Thursday, December 17, 2015

వెల్చేరు నారాయణరావుగారు - డొల్ల - గప్పాలు - చెంపపెట్టు - మొట్టిమెట్టు!

"పి.హెచ్.డి గ్రంథాలన్నీ డొల్లగా ఉన్నాయ్"

అన్నదెవరు ?
వెల్చేరు నారాయణరావు గారు.
రిపోర్టు చేసిందెవరు ?
ఆంధ్రజ్యోతి.

ఆంధ్రజ్యోతి వారి కాప్షనేమిటి ?
ఫాక్సు న్యూసు నుండి కాపీ కొట్టిన "వి రిపోర్ట్, యు డిసైడ్" అని.
మరి వారు రిపోర్టు చేసారు.
ఇక మనం డిసైడు చెయ్యాలె.

రిపోర్టు చేసినవారు పూర్తిగా రిపోర్టు చేసినారా అంటే లేదు.
ఈ రిపోర్టుగా రాసినదానిలో అక్కడో ముక్క ఇక్కడో ముక్క అన్నట్టు చెల్లాచెదురుగా నూకలున్నాయ్.
అందువల్ల డిసైడు చెయ్యటం కొద్దిగా కష్టం.
ఆ ప్రసంగ పూర్తిపాఠం ఉంటే కానీ అసలు సంగతి తెలియదు.
కానీ మన ప్రాప్తం ఇప్పటికింతే కాబట్టి, ఉన్నదాన్నే డిసైడు చేస్తే సరిపోతుందేమో!

పోతే కాస్త తీరిక ఉన్నది కాబట్టి, ఉన్నదాంతోనే సంతృప్తి పడే మనుషులం కాబట్టి, ఉన్నదాన్ని పుచ్చుకొని డిసైడు చెయ్యవచ్చునేమోనన్న ప్రయత్నం.

<<గొప్పదని గప్పాలు కొట్టుకోవటంతో ఫలితం లేదు.>>

బాగుంది మాంఛి స్టేటుమెంటని డిసైడు చేస్తిమి.

<<ఎందుకు గొప్పదో పరిశోధన చేసి నిరూపించాలి......నేటి పి.హెచ్.డి గ్రంథాలన్నీ డొల్లగా ఉన్నాయి....ఏ భాష ఎందుకు నేర్చుకోవాలో, నేర్చుకోకపోతే విజ్ఞానానికి జరిగే నష్టమేమిటో పరిశోధన సిద్ధాంత గ్రంథాల ద్వారా చెప్పగలగాలి>>>>

ఇది వినటానికి మరింత భేషుగ్గా ఉన్నదని డిసైడు చేసేసినా, ఇక్కడ నాకు తలెత్తిన ఒకట్రెండు కొచ్చెన్లేమంటే

 • - ఎందుకు గొప్పదోనని పరిశోధన చేయటమెట్లా అన్నదాని మీద పి.హెచ్.డి గ్రంథమో, గైడులైనో ఏమన్నా ఉన్నదా?
 • - గొప్పదని చెప్పడానికున్న కొలమానమేమిటి ?
 • - ఆ కొలమానం విద్యార్థులందరికీ అందుబాటులో ఉన్నదా?
 • - అలా నిరూపించిన పి.హెచ్.డి పరిశోధనలు "తెలుగులో" ఎక్కడైనా ఉన్నవా?
 • - తెలుగులో లేవు కానీ వేరే భాషల్లో ఉన్నవని సమాధానమైతే, వాటిని కాపీ కొట్టి మన భాష గొప్పదని ప్రూవ్ చేయటమెందుకు?
 • - పోనీ ఉన్నవే అనుకుందాం, ఉంటే ఇంతవరకు ఎవరైనా వాటిని చూచినారా?
 • - చూచి ఉంటే వాని మీద జరిగిన చర్చలు ఏవన్నా ఉన్నవా?
 • - ఉన్నవనే అనుకుంటే ఆ పరిశోధనలు, కొలమానాలు ఒక బాట గీసి తరువాతి వారికి ఆదర్శంగా ఎందుకు నిలవలేకపోయినయ్?
 • - లేవనుకుంటే ఒక పర్యవేక్షణాచార్యుడిగా ఎవరైనా, వెనారా గారితో సహా ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టినారా?
 • - సాహిత్యాన్ని పక్కనబెడితే భాష గొప్పదని నిరూపించటమెట్లా ? (భాష యొక్క గమనం, భాషా ప్రక్రియ, భాషా యుగం, భాషా దృక్పథం, భాష మీద ఒక నూతన ప్రసంగం, వాదం, సిద్ధాంతం - వీటన్నిటి మీద బోలెడు వచ్చినాయి, వస్తున్నాయి. ఆ వాదాలు కాక, ఇంకే వాదాలు లేవదియ్యాలో, ఆ దారి కాక ఇంకే దారి పట్టాలోనన్నది వివరించి ఉంటే బాగుండేది. ఆన్! అన్నీ మేమే చెబుతే ఇంక పరిశోధనెందుకు అంటే తూర్పు తిరిగి దణ్ణం పెట్టవలసిందే) 

నా మటుకు నాకు ఆ మధ్యలో ఆ.జ్యో వారు రిపోర్టు చేసిన వెనారాగారి "డొల్ల" స్టేటుమెంటే పూర్తి డొల్లగా ఉన్నదని చెప్పటానికి కాస్త సంకోచం ఉన్నది కానీ, పూర్తి రిపోర్టు లేదు కాబట్టి  ప్రశ్నలున్నాయ్!

 • డొల్లగా ఉన్నాయని ఎవరైనా పరిశోధన చేసి నిరూపించినారా?
 • ఆ పరిశోధన, సిద్ధాంతం, ప్రూఫు లేకుండా అది ఉత్త నోటిమాటేనా?
 • అదీ ఇదీ కాక విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఆచార్యవర్యుల జనరలు ఫీలింగా!
 • ఒక వేళ అలా ఉంటే ఆ ఆచార్యవర్యులు తమ వద్దకు వచ్చిన విద్యార్థులకు డొల్ల వైపు కాకుండా ఇతరంగా దిశానిర్దేశం ఎందుకు చేయలేకపోతున్నారు?
 • దిశానిర్దేశం చేసినా విద్యార్థులు ఆ దిశవైపు వెళ్ళి ఇంకో దిశగా బయటకొస్తున్నారా? 
 • ఈ సంగతి ఇంతకు ముందే తెలిసి ఉంటే ఆ దిశగా ఎందుకు సిద్ధాంతీకరించలేకపోయినారు ? మనకు ఆ గ్రంథాలు ఎందుకు అందించలేకపోయినారు ?
 • ఇంతకు ముందు లేనిది ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎట్లా వస్తుంది ?
 • ఒకవేళ అందించి ఉంటే మన భాష గొప్పదని ఆల్రెడీ ప్రూవు చేసినారు కనక ఇంకొకసారి చెయ్యవలసిన పని లేదు కదా?
 • ప్రూవు చెయ్యాలనుకున్నా ఇది అదేనని, ఉన్నదాన్నే తిరగేసి మరగేసి మళ్ళీ అదేగా చెప్పినారని ప్రపంచం అనుకోదా? 
 • పోనీ డొల్ల నిరూపణ ఉన్నదనే అనుకుందాం! - చాలా సంతోషం. కాస్త ఆ లంకె ఎవరన్నా ఇస్తే వారికి పాదాభివందనాలు.
 • అలా లేకపోతే, వెనారా గారి ఆ స్టేటుమెంటు ఆ పైనన్న "గప్పాల" మాట కన్నా ఏ విధంగా వేరోనన్నది తెలియవలసి ఉన్నది. ఆ సంగతి పూర్తి ఉపన్యాసం చదివితే కానీ తెలవదు....పైగా కీలకోపన్యాసం అనినారు ఆ రిపోర్టరు వారు...మరి ఆ శిక్షణ శిబిరం వారు ఆ పూర్తి పాఠం అందిస్తే బాగుండును
 • కొల్లలు, కోకొల్లలు, కోకోకోకొల్లలు గా బయటకొస్తున్న పరిశోధక విద్యార్థులను, భావి డాక్టర్లను డిప్రెషనులోకి నెట్టేస్తే ఎట్లాగండీ ? ఉన్నది ఊడి, ఉంచుకున్నదీ ఊడి, లేనిదీ ఊడి - ఇంకేదో అవ్వదూ ?

ఆ సభలో ఉన్న ఇతర ఆచార్యవర్యులు ఎట్లా తీసుకున్నారో కానీ, ఇది మటుకు ఓలుమొత్తంగా
 • - విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి పర్యవేక్షణాచార్యుల పర్యవేక్షణకు, ప్రతిభకు, పాటవాలకు చెంపపెట్టు
 • - విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి పరిశోధనావిద్యార్థులకు మొట్టిమెట్టు

ఉద్దేశం అదే అయితే ఇక వారూ వారూ చూచుకొనవలసిందే!

ఇక చివరిగా

<<తెలుగువాళ్ళు తెలుగు భాషను మరచిపోయి...పరభాషల వాళ్ళు మనకు తెలుగు గురించి చెప్పే దుస్థితి...>>

తెలుగువాళ్ళు తెలుగుభాషను మరచిపోవటమంటే ఏమిటో నాకర్థం కాలా! ఆ సిద్ధాంత గ్రంథాలు తెలుగులోనే కదా ఉంటవి. మామూలుగా సామాన్యులకు తెలిసిన తెలుగూ కాక, పండితులకూ తెలిసిన తెలుగూ కాక, నాగబు  దగ్గరినుంచి మారుతూనే వస్తున్న అసలు తెలుగే కాక ఇంకేదైనా భాష తెలుగు రూపం సంతరించుకొని, ఇంకో రకమైన తెలుగుగా వాడబడుతోందా?   అంతా గందరగోళంగా ఉన్నది. కాస్త వివరిస్తే బాగుండు.

ఇక పరభాషల వారు మనకు తెలుగు గురించి చెప్పే దుస్థితి భయం మటుకు, భయంకరంగా ఇబ్బడి ముబ్బడిగా పెంచి పోషిస్తున్నారు. ఆ భయంకరమైన నిజంతో మటుకు ఏకీభావం ఉన్నది. ఆ పెంపూ పోషణా మటుకు నిజమేమోనన్న అనుమానం కలుగుతోంది.

అమెరికనువారు, జర్మనీవారు, పాలస్తీనా వారు, ఇజ్రాయెలువారు ఇంకా నానావివిధ పరిమళపత్ర దేశాలవారు మన తెలుగునేల మీద పడిగాపులు పడుతున్న తెలుగు పరిశోధనా విద్యార్థులను మించి తెలుగు మీద ఎడమ చేత్తో ఇరవై, కుడి చేత్తో నలభై రాసవతల పారేసి చలామణీ అయిపోతుంటే అదే కొద్దికాలానికి అసలు తెలుగైపోతుందేమో! ఏమో! 

సరేనండి ఈ నా శోష అంతా మీకు ఎందుకు గానీ, ఇంకో రెండు ముక్కలు రాసి శలవు తీసుకోవాలనుకుంటున్నాను మీరు దయతో అనుమతిస్తే  .....

మాటవరసకు అనుకుందామని - ఊరకే మాటలు మాట్లాడి అగ్గి రాజెయ్యటం, డోనాల్డు ట్రంపుకు అలవాటని ఇక్కడి వారి అనుకోలు.

మరి....ఆ శిక్షణ శిబిరం దారి కూడా అదే దారా? మిగిలిన అన్ని శిబిరాల్లాగే, సభల్లాగే, తీర్మానాల్లాగే! ఏమో ఆ భగవంతుడికే తెలియాల !

సరేలే....అనవసరంగా అదంతా ఎందుకు కానీ....

ఏదైతేనేం - బాగుపట్టం కావాలె. ఎట్లాగైతేనేమి ? 

ఈ పోష్టులో ఎగతాళీ లేదు, అవమాన అనుమానాలు ఏమీ లేవు... ఎవురైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియచేసుకుంటూ .....

ఓం తత్ సత్ చెప్పేస్తే అయిపోయె!

డొల్లమాతా అభివందనం!
ఆంధ్రజ్యోతి మాత అభివందనం.