Monday, April 18, 2016

అనగా అనగా అనగా.....

అనగా అనగా అనగా

అనగా అనగా అనగానే ఒక కథ

అనగా అనగా అనగానే ఒక ఊ కొట్టటం

అనగా అనగా అనగానే ఒక అనుభూతి

అలా ఎన్నిట్నో తనలో ఇముడ్చుకున్నది ఆ చిన్న పదం

ఆ చిన్న పదానికి ఎంతో పెద్ద అనుభవం ఉన్నది

అలా ఈ కథకు కూడా

అనగా అనగా ఎన్నో సంవత్సరాల క్రితం

లయకారకుడు, ఆ పరమేశ్వరుడు కాలంతో ఆడుకుంటున్న కాలం

ఆ కాలం అనే కుర్రది అప్పుడే పుట్టింది

ఆయనే పుట్టించాడు ఆ కాలాన్ని

తన వద్దనున్న బూడిద నుంచి

బుడి బుడి నడకలు నేర్పాడు

నడక వచ్చాక ఇక వదిలేశాడు

కాసంత పెద్దదయ్యింది

ఫరవాలా అనుకున్న తరువాత అమ్మాయిని పరుగెత్తమన్నాడు

అప్పటినుంచి పరుగులు మొదలుపెట్టింది

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు, పరుగే జీవితంగా జీవిచటం మొదలుపెట్టింది

అనంత విశ్వమంతా తనకు పచ్చికబీడుగా పరుగులుపెడుతోంది

కానీ దేనికైనా సామర్థ్యం కావాలిగా?

ఊపిరితిత్తులు తట్టుకోవాలి, పిక్కలకు బలం రావాలి, ఇలా ఎన్నో ఉంటవి

చిన్న వయసులో పర్వతాలు ఎత్తమంటే, ఆయమ్మ కిష్టప్ప కాకపోయింది

సరే, అలా పరుగులు పెడుతుంటే ఒక రోజు ఆయాసం వచ్చింది పిల్లదానికి

ఆ కాలానికి, ఆ పిల్లకాలానికి

చెమట్లు ధారాళంగా కారిపోతున్నాయ్

సొమ్మసిల్లిపోతోంది, మూర్ఛ వచ్చేస్తోంది

నాయనా తండ్రీ అని పలవరిస్తుంటే వచ్చేసాడాయన

ఏం చిన్నమ్మా ఏమయ్యింది అన్నాడు ఆ పరమాత్ముడు

నాయనా పరిగెత్తడం నావల్ల కావట్లా, ఇహ అయిపోయింది నా పని అని ఆ అమ్మాయ్ నీరసంగా విన్నవించుకొన్నది

ఓస్ ఇంతేనా, మహాదేవుడి బిడ్డవు, ఈ కాసింత దానికి అట్లా అలసిపోతే ఎట్లా ? సరే నీకొక బంతి ఇస్తా ఆడుకుంటూ అలసట మర్చిపోదువు గాని అని ఒక బంతి ఇచ్చినాడు

బంతి చూడగానే పిల్లదానికి కాసంత హుషారు వచ్చింది

ఆ హుషారు చూచి, ఇక ఫరవాలేదులేనని ఆయన పనిలో ఆయన పడిపోతూ ఒక సావధానపు మాట చెప్పినాడు

అమ్మాయ్, ఆ బంతి కింద పడకుండా చూచుకోనని

హుషారు ఉన్నప్పుడు అందరూ తలలు ఊపేసినట్టే, ఆయమ్మ కూడ తల ఊపింది

కానీ ఎందుకు తల ఊగిందో గుర్తులేదు

ఆటపాటల్లో పడిపోయింది

అనంత విశ్వంలోకి విసురుతోంది

పరుగులెత్తి పట్టుకుంటోంది

విసురులు పరుగులు

విసురులు పరుగులు

అలా కొద్దిరోజులు బానే ఉన్నది

ఎంత సేపని విసరటం పట్టుకోటం? అదీ బోరేగా

ఈసారి పైకి విసిరి పట్టుకోకపోతే ఏమిటవుతుంది చూద్దామని విసిరేసి అక్కడే నిలబడిపోయింది

ఆ బంతి దిగిపోతోంది

కిందకు దిగిపోతోంది

చేతిలో పడకుండా కిందకు దిగిపోయింది

పడిపోతూనే ఉన్నది

అలా అలా పడిపోయి పడిపోయి దేనికో కొట్టుకున్నది

అంతే! ఫెటిల్లుమని ఒక శబ్దం

దాని వెంబడే పెద్ద కాంతి

కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతి

ఆ కాంతికి, ఆ శబ్దానికి గుండెలవిసిపోయినాయి ఆ పిల్లకు

కళ్లు మూసుకుని నాయనా అంటూ పరిగెత్తుకొని పోయి పెద్దాయన వొడిలోకి చేరిపోయింది

ఆ బంతిని కింద పడెయ్యొద్దు అని చెప్పానా అని నిమ్మళంగా అంటూ తల మీద చెయ్యి వేసి నిమిరినాడు పరమాత్ముడు

భయం లేదన్నాడు, ఊరట కలిగించాడు

అయినా ఇంకా ఆయన్ను కరుచుకునే ఉన్నది ఆయమ్మ

కళ్ళు మూసేసుకునే ఉన్నదని గమనించి, అమ్మాయ్ కళ్ళు తెరువు అన్నాడు

కళ్ళు తెరిచింది అమ్మాయి

అంతా నీలం, పసుపు, ఆకుపచ్చ, నవరత్నాల రంగులు, కంటికి తెలియనన్ని రంగులు కనపడ్డవి

ఒక్కసారిగా ఆమ్స్టర్డాములోని టూలిప్స్ తోటలోకి వెళ్ళినట్టుగా అనిపించిందనుకుంటా ఆ అమ్మాయికి, కళ్ళన్నీ విప్పార్చుకుపోయినాయి

అయితే పుష్పాలకు పట్టే కీటకాల్లా ఆ రంగుల మధ్యమధ్యలో నల్లని మరకలు

అయ్యా, ఆ నల్లనివేమి అన్నది ఆయనను చూస్తూ

వాటిలో కొన్ని కృష్ణబిలాలు, కొన్ని పాలపుంతలు, కొన్ని గ్రహాలు, కొన్ని నక్షత్రాలు అమ్మా అన్నాడు పరమాత్ముడు

ఇవన్నీ ఎక్కడినుంచొచ్చాయి అన్నది అమ్మాయి

మరి నేను పని చేసుకుంటున్నానుగా అక్కడినుంచొచ్చాయ్ అన్నాడాయన

ముక్కలు ముక్కలుగా ఉన్నాయే అవన్నీ మరి అన్నది అమ్మాయ్

నేనేమో చక్కగా వేటికి వాటికి ఒక ఇల్లు ఏర్పాటు చేసి పెడుతుంటే నువ్వేమో బంతి వదిలేస్తివి, అది వచ్చి అక్కడ నేను చెక్కుతున్న ఉలి మీద పడి బద్దలయ్యింది, దాంతో అవన్నీ ముక్కలు ముక్కలు అయిపోయినాయ్, పోనీలే నేననుకున్నంత అందంగా కాకపోయినా ఇలాక్కూడా బానే ఉన్నాయిలే అన్నాడాయన

మరి అంత శబ్దం వచ్చింది ఏమిటి అనడిగింది కుమారి

దాన్నే మహావిస్ఫోటం అంటారు అన్నాడు శంకరుడు

అంటే బిగ్ బాంగా అని అడిగింది కాలం

అవును భవిష్యత్తులో అలానే పిలుస్తారు దాన్ని అన్నాడాయన చిరునవ్వుతో

అసలు నువ్వు ఇవన్నీ దేనితో తయారు చేశావు అని అడిగింది అమ్మాయ్

అణువులు, పరమాణువులతో తయారు చేసాను కానీ, ఇప్పుడు నాకో పని చేసి పెడతావా అన్నాడు మహాదేవుడు

పని మాట వినపడగానే అందాక మర్చిపోయిన బంతి జ్ఞాపకానికి వచ్చి నాకు ఇంకో బంతి ఇవ్వు ఆడుకోటానికి అని గారం చేసింది

బంతి ఇస్తాను, కానీ ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన పని ఏమిటంటే ముక్కలు ముక్కలుగా పడిపోయిన ఆ బంతి ముక్కలను ఏరుకుంటూ ఎంత ఫాష్టుగా నా దగ్గరికి తెచ్చేస్తావో అంత ఫాష్టుగా నీకు ఇంకో బంతి చేసిస్తాను అన్నాడు పరమాత్ముడు

మరి అంత ఫాష్టుగా నే పరిగెత్తలేను ఆయాసం వస్తుందికదా అన్నది చిన్నది

సరే, నీకు ఎప్పటికీ అలసట, ఆయాసం లేకుండా నే వరం ఇస్తాను పో అని భుజమ్మీద చెయ్యేసి పంపించేశాడు

అంతె ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ కాలం అలా బంతి ముక్కలు ఏరుకుంటూ పరిగెత్తుతూనే ఉన్నది

ఇంకో బంతి తయారీ కోసం, ఇంకో బంతితో ఆడుకోటం కోసం

ఎప్పటికి ఆ పగిలిన బంతి ముక్కలు అన్నీ దొరుకుతాయో ఆ అమ్మాయికి కూడా తెలియదు

అందాకా మనం అట్లా చూస్తూ ఉండటమే

-- ఓం తత్ సత్

-- ఎనిమిది తొమ్మిదేళ్ళ క్రితం బిగ్ బాంగు గురించి ఒకానొక సాయంత్రం మిత్రులతో డిస్కషను వేసుకున్నాక, మా అమ్మాయి కాస్త పెద్దదయ్యాక చెపుదామని రాసుకున్న కథ. ఆ తర్వాత గుర్తుకే లేదు. ఇప్పుడైనా చెప్పాలి....