Monday, July 25, 2016

ఎర్రగడ్డ సినిమా రివ్యూ's

పంచపాండవులలాటి ప్రేక్షకులు అయిదుగురు సుఖాసీనులైయున్న కాలమున ఒక బయ్యరు చనుదెంచి వినోదానందములకు ఉపయుక్తమైన కథతొ కూడిన సినిమాను స్క్రీనుకు తగిలించి ఉండు సమయమున పిచ్చి గంతులకు, వెర్రి పాటలకు అలవాటు పడిన చిత్రవిమర్శకుడొకడు సోషలు మీడియానందు పుంకానుపుంఖాలుగా చెత్త రివ్యూ రాసి సినిమాను దివాళా తీయించగా ఏమీ పాలుపోక నెత్తిన తడిగుడ్డవేసుకుని మీవద్దకు వచ్చితినని, ఆ చిత్రవిమర్శకుని పని పట్టవలెనని, పనిలో పనిగా పైరసీదారుల పని పట్టవలెనని మొరపెట్టుకొనగా ఆ గుంపుయందలి ధర్మరాజులాటి ప్రేక్షకుడు అంగీకరించి తన తమ్ములతో ఆ విమర్శకుని వద్దకు పోవుటకు సరంజామా సిద్ధము చేసుకొనెను. ఆ వార్త విని, కాసంత ఖంగారు పడిన ఆ విమర్శకుడు సోషలు మీడియానందు తన ప్రొఫైలు డిసేబులు చేసెను.

ఒక రెండు రోజులు ఆగిన తర్వాత అంతా సద్దుమణిగినదనుకొని మరల ఎనేబులు చేసెను. కానీ ధర్మజుడు ఊరుకొనడు కద. వాని ప్రొఫైలు ఎనేబులు అయినదన్న విషయము వార్తాహరుల ద్వారా విని తన తమ్ములను ముందుగా వాని మీదకు పంపెను. నకులుడి లాటి ప్రేక్షక తమ్ముడు వెళ్ళగా వానిని అర్థము కాని ఆర్గ్యుమెంట్లతో చీల్చి చెండాడి తరిమివేశెను. ఆ తరువాత సహదేవుడు గుర్రమెక్కి వెళ్ళెను. ఆయనతో కాక ఆయన గుర్రముతో మాటలాడి, అర్థము, ఆ పైన తోడుగా పర్థము లేని ఆర్గ్యుమెంట్లతో గుర్రమును ముందు మట్టి కరిపించి ఆ తరువాత సహదేవుని పని పట్టి మట్టి కరిపించినాడు. ఆతరువాత అర్జునుడు గాండీవము పుచ్చుకొని వెళ్ళెను. బభ్రువాహన రూపము ధరించి ఆయన ఒక మాటబాణము వేస్తే వీడు తీటబాణములు వంద వేసి ముప్పుతిప్పలు పెట్టి మొత్తానికి ఆయన మత్స్య యంత్రాన్ని గింగిరాలు తిరిగే లాగున వీడు ఛేదించినాడు. ఇక భీముని వంతు వచ్చినది. ఆయన ఇంతలావు గద పుచ్చుకొని లాజిక్కు స్టేటుమెంటులు తీసుకుని వెళ్ళగా వీడు ఐరను మానువంటి ఇనప తొడుగు ఒకటి ధరియించి ఆ పైన దానికి ఒక తోక పెట్టుకొని కూర్చొనినాడు. భీముని చూడగనె ఎత్తు బాబూ నా తోక ఎత్తు అని పరిహాసము చేయగా భీమునికి కండ్లు తిరిగినవి. అన్న తోకను ఎపుడు చూచినా వానికి ఆ కండ్లు అట్లే తిరుగునన్న విషయము వీడు బాగుగా పట్టినాడు. భీముని కండ్లు తిరుగుచుండగా ఇదే అదననుకొని అయిరను మాను సూటుతో ఒక్క గుద్దు గుద్దినాడు. ఆయన మూర్ఛపోయినాడు.

ఎంతసేపయినను ఎవరు వెనుకకు రాకపోవుటచే, ధర్మజుడు మహిషము నెక్కి గంటలు కొట్టుకుంటూ బయలుదేరినాడు. వీనికి ఆ గంటల శబ్దము వినినంతనే చెమటలు పట్టినవి. చిన్నతనమున గుడి మెట్ల వద్ద చెప్పులు, ముష్టివారి పాత్రలలోనుంచి చిల్లర దొంగిలించిన సమయమున అక్కడి ముష్టివారు గుళ్ళో గంట ఊడబెరికి దానితో చావుదెబ్బలు కొట్టిన సంగతి జ్ఞాపకము వచ్చినది. చిల్లర దొంగనుంచి, పెరిగి ఇంతయైనాక కూడ, ఇతరుల రివ్యూలలోని భాగములు అక్కడొకటి ఇక్కడొకటి దొంగిలించి దానికి వీని పైత్యము జోడించి, వీనికి డబ్బులివ్వని నిర్మాతల మీద కసి పెంచుకుని ఆ సినిమాకు పోవు ప్రేక్షకులందరినీ ఎర్రగడ్డ రివ్యూలతో విముఖత కలుగచేసి, ముప్పుతిప్పలు పెట్టు బుద్ధులు వదలలేదు వీనికి. కానీ అంత:కరణమున ఊడబెరికి కొట్టిన గంటల చప్పుడు, చప్పుడు చేస్తూనే ఉన్నది. అందువలన ధర్మజుడి గంటల చప్పుడు ముచ్చెమటలు పట్టించుచున్నది. మొత్తమునకి మేకపోతు గాంభీర్యముతో సదరుకొనినాడు. ధర్మజుడు వచ్చినాడు.

సంవాదము మొదలు అయినది.

చిత్రాక్ష ప్రశ్నలు అనియెడు పేరు పెట్టి ఆ సంవాదమును మీ ముందుకు తీసుకువచ్చు ప్రయ్త్నము చేశినాను. చదువుకొని భోరున ఏడ్చుటో, ఉన్మాదముతో నవ్వుటో చేసుకొనుడు

ధర్మజుడు సంవాదము మొదలుపెట్టుచు - నాయనా, నేను ధర్మజుడను, నీవు ఎవరో ఏమోనని వచ్చు దారిలో ఒకరిద్దరను అడిగినాను. వారు నీ చరిత్ర, నీ చరిత్రహీనత అంతయు వివరించినారు. నీ భయములేవో నాకు ఎరుక పట్టించినారు. ఇపుడు నేను కొలది ప్రశ్నలు వేసెదను వానికి సరియైన సమాధానములు చెప్పకున్న ఈ నా మహిషపు గంటలు తీయుదును అనెను.

వాని ప్రాణములు కడగట్టిపోయినవి. వేరొక దారిలేక ఒప్పుకొనినాడు.

ప్ర. చిత్రము దేనియందుండును
స. ప్రదర్శనశాల యందుండును

ప్ర. ఆకసము కంటె పొడవు కలది
స. ప్రదర్శనశాల యందలి స్క్రీను

ప్ర. వాయువు కంటె జవము కలదేది
స. బ్రహ్మానందము తన్నులు తినుట

ప్ర. దేనికి హృదయము లేదు
స. నాకు

ప్ర. చెత్త కంటె హీనమైనది ఏది
స. నా రివ్యూ

ప్ర. దేనివలన భయము పెరుగును
స. గంటల వలన

ప్ర. దేనిచేత లోకము ఆవరించబడినది
స. నా రాతల వలన లేచిన గందరగోళము

ప్ర. చితమునకు శత్రువేది
స. నేను, నావంటి నా సహోదరులు

ప్ర. చిత్రమునకు శొకమేది
స. నా రివ్యూలను నమ్ము ప్రేక్షకుని అజ్ఞానము

ప్ర. పండితుడెవడు
స. నేను, దొంగ అయిన మా నాయన, గజదొంగ అయిన మా తాత

ప్ర. అహంకారమేది
స. నేను రాసిన చిత్రవిమర్శ

(అదాటుగా జుబ్బా సవరించుకొనుచు ధర్మజుని చేయి తగిలి గంట మోగగా, మహిషము వల్లెయనుచు తల ఊపినది. ఆ సమయమున గంగడోలు వంటి మెడకు కట్టిన గంట ఒకటి గిర్రున తిరిగి వీని మాడు మీద పడెను. దానితో మాడులోని మట్టి మాగాణి పొలమైనది)

ప్ర. చలనచిత్రమును ప్రేరేపించునది ఎవరు 
స. ఏమో. ప్రేక్షకుడవవచ్చును

ప్ర. ఆతని సహాయులెవరు
స. మీరు అని అనుకొనుచున్నాను

ప్ర. వినోదము కలుగచేయునది ఏది
స. చిత్రమునందలి సంఘటనాక్రమము

ప్ర. చిత్రము దేనిచే శ్రోత్రియమగును
స. దర్శక నిర్మాతల చేత

ప్ర. దేనిచే గొప్పతనమును పొందును
స. అందుండు పాటలు, సంగీతము, డైలాగుల చేత

ప్ర. దేనిచే దేవత్వము పొందును
స. బ్రహ్మపదార్థమైన కథ చేత

ప్ర. చిత్రమునందు  ముఖ్యులెవ్వరు
స. మానవ సంబంధములు ఎరిగిన కథా రచయిత పాట రచయిత డైలాగు రచయిత, ప్రేక్షక వినోదము తెలిసిన పాటగాడు, గిలిగింతలు పెట్టు సంగీతమునందించు సంగీతజ్ఞుడు, అందచందాలతో పాటు స్వచ్ఛ ఉచ్చారణ కలుగు నాయక నాయకీమణులు మరియు సహనటీనటులు

ప్ర. చిత్రము కంటె పెద్దదేది
స. ప్రేక్షకుని మనసు

ప్ర. చిత్రమునకు దిక్కు ఏది
స. కథయే

ప్ర. జలమేది
స. కథకు జోడించబడిన సున్నిత హాస్యము

ప్ర. అన్నమేది
స. చిత్రమునందు పాలుపంచుకొనినవారి శ్రమ

ప్ర. ధైర్యమేది
స. మీరు, మీ వంటి ప్రేక్షకులు

ప్ర. నా తమ్ముల మూర్ఛ కడతేర్చునది యేది
స. నేను రివ్యూలు రాయకుండుట

(దానితో ధర్మజుడు సంతుష్టుడై మహిషముతో మరలిపోయెను. ఆ సంవాదమునకు గురుతుగా మహిషము మెడ నుంచి ఒక గంట ఊడపెరికి వాని చేతియందు పెట్టి జ్ఞాపికగా అట్టిపెట్టుకొనుమని చెప్పివేసి తన స్థానమునకు మరలినాడు. ఆనాటి నుంచి ప్రేక్షకులు కాసింత సుఖమున నుండిరి ) 

No comments:

Post a Comment