Monday, November 2, 2015

ఈమాట - చంద్ర కన్నెగంటి - నా తుత్తి కోసం!!

చంద్ర కన్నెగంటి.
ఈయన పేరు వింటే చంద్రుడు పులకిస్తాడని ప్రతీతి.
ఆ పులకరింతల్లో అహా ఓహోనని పలవరిస్తాడని కూడా నానుడి.
నానుడి అన్నది ఒక సత్యం.
ఆ సత్యాన్ని సూత్రీకరించి వ్యక్తీకరిస్తే అదొక క్రియ.
అలాటి క్రియలకు ఒక అక్షరరూపం ఇస్తే అది రచన.
ఆలాటి క్రియాశీలకరచనలు ఈయన కోకొల్లలుగా రాశాడని ప్రపంచానికెఱుక.

అలాటి ఎఱుకను ఈమాటవారు బహిర్గతం చేయపూనుకోవటం ముదావహం.

ఎఱుక తెలియదేమోనని కాలపు గడియారంలో దాగున్న ముల్లు ఒకటున్నదని, అది మీకు "తెలుసా"నని ప్రశ్నించి, ఆ పైన లంకె ఇచ్చి మరీ ఎఱిగిస్తిరి.

అలాటి చూడచక్కని, పాల చిక్కని మైత్రీబంధం సంపాదకీయానికి, సంచికకు ఎక్కించి పుణ్యవంతులైనారు ఆ పత్రిక వారు.

చదివిన పాఠకులూ ధన్యజీవులైనారు.

ఈలాటి పనులు వారు, పాఠకుల పుణ్యమాని, సాహితీ ప్రపంచం చేసుకున్న పూర్వజన్మ సుకృతమాని - ఆ పత్రిక వారు చెయ్యటం ఇది రెండోసారి.

రెండోసారి అంటే - నేను ఆ పత్రిక చదవటం మొదలుపెట్టిందగ్గరినుంచి అని...

మొదటిది  వెల్చేరు నారాయణరావు గారి మీద వెలువరించింది.
రెండోది ఈ చంద్రుడి మీద వెలువరించింది.
నారాయణ శబ్దం వెనకాలే చంద్రుడు ఉండటం మరింత.....
నారాయణులు పాలసముద్రం వారే.
చంద్రులు పాలసముద్రం వారే!
సరే.. పొగడ(డ్త)పూలు ధారగా కురుస్తున్నాయని ఎవరో కేకేస్తున్నారు.
ఆ ధారనాపి ఈ చంద్రుల వారి ధారవద్దకు వచ్చేద్దాం.

ఆ ముఖపత్రంలో ఆర్జకత్రిమూర్తిస్వరూప సమానులు , అపర తొల్లింటికతామందారమకరందులు, రూపకరస సరస్వతీ పుత్రులు, ఐతిహాసికకథారాజ బ్రహ్మ, ప్రవాససీమకథకతిలకరత్న, మానుషసంప్రహాసకథాచక్రవర్తి అయిన శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారు ఈ చంద్రుడి మీద రాసిన మాటలు చదివిన తరువాత ఇక నేను చెప్పవలసిందేమీ లేదని అనిపించటంతో ఆ జోలికి వెళ్ళకుండా, ఏదో నా తుత్తి కోసం ఒక రెండు ముక్కలు ఆ త్యాగరాజ పంచ రత్నాల్లాటి అయిదు కవితల మీద రాసి ఊరకుంటా...

  • మబ్బుల్లో బబ్బోపెట్టి వెల్లకితల కితకితలు పెడుతూ రాసిన "మబ్బుల్లో బొమ్మలు" చదవగా ఆ బొమ్మల్లోంచి ధారగా ద్రాక్షాపాకం కురిసిందిట.
  • పాఠకుల మీదకు విస్ఫులింగాలు విసురుతూ రాసిన "అగ్ని స్పర్శ" చదవగా చమరుపాకం ధారగా కురిసిందిట.
  • ఫటిల్లుమని పేలిన చావుకేకలతో కూడిన "గాలి రొద" చదవగా పాషాణపాకం ధారగా కురిసిందిట. 
  • కనపడని మట్టిలో పడిన అడుగులని హత్తుకుంటూ సాగిన "మట్టి వాసన" చదవగా మధుపాకం ధారలై కురిసిందిట.
  • వరదగుడిని చెరిపేస్తూ పొద్దు కొండల్లోకి జారిపోయిన "నాలుకపై వానచుక్క" చదవగా శర్కరపాకం ధారలై కురిసిందిట. (ఈ వానచుక్క మటుకు ఆ పత్రిక ముఖపత్రంలో కనపడకుండా సైడు షోలో కనపడుతోంది కారణమేమిటో తెలియదు కానీ...ఎవరో నాలుకమీద పడ్డదని చప్పరించి ఉంటారు...)

అలా తుత్తి చెంది రాసిన రెండు ముక్కలు ఇక్కడికైపోయినాయి.
 ఇంకో రెండు ముక్కలు చెప్పి శలవు తీసుకుంటా.

ఒక మనిషి ఒక రచయితగా పేరు తెచ్చుకోవడం కష్టమైన విషయం.

ఒక రచయిత ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకోవడం మఱింత కష్టమైన విషయం.

ఒక ప్రతిభావంతుడు సహృదయుడిగా పేరు తెచ్చుకోవడం మఱింత కష్టమైన విషయం.

అటువంటి అరుదైన ప్రతిభావంతుల్లో ఒకాయన ఈ చంద్రుడు.

అయితే ఈ చంద్రుడు కూడా క్షీణ దశ, ఉచ్ఛ దశలకు అతీతుడు కాడు.

ఆ దశలు రచనలకే పరిమితం కావడం మటుకు ముదావహమైన విషయం.

ఇలా అన్నానని చల్లనైన చంద్రుడు కందిపోతే చెయ్యగలిగిందేమీ లేదు కానీ, ఆయనకు మన:స్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ......

పోతే - ఆయనకు నచ్చినా నచ్చకున్నా తెలిసినా తెలియకున్నా ఒక పిట్ట కథ.

పిట్ట కథ పిట్టకథగానే తీసుకోవాలె కానీ అనవసరంగా రౌద్రరూపం దాలిస్తే సౌమ్యుడైన చంద్రుడి మీది మచ్చలు భూతద్దంలో కనపడతవని ఎవరో చెప్పగా విన్నమాట.

సరే ఈ పిట్టకత ఏందంటే - "కన్నెగంటి" అన్న వారి ఇంటిపేరు గుఱించి.

అనగనగా ఒకానొక కాలంలో, గల్లు అంటే ఱాయి అని అర్థం.
ఆ ఱాయి గల్లు, గంటిగా రూపాంతరం చెందిందని నామశాస్త్రవేత్తలందరికీ తెలిసిన ఒక సత్యం.

కన్నె అంటే తాడు, పలుపు, బంధం.
అలా చేతినిండుగా బంధాలను తయారు చేసినందుకు కన్నెగంటివారైపోయారని సూత(త్ర)మహాముని ఉవాచ.

బంధాలకీవల చివర ఏమున్నా, ఆ చివర మటుకు గల్లుకు కట్టి ఉండేదిట.

ఆ బంధాన్నుంచి తప్పించుకోవటం ఆ హరిహరాదులకైనా సాధ్యం కాదని కొన్ని శిలాశాసనాల్లో కూడా వేసి ఉండవచ్చు.

ఆ శాసనాలు దొరికితే మటుకు బ్రహ్మాండమైన పండగ చేసుకుందామని ఆత్రుతగా ఉన్నది. 

అందాకా వేచిచూస్తూ అలా ఈ పిట్టకథకు ముగింపు పలకవలసివచ్చినందుకు .......

ఇలా తమకు ఆప్తులైన వారిమీద, కంటెంపరరీ రైటర్సు మీద ఏకంగా ఒక సంచిక తీసుకొచ్చి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినందుకు ఈమాట వారికి కూడా అభినందనలు.

ఇక మీదట సంవత్సరంలో కనీసం రెండు సంచికలు ఈ విధంగా తీసుకొస్తే ఆ పత్రిక సంపాదకుల్ని పంచామృతాలతో అభిషేకించవచ్చు.

వచ్చే సంచిక కాక ఆ పై సంచిక శ్రీ మోహనరావు గారి మీదో, ఏల్చూరి వారి మీదో, వేలూరి వారి మీదో తీసుకొనివస్తే నా తరఫున నాలుగొందల వీరతాళ్ళు వేస్తానని బహుమానం ప్రకటిస్తూ - శలవు.

PS: 

సరే కానీ - ఇదంతా అక్కడే ఆ పత్రికలో కామెంటులో రాయొచ్చుగా అని అడుగుతున్నారా మహానుభావా?

అదే అడిగారూ ?

ప్చ్!

ఎదగాలి నాయనా ఎదగాలి....మీరు ఎదగాలి.... ఎద మీద గాలి ఊపుకుంటేనూ, ఎద లోపల గాలి నింపుకుంటేనూ తేలే విషయం కాదది...  :P

చివరాకరిగా - వెనారా మీద ఓ రెండేళ్ళ క్రితం వచ్చిన సంచిక గూర్చి కూడా ఓ రెండు ముక్కలు రాస్తిని. అది ఇక్కడ చదువుకొనవచ్చును 

ఓం తత్ సత్!

No comments:

Post a Comment