Friday, June 17, 2016

అదొక లైబ్రరీ

అదొక లైబ్రరీ
లైబ్రరీ అన్నాక పుస్తకాలు
అందులో రెండు గ్రంథాలు మాట్లాడుకుంటున్నాయ్

***************

"ఎందుకంత ఇది? నా మీదట్లా పడతావెందుకు ? ఒరిగిపోతూ నీ బరువంతా నా మీద వేస్తావేం?"

"నీ మీద కొరుగుతానా, కరుస్తానా, జాగ్రత్త ఖబడ్దార్"

" తమరి పేరేమి నాయనా?"

"నా పేరే తెలియదా నీకు, అరేయ్ వీడెవడో నన్ను పుస్తక ప్రొఫైలింగు చేస్తున్నాడు చూడండిరా"
(చంపండి, నరకండి, చించెయ్యండి....దూరంగా వేరే పుస్తకాల అరుపులు)

"అరెరె, అంత ద్వేషమేమిటండి. అయినా ఇక్కడెవరూ మనుషులు లేరే. చంపుకోడానికి, నరుక్కోడానికి. మనమంతా పుస్తకాలమేగా"

"ఏయ్! తగ్గు తగ్గు. మనం మనుషులం కాకపోతే, మనల్ని చదివేవాళ్ళు మనుషులేగా! మనం ఏది చెపితే అదే వాళ్ళు ఆచరిస్తారు. అయినా అదంతా పక్కనబెట్టు - అసలు నువ్వంటేనూ, నీ పేరంటేనూ, నీ జాతంటేనూ, నిన్ను చదివే వాళ్ళంటేను నాకు పడదు"

"ఎందుకలాగ, అనవసరంగా అరుస్తూ అంత రక్తపోటు తెచ్చుకోకండి. మరి మనం చెప్పేది వాళ్ళు ఆచరిస్తారంటే, మన బాధ్యత ఎక్కువ ఉన్నట్లేగా. చెప్పేదానిలో మంచే ఉండాలిగా. చెడు, ద్వేషం పంచకూడదుగా. ఆ మంచే చెప్పకపోతే మనం ఎందుకు మన బతుకెందుకు. అట్టలోపలున్న పేపర్లు చింపేసుకుని గాల్లో కలిసిపోటం మంచిది."

"చూడూ! అదంతా నాకు తెలియదు. అయినా నీ పేరుతో ప్రాబ్లం నాకు. నీ పక్కనే ఉన్న ఆ రెండు మూడు పుస్తకాలు రామాయణం, భాగవతం, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, శృతులు ఇలా మిగతావంటే కూడా కచ్చ నాకు. నీ పేరు భారతం. నీ పేరులోనే ఒక భాగం భారత్. విన్నావా భారత్ ఉన్నది. భారత్ అంటే పడదు నాకు"

"నాయనా! అదా నీ భాగోతం. ఇప్పటికే విడదీయలేని సంకెళ్ళలో పడి ఎవడూ నే చెప్పిన మంచిని ఆచరించకుండా సుడిగుండాల్లో పడి తిరుగుతున్నారు. కాసంత ప్రశాంతంగా ఉండి సమాజానికి ఉపయోగపడే పనులు ఏవన్నా చెయ్యొచ్చుగా? అసలు మన పుట్టుకే దాని కోసంగా!"

"అది ఇందాకే చెప్పావ్. నాకు నచ్చలేదు ఆ పాయింటు. మా తాతను చూశావా, అదిగో అక్కడ ఆ షెల్ఫులో చిరిగిపోయి పడి ఉన్నాడు. ఆయన పిచ్చాసుపత్రి లైబ్రరీ షెల్ఫులో ఉండేవాడు చిరిగిపోకముందు. ఆయన అక్కడికి వెళ్ళటానికి కారణం ఒక రాజకీయనాయకుడి లాటి లైబ్రేరియన్ అని, చిరిగిపోయాక చెప్పాడు నాకు. అక్కడ, ఆ పిచ్చాసుపత్రిలో చించేశారట ఆయన్ని. ఆయన పరిస్థితికి, ఆయన తరఫున ఆయన పగ నేను తీర్చుకోవాల్సిందే. నా మిత్రులతో కలిసి సాధిస్తా"

"ఆయనెవరో రాజకీయాలు నేర్చినవాడు మీ తాతను అక్కడికి పంపిస్తే, అది మా తప్పెలా అవుతుందో ఏమిటో! ఆ పిచ్చాసుపత్రిలో వాళ్ళంతా నీలా ఉద్రేకపరులేగా. అందుకే తట్టుకోలేక చించేసి ఉంటారు. అయినా మన బుద్ధి ఏమయ్యింది? మన బుద్ధి సరిగ్గా లేకపోతేనే, ఇప్పటి మీడియాలా కలగాపులగా ఐకమత్యం అవసరం పడుతుంది అనుకుంటా"

"ఏయ్! మా ఐకమత్యం గురించి నీకేం తెలుసు. అంతే, మేమంతా అంతే, మాలో అంతా ఐక్యత ఉన్నది. మాలో ఒకరు రాముడి మీద పడి పడి ఏడుస్తారు. ఒకరు కృష్ణుడి మీద పడి ఏడుస్తారు. ఒకరు మనుషుల మీద పడి ఏడుస్తారు. ఒకరు మతం మీద పడి ఏడుస్తారు. ఒకరు పాత రచయితల మీద పడి ఏడుస్తారు. ఒకరు అన్ని కులాలు, లేని కులాల మీద పడి ఏడుస్తారు. ఇలా వారు వీరు అని లేకుండా అందరి మీద పడి అందరం ద్వేషంతో ఏడుస్తూనే ఉంటాం"

"అందువల్ల లాభం ఏమిటో నాకు అర్థం కాలా! "

"లాభం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అయినా నా లాభం నాకు తెలుసులే. మా ద్వేషమే మా ఏడుపు. ఆ ఏడుపే వరదలుగా పారిస్తాం. అందరినీ ముంచేస్తాం"

"నాయనా! ఎప్పుడూ ఏడ్చేవాణ్ణి లోకం నమ్మదు. కొద్దిరోజులు పోయాక చరిత్రలో ఏడుపుగొట్టు పుస్తకాల్లానే మిగిలిపోతారేమో ఆలోచన చేసికోండి"

"ఆలోచనా! అంటే ఏమిటి ? ఏమిటి చేస్తారు దాంతో"

"ఓ! అర్థమయ్యింది. పూర్తిగా అర్థమైపోయింది. సరే, దాని గురించి చెప్పటం కన్నా నిన్నిలా ఏడుస్తూనే ఉండమనటం మంచిదేమో. సరే! లైబ్రేరియన్ వస్తున్నాడు, అరుపులు అవీ తగ్గించుకుంటే అందరికీ మంచిది"

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.