Friday, November 6, 2015

ఏలినాటి సినిమా శని యాభైనాలుగేళ్ళ శనిగా మారింది!

సోషలు మీడియా నుంచి రిటైరైపోయినాక, ప్రశాంతమైన జీవితం గడుపుతూ సినిమా సముద్రపు వొడ్డున కూర్చొని, వచ్చి తాకే అలలతాకిళ్ళ స్మృతులు అలా అలా ఆస్వాదిస్తూ గడిపేస్తున్నాం! జీవితం ఎంత బాగుందో! రిటైరుమెంటు ఇంత బాగుంటుందని తెలిస్తే ఎప్పుడో రిటైరు అయిపోయేవాణ్ణి.

సరే - క్రితం వారం  చూచిన సినిమాల జాబితా! నక్షత్ర క్రమం కూడా ఆ పక్కనే!

బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ - పది నక్షత్రాల కొలబద్ద మీద 30 నక్షత్రాలు ఇచ్చేశాం. టాం హాంక్స్, మార్క్ రైలాన్స్ లకు చెరో పది నక్షత్రాలు. సినిమా మొత్తానికి ఇంకో పది. అలా ముప్ఫై. యుద్ధం , ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం, మనుషులు, యాక్టర్లు, యాక్షను, కథ, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగు, సినిమాటోగ్రఫీ - ఇలాటివి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూస్తే సరిపోతుంది

ద లాస్ట్ విచ్ హంటర్ - పది నక్షత్రాల కొలబద్ద మీద ఆరున్నర నక్షత్రాలిచ్చేశాం. విన్ డీజిల్ విభిన్నంగా కనపడటం ఇదే మొదలు. దానికి మూడు నచ్చత్రాలు, మిగిలిన మూడున్నర మ్యూజిక్కుకు, సాఫ్ట్వేరుకు ఇచ్చివేస్తిమి. పనీ పాట లేని రిటైరీలు వెళ్ళి పాప్ కార్ను నోట్లో వేసుకుంటూ చూస్తే సమయం బ్రహ్మాండంగా గడిచిపోతుంది.

క్రిమ్సన్ పీక్ - పది నక్షత్రాల కొలబద్ద మీద నాలుగుంపావు నచ్చత్రాలు ఇచ్చేసాం.  అటూ ఇటూ కానీ సినిమా. అటు దరిద్రానికి దగ్గర, ఇటు నికృష్టానికి దూరంగా ఉండటంతో వోలు మొత్తంగా నాలుగుంపావు ఇవ్వొచ్చు.

గూస్ బంప్స్ - పది నక్షత్రాల కొలబద్ద మీద ఐదుంపావు నచ్చత్రాలు ఇచ్చేసాం. పోతే జాకు బ్లాకు నిజంగా సినిమా స్క్రీను నుంచి రిటైరైపోటం మంచిది. ఎనకమాల నిలబడి పాండాలకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే అందరికీ మంచిది.

స్పెక్టర్ - పది నక్షత్రాల కొలబద్ద మీద ఐదు నచ్చత్రాలు ఇచ్చేసాం. ఈ సినిమాకు ఐదు ఇవ్వటానికి కూడా మనసు రాలా కానీ, మెక్సికో సిటీలో ఉల్టా పల్టా హెలికాప్టరు ఫైటు, బాండు బ్రాండు మూలాన ఇవ్వవలసి వచ్చింది. ఏ కర్మవశానో డానియెల్ క్రెయిగ్ బాండు కింద మారటం ప్రేక్షకుల నెత్తిమీద శనిదేవతలా కూర్చోటం రెండూ ఒకేసారి జరిగినాయి. పైగా డానియెల్ వారు ప్రొడ్యూసరులలో ఒకడవ్వటంతో ఏలినాటి శని యాభైనాలుగేళ్ళ శనిగా మారింది. ఏమిటి చెయ్యటం? బాండ్లంటే చురుగ్గా, ఉల్లాసంగా ప్రేక్షకులని బాండు చేసుకునేవారు. ఈ చెత్త సినిమా అంతా తన్నో మంద:ప్రచోదయాత్ లా చీకట్లో గడిచింది.ప్రొడ్యూసరా! నోరెళ్ళబడినదా స్వామీ? పూర్తిగా చదివారన్నమాట పోష్టు అయితే - సంతోషమండి, చాలా సంతోషం. సరే కానీ, సినిమా దోమలు దూరతాయేమో, కాస్త ఆ విచ్చుకున్న పెదాలు మూసేసి , మీరు ఆ సినిమాకెళదామని డిసైడు అయిపోతే మటుకు సినిమా మొదట్లో వచ్చే క్రెడిట్సు జాగ్రత్తగా సూడండి. ఆతర్వాత ఇక్కడికొచ్చి మాటాడుదురుగాని...

క్రిస్టాఫ్ వాల్జు విలనుగా, అసలు యాక్టరుగా పరమ చెత్తగా యాక్షను చేసింది ఇందులోనేనన్నది చారిత్రక సత్యం. సినిమా చారిత్రక సత్యపు పుటల్లో ప్రేక్షకుల రక్తంతో రాయాల్సిన ఘట్టం...అలా జరిగిందన్న మాట...సరే కానీ, ఈ మూడో తరగతి, నాలుగో తరగతి, ఐదో తరగతి దేశాలు అనగా ఇండియా, మెక్సికో వగైరా చూపిచ్చేప్పుడు, కళ్ళు బైర్లు కమ్మేట్టు పసుప్పచ్చ, తేలిపోయిన పసుప్పచ్చ, ముదురు గోధుమ, ముదురాకుపచ్చ - ఇలాటివి వాడి విస్తరాకులు విసురుతారెందుకు స్వామీ ? అదొకటి, ఇంకొకటేమో యాభయ్యో తరగతి దేశాలైన ఆఫ్రికా దేశాల్లోకెళ్ళగానే వీరోయిను తెల్ల పాంటు తెల్ల చొక్కా వేసుకుని దర్శనమితి దర్శనం. ఏమిటో, ఎందుకో మీకేవన్నా తెలుసా? ఈ సినిమా కూడా  అందుకు అతీతం కాదు నాయనా, కాదు. మెక్సికో సిటీ అంతా పాలిపోయిన పసుప్పచ్చలో మునిగి తేలింది. ప్చ్చ్!

ఓం తత్ సత్ అండి...ఓం తత్ సత్! అంతే! పూర్తి రివ్యూలు తర్వాత...No comments:

Post a Comment