Sunday, August 2, 2015

అంత అందం ఈ మధ్యలో ఎక్కడా చూడలా!

బులాకీ
బాహుబలిలో బులాకీ
అదే శివగామి బులాకీ.
ఎంత బాగుందో అమ్మగారు.

నెత్తిమీద పాపిట బిళ్ల ఎంత అందమో, ముక్కుకి బులాకీ అంత అందం.
కాలికి మెట్టెలెంత అందమో, ముక్కుకి బులాకీ అంత అందం.
చెవులకి బుట్టలు ఎంత అందమో, ముక్కుకి బులాకీ అంత అందం.

ముక్కుకి పుడక ముందొచ్చి బులాకీ తర్వాతొచ్చిందిట.
కైరోలో బులాక్ అనే ప్రాంతంలో పెట్టుకునేవారనీ, అది మిగతాదేశాలకు పాకిందని వినికిడి.
వినికిడి అంటే చెవులకు సంబంధించింది.
చెవులు అన్నిసార్లూ అన్నీ సరిగ్గా వినలేవు.
అందువల్ల నేన్నమ్మను ఆ సంగతి.

బులాకీ అనేది, మన కోయమ్మలు కనిపెట్టిందని నా ఘాట్టి నమ్మకం.
పాతకాలం వాళ్ళను చూసారనుకో ముక్కుపుడక రెండు వేపులా ఉండేది.
రెండు వైపులా ఉండి మధ్యలో లేపోతే ఎట్లానని మధ్యలో దూలానికి బులాకీ కట్టేసారు.

దూలానికి తుల అన్నది పేరు.
తుల బుల అయ్యి, బుల పండితుల చేతిలో బులాకీగా మారిపోయింది.
అంతే అంత చింపులు.
అంతే కానీ బులాక్ కి బులాకీకి సంబంధం లేదయ్యా!

అది మనదగ్గరే మొదలై, ఈజిప్టులో బులాక్ ప్రాంతానికి మనవాళ్ళల్లో ఒకళ్ళు వలస వెళ్ళటంతో అక్కడ వ్యాపించిపోయింది. అదీ సంగతి.

సరే అదంతా పక్కనబెడితే ఏ గుళ్ళో అయినా అమ్మవారి విగ్రహాలు చూడండి.

మీకు బులాకీ ఖచ్చితంగా కనపడుతుంది.
ఆ అందం ఏమని చెప్పేది.

అదీ గాక లలితాసహస్రనామంలో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని ఉన్న పాదం అర్థం కూడా అదే!
బులాకీ ఉండగా నాకు తారలెందుకురా పిచ్చివాడా అని అమ్మవారు అనటం అన్నమాట.

బులాకీకి నాకు అవినాభావ సంబద్ణం ఉన్నది.
నాకంటే నాకు కాదు కానీ, నా వృత్తికి.

ఒక ఇరవై ఐదేళ్ల క్రితం చార్టర్డు అక్కవుంటన్సీ చేస్తున్నప్పుడు, జి.ఎం.ఆర్ గ్రూపు మా పెద్దాయన వెంకాటాద్రి గారి దగ్గరే ఉండేది.

దాని ఆడిట్ల కోసం నా సహాధ్యాయులంతా పోటాపోటీలు పడేవాళ్ళు.

ఆ రకంగా బయటికి పోయి, కాస్త ఊపిరి పీల్చుకుందామని.

మా వెంకటాద్రి గారు, నన్ను ఆ రాజాం రూటుకు పర్మనెంటు చేసేసి, శ్రీకంతుతోనూ, శ్రీనివాసుతోను పంపించేసేవాడు.
రాజాం అంటే మాటలా.

బొబ్బిలి దగ్గరిది.
అంతా నేలతల్లి బిడ్డలు.
మాంచి భాష.
చెవులారా, చేతులారా పలకరించే మనుషులు.
ఆప్యాయత, ప్రేమ అంటే ఆ భూమి బిడ్డల దగ్గర నేర్చుకోవాలె.
అక్కడి అమ్మలకు, ఆడవాళ్లకు ఈ బులాకీ ఎంత శోభగా ఉండేదో!
సికాకుళం నుంచి ప్రయాణాల్లో, టెక్కలికి ప్రయాణాల్లో - ఎన్నో బులాకీలూ!
ఎన్నెన్నొ బులాకీలు. ఎంతందంగా ఉండేవనీ!

బంగారు తీగల బులాకి.
రాగి చువ్వల బులాకీ.
చెట్టు తీగల బులాకీ.
ఇలా రకరకాలు.
ఆ నేలతల్లి బిడ్డల ముక్కులకు.
అచ్చు సంగమ్మలానే!
అచ్చు రోహిణిలానే.
ఆ బులాకీతోనే సంగమ్మకు అంత ఊపొచ్చింది.
ఆ పాత్ర అలా నిలబెట్టేసింది.
జై సంగమ్మా! జై జై బులాకీ!

సరే అది అలా వదిలి శివగామి అమ్మ దగ్గరకొచ్చేస్తే, ఎంత రాజసం వొచ్చేసింది ఉత్త బులాకీతో.

అలా రాజమందిరంలోకి నడుచుకుంటూ వొస్తూ వుంటే, ఆ అడుగులకు మడుగులుగా ఆ బులాకీ ఊగుతూ ఎంతందం తెచ్చిందో.

కట్టప్పా అని అరిచినప్పుడు ఆ బులాకీ కూదా ఎంత ఆవేశం చూపించిందో!

మార్తాండను వేసేసినప్పుడు ఊగిన బులాకీ ఎంత రౌద్రంగా ఉన్నదో!

బాహుబలి అని నామకరణం చేస్తున్నప్పుడు ఆ బులాకీ ఎంత ఆనందంగా ఉన్నదో!

ఇద్దరినీ ఒడి చేర్చుకున్నప్పుడు ఆ బులాకీ ఎంత మమతల తల్లిలా ఉన్నదో!

అంత అందం ఈ మధ్యలో ఎక్కడా చూడలా!

శివగామి - బులాకీ జీవితాన్ని ధన్యం చేసిన నీవు ఒక శక్తివి. ఆదిశక్తివి. పరాశక్తివి.

రాజమాత అయిపోయినాక పిల్లలు పెద్దవాళ్ళపోయినందుకు తీసేసావేమో కానీ, నే చాలా బాధపడ్డా శివగామి మాతా! అంత అందమైన బులాకీని అలా తీసేసావేమిటని!

సరే - సివరాఖరికి వొచ్చేసి - జై శివగామి. జై జై బులాకీ! అని ఇప్పటికి ఊరకుంటా.

అయ్యా, ఆ మేకపు తీసిచ్చిన, చేసిచ్చిన వారందరికీ నమస్సులతో !

No comments:

Post a Comment