Thursday, July 28, 2016

సజీవంగా తగలబెట్టెయ్యడం

"తలిదండ్రినైన తమ్ముల నన్నల సఖులనైన బంధుజనులనైన విత్తకాంక్ష జేత మనుషులు జంపుదు రవనియందు"

అయ్యా, అమ్మా, తల్లీ, తండ్రీ

ఈ మాటలు వర్తమాన కాలంలో పుట్టలేదు. భూతకాలంలో వర్తమానాన్ని, భవిష్యత్తుని ఊహించి మనుషులు రాసినవే. మనుషులు పుట్టిన తర్వాతే మాటలు పుట్టాయి. ఈ మాటలూ పుట్టాయి. ప్రత్యక్షంగా మనం చూస్తూనే వున్నాం. తెల్లవారితే ఇలాటివి లక్ష, తెల్లవారకముందు ఇలాటివి ఇంకో లక్ష. రాముడు, హరిశ్చంద్రుడు లాటివారు, విత్తమేమి ఖర్మ అసలు రాజ్యమే వద్దు, మాట ముఖ్యమనుకొని జీవితం నడిపినవాళ్ళు అలా యుగానికి ఒకరొ ఇద్దరో. మరి వాళ్ళేగా మనకు యుగపురుషులు. అందుకేగా వారిని యుగపురుషులని పిలిచేది ? మరి కలికాలమో ? ఒకరో ఇద్దరో ఉంటారు, ఉన్నారు, ఉండాలి. కాని ఎక్కడ ఉన్నారో, ఎక్కడ దాగుకొని ఉన్నారో, అసలు తెలియరావట్లా. సరే, వాళ్ళ సంగతి అట్లా పక్కనబెట్టు. ధనకాంక్ష ఉన్నవాళ్ళు సాక్షాత్ రాక్షసులేనోయ్. వాళ్ళకు గుండె లేదు. ఒకవేళ ఉన్నా, అది రాయితోనో, రప్పతోనో చేయబడి ఉన్నది కాని ఇంకో పదార్థం మాటే లేదు.

అరెరె, మొన్నామధ్య పేపరులో వార్త! ఏమని ? ఆస్తికోసం అమ్మను చంపేశిన వ్యక్తి అని. ఎంత దారుణం. మనిషన్నవాడికి ఒళ్ళు గగుర్పొడచదూ ఇట్లాటివి చదువుతుంటే. కాంక్ష చుట్టుకుంటే కాలసర్పమే, చుట్టుకున్నవాణ్ణే కాక చుట్టబడవలసినవాళ్ళను కాల్చేస్తుంది, విషంతో నింపేస్తుంది, మరణం ప్రసాదించేస్తుంది. మరి ఇవన్నీ ఏమి? ఆ పరమేశ్వరుడు రాసిన తలరాత అనుకోవాలా, లేక కర్మ ఫలాలు అనుకోవాలా? అమ్మను, ముసిలిదానిని చంపెయ్యటమేమిటీ? వీడి చేతులు నరికెయ్య! వాడి డబ్బుకాంక్ష రాళ్ళపాలైపోను! అయ్యో, అమ్మా - ఆ దిక్కుమాలిన కుటుంబంలోకి ఎందుకు చేరావమ్మా?. అట్లాటి వాడికి బీజాన్నిచ్చిన ఆ భర్తతో ఎలా వేగినావమ్మా? అట్లాటి కొడుకుని కడుపులోనే చంపేసుంటే పోయేది కదమ్మా! అంతకు అంతా శాస్తి జరుగుతుందో లేదో తెలియదు కానీ, ఆ పైవాడు చూస్తూనే ఉంటాడని అనుకోలు.

అయినా అట్లాటివాడిని కొడుకని చెప్పుకోవటం కన్నా ఆ వైకుంఠంలో కూర్చొని వైకుంఠపాళీ ఆడుకోవటం మేలు కాదు ? ఎందుకొచ్చిన బతుకమ్మా! ఎందుకొచ్చిన ఈ మానవ జన్మమ్మా ఇది ? ఇంత కక్షలు, కార్పణ్యాలు చూట్టానికి, చేతపట్టుకోటానికా మనం ఈ జన్మ ఎత్తింది? డబ్బు లేకపోతే పీడా పోయే, ఏ కూలో నాలో చేసుకుని పూటకింత ముద్ద తిని, కాస్త సుఖంగా నడుం వాల్చి ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటే, తెలిసిన ఒకరో ఇద్దరికో సాయపడితే ఎంత బాగుంటుంది జీవితం.

మంచి చదువులు చెప్పాల్సిన గురువులు అట్లానే ఉన్నారు. వారి దగ్గర నేర్చుకున్న విద్యార్థులు అట్లానే ఉన్నారు. ఎవరికీ ఉపయోగపడని, వివేకం కలిగించి ఆ డబ్బు భ్రమ తొలచించలేని చదువూ చదువేనా? పశువులసాలల్లో పేడ ఎత్తుకోవటం నయం కాదూ ? "కారే రాజులు.....ఈరే కోర్కులు" అనిపించాడు బలిచక్రవర్తి చేత ఒక కవి. అలాటి భాగాలు చదువుకో, మననం చేసుకో. నీ మనసు ఎంత తేలిక పడుతుందో చుసుకో. ఆకాశమంత వివేకంతో ఆ అంబరంలో విహరించవూ అలాటివి చదివాక?

పిల్లడికి డబ్బులివ్వకపోతే తండ్రి మీద కోపం, తల్లి మీద కోపం. ఒక దెబ్బ వేస్తే తలిదండ్రులని చూడకుండా సజీవంగా తగలబెట్టెయ్యడం - ఏమిటండీ ఇది ? ఎవరిది తప్పు ? ధనమ్మీది కాంక్ష ఎవరిని బాగుచేసింది ? "ధనము కలిగిన మీదట అసహాయులకు, యాచకులకు భాజ్యముగ బ్రతుకనేర్వని మనుజుడు రక్కసి సమానుడున్" అని లక్ష్యం పెట్టుకున్నవాళ్ళంతా యుగపురుషులైనారు. ఆ గతి తప్పిన వారంతా రాక్షసులైనారు. అందరమూ మనుష్యులమే, కానీ ఇదే భేదం. ఎప్పటికో విముక్తి? ఎప్పటికో పునర్జన్మ! 

(సెప్టెంబరు 14, 2014)

ఒక రోజు ఒక దుర్మార్గుడు డబ్బు కోసం తల్లిని చంపేశాడన్న వార్త చదివాక రాసుకున్నది....మాళ్లీ ఈరోజు వార్తల్లో ఏదో చదువుతుంటే గ్యాపకం వచ్చింది...

No comments:

Post a Comment