Friday, November 6, 2015

గొర్తి బ్రహ్మానందం నవల - బాబోయ్ కాల్చేసిందండి!

ఒహ రెండు వారాల కితం గావాలు, సిలికాన్ ఆంధ్ర వారి ఆంధ్ర కల్చరల్ ఫెస్టివల్ ఈవెంటుకు వెళ్ళినప్పుడు సాయంత్రం అయిదింటికొచ్చి కలుస్తానన్న మిత్రులు గొర్తి బ్రహ్మానందం గారు, ఆ ఈవెంటులో రుచికి ఎటువైపుందో తెలీని, అటు ఇటూ కానీ సాపాడు రెండు మెతుకులుగా కడుపుకు పట్టించినాక దర్బారులో ఆవులిస్తూ ఉండగా, అయిదు కాస్తా ఎనిమిదయ్యి - యాడున్నారు సామీ అంటూ టెక్స్టు చెయ్యటంతో మీరేడున్నారు సామీ అంటూ బయటకొచ్చి చూస్తే టడ టట్టడా టట్టడాం అంటూ భుజాన సంచొకటేసి నిలబడుకొని ఉన్నారక్కడ.

 సరే ఏడెనిమిదేళ్ళ తర్వాత కలవటం వల్ల కావిలింతలు, మందహాసాలు, వికటాట్టహాసాలు, చిక్కిపోయారే మారిపోయారే వగైరా ఉభయకుశలోపరులు అయిపోగొట్టి, జనాల మీద ఉస్కు కబుర్లు చెప్పుకొని కాస్త ఒహ అరగంటయ్యాక మళ్ళీ దర్బారులోకి దారి తీసాం. అక్కడ ప్రోగ్రాములు సివారాఖరికొచ్చినాయ్. బ్రహ్మానందం గారు అల్లప్పుడెప్పుడో రాసిన ఒహానొక నాటకం, విరాటపర్వం నాటకం రూపంలోకి మార్చి కొండిపర్తి దిలీపు ప్రధానపాత్రధారిగా వేసెయ్యటానికి సిద్ధమైపోవటం, అలిసిపోయిన అమ్మాయికి నిద్దరొచ్చెయ్యటం, ఇంటికి పోటానికి ఒక మూడు గంటల డ్రైవు ఉండటమ్మూలానూ తట్టా బుట్టా సద్ది బయటపడదామని నిశ్చయిస్తిని. ఇంతలో ఆయన ఒక పుస్తకం తీసి చదువుకుంటారని ఇవ్వటం అనటంతో జాగ్రత్తగా చేపట్టి ఆయనకు వీడ్కోలు పలికి బయల్దేరితిమి.

తీరా చూస్తే ఆయనిచ్చిన పుస్తకం ఆయన రాసిందే! :P

టైటిలు "అంతర్జ్వలన".

రక్తాకుపచ్చవర్ణంలో భీకరంగా ఉన్నది. దసరాలు మొన్నే అయినాయిగా అందువల్ల అలా వేసుంటారులే అనుకొని సర్దుకొని పేజీ తిప్పితిని. అక్కడ ఆ పేజీలో ఆయన ఫోటో వేసుకొంటిరి, దానికిందే ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఇ.వి.వి సత్యనారాయణ వేసిన టైటిళ్ళకు సమానాంగా  ఆనేల, ఆ నీరు, ఈ గాలి కింద రాస్తిరి. బాగుంది. అక్కడ +5 పాయింట్లు కొట్టినారు. ఆ తర్వాతి పేజీలో ఇంగ్లీషులో అచ్చు వేసిన వివరాలు చూసి సంతోషపడ్డాను. కవరు ఫోటోలు వారివేనని తెలిసి మరింత సంతోషం వేసింది. అక్కడ ఇంకో +5 పాయింట్లు కొట్టినారు. ఫోటోలు బాగున్నా, కవరు డిజైనుకు మటుకు -10 పాయింట్లు తగ్గిస్తిని. అందువల్ల రెడ్డొచ్చె లా సున్నా దగ్గరికొచ్చింది పాయింట్ల పట్టిక.

అయితే ఆశ్చర్యం కలిగించిన విషయమేమనగా అచ్చు వేసీ వెయ్యగానే అమెరికా వాళ్ళకు పాతిక డాలర్లు అని పుస్తకాల రేటు కొండమీద కోతికి అందని కొబ్బరి చిప్పలా పెట్టే ఇతర రచయితల పుస్తకాల్లా కాకుండా చక్కగా అందుబాటులో 4 డాలర్ల 95 సెంట్లు పెట్టారు. ఆ రేటు చూసి, ఆయన విజ్ఞత చూసి అమాంతం +25 పాయింట్లు ఇస్తిని. దాంతో పాటు వీరతాళ్ళు, చప్పట్లు, అభినందనలు కూడా అందచెయ్యాలని నిశ్చయించుకొంటిని. మిగిలిన రచయితలు కూడా ఈయన మార్గం పడితే చాలా బాగుంటుందని స్వాభిప్రాయం. ఈ సారి కలిసినప్పుడు ఆయనకు నేనున్న ఐదు డాలర్ల బాకీ తీర్చివెయ్యవలె.

సరే అదలా పక్కనబెడితే, ఆ తర్వాతి పేజీలో ముందుమాటకు వస్తిని. అక్కడ అపర తొల్లింటికతామందారమకరందులు, రూపకరస సరస్వతీ పుత్రులు, ఆంధ్రనిర్వాస ఐతిహాసికకథారాజ బ్రహ్మ, పరదేశ పరబ్రహ్మాత్మిక ప్రవాససీమకథకతిలకరత్న, మానుషసంప్రహాసకథాచక్రవర్తి అయిన శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారు  రాసిన మాటలు చూసిన్నూ, ఆ తర్వాత అక్షరతిలకతేజోవిలాసచంద్రుడు, నభోదుహప్రతిమాకవితా చక్రవర్తి, కవ్యవాలస్పర్శనేంద్రరచనారాజరాజు అయినా చంద్ర కన్నెగంటి "ఆత్మీయంగా" అంటూ రాసిన మాటలు చదివిన వెనుక ఇక నవల చదవనక్కరలేదనుకుంటిని. అయినా బ్రహ్మానందం గారు నాతో అన్న మాట గ్యాపకం వచ్చి మొత్తం పూర్తి చేస్తిని.

"ఒక్కసారి స్పృహలోకి వచ్చాను - నిశ్సబ్దం - లేద్దామని ప్రయత్నించాను - కాళ్ళూ చేతులు లేవలేదు - తలతిప్పుదామని ప్రయత్నించాను, కుదర్లేదు - ఏమయ్యింది నాకు ?" అంటూ మొదలై పాఠకుడి ఊపిరి భారం చేస్తో మొదలైన నవల, ఆ ఏమయ్యింది పాత్రధారి కోమాలోకి మనలని తీసుకుపోయి  అక్షరాల భావాల వట్రసుడిలో మనలను గిరగిరా తిప్పుతూ మధ్య మధ్యలో భారమూ, కొండొకచో అతిభారమూ అయినా డైలాగులతో ఆనందాతిరేకహర్షోల్లాసాలకు గురిచేసి చివరకు "నేనెవరో నీకు తెలియదా?...." అంటూ మంచులో కలిపేసాక కలిగిన చలిని అంతర్జ్వలనలోని జ్వాలలు వేడి వేడిగా స్పృశిస్తాయి. అలా 160 పేజీల దీర్ఘ, సుదీర్ఘ నవలా ప్రయాణంలో ఆయా పాత్రల సస్పెన్సు, థ్రిల్లింగు, చిల్లింగు, విల్లింగు అంతా కలిపి ఆయనకు ఇంకో  50 పాయింట్లు అందచేసినాయ్.

అయితే కుటుంబాలకు దూరంగా ఇక్కడ జీవితం తగలేస్తూ పైపూతగా మేకపోతు గాంభీర్యంతో లాక్కొస్తున్న నాలాటి బడుగు జీవులకు అనవసరంగా డిప్రెషను డబల్ డోసులో అందిస్తూ కొన్ని కొన్ని సార్లు నడవటం చాలా ఆనందదాయకం. ఆ ఆనందం ఒకటి, కాస్త తక్కువ డోసులో ఉంటే బాగుండేది. అప్పుడు నవలే ఉండేది కాదేమోనన్న అనుమానం పొడసూపింది! ఆ డిప్రెషనులో ఎవరైనా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఈ నవలే కారణమని చండప్రచండంగా చెలరేగే అవకాశం ఉన్నదున ఇలాటి నవలలు రాసి ఒక డిస్క్లెయిమరు కూడా జత చేస్తే బాగుంటుందని అనుకోలు. అయినా కథనం పట్టుగా ఉడుం పట్టుగా సాగటం ముదావహం. 

ఇక ఈ పోష్టుకు ముగింపు పలకాలని నిర్ణయించి ఒక రెండు ముక్కలు  - మొదలుపెట్టినాక పుస్తకం దించకుండా చదివించే గుణం ఉండటం వల్ల నా డైరీలో మొత్తానికి ఆయన 75 పాయింట్లు సంపాదించుకొనినారు. ప్లస్ నా ఖాతాలో ఐదు డాలర్ల బాకీ కూడా సంపాదించుకొనినారు. ఆయన ఇలాటి తరిగిపోతున్న నవలా ప్రక్రియకు చేదోడు వాదోడుగా నిల్చి ఆ మిగిలిన 25 పాయింట్లు కూడా కొట్టేసి శతం పూర్తిచెయ్యాలన్న ఆశ మన:స్ఫూర్తిగా వెలుగుతూండగా స్వస్తి వాక్యం......

సర్వేజనా స్సుఖినోభవంతు....

ఓం తత్ సత్!


No comments:

Post a Comment