Thursday, August 11, 2016

టింగు టింగు

వీణ

దానికొక మోత

మరి వాయించినప్పుడు ఒక శబ్దము వచ్చునుగా?

ఆ శబ్దమే టింగు

ఒక టింగు పది టింగులు తోడైతే సంగీతం

పది టింగులకు వంద టింగులు తోడైతే స్వర్గం

టింగు కొట్టని వాడు వైణికుడెట్లగునురా అన్నది నా నానుడి

టింగుకు ఆమ్రేడితము టింగుటింగు

ఈ టింగు టింగు మన ప్రబంధాల్లో కూడా ఉన్నవి

"జంటనేస్తగాండ్ర చేతి తిపిరి కిన్నెర లటింగుటింగులును" అంటూ గణపవరపు వేంకటకవి వేంకటేశ్వర విజయవిలాసములో రాసినాడు

అట్లే "నారదశ్రుతి గూర్ప నేరవు నీవు లెమ్మని వీణె టింగుటింగునను మీటు" అంటూ ధరణిదేవుల రామయమంత్రి దశావతార చరిత్రములో రాసినాడు

ఇలా ఇంకా చాలా చోట్ల ప్రయోగించబడింది

సరే అది అలా పక్కనబెట్టేద్దాం

టింగుకు మరో పేరు టింగురు

అదేనండి పర్యాయపదం

మరి ఠింగు అని కూడా ఉన్నదిగానన్నది మీ ప్రశ్నా?

ఠింగు వేరు టింగు వేరు

ఠింగు వీణ మోగినప్పుడు వచ్చేది కాదండి

గంటలు మోగినప్పుడు వచ్చేది

అందుకని అది వేరు

ఇది వేరు

ఠంగు ఠింగు మంటూ గంటలు మోగుతాయ్

టింగుటింగు మంటు కాదు

ఠంగున ఒంటిగంట కొట్టింది అన్న ప్రయోగం మీకు తెలిసే ఉండవలె

అందువల్ల మీరు ఠంగుని టింగుని దూరంగా పెట్టవలె

ప్రయోగపరంగా

కళా పూర్ణోదయంలో డుబ్బు డుబ్బు ఖంగుఖంగు ఠంగుఠింగు మన్ద్వ్హనుల్ అని రాసేసాడాయన

పోతే మీకు టింగురంగ పదం మీద అనుమానం రావ్చచ్చును

రంగనాథస్వామి వారి ఆలయంలో ఒకప్పుడు వీణలు బాగా మోగేవిట

టింగు మని అవి మోగగానే రంగ అని ఒకళ్ళు అందుకునేవారట

అలా భజనలన్నీ అయిపోయేదాకా రంగ రంగ అనే పదం దద్దరిల్లిపోయేది

మరి రంగనాథస్వామి పడుకుని ఉన్న పోజులు ఉన్నవి

అందుకని పనీపాటా లేకుండా పడుకునే వాణ్ణి చూసి టింగురంగా అన్న వాక్యం వ్యాప్తిలోకి వచ్చింది

టింగుకు పక్కన రంగ చేరి టింగురంగ అయ్యి అది మొత్తానికి పనికిమాలినవాడికింద మారిపోయింది

దాన్నే డాబూ దర్పంగా భావించేవారూ ఉన్నారనుకోండి - అది వేరే సంగతి

అందుకని మీరు టింగురంగడిలా, టింగురంగమ్మలా కాక వీణలు వాయించుకుంటూ అందరి మదుల్లో తంత్రులు తెంచాలని ఆశీర్వదిస్తూ

ఓం తత్ సత్

(వాచోపన్యాసం అంటూ రాసిన సమయములోనే ఇదీ రాస్తిని. అది తాటిపామల వారు వారి పత్రికలో అప్పుడెప్పుడో వేల సంవత్సరాల క్రితం అచ్చేస్తిరి, ఇది పొట్టిదైపోటమ్మూలాన టింగురంగడిలా మిగిలిపోయినది... :) )

No comments:

Post a Comment