాదని వరాహావతారమెత్తిన స్వామిని అడిగింది నీళ్ళెక్కడ నాయనా అని

ఉండు ఎక్కడున్నాయో చూసొస్తానని కోరలతో తవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు

ఓ రెండు సంవత్సరాలు గడిచినాయ్

సామి బయటకు రాలా

మూడో సంవత్సరం ఆకాశంలో సవుండు వినపడ్డది

ఆ సంవత్సరం, ఆ తర్వాతి సంవత్సరం నిండుగా ఇబ్బడి ముబ్బడిగా వానలు పడ్డయ్

వరాహమూర్తి బయటకు వచ్చినాడు

ఆయన కోరలకు కాసింత బురద అంటుకొని ఉన్నది

చేద అడిగింది ఏమిటని

అంత లోతుకు వెళ్తే కానీ తగల్లేదమ్మా, ఎడా పెడా జల వాడేస్తే ఇట్లాగే అవుతుంది, మీ ఊరి కర్మ బాగుండి వానలు పడ్డయ్, నీ తలరాత బాగుండి నాకు నీళ్ళు కనపడినయ్, ఇక చేదుకోనని ఐదు కిలోమీటర్లున్న తాడు ఇచ్చి చక్కా పోయినాడు ఆయన

ఆ ఐదు కిలోమీటర్ల తడు మూరెడు లోతులోకి రాటానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది

ఈ ఐదేళ్ళలో జనాలకు తెలివొచ్చి జాగ్రత్తగా వాడుకోటం మొదలుపెట్టినారు

ఊటని తిరిగి రప్పించినారు

అట్లా చల్లపల్లి చేద మళ్ళీ మామూలు పనిలో పడిపోయింది

(ఒక ముప్ఫై ఐదేళ్ళ క్రితం పూర్తిగా ఎండిపోయిన బావి గుర్తుకొచ్చి కారణం ఇదే అయ్యి ఉంటుందని నాలుగేళ్ళ కితం రాసుకున్న ఒక చిన్న చమక్కు... అంతే!)

మీకు నచ్చినా నచ్చకున్నా సంతోషమే! నాకు పొయ్యేదేమీ లేదు..



No comments:

Post a Comment