Sunday, November 15, 2015

అయ్యా, అమ్మా కళాకారులూ! మా ఊరికి రావొద్దండి, దయచేసి!

తెలుగువారు - సైకోయిసం

మా చిన్న టవును శాక్రమెంటోలో తెలుగువారి జనాభా బే ఏరియాతో చూసుకుంటే తక్కువే కానీ, అంత తక్కువ కూడా కాదు. ఒక మోస్తరు మీద ఒక పిసరు ఎక్కువే. సరే, ఆ జనాభా సంగతి - అదలా పక్కనబెడితే, అంత పిసరంతమంది వున్నా మా ఊరికొచ్చే కళాకారులకి వీళ్ళు చూపించే ఆదరం, అభిమానం అంతా గుడిమెట్ల మీద కూర్చుని అడుక్కుతినేవాడు సంతోషం ఎక్కువైనప్పుడు వేసే ఈలతో సమానంగా ఉంటుందని ఎవరన్నా అంటే మీరేమీ ఆశ్చర్యపోవక్కరలా. దాన్నే ఇంకో విధంగా చెప్పుకుంటే మాసు అని వర్గీకరించెయ్యవచ్చు కానీ, అది మాసు అంటే మాసుకే అవమానం.

మాసుకు కూడా ఒక క్లాసు ఉంటుంది. చీపులో చీపు, అధమంలో అధమం, దరిద్రంలో దరిద్రం అన్నది మా ఊరి తెలుగు వారి ఆతిథ్యానికి మారుపేళ్ళు. క్లాసు అనేది మా ఊళ్ళో తెలుగు వాళ్ళకు దాదాపు మృగ్యం. ఇంటికి వచ్చినా ఒకటే, ఊరికొచ్చినా ఒకటే. "ఆ... వచ్చావా! ఎవడికోసం వస్తావ్. నీకు పనుంది వచ్చావ్. నీకు అవసరం ఉంది వచ్చావ్. వచ్చావు చూసావు దయచెయ్" అన్న రీతిలో, తీరులో ఉంటుంది.

ఇంటికెవడన్నా స్నేహితులొస్తే మాటా మంతీ లేకుండా టి.వి.లు పెట్టుకొని చూట్టం, ఐఫోను ఐపాడుల్లో గేములాడుకోవటం, వచ్చిన అరగంటకి వీరి తీరు తెన్ను చూసి గొంతు పిడచకట్టుకుపోయిన అతిథే మంచినీళ్ళడుక్కోవటం - ఇలా నానారకాలుగా ఉంటుంది. కాస్తలో కాస్త గ్రామాలనుంచి వచ్చిన వాళ్ళల్లో పలకరింపు, క్షేమం కనుక్కోటం లాటివి ఉన్నా, అవీ సిటీనుంచొచ్చిన వాళ్ళను చూసి, వారితో సమానంగా మేమూ పోటీ పడగలమంటూ మార్చేసుకుంటున్న తీరు గ్లోబల్ వార్మింగు కన్నా ఎక్కువ అలార్మింగు.

సరే ఈ సోదంతా పక్కనబెడితే, నిన్న సాయంత్రం మరీ అంత కాకపోయినా, కాస్త పాతతరం సింగర్ విజయలక్ష్మిగారు, కొత్త సరికొత్త తరం సింగర్లు కిరణ్ / మానసలు కాలిఫోర్నియా తెలుగు సమితివారు తలపెట్టిన, నిర్వహించిన వార్షికోత్సవానికి విచ్చేసారు. మాములు కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక, ఏడింటికి గావాలు, ఏకచక్రపురంతో సమానంగా తలెత్తుకొని నిలబడగలమంటూ శాక్రమెంటో ఆబ ఆత్ర బకాసుర హిడింబిల భోజనాలు సమాప్తం అయ్యాక, ఈ సంగతులు ఏమీ ఎరుగని విజయలక్ష్మిగారు వారి టీము, సంగీత విభావరి కార్యక్రమం మొదలు పెట్టారు.

ఇహా మా జనాభా సంగతే చెప్పొచ్చారూ ? తినటం, విస్తరాకులు నెత్తిమీద, ఫ్లోరు మీద పడేసే రెగ్యులర్ కంగాళీలో బుర్ర, బొజ్జ నింపేసుకున్న మత్తులో తూలుతూ తట్ట బుట్టా సద్దుకుని సగం మంది అటునుంచి అటే బళ్ళెక్కేసి వెళ్ళిపోయినారు. నాలుగొందల మంది పట్టే హాలులో దాదాపు మూడువందల మంది ఉచిత స్నాకులు, ఉచిత టీలు, ఉచిత భోజనాలు తిని (ఒక టికెటు కొని మొత్తం కుటుంబం వచ్చి పడి మెక్కితే అది ఉచితం కిందే లెక్క) ఉడాయించారు.

పట్టుమని 50 మంది ఉన్నారు గావాలు. అందులో ఇరవై మంది పిల్లలు. ఒక పది మంది సంఘ సభ్యులు. ఆ ఈసురోమనే జనాభా సంఖ్యను చూసి మనోధైర్యం కోల్పోకుండా విజయలక్ష్మిగారు ఆ సమయానికి, ఆ పరిస్థితికి తగ్గ జోకులు వేస్తూ, కార్యక్రమం మొదలు పెట్టారు.

ఆవిడను లైవులో చూట్టం నాకు ఇదే మొదలు. ఇంతకు ముందు ఆడియోలు అవీ విన్నాను కానీ, అవి అంత ప్రభావం కలిగించలా. కానీ నిన్న ఆవిడ పాడిన పాటలు, వాటిని ప్రవేశపెట్టిన తీరు, పాడిన తీరు చూసి చాలా సంతోషించాను. ముఖ్యంగా ఎల్లారీశ్వరి పాడిన పాటలు చాలా బాగా పాడారు. కిరణ్ / మానస - పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ పాటలు అనగా బీట్లు వగైరా వగైరా ఉన్నవి తీసుకొని వారి శాయశక్తులా ఉన్న ఇరవై మందికి వినోదం పంచారు.

ఇక చప్పట్ల సంగతే అడిగారు? అవే ఆ కళాకారులకు ఆహారం, ఆహ్వానం, ఉత్తేజం , ఉల్లాసం అని మా దరిద్రానికి తెలియకపోవటం వల్ల ఉన్న ఇరవై మందిలో పదిహేను మంది జోగుతూ ఉండగా, మిగిలిన ఐదుగురు తమ పది చేతులతో చప్పట్లు కొట్టారు. అందులో మా కుటుంబానివి నాలుగు చేతులు. అదొక సంతోషం.

Anyways - last couple words before I wrap this up. Vijayalakshmi gaaru - She is a real entertainer. She has THAT SPARK in her. So were Kiran and Manasa. Those young singers did have a lot of patience with our unruly kids who are let out by the irresponsible parents, as usual, to run all over the place and all over every one. One good thing is that atleast the kids were the solace and replaced the void the cowardly escapist hunger-borne telugu folk have created earlier. I let my daughter go too just to be part of that solace. Usually I donot and she herself is not inclined either, to be that mass oriented. Nothing wrong with being mass oriented, but when mass becomes nauseous it is a dangerous potion.


ఇదంతా చూసిన విజయలక్ష్మి గారు, వారి బృందానికి ఎట్లాగున్నదో కానీ, నేను మటుకు మా టవును వారి అసహ్య ఆతిథ్య చర్యలకు, కళాకారులకు ప్రోత్సాహం అందించలేకపోయినందుకు పరమసిగ్గుతో తలవంచుకుంటున్నానయ్యా.

ఈ కార్యక్రమమే కాదు, ఇంతకుముందు చిత్ర గారు వచ్చినప్పుడు, SPB గారు, పంతుల రమ గారు, మల్లాది సోదరులు వచ్చినప్పుడూ ఇదే తంతు. ఒక్క గజల్ శ్రీనివాస్ గారి వద్ద మటుకు మా సైకో శాక్రమెంటన్లకు తగ్గ మందు ఉండటంతో అది భారీ డోసులో వేసి కూర్చోబెట్టినారు. అయ్యా, అమ్మా - కళాకారులూ మా ఊరికి రావొద్దండి, దయచేసి. ఆ కళామతల్లికే అవమానం. మీ కళ ఇంకెక్కడైనా ఆదరణ ఉన్నచోట ప్రదర్శించండి. ఆచోటికే నేనూ వచ్చేస్తాను. 

మరొక్కసారి మా వూరికి విచ్చేసిన కళాకారులందరికీ, మా టవును వారి నడవడికకు సిగ్గిలిపోతూ, క్షమాపణలు వేడుకొంటున్నాను.. ఒకనాటికి కాకపోయినా, ఒకనాటికన్నా నేర్చుకుని ఏడుస్తారన్న ఆశతో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ!

భవదీయుడు
వంశీ
1 comment: