Tuesday, August 4, 2015

అరెరే, ఎంత అందంగా వున్నారు ఆ అడివి తల్లి బిడ్డలు.!!

సంగ....
సంగమ్మ....
బాహుబలికి అమ్మలగన్న అమ్మ!

ఆ రోహిణమ్మను చూస్తే నాకు మా విశ్వనాథ్ వాళ్లమ్మ గుర్తొచ్చింది.
విశ్వనాథ్ అంటే, నేను చదివిన కాలేజీలోనే బై.పి.సి సెక్షన్లో ఉండేవాడు.
వాడిది ఆదిలాబాద్ జిల్లా. సిటికి చదువుకోసం వచ్చాడు.
వివేకనగర్లో మూర్తిగారింట్లో మేమున్నప్పుడు వాడూ ఆపక్కనే బాచెలర్ రూం తీసుకుని ఉండేవాడు.

వాడి చదువు వేరు, నా చదువు వేరు. నాది లెక్కలు, వాడిది మందులు మాకులు.
అయినా ఒకటే కాలేజవ్వటం వల్ల, పక్క పక్కనే ఉండటం వల్లా స్నేహం పెరిగింది.
పెరగటం అంటే ఓ ఇదిగా కాదు కానీ, ఓ మాదిరిగా...

వాడి రూము బాచిలరు రూము కావటంతో మందు, మాకు, దమ్ము, దగ్గులతో కళకళలాడుతూ ఉండేది.
ఒక్క వాళ్ల అయ్యవారు వొచ్చినప్పుడు తప్ప, రోజూ పార్టీనే.
ఇంటి ఓనరు విజ్జివాడవాడవటం, ఆయన సత్తినారాయణపురంలోనే ఉండటం వీడికి కలిసొచ్చేది.
నాకు దమ్ము, మందు అంటే పరమ చిరాకు.
అందుకని వాడు పిల్చినా వాడి రూముకి వెళ్లేవాడ్ని కాదు.
అది వాడికి కచ్చగా ఉండేది. పిల్చినా రాడేమిటని.
అలా ఒక ఆర్నెల్లు గడిచినై.
ఆ ఆర్నెల్లలో వాడు ఒక యాభైసార్లన్నా పిల్చుంటాడు.
నేను వందసార్లు రానని చెప్పుంటా.

చిక్కడపల్లి సుధా హోటలు మాకు రచ్చబండ.
పిచ్చాపాటీలు, కచ్చలపోట్లాటలూ అన్నీ అక్కడే.
సాయంత్రం ఏడయ్యేప్పటికి గుంపు తయారు.
అలా ఓ రోజు పిచ్చాపాటీల్లో ఉండగా వీడొచ్చాడు.
ఎవరు ? విశ్వనాథుడు.
ఈ లావున బెల్ బాటము, పైన చారల చొక్కా!
నోట్లో సిగరెట్టు. ఆకాశంలో పొగలు
అబ్బో ఆ అందం చూస్తే కానీ తెలవదు.

అరేయ్, రేపు నేను ఊరెళ్తున్నా, ఎవడన్నా నాతో వస్తాడా అన్నాడు.
క్రిస్టమస్ శలవలు. కోతికి కొబ్బరిచిప్పలు.
ఇహ అంతా, అంటే ఒహ ఇరవైమంది పొలోమని నేనొస్తా, నేనొస్తానని అరుపులు కేకలు మొదలెట్టారు.

పీర్ ప్రెషరు మూలాన నేనూ కేకలు పెట్టా.
కేకలైతే పెట్టాకానీ, నాన్ననడిగితే కాక తీరిపోతుందనిపించింది.
ఎందుకంటే బస్సు ఖర్చులు మిగతావి అన్ని కలిపి ఓ వంద పైనే.

సరే ఏదైతేనేం అని భోజనం చేసేసాక నాన్న దగ్గర సణిగా!
అక్కడ కేకలు పెట్టినా ఇక్కడ మాట సరిగ్గా బయటకు పెగలకపోటంతో ఏవిటి అన్నారాయన.
తెత్తెన్నా...మెమ్మెమ్మె...విశ్వనాథు వాళ్ల ఊరికి అందరూ పోతున్నారు. నేను కూడా పోతా అన్నా.

ఎంత కావాలి అన్నారు. ఒక వంద అన్నా!
వెంటనే జేబులో చెయ్యి పెట్టి రెండు వందలు ఇచ్చారు.
ఉబ్బు కాస్తా తబ్బిబ్బు అయ్యి ఇంకేదో అయ్యింది.
నాన్నా, ఇది రెండు వందలు అన్నా!
నేను గట్టిగానే అన్నా అనుకున్నా.
కానీ అనలా...లోపలే లోతుగా ఉండిపోయిందనుకుంటా.

నాన్న, మళ్ళీ, ఏమిటీ అన్నారు.
ఈసారి కాస్త గట్టిగా ఇది రెండు వందలు అన్నా.
పైన వంద నిర్మల్ లో దిగి రామకృష్ణ మావయ్యకిచ్చెయ్ అన్నారు.
రామకృష్ణమావయ్య వాళ్ళిల్లు నిర్మల్ బస్స్టాండుకి ఆనుకునే.
సరేనని బుర్ర ఊపి, బట్టలు సద్దుకుని బయల్దేరాం తర్వాతి రోజు.

బయల్దేరాం అంటే, ఓ సుధా హొటలు దగ్గర కేకలు పెట్టిన ఇరవై మందీ అనుకునేరు.
ఆరుగురం, మొత్తం.
అంతే ఆరుగురం.

మిగిలినవాళ్ళ ఇంట్లోవాళ్ళు తాటలు తీస్తామని కొరడాలెత్తుకోటంతో మానేస్తిరి.
వాడి ఊరు కడెం ప్రాజెక్టు దగ్గర.
వాళ్ల నాన్న ఫారెష్టు డిపార్టుమెంటులో ఆఫీసరు.
యాభై కిలోమీటర్లనుకుంటా నిర్మల్ వాడి ఊరికి. నిర్మల్ మీదనుంచే వెళ్ళాలి.
వెళ్ళేప్పుడు కాక వచ్చేప్పుడు దిగి ఇచ్చేసి ఆ తర్వాత బస్సెక్కుదాంలే అని విశ్వనాథుగాడు అన్నాడు.

ఇంతమంది రామకృష్ణమావయ్య వాళ్ళింటికి వంద రూపాయలివ్వటం కోసం వెళ్తే ఆయన ఖంగారు పడతాడేమో అని శంక మొదలయ్యింది.

అరే, ఆ గోలంతా ఎందుకు, ఇప్పుడిచ్చేసిపోదాం అని బస్స్టాండులో దిగేసి డ్రైవరుసాబును ఒక్క రెణ్ణిమిషాలని బతిమిలాడి ఉరుక్కుంటూ పొయ్యి ఇచ్చేసొచ్చా.

ఆయన గోల, ఒరే వచ్చినవాడివి ఒక రెండు రోజులుండేట్టు రాకుండా ఈ ఉరుకులు పరుగులేమిటని.
సరే, బస్సెక్కాం, ఊరు చేరాం.

ముప్ఫై గుడెసెల్లాటి ఇళ్ళు, ఒక బంగళా, సైకిళ్ళు అద్దెకిచ్చే షాపు, ఒక పదిహేనిరవై షెడ్లు. అంతే! ఆ ఊర్లో.

ఒకటే ఒక్క బస్సు రోజు మొత్తానికి.
మట్టిరోడ్డు మీద దుమ్ములేపుకుంటూ పొయ్యే ఒకే ఒక బస్సు.
మట్టిరోడ్డైతేనేం, ఆ మట్టిరోడ్డెమ్మటంతా చెట్లు.
తాతలకాలం నాటి చెట్లు. ఎర్రమందారాలు.
అంతా ఎరుపూ, ఆకుపచ్చాను!

ఆ పచ్చదనం, పేద్ద పేద్ద చెట్లు చూసి - కాకులు దూరని కారడివి అని చదుకున్నది గ్యాపకం వచ్చింది.
వాడితో అదే అంటే, ఓరి పిచ్చోడా అని చూసి ఇది అడివేరా అన్నాడు.
అడివి అనే మాట వినటం తప్పితే చూట్టం అదే మొదలు నాకు.
అలా రికార్డైపోయింది అడవితల్లి గ్యాపకం.

కట్ చేస్తే - విశ్వనాథు వాళ్ళమ్మ, అచ్చం సంగ లానే...

పెద్ద పెద్ద కడియాలు, బులాకీలు, చెవుల చుట్టలు, అమాయకత్వం, ప్రేమ, ఆప్యాయత - అచ్చం అమ్మలానే. అడవితల్లిలానే. చక్కగా మట్టిమూకుళ్ళలో రెండు కూరలు, పప్పు, పప్పుచారు, పెరుగు వేసి కడుపు నిండేలా ఆకలి తీర్చింది తల్లి.

మట్టిమూకుళ్ళో ఉన్న పప్పుచారు ఎంత బాగుందో!
ఆ రుచి ఇంకా తగుల్తూనే ఉన్నది నోటికి, నాలిక్కి, జ్ఞాపకాలకి.
అమ్మమ్మ పెట్టే రాచ్చిప్ప పులుసు, చారుతో సమానంగా నిలబడ్డదా పప్పుచారు.

సరే కడుపు నిండాక, అడివిలోకి పోయొద్దాం అన్నాడు ప్రవీణుగాడు.
వాడో పెద్ద లపాకీగాడు. అడవిలో కోతులన్నా చెట్ల మీద కాం గా కూర్చుంటయ్యేమోకానీ, వీడికి అదీ లేదు.
కాస్త డబ్బున్నవాడవ్వటంతో ఒక లాగూ, టీషర్టు, కళ్ళజోడులతో హంగామా చేసేవాడు.
విశ్వనాథుగాడు సరేననటంతో బయట పడ్డాం.
ప్రవీణుగాడు చొక్కా విప్పేసి నడవటం మొదలుపెట్టాడు.
అదేవిట్రా అంటే, నాకిలా మన సిటీలో తిరగాలని ఉంటుందిరా, కానీ ఇలా తిరిగితే మన్ని అక్కడ పిచ్చోడనుకుంటారు, ఆ తర్వ్తా మా నాన్న నా తాట వొలుస్తాడు.
అందుకు ఇక్కడ విప్పేసా అని వాడి దారిన వాడు ఈలలేసుకుంటూ పోతున్నాడు.

పెద్ద పెద్ద అంగలు వేసేవాడవ్వటంతో మమ్మల్ని వొదిలేసి ఒక అరకిలోమీటరు దూరంలోకెళ్ళిపోయాడు.
కానీ కళ్ళకు కనపడుతూనే ఉన్నాడు.
ఇంతలో ఆరోజటి బస్సొచ్చింది. దుమ్ము రేగింది.

వీడు విప్పిన చొక్కా ఎర్ర రంగుది.
పైగా నెత్తికి చుట్టుకున్నాడు.
మా పక్కనుంచి దుమ్ము లేపుకుంటూ పోయిన బస్సు సడనుగా ఆగింది.

అందులోంచి ఒక భారీ పర్సనాలిటీ దిగటం, ప్రవీణుగాడి మెడ మీద చెయ్యి వెయ్యటం, వీడు హాహాకారాలు చెయ్యటం అన్నీ జరిగిపోయినై.

ఆ దిగినాయన ఒక పోలీసాయన. ఆయన వీడి ఎర్రచొక్కా అదీ చూసి మావోయిష్టు అనుకున్నాట్ట.

ఏసేద్దామని దిగాడు. వీడి మెడ మీద చెయ్యేసాడు.

ఇంతలో విశ్వనాథుగాడొచ్చి సార్, మా అయ్య పేరిది, ఫారెష్టు ఆఫీసరు, మేమంతా ఊర్కే వొచ్చి ఈడ తిరుగుతున్నాం, వాడు మావోడే అని చెప్పి ఆ భారీబాబాయిని శాంతపరిచాడు.

బస్సు మళ్ళీ దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది.

అప్పట్నుంచి ప్రవీణుగాడు, ఇంకో ఇరవై ఏళ్ళదాకా ఎర్రరంగు చొక్కా వెయ్యలేదు, వేసిన చొక్కా ఎప్పుడూ బయట విప్పలేదు.

సరే, అదలా పక్కనబెడితే, ఆరోజుకి అక్కడ పారుతున్న ఏళ్ళు, సెలయేళ్ళు అన్నీ చూస్కొని సాయంత్రంకల్లా ఇంటికొచ్చి పడితిమి.

ఇంటికొచ్చి అన్నం తిన్నాక లాంతర్ల వెలుతుర్లో కూర్చొని ఆ రోజు సంగతులు నెమరేసి ప్రవీణుగాడ్ని ఆటపట్టిస్తూంటే, విశ్వనాథుగాడన్నాడు అరే ఈ పక్కన గోండులోల్ల గూడెం ఉంది. ఆళ్ళు రాత్రి చీకటిపడ్డాక నిప్పు మంటలేసి, డాన్సులు అవ్వీ చేస్తారు. పోయి చూసొద్దాం అన్నాడు.

ఇంతలో వాళ్ళ నాన్న రావటం, ఆయన దగ్గరున్న జీపెక్కి ఆ గోండు గూడేనికి పోవటం జరిగింది.
అరెరే, ఎంత అందంగా వున్నారు ఆ అడివి తల్లి బిడ్డలు.
వాళ్ళ గూడెం కూడా అంత బాగుంది.
రాత్రి పూటే ఉన్న నాలుగు సందులు శుభ్రంగా తళతళలాడిపోతూ ఉన్నవి.
అన్ని గుడిసెలకి తలుపుల్లేవి, ఉత్త నార పరదాలు ఉన్నై.

ఆ జీపుడ్రైవరు బోల్డుసార్లు వచ్చినట్టున్నాడక్కడికి, సరాసరి నెగడు దగ్గరికి తీసుకుపొయ్యాడు.
అప్పుడే చుట్టూ చేరుతున్నారంతా. రకరకాల రంగులు. ఆ ఆడపిల్లల అందం, సహజమైన అందం ముందు నగరవాసుల పిల్లలెంతయ్యా?
స్వచ్ఛమైన నవ్వులు. మళ్లీ అలాటి నవ్వులు ఎక్కదా చూడలా.

అందులో కొంతమంది చిన్నపిల్లలు ఈ మా పట్నపోళ్ళని చూసి ముసిముసి నవ్వులు.
మొత్తానికి డాన్సు మొదలయ్యింది. ఎంత బాగుందో!
చెంచులక్ష్మి సినిమాలో చెంచులు డాన్సు చేసినట్టు ఉన్నది.

కాకపోతే అంత డ్రమాటిక్ గా కాకుండా చాలా సహజంగా ఉండటంతో అది అలా జ్ఞాపకంలో నిలిచిపొయ్యింది.

ఆ నాట్యాల మధ్యలో మమ్మల్ని కూడా ఓ చిందెయ్యమన్నారు.

దరిద్రం పట్నవాసం అలవాట్ల వల్ల, నాగేశ్వర్ర్రావు, రామారావు సినిమా డాన్సులు బాగా బుర్రకెక్కినవాళ్ళమవ్వటం వల్లా పిచ్చిపిచ్చి గంతులు వేసి వాళ్ళు నవ్వుకునేట్టు చేసామనుకో! అది వేరే సంగతి. చిన్నపిల్లలైతే విరగబడి నవ్వారు మా పిచ్చి గంతులు చూసి. వాళ్ళు మాకు పంచిన ఆనందానికి అలా పిచ్చి గంతులతో రీ-పే చేసమని ఇప్పుడు అనిపిస్తుంది. అలాగన్నా వాళ్ళ రోజులో నవ్వులు పూయించాంగా. అది చాల్లే!

అప్పుడంటే వయసులో ఉన్నాం, తారలు తమ్యాలు తెలియవు కాబట్టి గడిచిపోయింది కానీ, ఇప్పుడు మళ్ళీ ఆ చిందేసే ఛాన్సొస్తే ఆ మూమెంటు చాలా జాగ్రత్తగా బంధించుకుని వుండేవాడిని.

అలా ఆ రాత్రి గడిచిపోయి రెండో రోజు పొద్దున్నే కడుపు నిండా మెక్కి, సైకిలు షాపుకెళ్ళి సైకిళ్ళద్దెక్కు తీసుకుని పోయి, కడెం ప్రాజెక్టులో గడిపి వొస్తిమి.

ఎంత బాగుందో కడెం ప్రాజెక్టు. ఇంకా అంత అందంగానూ, అంత పచ్చదనంతోనూ, అలానే ఉన్నదో లేదో తెలవదు.
ఇదంతా, ఈ అందమైన అనుభూతులు, ఆ గోండులు, అడవితల్లి బిడ్డలు, వ్యవహారాలు, జీవితం, అందాలు, అడవి ఎలా ఉంటుందో తెలుసుకున్నా క్షణాలు, వాళ్ళమ్మ కడియాలు, బులాకీ, ప్రేమ, ఆప్యాయత ఎప్పటికి మర్చిపోలేనిదయ్యా!

మళ్లీ ఆ చాన్సొతుందో లేదో తెలియదు కానీ, ఇవి మటుకు భద్రంగా ఉన్నై నా వద్దే!

ఇదంతా జరిగి దాదాపు ముప్ఫై ఏళ్ళు పైనే!

విశ్వనాథుగాడు ఎక్కడున్నాడో తెలవదు ఇప్పుడు.
వుంటే మళ్ళీ ఓ సారి వాడి ఊరికి తీసుకెళ్లమని అడగాలి.
ఒరే విశ్వనాథూ ఎక్కడున్నావురా! కనపడు ఓ సారి....
ఆ అడవి తల్లి వొడిలోకి తీసుకెళ్ళు మళ్ళీ!

జై సంగమ్మ!
జై బాహుబలి!
జై విశ్వనాథుడి తల్లి!

No comments:

Post a Comment