Friday, August 28, 2015

ఆడంగులొస్తే అంతా గలగలలు - బావుబలి!

ఉదయం తొమ్మిదిగంటల వేళ.

ఆరోనంబరు కాలవకి ఆడవాళ్ళు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. పిల్లలకి చద్దన్నాలు పెట్టి బళ్ళోకి పంపి. మొగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పొలాలకి, వీధిలోకి వెళ్ళగా ఇల్లాళ్ళు ఇల్లు కడుక్కుని, పొయ్యి అలుక్కుని. బిందెల నిండా ఉతకవలసిన బట్టలు నింపుకొని కాలవకి వస్తున్నారు.

ఓ పక్క గాడిబావి దగ్గర స్తానాలు. శివాలయంలో గంటలు. కోనేరు దగ్గరున్న చింతచెట్టు కింద పైనా పిల్లలు పక్కనే ఉన్న కోసురాయి మీంచి కోనేట్లోకి దూకులాటలు. అల్లాటి సమయంలో చల్లపల్లిలో ఉన్న అందరు ఆడంగులూ, అన్ని వర్గాల ఆడంగులు కాలవకొస్తున్నారు. ఆడంగులొస్తే అంతా గలగలలు. పిల్లలొస్తే ముసిముసి నవ్వులు, కిలకిలలు.

 కాలవకి వెళ్ళే దోవంతా కాలిమట్టెల మోతలు, కాలికడియాల మోతలు ఠంగు ఠంగున మోగుతున్నయి. కాళ్ళగజ్జెల పట్టిలు ఘల్లు ఘల్లుమంటున్నాయి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. అందరూ కాలవ వొడ్డుకొచ్చారు.

కాలవ వొడ్డెమ్మట చీర అంచులా ఆ చివర్నుంచి ఈ చివర్దాకా రంగురంగుల ఆడవాళ్లు. వొడ్డుకొస్తూనే పలకరింపులు, వేళాకోలాలు, చర్చలు.

"రేత్రి సినిమాకెళ్ళావేంటే?" రంగమ్మ బట్టలు తడుపుతూ పుల్లమ్మనడిగింది.
"ఆ మూడోసారి. నువ్వెళ్ల్లేదేటి" అంది పుల్లమ్మ.
"నేనారుసార్లు సూసినాలేయే" అని గొప్పలు పోయింది రంగమ్మ.
"ఎబ్బే! మా మావ పొలంపనుల్లో ఇరుక్కుపోయుండాడు. లేకుంటే నే పదిసార్లు చూసొత్తులేమ్మా ఈపాటికి" అని సర్దిచెప్పింది పుల్లమ్మ.

కొద్దిగా వొడ్డుకాపక్క అవంతిక సీతాకోకచిలకల మీద కబుర్లు సాగుతున్నాయి. "ఆ చిలకలు కాంప్యూటరో ఏందో అందులో చేసారంటగా. కంపూటరులో సేయటమేందో, ఈ కాలవెమ్మడి ఎన్నున్నాయో రాజమౌళీ సూసినట్టు లేడు." అంది పోలమ్మ.

"సరేలే, మన కాలవెళ్ళి కిష్టలో కలిసేప్పుడు ఇంతబారున పైనుంచి పడుద్ది. దాన్నే అటూఇటూ సేసి నీటికొండ సేసినాడు కాదేటి. నీ చిలకల సంగతి పక్కనెట్టు" అని మాట పొడిగించింది చిట్టెమ్మ.

"ఓసోస్! శివుడి శివలింగమెత్తి అలా బుజానేసుకున్నది కూడా కంపూటరేనంట. అయినా ఆ కండలు అయ్యీ చూసి పెబాస్ నా మావనుకున్నా" అంటూ పోలమ్మ పడాపడా చీర ఉతుకుతోంది.

ఇంకా ఆ పైన సూరమ్మ అంటోంది " కీరోణి ఏం గొట్టాడే ఆ మూజిక్కు. తుప్పట్టిన సెవుల సిలుమంతా ఒదిలిపొయ్యింది. ఏం గొట్టాడు ఏం గొట్టాడు"

"సర్లే! అదట్ట పెట్టు. శివగామేందే. అసిలు రమ్మికిష్ణేనా ఆయమ్మ. అంతలా పొడిసేశింది యాచ్చను. కళ్ళు అట్టా నిలబెట్తేసిందిపో! " అంది పేరమ్మ.

"ఆ! శివగామిలేపోతే సినిమా లేదు, కట్టప్ప లేపోతే పెపంచకంలో కత్తులూ లేదులేమ్మా! ఆమాత్తిరం ఉండాలిగాదేంటి సినిమాంటే. అల్లప్పుడెప్పుడో కత్తి కాంతారావ్ తిప్పు సూసా. మళ్ళ ఇప్పుడే" సగం చీర కట్టుకుని మిగతా చీర ఉతుకుతున్న సరోజ.

పక్కనే ఉన్న గిరిజతో " ఒసేవ్! బావుబలి బట్టలు అయ్యీ ఎంత బాగుండాయే. నీ దర్జీమొగుడు కుట్టించ్చినాడా ఏంది" అని వేళాకోలమాడుతోంది ఎంకమ్మ.

ఒకచోట దేవసేన మీన కబుర్లు. ఇంకోపక్క పాటల కబుర్లు. ఇంకో పక్క చైతన్యప్రసాదుగారి ఐటము సాంగు మీద కవుర్లు. ఇంకో పక్క రానా మీద కవుర్లు. ఇంకోపక్క నాజర్ మీద తిట్లు. ఇంకోపక్క కాలకేయనాయకుడి మీన కవుర్లు.

అల్లా కవుర్లన్నీ అయిపోయినాక పదిన్నరకల్లా కాలవ వొడ్డు ఖాలీ అయిపోయింది. అంతా నిశ్శబ్దం. మురికి బట్టలు ఉతికినట్టే, సినిమా గురించి మంచీ చెడు, చిన్న విషయం, పెద్ద విషయం సర్వం కిష్టమ్మ కాలవ వొడ్డున ఉతికేసి గిలక్కొట్టి వెళ్ళిపోయారు ఆడంగులు.

కిష్టమ్మ కాలవ ఆ కవుర్లన్నీ వింది. ఆ నీళ్ళు ముందుకెళ్లిపోతున్నాయ్. రేపు మళ్ళీ కొత్త నీళ్ళొస్తాయ్. మళ్ళీ బావుబలి మాటలిని వెళ్ళిపోతాయ్. నీళ్ళు వెళ్ళిపోతాయ్. అనుభూతులు అక్కడ గాల్లో నిలబడుకొని ఉంటాయ్.

**************

శంకరమంచోరూ - నమోన్నమ:

No comments:

Post a Comment