Wednesday, November 4, 2015

"కంచె" బయటున్న దూపాటి హరిబాబుగారికో లేఖ!!దూపాటి హరిబాబుగారికో లేఖ

ప్రియమైన హరిబాబు గారికి శిరోభారంతో రగిలిపోకుండా రాస్తున్న ఒక ప్రేక్షకుడి లేఖ. మీరు నటించిన సినిమా, కంచె"ట", అది నిన్న రాత్రి చూట్టం జరిగింది. ఉపోద్ఘాతంగా ఉభయకుశలోపరి. మరి, ఈ ఉత్తరం కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటో నుంచి రాయటం. మీరు వీరమరణం చెంది పైలోకంలో ఉండటం వల్ల ఈ ఉత్తరం పోష్టు చెయ్యట్లేదు. రాసి భద్రంగా నాదగ్గరే అట్టిపెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఒక రూపం కలిపించి అమలు చేసాక, కాస్త ఊపిరి పీల్చుకోగలిగాను. సరే కాస్త ముందుకు వెళిపోదాం.

ఫాల్సం సెంచురీ థియేటరులో ఈ సినిమా చూసిన ఇక్కడి వారంతా క్షేమమో కాదో తెలియని పరిస్థితి లేకున్నా వెరైటీగా ముక్కు కాకుండా కళ్ళు చీదుకుంటూ బయటకు వచ్చిన ప్రేక్షకామణి లను చూచి కడుపు నిండింది. డబ్బులు తగలేసిందే కాక ఈ ఊరుకో కాంతం ఓదార్పు బాధలేమిటండీ అనుకుంటూ పక్కనే నిలబడి దీనంగా బయటికొస్తున్న భర్తాజ్బెండులను చూసి జాలీ కలిగింది. అయితేనేం, ఎన్నో ఏళ్ళకు సినిమా హాల్లో ఆడప్రేక్షకులు కంటతడి పెట్టటం చూసి ఆనందం ముందు ఆ జాలి ఎంత అన్న ఊఱట కలిగింది. కరుడు కట్టిపోయిన వెకిలి హాస్యాన్ని కడుపుబ్బ హాస్యంగా భావించే మా టవును తెలుగు ప్రేక్షకుల మనసులను అంతలా కదిలించి వారి చేత కంటతడి పెట్టించిన మీ సినిమా సామాన్యమైంది కాదని నాకర్థమైన విషయం. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్ళిపోదాం.

మనుషులన్నాక మానవత్వం, ప్రేక్షకులన్నాక వినోదత్వం, దర్శకులన్నాక దర్శకత్వం, వగైరాలన్నాక వగైరత్వం ఇలా కొన్ని "త్వం"లు త్వమేవాహంలా పూర్తిగా ఆవహించుకొని వుండాలి. మీ రాధాకృష్ణకు కథలో త్వం కొంత, దర్శకత్వంలో త్వం కొంత, చలనచిత్రేంద్రియాలకు అతీతమైన త్వం కొంత, ప్రేక్షక సాక్షీభూత చైతన్యంలోని త్వం  కొంత మాత్రమే పట్టుబట్టిందనే అనుమానం నాకు పొడసూపటం ముదావహమైన విషయమని అనుకోవటంలో తప్పు లేదని అనుకుంటున్నాను. అదీ కాక మా థియేటరు వాడికి ఆబ ఎక్కువ కావటమ్మూలాన, తెలుగు సినిమా అనగానే, ఆ ఇంగ్లీషు థియేటరు కాంప్లెక్సులో ఏ సినిమాకైనా ఐదు డాలర్లుండే టికటు అమాంతం 15 డాలర్ల విశ్వరూపం దాల్పిస్తూ ఉండటం, ఆ విశ్వరూపం కర్మా ఖర్మణ్యివాధికారస్తే డాలరేషు కథాచన రూపానికి ప్రతిరూపమని నేను తలచటం, అల్లా తలచుకొని టికెటు కొనటం, కొనటమైపోయాక ఆ సినిమా చూడటం, చూసిన వాడిగా ఈ మాత్రం రాయగలిగే అవకాశం ఉండటం మీరు అంగీకరించినా అంగీకరించకున్నా ముదావహమైన విషయమే! 

ఒకానొక గ్రామంలో మంగళవాయిద్యాలు వాయించే తాతగారు ముంగల దృష్టితో మిమ్మల్ని మద్రాసులో చదువులు చదివించటం ఎంతో మంచి విషయం. అలా చదివించటమ్మూలానా మీ రాధాకృష్ణకు కథలో చిన్న జమిందారిణి అయిన మీ హీరోయిన్ను, భార్యామణిగారిని కూడా అక్కడే చదివించి ప్రేమ పుట్టించే ట్విష్టు రాయగలిగిన అవకాశం చిక్కింది.  అందుకు ముందుగా మీ తాతగారికి నమోవాకాలు. పోతే ఆ రకమైన ట్విష్టు చూసి ఇక తెలుగుదేశంలోని తాతలంతా మనవళ్ళను బయటి ఊళ్ళో చదివించకుండా భయపడే స్థితి రాకూడదని మన:స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తాత పాత్రధారి శాయశక్తులా నటించి, దబ్బఱ దబ్బఱగా మంగళవాద్యాలు మోగించి తనకే సొంతమైన, తనదైన, అరుదైన ప్రతిభ చాటుకున్నారు. అందుకు చప్పట్లు కొట్టవలసిందే. సరే ఇంకాస్త ముందుకెళిపోతే....

రెండవ ప్రపంచయుద్ధాన్ని, స్క్రీను మీద చండప్రచండంగా చూపించలేకపోయినందుకు ప్రేక్షకుల బుర్రలు తీండ్రంగా బాధపడ్డాయ్. ఈసారి ఇలాటి ప్రపంచ యుద్ధ సినిమాలు తీసేప్పుడు మీ రాధాకృష్ణను ఎప్పుడైనా ఒకసారి ఈ అమెరికా దేశానికొచ్చి ఆ దేశంలో కన్ఫెడెరేట్ వార్ అని నామం సంతరించుకున్న సివిలు వారును నాటక రూపంలో ఈ దేశపు నాటక సంస్థల వారు ప్రదర్శిస్తున్నప్పుడు చూడమని, ఆ చూచివేత తర్వాత "ఛస్, నాటకమే ఇలాగుంటే సినిమా ఇంకెలాగ ఉండాల" అన్న ఆలోచన ఆయనకు కలిగించటంలో మీవంతు కృషి మీరు చేస్తారన్న ఆశతో ఈ ఉత్తరంలో రాసి దాచిపెడుతున్నా. ఈ మీ సినిమాలోని యుద్ధ దృశ్యాలకన్నా ఆ నాటకమే వంద రెట్లు మెఱుగని చెప్పడానికి కాస్త చింతనగా ఉన్నది. అంతకాకున్నా హాలీవుడ్డులో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సినిమాలు చాలా వుండటంతో, వాటిలో కొన్నైనా చూడమని, చూసాక ఆ సహజత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దృశ్యకల్పన చెయ్యమని మీరు వారికి ఉచిత సలహా ఇవ్వగలరని ఆశిస్తూ... సరే ఇంకాస్త ముందుముందుకెళిపోతే....

హిట్లరు యూదు జాతులను పట్టుకుని ఊచకోత కోసాడన్నదానికి, ప్రపంచయుద్ధానికి అదే కారణం అన్న దాని నిరూపణకు రెండువైపులా వాదనలున్నా, రొచ్చు రాజకీయాలు పుచ్చు సినిమాలు చచ్చు కథలూ చూసి తలపండు పండించుకున్న తెలుగు ప్రేక్షకకుక్షులకు, అవొదిలేస్తే ఈలాటి విషయాల్లో నిరక్షరాస్యులు, అవిటి మస్తిష్క తెలుగు ప్రేక్షకులకు - మీ ఈ సినిమాలో ప్రేమతో యుద్ధమ్మొదలుపెట్టి, దాన్ని కుల, ప్రపంచ యుద్ధాల వరకు తీసుకెళ్ళిపోయిన వంతెన దాటటం కష్టమన్న సంగతి మీ తెలివిడికి, మీ రాధాకృష్ణ తెలివిడికి వచ్చి ఉంటుందున్న ఆశ కాస్త పదునుగా ప్రాణం పోసుకుంటోంది. కంచెలే దాటలేని మనవారు వంతెనలేం దాటుతారు ? మీ పిచ్చి కాకపోతే - పిచ్చని అనకూడదు కాని, ఇంత ఉత్తరం రాసాక దగ్గరైపోయారు కాబట్టి అనటానికి నిశ్చయించుకున్నా ! అయితే మీరు కంచెలు చూపించటం వల్ల వంతెన విలువ ఎప్పటికైనా తెలుస్తుందేమోనని ఒక ఆశ ఉన్నది...ఈ మీ ప్రయత్నం వల్ల మనవారు కంచెలే కాక వంతెనలూ ఒకనాటికి దాటగలరని అనుకుంటున్నారు ఇక్కడ. మీ కంచెకు అవార్డులు ఖాయమన్నది ఖాయం. అవార్డు సినిమాలకు రివార్డులు తక్కువని ఒక నానుడి. నానుడి అన్నది ఒక సత్య రూపం. ఆ సత్యానికి ప్రాణం పోసింది మీ సినిమా. అయితే ఈ సంవత్సరానికిచ్చే అవార్డుల్లో కొన్ని మీకు వచ్చేసాక, అవి మీకందే ఏర్పాటు ఎవరైనా చెయ్యగలరొ లేదో ఇక్కడెవరికీ ఎఱుక లేదు. సరే, ఇంకాస్త ముందుముందుముందుముందుకెళిపోదాం.

సీతగారు స్వచ్ఛంగా నవ్వుతూ ఎంత బాగున్నారో! వారూ పొట్టలో దిగిన కొబ్బరికురిడీ శూలమ్మూలాన పరలోకాలకు చేరి, మీరొచ్చే సమయానికోసం ఆత్రంగా ఎదురు చుస్తూ ఇప్పుడు మీ పక్కనే ఉన్నారని అనుకోలు. ఈ మాట వారి చెవిన వెయ్యండి. అయితే మీ ఇద్దరి మధ్య కెమిష్ట్రీ అంతా చాలా కృతకంగా ఉన్నదని ఇక్కడి ప్రేక్షకులు అనుకోవటం చెవుల పడ్డది. అందుకు మీ రాధాకృష్ణుడే కారణమని అనుకోలు. సీతగారు 1940ల్లోనే 2015వ సంవత్సరపు డిజైను చీరలు కట్టటం చాలా ఆనందకరమైన విషయం. ఒక యుద్ధం సీను, ఆ వెంటనే ఒక సీత సీను, మళ్ళీ ఆ సీక్వెన్సే రిపీటు అవ్వటం చూసి ఆయనెవరో శ్రీను వైట్ల సినిమాలో సూమోలు అకారణంగా ఉవ్వెత్తున ఆకాశంలోకి ఎగిరినట్టు సినిమాహాల్లోని ప్రేక్షకుల సహనం కూడా ఎగిరెగిరి పడ్డది. కొత్త ప్రయోగాలు చేసినప్పుడు అందరూ ఎగిరెగిరి పడుతూనే ఉంటారు. అయితే క్రమం తప్పక ఆ ఎగురుడు అలవాటు చేస్తే అదే ఒకనాటికి క్లాసికల్ డాన్సైపోతుంది. చాలా సింపులు సూత్రమది. ఆ సూత్రం మీరు మీ రాధాకృష్ణగారికి అందించవలసిందిగా కోరుతున్నాం.

సీతగారి అన్నయ్య, మీరూ ఇద్దరూ కలిసి ఎగరేసిన ముక్కుపుటాల క్షణాలు మీ సినిమాలో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నదని అనిపించిన మాట వాస్తవం. ఆ ముక్కుపుటాల్లోని రోమాలు స్క్రీనంతా కనపడి ప్రేక్షకులను రోమాంచితులను చేసినాయి. ఆ సినిమాటోగ్రాఫరు వారు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఆ రోమాంచిత దృశ్యం ప్రేక్షకులకనుభవం అయ్యే పరిస్థితి ఉండేది కాదని ఒకానొక ప్రేక్షకుడి ఉవాచ. ఆ ప్రేక్షకుడికి తెలియని సూత్రం ఒకటి ఉన్నది. రోమాంచితం అన్న అనుభూతి అంతత్వరగా అనుభవానికి రాదని వారికి తెలియకపోవటంతో ఆ పిచ్చి వాగుడంతా వాగారు. మీరు మటుకు బాధపడకండి. మీ ఇద్దరి మల్లయుద్ధం సీన్లు చూసి చిన్నప్పుడెప్పుడో ఒకానొక నాటకంలో జరిగిన కంస చాణూర మర్దనం సీను గుర్తుకువచ్చింది. అదొక తీపి గ్యాపకం. నా మటుకు నేను, అతి బలాఢ్యులైన మీ ఇద్దరిని ముఖారవిందాల మటుకే చూసి సద్దుకొనిపొమ్మని బ్రెయిను వారికి ఆదేశాలిచ్చి ఊరకున్నాను.

శ్రీశ్రీ గారిని అవసరంగా వాడుకొన్నా, ఆ పాత్రధారి అనవసరంగా అవసరానికి మించి యాక్షను చెయ్యపూనుకోవటంతో ఆ అవసరం అభాసు పాలయ్యిందని ఇంటర్వెల్లులో కేతిప్రేక్షకులు కామెంటినారు. నటన అంటే హావము భావము రెండూ సమృద్ధిగా ఉండవలెనన్న ప్రాథమిక సూత్రం మరవటంతో వచ్చిన చిక్కని అనుకోలు. ఏదైతేనేం, ఆ పాత్రధారి యాక్షను ఓవరాక్షనుగా పరిణమించి అశ్రువుకణాలు విస్ఫులింగాల్లా మారటానికి కారణమయ్యిందిట. అవునండీ, ఒక విషయం అడుగుదామని - మిమ్మల్ని కసుక్కున పొట్టలో పొడిచినాక ఒడ్డున పడిపోయిన మీరు జమిందారిణి గారి పడగ్గదిలో తేలి అక్కడ సేదదీరటం ఎట్లా జరిగిందో, దానికెక్స్టెన్షనుగా ఆవిడ చెయ్యుచ్చుకుని అడుగులో అడుగేసుకుంటూ పెళ్ళి చేసేసుకోటానికి బీజవర్తనం ఎలా సాధ్యమయ్యిందో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది చాలా మంది ప్రేక్షకులకు. పరలోకంలో పరుగుపందాలాడుతున్న మీకు తిరుగుజాబు రాయటం, అది మేం చూట్టం సాధ్యం కాబట్టి వారిని సమాధానఒపరచలేకపోవటం కూడా జరిగింది. దాంతో అశాంతి పెచ్చరిల్లిపోయింది కూడానూ. పోనీలెండి ఈసారికిలా సద్దుకుందామని తీర్మానం చేపట్టినారు ఇక్కడి ప్రేక్షకులు - అదొక రిలీఫు...

ఇహ సంగీతానికి వస్తే, వారెవరో చిరంతనుల వారట. చిరంతన అంటే పాతది, ఎన్నో యుగాలనాటిదని అర్థం. మీ రాధాకృష్ణుల వారు వివేకం కలవారవ్వటంతో ప్రపంచయుద్ధ కాలపు సినిమాలు సాయంగా వారిని తీసుకొచ్చినా, సంగీతంలో వారి పేరుకు వారే న్యాయం చేకూర్చలేకపోయినారు. మధ్య మధ్య బాహుబలి బిట్లు కూడా వినపడ్డవని ప్రేక్షకుల ఉవాచ. 

డైలాగులు, పాటలు కక్కసంగా ఉన్నవి. ఆ రాసినవారెవరో కానీ వారు పనిచెయ్యాలనుకునే మున్ముందు సినిమాలకు కాస్త సంవర్ధనంగా చెయ్యగలరని అనుకోలు.  సినిమాటోగ్రఫీ మటుకు అక్కడక్కడా, కొండొకచో చాలాచోట్ల బాగా అదరగొట్టినారు. ఇక ముందుకెళ్ళటం ఇక్కడికాపేస్తే మంచిదని భావించి.....కానీ చివరిగా ఓ రెండు ముక్కలు...

కంచె అంటే అర్థం ఇదని -  ఇక్కడ మా టవునులో అనుకుంటున్నట్టుగా ఎవరికో తప్ప ఎందుకో తప్ప ఉపయోగపడని వికిపీడియా చెపుతోంది.

1.ఎండ నుంచి రక్షించే కంచె
తమలపాకు తోటలకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు తాటి ఆకులతో దడిని కడతారు.
2.పెంపుడు జంతువుల రక్షణ కొరకు
గొర్రెలు, మేకలు వంటి పెంపుడు జంతువులు క్రూర మృగముల బారిన పడకుండా ముండ్ల కంపతో కంచెలను నిర్మిస్తారు.
3.ఇతరుల నుంచి, జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి తోట చుట్టు కంచెను నిర్మిస్తారు.
1.దొంగల నుంచి రక్షణ కొరకు కంచెలను నిర్మిస్తారు.
1.రెండు దేశముల మధ్య శత్రువుల నుంచి రక్షణ కొరకు సరిహద్దు కంచెలను నిర్మిస్తారు.
1.విద్యుత్ స్టేషన్ల వంటి ప్రమాదకరమయిన ప్రదేశములలో కంచెలను నిర్మిస్తారు.
2.జంతుప్రదర్శన వంటి ప్రదేశములలో జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు రక్షణ కల్పించడానికి కంచెలను ఏర్పాటు చేస్తారు.

తెలుగు వికిపీడియాను ఆదర్శంగా తీసుకొన్నవాళ్ళు ఆ కంచెల్లోనో మతిభ్రమించిన్నూ, చిక్కుపడిన్నూ తిరుగుతూ ఉంటారన్న విషయం అందరకూ తెలిసిన విషయమేనని నాకు కొత్తగా తెలిసిన విషయం.

సరే ఆ వికిపీడియా ఇచ్చిన కంచె అర్థమే ఈ సినిమాకు అన్వయిస్తే - ఈ మీ సినిమా కొంత మందికి ముండ్ల కంప కంచెగానూ, కొంతమందికి జంతుప్రదర్శనలో కంచెగానూ, మరికొంతమందికి విద్యుత్ స్టేషను షాకు కంచెగానూ, ఇంకా.....గానూ.....గానూ గానూ వున్నదని నిన్న చూసిన ప్రేక్షక సమూహ రియాక్షనును బట్టి ఊహించుకోవలసి వచ్చింది. ఇలా ఎంతో మందికి ఎన్నో కంచెలు చూపించిన మీకు, మీ సినిమాకు హృదయపూర్వక శుభాకాంక్షలు 


ఈ సినిమాను చాలా కష్టపడి, విలక్షణంగా, వైవిధ్యభరితంగా తీసినా, ప్రేక్షకసమూహాలకు ఈ విలక్షణవైవిధ్య డోసు తేడా చేసినందున మీ రాధాకృష్ణుల వారు ఈసారి కాస్త పకడ్బందీగా తీయాలని కోరుకుంటూ...

అభినందనలతో స్వస్తి వాక్యం....

ఓం తత్ సత్!

2 comments:

 1. Kayalunna chettuke raalla debbalu ante idhenemo

  ReplyDelete
 2. వంశీ గారూ...తెలుగు విమర్శకులు ఆహా..ఓహో అంటున్న కంచె కూడా మీకు నచ్చలేదంటే....
  మీకు నచ్చే తెలుగు సినిమాలు కనుచూపు మేరలో
  లేవు.
  నిజమే..మీరన్నట్లు..యుద్ద సన్నివేశాలు అంత బాగా రాలేదు.
  కారణం ...తెలుగు సినిమాతో పాటూ హీరో, దర్శకుడికి ఉన్న మార్కెట్ గావచ్చు. గుడ్డిలో మెల్లలా...ఆముదం చెట్టునే మహా వృక్షం అనుకోవాలె...

  ReplyDelete