Tuesday, October 13, 2015

అది రుద్రమదేవి కాదు నాయనా, రు"డ్రామా"దేవి!రుద్రమదేవి

రుద్ర అంటే భయంకరమనీ, శివుడని రెండర్థాలు.
శివుడంటే పరమదయాళువు, పరమభయంకరుడు.
రుద్ర శబ్దానికున్న ప్రత్యేకత దాని శ్రవణమే.
కొంతమందికి ఆ పేరు వినగానే ఒక మహాశక్తి ఆవహించినట్లుంటుంది.
ఎంతోమందికి ఆ పేరు వినగానే ఒక రకమైన అనుభూతి.
పులకరించిపోయే, గగుర్పొడిచే అనుభూతి.
అనుభూతి అంటేనే గతం నుంచి రావలసిందే.
గతం గత: అన్నది ఒక ఉక్తి.
ఉక్తులెప్పుడు గతమైపోయిన గాథలే.
ఆ గాథలే చరిత్ర.
ఆ చరిత్ర ఎవరూ చెరపలేనిది.
ఆ చరిత్ర ఎవరూ ముట్టుకోలేనిది.
ఆ చరిత్ర ఎవరూ మార్చలేనిది.

అలాటి చరిత్ర మన తెలుగువాళ్ళకూ ఉన్నదయ్యా.
అల్లప్పుడెప్పుడో ఆఅ కాలంలో ఉండేది.
మరి చరిత్ర అంటే కాలంలో ఉండేదేగా?
అలాటి చరిత్ర ఒక శరీరం అనుకునుటే దానికి నీడలాంటిది చారిత్రకులు రాసే సాహిత్యం.
ఆయా చరిత్రలు రచించినవారు ఆనాడు సాహితీకారులు.
ఈనాడు సినిమా స్క్రీన్ ప్లే రైటర్లు.
ఆ నీడ పెద్దది, ఈ నీడ చిన్నది.
అంతే తేడా.
సరేలే, ఆ విషయం పక్కనబెట్టి సినిమాకొచ్చేస్తే ...

ఈ సినిమా స్క్రీన్ ప్లే క్రమంలో అప్పటి తెలుగువారి చారిత్రక పరిస్థితులు విపులంగా, గాఢంగా, కన్నులకు కట్టినట్లు చిత్రితమైనాయా? అసలు అలా చిత్రించాలంటే సాధ్యమయ్యే పనేనా?

నవలల్లో, కథల్లో అంటే అడ్డూ ఆపు లేకుండా రాసుకోవచ్చు కానీ సినిమాలో సాధ్యమయ్యే పని కాదని కొందరంటారు.

కానీ కట్టుదిట్టంగా రాసుకుంటే సాధ్యమయ్యే పనే.

ఆ పనిలో గుణశేఖర్ అనే ఈ సినిమా దర్శకుడు, తేలిపోకుండా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నించాడు.

ఆ చారిత్రకత గురించి ప్రేక్షకుడిలో ఒక యెరుక కలిగించాడా ?

కలిగించాడు. ఎంతదాకా కలిగించగలిగాడు అంటే రుద్రమదేవిని, కాకతీయ సామ్రాజ్యాన్ని, గోన గన్నారెడ్డి పేర్లను ఇప్పటి తరానికి పరిచయం చేయటమంతవరకు.

ఉత్త పేర్లను పరిచయం చేస్తే అది చాలా అన్నది ప్రశ్న అయితే, దాని సమాధానం - అది మీ చరిత్రే, దాని గురించి మరింత విపులంగా తెలుసుకోవాలన్న ప్రయత్నం మీరు చెయ్యాల్సిందే. గుణశేఖర్ ఒక్కడి మీద వదిలేసి కూర్చుంటే కాదు. తనకున్న సామర్థ్యం మేరకు, అవగాహన మేరకు, బిజినెస్సు లాజిక్కు మేరకు చెప్పాడు, చూపించాడు, చూపించగలిగాడు. 

ఈ కాకతీయులకు సంబంధించిన చారిత్రక సినిమాలో ఉండవలసిన మరొక ముఖ్యాంశం - ప్రేక్షకుడికి ఆ రుద్రమదేవి దేశపరిపాలన స్థితులు, దేశకాల పరిస్థితులు, అప్పటి పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ బలంగా చూపించగలిగామా లేదా అన్నది. 

గుణశేఖరుకు అవకాశం ఉన్నా, ఎంచుకున్న పాత్రధారుల వల్ల ఆ పని నీరుకారిపోయింది. పాత్రధారుల వేషభాషలు, ఆపైన నటన అనే బ్రహ్మ పదార్థం వారిలో అసమర్థత అనే రూపంలో ప్రతిఫలించడం వల్ల కారిన నీరు యేరులై పారింది. 

సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఆ సంగీతం "మయిస్ట్రో" స్థాయి నుంచి జారిపోయి అడ్డాల్లో "మేస్త్రి" కోసం ఎదురు చూసే కూలీల దరువు సంగీతం స్థాయికి దిగిపోవటమ్మూలాన థియేటరులోని ప్రేక్షకులు విడిచిన వేడి నిట్టూర్పులతో ఆ సినిమాహాలు లోపలి ఉష్ణోగ్రత థార్ ఎడారిలో ఉన్నట్టుగా తయారై ఎయిరు కండిషను ఠపీమని చచ్చి ఊరకున్నది. 

ఆ పాటలు రాసిన ఆయన ఎవరో సిరివెన్నెల సీతారామశాస్త్రి అట, ఆయన ఈ సినిమాతో రిటైరైపోతే మంచిది.
ఇళయరాజాకు బాలుకు విడదీయలేని అనుబంధం వున్నా, అది ప్రేక్షకుడికి రౌరవ నరకంలో పాటలు ఎలా పాడుకోవచ్చోనన్నది వినిపించి చూపిచ్చింది. 

అలాగే డైలాగులు రాసిన పరుచూరి బ్రదర్స్ కూడా రిటైరు అయిపోతే మంచిది. అవ్వకపోతే ప్రేక్షకులే రిటైరు చేయించటం మంచిది. 

అజయ్ విన్సెంటు కెమెరా పనితనం చాలా చోట్ల తేలిపోయినా అనుష్కను బ్రహ్మాండంగా చూపించింది. అంత:పురంలోని సెట్సు, ఉద్యానవనాల్లోని సెట్సు బాగా ఎలెవేట్ చెయ్యగలిగాడు. 

రజా మురాద్, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజు, సుమన్, సుమన్ పక్కనే ఉన్న ఇంకో సుమను, మిగిలిన సామంతులు, నాగదేవుడు, మహదేవుడు - ఓలుమొత్తంగా ఆ రాజ్యంలోని పాత్రధారులందరినీ కాకతీయ సామ్రాజ్యంలోని పేద్ద సొరంగంలోనే బంధించి ఉంచేసి ఆ పాత్రలను సురభి నాటక సమాజంలోని పాత్రధారుల చేత ఎవరిచేతన్నా వేయించేస్తే పోయేదన్న ఫీలింగు అలా ఓసారి తళుక్కుమని మెరిసినా, అది సమంజసమైన ఆలోచన కాదు కాబట్టి దాన్ని పాతర వేస్తిని. 

చాళుక్య వీరభద్రుడిగా వేసిన రానా, పాపం బాహుబలి ఎఫెక్టు నుంచి తేరుకోనట్లున్నది. రాజసం చూపించాలని భేషజం లేకుండా ప్రయత్నించి విఫలమైపోయాడు. ఆయన పట్టి విడిచిన ఉచ్చారణ వినలేక అష్టదిక్కుల్లో నిలబడుకొని ఉన్న నవదిక్పాలకుల దశనాడులు ఏకాదశంగా నన్నావహించ ప్రయత్నించటంతో మనసు మూగగా కుమిలి కుమిలి రోదిస్తూ నిలబడిపోయింది. 

ప్రకాశ్ రాజు అనే ఆయన ఎన్నో వేల ఏళ్ళ నుంచి తెలుగు సినిమాలు చేస్తున్నాడట. అయినా ఆయన తెలుగు అలాగున్నదేమిటో! 

గోన గన్నారెడ్డి పాత్ర వేసింది అల్లు అర్జున్ అని ఎవరో చెప్పగా విన్నమాట. ఆ గోన గన్నారెడ్డి గుర్రానికి చివికిపోయిన గుడ్డలేసి ఆయన వేసుకున్న బట్టలతో మాచింగుకు ప్రయత్నించారు కానీ ఆ ఎఫెక్టు చూడటంకన్నా ఆ చివికిపోయిన గుడ్డలు మన నెత్తిమీదేసుకుని సొంత ఊళ్ళో సొంత ఇంటి ముందు నిలబడి అడుక్కోటం మంచిది అని మరొకసారి ఒక అసమంజసమైన ఆలోచన పొడసూపింది కానీ దాన్ని నేను తొక్కి నారదీసేయ్యటంతో పరుగులెత్తింది. అదీకాక ఆయన పలికిన డైలాగులు విని, మొలతాడులో తాయత్తు కాకుండా తాయెత్తులో మొలతాడు ఉందా అని ఒకసారి సరిచూసుకునే పరిస్థితి వచ్చింది. 

స్పెషల్ ఎఫెక్టులు - వాటిని స్పెషలు ఎఫెక్టులనటం కన్నా ............ (ఇక ఇంతే సంగతులు చిత్తగించవలెను)

చారిత్రక పరిఙ్ఞానమే చాలుననుకుంటే, దానికి చరిత్ర గ్రంథాలు వున్నాయి - చారిత్రక సినిమాలు అనవసరం. ఆ చారిత్రక దశలోని పాత్రలకు ఎంచుకున్న నటుల యాక్షనుతో పాఠకుడు తాదాత్మ్యం పొందగలిగినప్పుడే చారిత్రక సినిమా సార్థకమౌతుంది. ఒక మంచి ప్రయత్నం నెత్తికెత్తుకున్న గుణశేఖరును అభినందిస్తూ, ఆ ప్రయత్నాన్ని సరిగ్గా ఎక్సెక్యూట్ చెయ్యలేకపోయినదుకు చింతిస్తూ, ఈ సినిమా నేర్పిన గుణపాఠంతో గుణం పెంచుకున్న గుణశేఖరుగా తాను తీయబోయే తరవాతి సినిమాకోసం ఎదురుచూస్తూ ఓం తత్ సత్!

తా.క - ఈ సినిమా నిన్న రాత్రి 14 డాలర్లు తగలేసి చూసొచ్చి పొద్దున్నే మా ఆఫీసులో చెపుతూ అది రుద్రమదేవి కాదు నాయనా, రు"డ్రామా"దేవి అని చెప్పిన సంగతి ఎందుకో గుర్తుకొచ్చి ఇక్కడ వేస్తిని.