Friday, May 20, 2016

జాతకర్ణి - A movie in itself
ఒకటి...రెండు...ఎనిమిది...అయిదు; ఒకటి...మూడు...రెండు...ఆరు; ఒకటి...ఏడు" రిథం తప్పకుందా వుచ్ఛరిస్తూ అంకెలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది పులమా దేవి

అక్కడికి కొద్దిదూరంలోనే వున్న సింహాసనం మీద విసనకర్ర విసురుకుంటున్నాడు జాతకర్ణి.

"ఒకటి...మూడూ...ఒకటి...ఎనిమిది" పులమాదేవి అడుగులు లెక్కతప్పాయి. మడమ మెలికపడటంతో బోర్లా పడింది

అప్పటికీ తలేత్తి చూడలేదు జాతకర్ణి.

ఉక్రోషంతో లేచి గబగబా అడుగులు వేస్తూ అతన్ని సమీపించింది పులమ. చేతిలో వున్న విసనకర్రను విసురుగా వూడలాక్కున్నది.

సింహాసనం పక్కనే వున్న మేజాబల్ల మీది బస్కీ దండం అందుకున్నాడు జాతకర్ణి. "చూడు పులమా, మల్లయుద్ధం నేర్చుకునేవారు ముఖ్యంగా నేర్చుకోవలసింది, అంకెలు లెక్కపెట్టటం. ఓపిక, అంకెలు లేకపోతే నువ్వు వెయ్యి సంవత్సరాలు అడుగులు వేసినా ఆ విద్య నీకు వంట బట్టదు."

నడుము మీద చేతులు వుంచుకుని కోపంగా చూసింది పులమ. "అంటే మీ ఉద్దేశ్యం? నాకు అంకెలు రావనేగా?"

దండం తిప్పుతూ ఒక బస్కీ తీసి దండాన్ని గదిమూలకు విసిరాడు జాతకర్ణి

"కనపడుతూనే వుంది. అంకెలు చెప్పటం చేతకాక, అడుగు వెయ్యటం రాకపోగా బోర్లాపడి, పడ్డాననే వుక్రోషంతో నా విసనకర్ర లాక్కోవటం... ఇవన్నీ దేనికి ఉదాహరణలు."

పులమా దేవి వదనం కోపంతో మంకెన పుష్పంలా తయారయ్యింది. పళ్ళు బిగించి జాతకర్ణి చేయి పట్టుకుని బలంగా ముందుకు గుంజింది. మోకాళ్ళకు తల అడ్డుపెట్టి తాడోపేడో విధానాన్ని వుపయోగిస్తూ భుజం మీది నుంచి ఎత్తి అవతలకు విసిరింది.

పల్టీలు కొడుతూ గదిమూలకు వెళ్ళి కిందపడ్డాడు జాతకర్ణి, తలమీద వున్న కిరీటం ఎగిరి అవతల పడిపోయింది. పంచెకు అంటిన దుమ్ము దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు.

"వద్దు వద్దన్న కొద్దీ....నీకు మల్లయుద్ధం నేర్పటం తప్పని యిప్పుడు అనిపిస్తోంది. నీకు అంకెలు రావని నేనన్నప్పుడల్లా నన్ను ఇలా విసిరేస్తూనే ఉన్నావ్. కిందపడి నా తొడలన్నీ వాచిపోతున్నాయ్ కొట్టుకోడానికి లేకుండా" అన్నాడు సింహద్వారం వైపు అడుగులు వేస్తూ.

పులమ కోపం మటుమాయం అయిపోయింది. చటుక్కున అడ్డువెళ్ళి "కర్ణీ, ఈ ఒక్కసారికి క్షమించు...ఇంకోసారి అంతగట్టిగా విసరనులే..." అన్నది గడ్డం పట్టుకుంటూ

ఆమె భుజాల చుట్టూ చేతులు చుట్టి దగ్గరికి లాక్కున్నాడు జాతకర్ణి. తలవంచి ముఖం మీదకు వంగాడు

ఠంగ్ ఠంగ్ మని మోతలు చేస్తూ వారి ఏకాంతానికి అడ్డువచ్చింది అంత:పురంలోని గంట.

గట్టిగా నిట్టూర్చి జాతకర్ణి చేతులు వదిలించుకుంది పులమ. ఎవరక్కడ అని చప్పట్లు కొట్టింది..

*******


 "జాతకర్ణి ఎక్కడ ?" కోటగుమ్మం దగ్గర నిలబడి ప్రశ్నించింది ఛాయాదేవి

బొటనవేలితో గుట్టలకొండ వైపు చూపించింది పులమ. "ఏమోనండీ తెలియదు, ఈ రోజు నే వేసిన పచ్చిమిరపకాయ బజ్జీలు తిని గొల్లుమంటూ వెళ్ళిపోయారు...." అని కళ్ళనీరు కుక్కుకొంది

పమిటను సద్దుకుని, గుట్టలకొండ వైపు సుదీర్ఘంగా చూపు సారించింది ఛాయాదేవి

గుట్టలకొండలో, చెట్టు ముందు నిలబడి, బస్కీదండం తలకణుపు మీద పెట్టుకుని భారంభారంగా ఊపిరి పీలుస్తున్నాడు జాతకర్ణి."మిర్చీబజ్జీ అలా చేసి ఉండవలసింది కాదు. కనీసం బజ్జీల్లో ఏమేం వెయ్యాలో నాన్నగారిని అడిగి ఉండవలసింది తను" అంటూ లోపల లోపల వినీవినపడనట్టు అరుపులు కేకలు పెడుతున్నాడు.

పక్కనే ఉన్న మద్దిచెట్టు దగ్గర ఏదో అలికిడి

ఊపిరి బిగదీసి బస్కీదండం కణుపు మీద నుంచి దింపాడు

అలికిడి ఆగిపోయింది

అరగంత తర్వాత బారుబద్దలు వంపు దగ్గర సెకండు కార్నరులో ఆగాడు. ఒక పెద్ద రావిచెట్టు ఉంది. అక్కడికి వందగజాల దూరంలో పదిమంది దృఢకాయులు జాతకర్ణిని చూడగానే మాటలని ఆపి, మెల్లిగా ముందుకు రావటం ప్రారంభించారు

చేతిలో వున్న దండం నేల మీద పడేసి తొడ మీదకు చూపుడు వేలుతో సైగ చేశి చూపించాడు జాతకర్ణి. అది చూడగానే బ్రతుకుజీవుడా అనుకుంటూ చిల్లపెంకులు అయిపోయారు ఇద్దరు. మిగిలిన ఎనిమిది మంది చెక్కు చెదరని ధైర్యంతో బిక్కు బిక్కు మంటూ జాతకర్ణిని సమీపించేప్పటికి ఏదో వెతుక్కుంటున్నవాడిలా రెండు ఫర్లాంగుల దూరం వెళ్ళిపోయాడు. దృఢకాయులు వదిలిపెట్టక వెంబడించి చేరుకున్నారు. చుట్టూ రింగు కట్టారు

"ఏ వూరు రా మనది?" చుట్టపొగను జాక ముఖం మీదికి వదులుతూ ప్రశ్నించాడు ఒక దృఢకాయుడు

భూనభోంతరాలు దద్దరిల్లేలా ఒక శబ్దం

అది జాతకర్ణి పళ్ళు పటపటలాడిన శబ్దం

ఇద్దరు దృఢకాయుల చెవుల్లోనుంచి రక్తం వరదలు వరదలుగా పారింది

బారుబద్దల వంపు దగ్గరి వాళ్ళంటే ఆ గుట్టలకొండ అంతా హడల్. రౌడీయిజం చెలాయించటానికి కారణం అవసరం లేదు అక్కడి దృఢకాయులకు. దారినపోయే గాడిదల రథాలని ఆపి, అందులో ఉన్నవారినందరినీ ఏడిపించి వీలు అయితే అన్నీ ఖాళీ చేసి పంపటం వారికి ఒక వినోదం. అలాటి దృఢకాయుల చెవుల్లో రక్తాలు. మతిపోయింది మిగిలిన ఆరుగురికి.

"ఏరా? పళ్ళు కొరికి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా?" జాతకర్ణి బుగ్గల మీద చిటికె వేస్తూ అడిగాడు మరో దృఢకాయుడు

సలసల మరుగుతున్నది జాతకర్ణి నరాల్లోని నెత్తురు. అయినా పైకి కాం గా ఉన్నాడు. అలా కాం గా వున్నాడంటే ఏదో కారణం వుండే వుంటుందని చేతిలో వున్న బస్కీ దండానికి తెలుసు

"ఏరా మాట్లాడవే?" కుతూహలాన్ని అణుచుకోలేని ఒకడు జాతకర్ణిని రెట్టించాడు

అతని ప్రశ్నకు సమాధానం లబించలేదు. మరోసారి రెట్టించి అడిగేందుకు అతని, అతని సహచరుల రెట్టలు కూడా మిగలలేదు. ఒకే ఒక్క బస్కీ తీసి పైకి లేస్తూ ఎటు విసురుతున్నాడో తెలియకుండా ఆకాశంలోకి ఒకే ఒక పిడిగుద్దు విసిరాడు. అంతే ఆ పిడిగుద్దుతో అందరూ కలుగుల్లోంచి బయటపడుతున్న ఎలకల్లా టప టప రాలిపోయారు.

రెండు క్షణాల్లో సద్దుమణిగింది అక్కడి గందరగోళం.

జాతకర్ణి దూరంగా కనపడుతున్న గుట్టలకొండలోని ఒక కొండ మీద దివిటీల వెలుగులో వెలుగుతున్న ఓ పూటకూళ్ళ ఇల్లును చూస్తున్నాడు

********

అర్థరాత్రి అవుతుండగా నాలుగో గుట్ట దగ్గరకు చేరుకున్నాడు జాతకర్ణి.

ఆ గుట్ట మీద ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి. ఒకే ఒక్క ఇంట్లో దివిటీ వెలుగుతోంది. ఆ ఇంటికి ఉన్న తలుపు ఓరగా తెరిచి వుంది.

తలుపును లోపలికి తోసి చూస్తూండగా - తలుపు పక్కనే అలికిడి అయ్యింది. గిరుక్కున పక్కకి తిరగబోయాడు

'ఎవరదీ!' అంటూ వినిపించింది ఉరుములాటి గంభీరమైన కంఠం

వజ్రాలు తాపడం చేసి సింహం పిడితో పొడుగ్గా కత్తిని పట్టుకొని ముందుకు వస్తున్న వ్యక్తిని చూడగానే శిలావిగ్రహంలా బిగుసుకుపోయాడు జాతకర్ణి

"నాగభైరవా, నీవిక్కడ...." చేతిలోని బస్కీదండం నేలమీద పడిపోతుంటే ఒకే ఒక మాట వచ్చింది జాతకర్ణి నోటినుంచి

మరుక్షణం ఆ కత్తికొసని జాతకర్ణి గుండెల మీద ఆనించాడు ఆ ఆజానుబాహుడు

జాతకర్ణి కళ్ళవెంట ఆనంద భాష్పాలు కారినాయి

"ఎలా, ఇదెలా సాధ్యం" అంటూ కత్తిని కావలించుకున్నాడు

రెండు క్షణాల తర్వాత ఒక మృదుహస్తం అతని చుబుకాన్ని పట్టుకొని పైకి ఎత్తింది

ఆనందభాస్పాలు తుడుచుకుంటూ ఎదురుగా నిలబడ్డ నాగభైరవుణ్ణి కావలించుకున్నాడు

"కథ అంతా చెపుతా కానీ, ముందు కాస్త ఎంగిలిపడు మిత్రమా" అంటూ ఆహారం అందించాడు నాగభైరవుడు

తెలవారవస్తోంది. కత్తిని ముందు పెట్టుకొని తదేక దీక్షతో దాన్నే చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చిన్న గులకరాయి వచ్చి అతనిమీద పడింది

మెల్లగా తల ఎత్తి చూశాడు. ఎవరూ కనపడలా. కత్తిని తీసుకొని ఒరలో పెట్టుకొని, అటు తిరిగి కూర్చున్నాడు

గజ్జెల అలికిడి అయ్యింది. తలతిప్పి చూస్తే తెల్లనిచీర, నుదుట పావలా అంత కుంకం, ముక్కు ధధగలాడిపోయే పుడకతో ఒక అమ్మాయి. కన్ను తిప్పుకోలేకపోయాడు ఒక క్షణం ఆ అందానికి.

"ఏ వూరో ? " సన్నని కోకిల గొంతుతో ప్రశ్న

మనసు సంభాళించుకుని "వేఁకి" అన్నాడు జాతకర్ణి

"వేఁకిలో ఇంత అందగాళ్ళు ఉంటారని నాకు తెలియదు" అంటూ మళ్ళీ గజ్జెల చప్పుడు చేసింది ఆ సుందరి

బయటనుంచి హా అన్న అరుపు. ఆ వెంటనే మెల్లని మూలుగు. వింటి నుంచి వెలువడ్డ బాణంలా జాతకర్ణి తలుపు వైపు పరుగులు తీశాడు

ఇంటిముందు భాగంలో అరుగు మీద పడి వున్నాడు నాగభైరవుడు. ఎర్రటి వాతలతో, గడ్డకట్టిన రక్తంతో, ఛాతీలో దిగిపోయిన చురికతో భయంకరంగా కనిపిస్తోంది అతని శరీరం

"భైరవా" అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు జాతకర్ణి

"ఎవరు, ఎవరు చేశారిది భైరవా, ఎవరు చేశిన పని ఇది, ఏ దుర్మార్గులు చేసిన పని ఇది" అని భైరవుణ్ణి పొదివి పట్టుకొని కుమిలిపోతున్నాడు జాతకర్ణి

"క....క....క...." అని ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఏదో చెప్పాలనుకున్న భైరవుడి శ్వాస కొడిగట్టిన దీపంలా ఆరిపోయింది

"చెప్పు భైరవా, ఆ చెప్పు చెప్పు ఆ చెప్పు ఆ ఆ" అంటు శరీరాన్ని ఊపేస్తూ ఒక్కసారిగా చల్లగా తగిలేప్పటికి స్థాణువైపోయాడు. భైరవుడి కనురెప్పల మీద చెయ్యి వేసి కళ్ళు మూసేసి ఆవెంటనే కళ్ళు చింతనిప్పుల్లా కణకణ మండిపోతూ లేచి చరచరా ఇంట్లోకి దారితీశాడు

ఈ పరిణామాలన్నిటితో బిత్తరపోయిన సుందరిని చెయ్యిపట్టుకొని "మనం ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపోవాలి" అంటూ తలుపు వైపు అడుగులువేశాడు

"పట్టుకోండి, వాళ్ళను పట్టుకోండి" అని అరుస్తూ దూరంగా అరుపులు. ఆ వెంటనే గుర్రాల చప్పుళ్ళు వినపడ్డాయి

"నేను వాళ్ళను ఆపుతాను, నువ్వు పారిపో" అని జాతకర్ణిని హెచ్చరిస్తూ ఆ సుందరి చెయ్యి విదిలించుకొంది

"అంతమందిని ఎదురుకోవటం నాకే తలకు మించిన పని, పద వెళ్దాం" అన్నాడు జాతకర్ణి మళ్ళీ చెయ్యి పట్టుకుంటూ

చటుకున్న గోడకానించి వున్న కత్తిని అందుకుని జాతకర్ణి మెడ మీద పెట్టి  "పిల్లదైనా పులిబిడ్డ పులిబిడ్డే. నా సంగతి నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపో" అని ఒక్క విసురున జాతకర్ణిని పక్కకు తోసింది.


*****

కోటలో శివాలయం దగ్గర పూజలు జరుగుతున్నాయ్. ఆ ప్రాంతమంతా శంభో శంకరా, ఉమాపతే అంటూ మారుమ్రోగిపోతోంది

శివాలయానికి పాతిక ధనువుల దూరంలో ఒక రథం ఆగింది. అందులోనుంచి పులమ కిందకు దిగింది. "ఉమా, త్రిపుర సుందరి ఉమా! అమ్మా! నీ మొగుణ్ణి విడిచి నువ్వైనా ఉండలేవే, నేనెలా ఉంటాననుకున్నావమ్మా. ఎక్కడ ఉన్నాడో, అత్తగారు బెంగ పెట్టుకున్నట్టు కనపడుతోంది. దయ వుంచమ్మా. జాతకర్ణిని తిరిగి రప్పించమ్మా" అంటూ వేడుకుంటూ ఆ పాతిక ధనువుల దూరం దాటేసి గర్భగుళ్లోకి వచ్చేసింది

అక్కడ ఠణ ఠణ గంటల మోతల మధ్య ఒక పెద్ద ముత్తైదువ పాట పాడుతోంది. ఆవిడ నుంచి పులమ అందుకొన్నది

అమ్మా త్రిపూర సుందారీ ఉమా
మాయమ్మ బాలా త్రిపూర సుందారీ ఉమా
త్రిపూరా సుందారి ఉమా
అమ్మా, నీవు గంధామందుమా
బాలా త్రిపూర సుందారీ ఉమా
అమ్మా, నను గాన్నా ఓ మాయమా

అమ్మా దయాతో గాంచుమా
కారూణాతో కోర్కెలు దీర్చుమా
బావాను కోటకు రప్పించుమా
ఓ భక్తాజనాపోషణా మందారమా
త్రిపూర సుందారీ ఉమా

నీవే కుందారదనా
నీవే శరదీందూవదనా
ఓ మందా గజ గమనా
త్రిపూర సుందారీ ఉమా
అమ్మా, నీవు ప్రసాదమందుమా
బాలా త్రిపూరా సుందారీ ఉమా

అమ్మా, నీవు వందనమందుమా
బాలా త్రిపూరా సుందారీ ఉమా  

పాట ఆగిపోయింది, అయిపోయింది. వామహస్తంతో కుంకుమ దక్షిణహస్తంతో పసుపు రెండూ అమ్మ మీదకు పడ్డాయి

నల్లగా కాటుక పులిమినట్లున్న ఆకాశంలో ఊహించని విధంగా ఉరుములు మెరుపులు ఉన్నట్టుండి.

పులమ ఆవేదనకు అమ్మ కరుణించిందా అన్నట్టు, కనుచూపు మేర యాభై యోజనాల పైనే వర్షం మొదలయ్యింది. గుట్టల కొండ మీద కూడా!

ఆ తెల్లచీర సుందరి పక్కకు తోసిన విసురుకు పళ్ళు బిగబట్టి కుంభాల వంటి తొడలను ఆసరా చేసుకుని యాభై గజాలు జారిపోయిన జాతకర్ణి నిలదొక్కుకున్నాడు. చూడటానికి పిపీలకంలా ఉన్నది కానీ ఈ సుందరికి ఇంత బలమా అని ఒక్క క్షణం రిచ్చపడ్డాడు. అప్రయత్నంగా నీ పేరేమిటి అన్న మాట వచ్చింది జాతకర్ణి నోటనుంచి.

నలభై సెకండ్ల తర్వాత అతనికి వినిపించింది ఒక పేరు గుస గుసగా. సాలీళ్లు పాకినట్లు జలదరించింది అతని శరీరం. వేగంలో చిరుత కళ్ళలాంటి కళ్ళున్న తన కళ్ళే కప్పగలిగినంత వేగంతో ఆ చివర నుంచి ఈచివరకు ఒక్క ఉదుటున ఎలా వచ్చిందోనని ఆశ్చర్యపోయాడు.

గుసగుసగా పేరు వినిపిస్తుంటేనే వచ్చేశారు పొడుగాటి చిచ్చుకత్తులు పట్టుకున్న పదిమంది దృఢకాయులు. అమ్మాయి వంక మిర్రి మిర్రిగా చూస్తూన్నాడు వాళ్ళలో ఒకడు.

 అదే అతను చెసిన పొరపాటు. చూపులు కళ్ళను దాటకముందే ముక్కు ముఖానికి అతుక్కునిపోయేలా, ముందు పళ్ళు బఠానీ గింజల్లా కిందకు దొర్లిపోయాడు సుందరి కొట్టిన దెబ్బకు. అదే ఊపులో గుర్రున పక్కౌ తిరిగి అక్కడ నిలబడు ఉన్న మరో ఇద్దరి చేతుల్లో కత్తులు తీసుకుని మెడ నుంచి మోకాలు దాకా దిగిపోయేలా గుచ్చేసి మట్టి కరిపించేసింది. వున్నచోట వుండకుండా ఎగిరెగిరి దూకుతూ కొట్టినచోట కొట్టకుండా అందిన వాళ్ళను అందినట్టే విరగదీసేసింది.

చూస్తూ ఉండగానే నేలను కౌగిలించుకున్నారు అందరు, ఒకడు తప్ప. నాలుగడుగులు వెనక్కి వేసి చేతిక్రింది నుంచి తిప్పి ఛురికతో అతని తలపై మోదింది బలమంతా ఉపయోగించి

ఫట్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది వాడి తల

చుట్టుపక్కల ఉన్న ఇళ్ళతో పాటు, దూరంలో ఉన్న కోట కూడా దద్దరిల్లిపోయేటట్టు గావుకేక పెడుతూ మోకాళ్ళ మీద కూలిపోయాడు వాడు. ఆ మిగిలిన ఒక్కడు. వెనక్కి తిరిగి జాతకర్ణిని చూసి నవ్వింది

"కెంపా" అన్నాడు జాతకర్ణి

*******

(జాతకర్ణి సీను 6)

పేరు వినగానే పట్టించుకోకుండా కనుబొమ్మ ఎగరేసి ముసిముసిగా నవ్వుకుంటూ తలుపు బయటకు కాలు పెట్టింది

ఆగు, ఆగు అంటూ జాతకర్ణి కూడా బయటలు నడిచాడు

దూరంగా ఇంకా గుర్రాల డెక్కల చప్పుళ్ళు వినపడుతున్నాయి, గిట్టల తాకిడికి లేచిన మట్టితో ఆకాశమంతా జేగురు రంగులో కప్పడిపోయింది

పక్కన ఇంట్లోనుంచి ఒక మడివయసు వ్యక్తి గడ్డం నిమురుకుంటూ బయటకు వచ్చి పరీక్షగా చూశాడు జాతకర్ణిని. సన్నగా, పొడుగ్గా, వాలు మీసాలతో, మెడలో రుద్రాక్షలతో ఉన్నాడు. ఒకళ్ళకు తలవంచి అభివాదం చేసే మనస్తత్వం ఆ మనిషిలో కనపడలేదు

"నీకోసం అమ్మాయెందుకు తన ప్రాణం పణంగా పెట్టిందో తెలుసా? తెలుసా నీకు ? " అంటూ కిందకు వాలిన మీసాలను దువ్వుకుంటూ తల ఊపాడు

క్షణకాలం ఆలోచిస్తున్నట్టుగా ఫోజు ఇచ్చాడు జాతకర్ణి. తర్వాత ఆ నడివయసు వ్యక్తి వైపు సాలోచనగా చుశాడు.

"పిండామాలీలు వాళ్ళంతా. మీ మేనమామను కిరాతకంగా చంపేసింది వాళ్ళే. మెరుపుదాడి వాళ్ళ సొంతం. వారికి మానప్రాణాలంటే లక్ష్య లేదు. కంటికి నదురుగా కనిపించే ఆడదానిని వదలరు. మీ మేనమామ భార్యను ఎత్తుకుపోయింది కూడా వాళ్ళే" ఇంకా ఏదో చెప్పబోతున్నాడు

జాతకర్ణి ఆవేశంతో పిడికిళ్ళు బిగించాడు. ఎర్ర కళ్ళతో తీవ్రంగా శ్వాస తీసి వదులుతూ "ఎవడు వాళ్ళ నాయకుడు, ఎవడు?" అని ప్రశ్నించాడు జాతకర్ణి

"నేనేరా, నేనే. వాళ్లందరికీ నాయకుణ్ణి నేనే! ఈ సాతామాళి పేరే వినలేదా నువ్వు. కాకులు కావు కూడా అనవు. ఎవడని అడుగుతున్నావా? ఎవడ్రా నువ్వు, గుట్టకు కొత్తలా ఉన్నావ్" అంటూ ఎదురుగా ఒక బొంగురు గొంతు ఖంగుమంటూ మోగింది

తలతిప్పి వాడి కళ్ళలోకి సూటిగా చూశాడు జాతకర్ణి. వాడు గుర్రం మీద నుంచి దిగి పక్కనే ఉన్న చదునైన రాతి మీద కూర్చున్నాడు. తలపాగా తీసి పక్కన రాతి మీద పెట్టి జుట్టు ఎగరేశాడు.

"నా పేరు చెపితే జాతకాలకే భయంరా! నీ పేరు వింటే కాకులు కావ్ అనవేమో, జాతకర్ణి పేరు వింటే జాగ్వార్లు కూడా జారుకుంటాయ్" అంటూ బొటనవేలు చూపించాడు సాతామాళి తలపాగా వైపు. నిప్పులా మండిపోయింది భగ్గున ఆ తలపాగా ఆ తీక్ష్ణమైన బొటన గాలి విసురుకు

"జాతకర్ణి, జాతకర్ణి, జాతకర్ణి" అంటూ వికటాట్టహాసం చేశాడు వాడు

******

(జాతకర్ణి సీను 7)

మడివయసు వ్యక్తి గుండెలనిండా గాలి పీల్చుకుని "నీ పాపం పండింది సాతామాళీ! నీ పాపం పండే రోజు వచ్చేసింది. అది ఈ రోజే" అంటూ ఇంట్లోకి వెళ్ళిపోబోయాడు

సర్రున ఒక ఛురిక వచ్చి అతని వెన్నులో దిగబడిపోయింది. ఊహించని ఈ పరిణామానికి మెడమీద ఎవరో లాగిపెట్టి గుద్దినట్టు ఉక్కిరి బిక్కిరైపోతూ పడిపోతున్న అతన్ని అప్పుడే ఇంట్లోనుంచి బయటకు వచ్చిన కెంప పొదివి పట్టుకుంది

జాతకర్ణి చేతికందిన బాణాకర్రని పట్టుకొని విసిరాడు సాతామాళి వైపు. వికటాట్టహాసం చేస్తూ ఉన్న వాడి జుట్టు ఇంకా ఎగురుతూనే ఉన్నది. బాణాకర్ర తగలగానే వేళ్ళు తెగిన మహావృక్షంలా మూర్ఛపోయాడు ఆ చదును రాతి మీద.

కెంప ఆ ముసలాయన్ను పట్టుకొని వణికిపోతూ, ఆ శరీరాన్ని ఊపేస్తూ, అరుస్తోంది "పెదనాన్నా, పెదనాన్నా" అని

జాతకర్ణి చటుక్కున ముసలాయన వైపు పరుగెత్తి "ఏం కాదు ఆయనకు, అదిగో ఆ కనపడే భంజావని మొక్క తీసుకుని రా" అంటూ నడుముకు కట్టుకొని ఉన్న తోలుతిత్తి తీశాడు

ఇరవై సెకన్లలో గుప్పెడు ఆకులు తీసుకుని జాతకర్ణి చేతిలో పెట్టింది కెంప. ముసలయాన తల తన ఒళ్ళో పెట్టుకుని "అహర్నిశలు అఖిల జనావళికి సాయం చేసే మీలాటి వారు చనిపోకూడదు పెదనాన్నా, మీకు నేనున్నాను. మిమ్మల్ని ఈ ప్రమాదం నుంచి కాపాడుకుంటాను" అంటోంది. జాతకర్ణి తోలుతిత్తిలోనుంచి పొడి ఒకటి తీసుకుని భంజావని ఆకులను వేళ్ళ మధ్యలో నలిపి ఆ పసరును ఛురిక దిగినచోట ఆరు అడుగుల ఎత్తునుంచి పోశాడు.

పశ్చిమ దిక్కు ఎర్రబడిపోటానికి ఇంకొక్క నిముషం ఉన్నది. ముసలాయన పసరు దెబ్బకు కోలుకున్నట్టే కనపడ్డది. పడిపోయిన సాతామాళి వైపు చూశాడు జాతకర్ణి. అనూహ్యంగా ఎక్కడినుంచి వచ్చారో ఒక నలభై మంది వచ్చేశారు. సాతామాళి చుట్టూ రింగులా నిలబడ్డారు. కెంప, జాతకర్ణి ఒకరినొకరు చూసుకుని రింగును సగానికి చేస్తూ అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు కదిలారు. గుండెల మీద తాయెత్తులో కట్టిన శివలింగం ఊగుతుండగా ఫెటిల్లుమనే ఒక శబ్దంతో జాతకర్ణి తనవైపున్న వారిలో నలుగురి తలకాయలు ఉత్త చేత్తో పచ్చడి పచ్చడిగా ముందు నుంచి వెనకకు తిప్పేసాడు. ఆ పక్కనే గుర్రం మీద ఉన్న ఒక దృఢకాయుడి మెదకు వెళ్ళబోతుంటే ఆ గుర్రం పెద్దగా సకిలించి చివ్వున తల ఎత్తింది.

దాని తలను బిగించి పట్టుకొని శరీరంలో ఉన్న రక్తమంతా ముఖంలోకి వచ్చేస్తుండగా ఒక లంఘు లంఘించి ఆ గుర్రం మీద కూర్చున్నవాడి తోలుపటకా దక్షిణ హస్తంతో పుచ్చుకొని వాణ్ణి, వాడితో సహా ఆ గుర్రాన్ని గిర గిర తిప్పి మిగిలిన వాళ్ళ మీదకు వామ హస్తంతో తొడ కొడుతూ విసిరేశాడు. ఆ విసురుకు అందరూ గావుకేకలు పెడుతూ ప్రాణాలు అరచేత పట్టుకోవాలనుకున్నా పట్టుకోలేక నరకానికి వెళ్ళిపోయారు.

ఒకడు మాత్రం ఆ విసురును, దాని తాకిడిని తప్పించుకున్నాడు. అప్పుడే బాణాకర్ర మూర్ఛ నుంచి తేరుకున్న సాతామాళి "కాపాచీ, చంపెయ్ వాడిని కాపాచి,  వదలొద్దు వాడిని, చంపెయ్" అని కనుబొమలు ముడివేస్తూ అరిచాడు

"పిశాచాలే నా పేరు చెపితే భయపడతాయిరా, ఈ కాపాచి ఏం చెయ్యగలడు నన్ను, వాడి బుర్రలో పాచి కడిగెయ్యకపోతే వాడి గుండు మీద ఒట్టు" అంటూ చిచ్చరపిడుగులా సర్రున ఒర నుంచి కత్తి తీసి విసురుగా తిప్పాడు

కాపాచి ఒక అడుగు వెనుకకు వేశాడు