Friday, August 28, 2015

ఆడంగులొస్తే అంతా గలగలలు - బావుబలి!

ఉదయం తొమ్మిదిగంటల వేళ.

ఆరోనంబరు కాలవకి ఆడవాళ్ళు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. పిల్లలకి చద్దన్నాలు పెట్టి బళ్ళోకి పంపి. మొగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పొలాలకి, వీధిలోకి వెళ్ళగా ఇల్లాళ్ళు ఇల్లు కడుక్కుని, పొయ్యి అలుక్కుని. బిందెల నిండా ఉతకవలసిన బట్టలు నింపుకొని కాలవకి వస్తున్నారు.

ఓ పక్క గాడిబావి దగ్గర స్తానాలు. శివాలయంలో గంటలు. కోనేరు దగ్గరున్న చింతచెట్టు కింద పైనా పిల్లలు పక్కనే ఉన్న కోసురాయి మీంచి కోనేట్లోకి దూకులాటలు. అల్లాటి సమయంలో చల్లపల్లిలో ఉన్న అందరు ఆడంగులూ, అన్ని వర్గాల ఆడంగులు కాలవకొస్తున్నారు. ఆడంగులొస్తే అంతా గలగలలు. పిల్లలొస్తే ముసిముసి నవ్వులు, కిలకిలలు.

 కాలవకి వెళ్ళే దోవంతా కాలిమట్టెల మోతలు, కాలికడియాల మోతలు ఠంగు ఠంగున మోగుతున్నయి. కాళ్ళగజ్జెల పట్టిలు ఘల్లు ఘల్లుమంటున్నాయి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. అందరూ కాలవ వొడ్డుకొచ్చారు.

కాలవ వొడ్డెమ్మట చీర అంచులా ఆ చివర్నుంచి ఈ చివర్దాకా రంగురంగుల ఆడవాళ్లు. వొడ్డుకొస్తూనే పలకరింపులు, వేళాకోలాలు, చర్చలు.

"రేత్రి సినిమాకెళ్ళావేంటే?" రంగమ్మ బట్టలు తడుపుతూ పుల్లమ్మనడిగింది.
"ఆ మూడోసారి. నువ్వెళ్ల్లేదేటి" అంది పుల్లమ్మ.
"నేనారుసార్లు సూసినాలేయే" అని గొప్పలు పోయింది రంగమ్మ.
"ఎబ్బే! మా మావ పొలంపనుల్లో ఇరుక్కుపోయుండాడు. లేకుంటే నే పదిసార్లు చూసొత్తులేమ్మా ఈపాటికి" అని సర్దిచెప్పింది పుల్లమ్మ.

కొద్దిగా వొడ్డుకాపక్క అవంతిక సీతాకోకచిలకల మీద కబుర్లు సాగుతున్నాయి. "ఆ చిలకలు కాంప్యూటరో ఏందో అందులో చేసారంటగా. కంపూటరులో సేయటమేందో, ఈ కాలవెమ్మడి ఎన్నున్నాయో రాజమౌళీ సూసినట్టు లేడు." అంది పోలమ్మ.

"సరేలే, మన కాలవెళ్ళి కిష్టలో కలిసేప్పుడు ఇంతబారున పైనుంచి పడుద్ది. దాన్నే అటూఇటూ సేసి నీటికొండ సేసినాడు కాదేటి. నీ చిలకల సంగతి పక్కనెట్టు" అని మాట పొడిగించింది చిట్టెమ్మ.

"ఓసోస్! శివుడి శివలింగమెత్తి అలా బుజానేసుకున్నది కూడా కంపూటరేనంట. అయినా ఆ కండలు అయ్యీ చూసి పెబాస్ నా మావనుకున్నా" అంటూ పోలమ్మ పడాపడా చీర ఉతుకుతోంది.

ఇంకా ఆ పైన సూరమ్మ అంటోంది " కీరోణి ఏం గొట్టాడే ఆ మూజిక్కు. తుప్పట్టిన సెవుల సిలుమంతా ఒదిలిపొయ్యింది. ఏం గొట్టాడు ఏం గొట్టాడు"

"సర్లే! అదట్ట పెట్టు. శివగామేందే. అసిలు రమ్మికిష్ణేనా ఆయమ్మ. అంతలా పొడిసేశింది యాచ్చను. కళ్ళు అట్టా నిలబెట్తేసిందిపో! " అంది పేరమ్మ.

"ఆ! శివగామిలేపోతే సినిమా లేదు, కట్టప్ప లేపోతే పెపంచకంలో కత్తులూ లేదులేమ్మా! ఆమాత్తిరం ఉండాలిగాదేంటి సినిమాంటే. అల్లప్పుడెప్పుడో కత్తి కాంతారావ్ తిప్పు సూసా. మళ్ళ ఇప్పుడే" సగం చీర కట్టుకుని మిగతా చీర ఉతుకుతున్న సరోజ.

పక్కనే ఉన్న గిరిజతో " ఒసేవ్! బావుబలి బట్టలు అయ్యీ ఎంత బాగుండాయే. నీ దర్జీమొగుడు కుట్టించ్చినాడా ఏంది" అని వేళాకోలమాడుతోంది ఎంకమ్మ.

ఒకచోట దేవసేన మీన కబుర్లు. ఇంకోపక్క పాటల కబుర్లు. ఇంకో పక్క చైతన్యప్రసాదుగారి ఐటము సాంగు మీద కవుర్లు. ఇంకో పక్క రానా మీద కవుర్లు. ఇంకోపక్క నాజర్ మీద తిట్లు. ఇంకోపక్క కాలకేయనాయకుడి మీన కవుర్లు.

అల్లా కవుర్లన్నీ అయిపోయినాక పదిన్నరకల్లా కాలవ వొడ్డు ఖాలీ అయిపోయింది. అంతా నిశ్శబ్దం. మురికి బట్టలు ఉతికినట్టే, సినిమా గురించి మంచీ చెడు, చిన్న విషయం, పెద్ద విషయం సర్వం కిష్టమ్మ కాలవ వొడ్డున ఉతికేసి గిలక్కొట్టి వెళ్ళిపోయారు ఆడంగులు.

కిష్టమ్మ కాలవ ఆ కవుర్లన్నీ వింది. ఆ నీళ్ళు ముందుకెళ్లిపోతున్నాయ్. రేపు మళ్ళీ కొత్త నీళ్ళొస్తాయ్. మళ్ళీ బావుబలి మాటలిని వెళ్ళిపోతాయ్. నీళ్ళు వెళ్ళిపోతాయ్. అనుభూతులు అక్కడ గాల్లో నిలబడుకొని ఉంటాయ్.

**************

శంకరమంచోరూ - నమోన్నమ:

Saturday, August 22, 2015

బాహుబలి - కీరవాణి అదరగొట్టిన పీసులు

అయ్యా బాహుబలి మొదటి భాగంలో (Pre Interval) కీరవాణి అదరగొట్టిన పీసులు, నాకు నచ్చినవేలే...

1. బాహుబలి - ద బిగినింగ్ అని వచ్చేచోట
2. ఓ ఓ అంటూ జీవనది పాట మొదలయ్యేప్పుడు
3. జీవనది అంటూ అయిపోయేచోట జలపాతపు హోరు
4. శివగామి చెట్టుకొమ్మ పట్టుకొని నిల్చున్నప్పుడు
5. శివగామి పరమేశ్వరా అని కేకపెట్టినప్పుడు
6. శివగామి తల నీటిలోకి వెళ్ళిపోతున్నప్పుడు
7. శివుడు సూర్యోదయంలో వెలిగిపోతున్నప్పుడు
8. శివుడు పెద్దవాడవుతుండగా కొంద మీద కూర్చొని పైకి జంపు చేసేచోట
9. శివుడు చేతిలో మొదటిసారి చెట్టుకొమ్మ పట్టుతప్పేవేళ
10. శివుడు శివలింగం భుజాన పట్టి నీళ్ళల్లో అడుగేసేప్పుడు
11. అవంతిక ధీవరా అంటూ పిలిచినప్పుడు చెట్టుకొమ్మ అందేసుకున్న శివుడు జంపు చేస్తున్నప్పుడు
12. శివుడు ఊడల్లో వేళ్లాడి మళ్ళీ పైకి వెళ్లేప్పుడు శిఖర కఠోర అని వచ్చే లైను దగ్గర
13. శివుడి విల్లునుంచి బాణం చెట్టులో దిగబడేవేళ
14. అవంతిక ఎంట్రీ ఇన్ ద ఫారెష్ట్
15. అవంతిక కాశీ అని అరిచేచోట
16. కట్టప్ప ఎంట్రీలో నిలబడుకొనున్నప్పుడు అస్లం ఖాన్ ఎంట్రీ దగ్గర
17. అస్లంఖాన్ నిప్పులు కట్టప్ప డాలు మీదకు విసిరినప్పుడు
18. కట్టప్ప కత్తిని చీల్చేసేప్పుడు, ఆ తర్వాత పది సెకన్లు
19. రానా ఎంట్రీ - బోనాల్లో మహిష మ్యూజిక్కు
20. రానా మహిషాన్ని ఆపుతున్నప్పుడు
21. రానా మహిషపు తలమీద పిడిగుద్దు గుద్దినప్పుడు
22. మంచు జారినప్పుడు, అవలాంచు చూపించేప్పుడు
23. శివుడు మొదటిసారి గుర్రమెక్కి మాహిష్మతి వైపు దుసుకెళుతున్నప్పుడు
24. శివుడు మాహిష్మతిలోకి ఎంట్రీ - రాజ్యమా ఉలికిపడునప్పుడు ప్రభాసు నడక
25. శివుడిని బాహుబలిగా చూపించేప్పుడు
26. శివుడు భల్లాలుడి విగ్రహం పడిపోయేప్పుడు తాడు పట్టుకొన్న దగ్గరినుంచి ఆ పడిపోయిన ఆయనకు తాడు అందించేవరకు

**************************
కీరవాణి అదరగొట్టిన పీసులు ఇంటర్వెల్లు తర్వాత భాగంలో

 1. ·         దొంగలకోటలో ప్రభాస్ పెద్దది, పెద్దది అనే చోట
 2. ·         మనోహరీ పాట
 3. ·         సాకేతుణ్ణి కొండమీంచి దూకి పట్టుకున్నాక రానా కట్టప్పను చూసి తాడు లాగేప్పుడు
 4. ·         కాలకేయ ఆర్మీ ఇంట్రో
 5. ·         పదాతి దళం ఏనుగులతో గుర్రాలతో బయలుదేరినప్పుడు
 6. ·         బాహుబలి అమ్మవారి దగ్గరికొచ్చేప్పుడు
 7. ·         తన రక్తం సమర్పించాక బాహుబలి చెయ్యెత్తి నుంచున్నప్పుడు (By the way that guy who holds the sword is the same guy who rescues SivuDu in the water and let Sivagami go.. :) )
 8. ·         కాలకేయ నాయకుడు నీతో కొడుకుని కంటాను అన్నప్పుడు శివగామి చెప్పే డైలాగప్పుడు
 9. ·         శిబహోల్ బాహుబలి అని వడిసెల్లాంటి గుండు రెడీచేసినప్పుడు
 10. ·         ధర్మానికే దారిచూపించిన బాహుబలి లేడని ఏవరన్నారయ్యా అంటూ కట్టప్ప బాహుబలికత్తి గుండుకు తాకించుకునే సీనప్పుడు
 11. ·         పరదాలు కాలబెట్టినప్పుడు ( rAnA was very handsome in that scene, by the way.)
 12. ·         శివుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరిగెత్తి దేవసేన వైపు వస్తున్నప్పుడు and the next 30 seconds (This was one of the best clip music wise. Keera excelled here) **
 13. ·         దేవసేనను గుర్రబ్బగ్గీలో పడేసి మొదటిసారి పరుగులెత్తించినప్పుడు
 14. ·         గుర్రబ్బగ్గీ దేవసేన ఎస్కేపు సీనులో, గడ్డీగాదం మంటల్లోంచి బయటకొచ్చేప్పుడు వాడిన మాయాబజారు మ్యూజిక్కు బిట్టు.
 15. ·         భద్రగాడి కత్తి శివుడు ఉత్తచేతుల్తో ముక్కలు చేసినప్పుడు
 16. ·         యువరాజా మిమ్మల్ని కాపాడటం నా ధర్మం అని కట్టప్ప డైలాగు కొట్టేచోట
 17. ·         కట్టప్ప సిద్ధా సీను
 18. ·         భద్రను వేసేసేచోట
 19. ·         వానపడేప్పుడు (keers excelled here too)
 20. ·         కట్టప్ప అనిలా అని అరిచినప్పుడు
 21. ·         కట్టప్ప మోకాళ్ళ మీదకొచ్చేసి జారిపోయేప్పుడు
 22. ·         కట్టప్ప బాహుబలీ అని అరచేచోట (Sathyaraj's expression was fantastic)
 23. ·         శివుడి పాదం పట్టుకున్నప్పుడు కీరవాణి " " అని బిట్టు ఎత్తుకొనేవేళ
 24. ·         శివుడి కాలు నెత్తి మీద పెట్టేసుకున్నాక
 25. ·         శివగామి భల్లాలుడిని ఎత్తుకొని ప్రాకారంలో ఉన్నప్పుడు బాహుబలి అని నామకరణం చేసేప్పుడు (keers exceleed here too)
 26. ·         శివగామి రాజప్రాసాదం ఎంట్రీ (Keers was excellentecious)
 27. ·         శివగామి కట్టప్పని పిలిచి రక్తంతో కడిగెయ్ అన్నప్పుడు
 28. ·         శివగామి కుతంత్రం కాదు రాజతంత్రం అంటూ మార్తాండను వేసేసేప్పుడు
 29. ·         శివగామిని భల్లాదేవుడిదే సింహాసనం అని బిజ్జలదేవుడు చెప్పమన్నప్పుడు ఉత్త కేర్ కేర్లతో అదరహ
 30. ·         ఇది నా మాట నా మాటే శాసనం అని మమతల తల్లి బిట్టు అందుకునేవేళ
 31. ·         మాహిష్మతి వరక్షాత్రకులీ అంటూ మొదలయ్యేచోట
 32. ·         బాహుబలి కట్టప్పను మామా అని పిలిచేచోట (Sathyaraj was fantastic at that instant)
 33. ·         లేచిందా ఖండించే ఖడ్గం - సూపర్
 34. ·         బాహుబలి కన్నుకొట్టేప్పుడు
 35. ·         భల్లాలుడు రాయి బద్దలు కొట్టేప్పుడు
 36. ·         కాలకేయుడి సైన్యమ్మ్మీదకు పరదాలు వేసి మంట పెట్టేప్పుడు (Again keera excelled here)
 37. ·         మహాసేనా ఘాత్ ప్రతీఘాత్ అని కట్టప్ప అరిచేప్పుడు
 38. ·         కాలకేయ సైన్యం మాహిష్మతి సైన్యం ఢీ కొట్టేప్పుడు మోగే కవచాల శబ్దం
 39. ·         త్రిశూల వ్యూహం ప్రారంభ సమయమప్పుడు
 40. ·         బాహుబలి రెండు బల్లేలతో గుర్రమ్మీద పరుగులు పెట్టేప్పుడు
 41. ·         రానా కత్తుల రథం తీసుకొని పొయ్యేప్పుడు
 42. ·         బాహుబలి గుర్రమ్మీంచి దిగి ఒకణ్ణేసేసి మళ్ళీ గుర్రమెక్కేప్పుడు
 43. ·         బాహుబలి సేనా అంటూ వడిసెల సంకేతమిచ్చాక దూసుకుపొయ్యేప్పుడు
 44. ·         బాహుబలి బండోణ్ణి చెట్టుకు శిలువేసేప్పుడు
 45. ·         కాలకేయుల నల్ల జెండా ఎగిరాక బాహు వెనక్కి తిరిగి గుర్రమ్మీద వెళ్ళేప్పుడు
 46. ·         మరణం మరణం అని డైలాగొచ్చేచోట
 47. ·         "వాడితల నరికి అమ్మపాదాల కింద" అంటూ బాహుబలి దైళాగొదిలేచోట
 48. ·         "నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, మరణాన్ని దాటి నాతో బతికేదెవరు" అని బాహు, కట్టప్ప నల్లజెండాను నల్లోడితో సహా కింద పడేసేప్పుడు.
 49. ·         తర్వాత బాహు తిరిగి కాలకేయుల మీదకు బయల్దేరేప్పుడు (This was ultimate by keera)
 50. ·         కాలకేయక్స్ అంతా కర్రెలెక్కి నుంచుంటే బాహు గుండుతో బద్దలు కొట్టి గుర్రాన్ని ముందుకు జంపించేప్పుడు (Super Keera)
 51. ·         కాలక్ రానాను థోర్ సుత్తితో దెబ్బేసి వెనక్కి పంగలతో వెనక్కీ పంపించాక రానా రక్తం ఊసి మళ్ళీ ముందుకు దూసుకొచ్చేప్పుడు (Lovely keers)
 52. ·         కాలక్ డెత్తు సినూ అటూ ఇటూ మూణ్ణిముషాలు
 53. ·         దేవుడు చనిపోయాడు అని కట్టప్ప బయటపెట్టేప్పుడు
 54. ·         వెన్నుపోటు మహేంద్రా అని కట్టప్ప నిజం బయటపెట్టేప్పుడు
 55. ·         కట్టప్ప బాహును వేసేసేప్పుడు ఆతర్వాత బంగారు కలల్ని అంటూ వచ్చేచోట కీర్స్ అదరగొట్టేసాడయ్యా

అట్లా రెండో భాగంలో ఇన్నిచోట్ల అదరగొట్టేశాడాయన.

కీరవాణీ అందుకో చప్పట్లశోణి.

Tuesday, August 4, 2015

అరెరే, ఎంత అందంగా వున్నారు ఆ అడివి తల్లి బిడ్డలు.!!

సంగ....
సంగమ్మ....
బాహుబలికి అమ్మలగన్న అమ్మ!

ఆ రోహిణమ్మను చూస్తే నాకు మా విశ్వనాథ్ వాళ్లమ్మ గుర్తొచ్చింది.
విశ్వనాథ్ అంటే, నేను చదివిన కాలేజీలోనే బై.పి.సి సెక్షన్లో ఉండేవాడు.
వాడిది ఆదిలాబాద్ జిల్లా. సిటికి చదువుకోసం వచ్చాడు.
వివేకనగర్లో మూర్తిగారింట్లో మేమున్నప్పుడు వాడూ ఆపక్కనే బాచెలర్ రూం తీసుకుని ఉండేవాడు.

వాడి చదువు వేరు, నా చదువు వేరు. నాది లెక్కలు, వాడిది మందులు మాకులు.
అయినా ఒకటే కాలేజవ్వటం వల్ల, పక్క పక్కనే ఉండటం వల్లా స్నేహం పెరిగింది.
పెరగటం అంటే ఓ ఇదిగా కాదు కానీ, ఓ మాదిరిగా...

వాడి రూము బాచిలరు రూము కావటంతో మందు, మాకు, దమ్ము, దగ్గులతో కళకళలాడుతూ ఉండేది.
ఒక్క వాళ్ల అయ్యవారు వొచ్చినప్పుడు తప్ప, రోజూ పార్టీనే.
ఇంటి ఓనరు విజ్జివాడవాడవటం, ఆయన సత్తినారాయణపురంలోనే ఉండటం వీడికి కలిసొచ్చేది.
నాకు దమ్ము, మందు అంటే పరమ చిరాకు.
అందుకని వాడు పిల్చినా వాడి రూముకి వెళ్లేవాడ్ని కాదు.
అది వాడికి కచ్చగా ఉండేది. పిల్చినా రాడేమిటని.
అలా ఒక ఆర్నెల్లు గడిచినై.
ఆ ఆర్నెల్లలో వాడు ఒక యాభైసార్లన్నా పిల్చుంటాడు.
నేను వందసార్లు రానని చెప్పుంటా.

చిక్కడపల్లి సుధా హోటలు మాకు రచ్చబండ.
పిచ్చాపాటీలు, కచ్చలపోట్లాటలూ అన్నీ అక్కడే.
సాయంత్రం ఏడయ్యేప్పటికి గుంపు తయారు.
అలా ఓ రోజు పిచ్చాపాటీల్లో ఉండగా వీడొచ్చాడు.
ఎవరు ? విశ్వనాథుడు.
ఈ లావున బెల్ బాటము, పైన చారల చొక్కా!
నోట్లో సిగరెట్టు. ఆకాశంలో పొగలు
అబ్బో ఆ అందం చూస్తే కానీ తెలవదు.

అరేయ్, రేపు నేను ఊరెళ్తున్నా, ఎవడన్నా నాతో వస్తాడా అన్నాడు.
క్రిస్టమస్ శలవలు. కోతికి కొబ్బరిచిప్పలు.
ఇహ అంతా, అంటే ఒహ ఇరవైమంది పొలోమని నేనొస్తా, నేనొస్తానని అరుపులు కేకలు మొదలెట్టారు.

పీర్ ప్రెషరు మూలాన నేనూ కేకలు పెట్టా.
కేకలైతే పెట్టాకానీ, నాన్ననడిగితే కాక తీరిపోతుందనిపించింది.
ఎందుకంటే బస్సు ఖర్చులు మిగతావి అన్ని కలిపి ఓ వంద పైనే.

సరే ఏదైతేనేం అని భోజనం చేసేసాక నాన్న దగ్గర సణిగా!
అక్కడ కేకలు పెట్టినా ఇక్కడ మాట సరిగ్గా బయటకు పెగలకపోటంతో ఏవిటి అన్నారాయన.
తెత్తెన్నా...మెమ్మెమ్మె...విశ్వనాథు వాళ్ల ఊరికి అందరూ పోతున్నారు. నేను కూడా పోతా అన్నా.

ఎంత కావాలి అన్నారు. ఒక వంద అన్నా!
వెంటనే జేబులో చెయ్యి పెట్టి రెండు వందలు ఇచ్చారు.
ఉబ్బు కాస్తా తబ్బిబ్బు అయ్యి ఇంకేదో అయ్యింది.
నాన్నా, ఇది రెండు వందలు అన్నా!
నేను గట్టిగానే అన్నా అనుకున్నా.
కానీ అనలా...లోపలే లోతుగా ఉండిపోయిందనుకుంటా.

నాన్న, మళ్ళీ, ఏమిటీ అన్నారు.
ఈసారి కాస్త గట్టిగా ఇది రెండు వందలు అన్నా.
పైన వంద నిర్మల్ లో దిగి రామకృష్ణ మావయ్యకిచ్చెయ్ అన్నారు.
రామకృష్ణమావయ్య వాళ్ళిల్లు నిర్మల్ బస్స్టాండుకి ఆనుకునే.
సరేనని బుర్ర ఊపి, బట్టలు సద్దుకుని బయల్దేరాం తర్వాతి రోజు.

బయల్దేరాం అంటే, ఓ సుధా హొటలు దగ్గర కేకలు పెట్టిన ఇరవై మందీ అనుకునేరు.
ఆరుగురం, మొత్తం.
అంతే ఆరుగురం.

మిగిలినవాళ్ళ ఇంట్లోవాళ్ళు తాటలు తీస్తామని కొరడాలెత్తుకోటంతో మానేస్తిరి.
వాడి ఊరు కడెం ప్రాజెక్టు దగ్గర.
వాళ్ల నాన్న ఫారెష్టు డిపార్టుమెంటులో ఆఫీసరు.
యాభై కిలోమీటర్లనుకుంటా నిర్మల్ వాడి ఊరికి. నిర్మల్ మీదనుంచే వెళ్ళాలి.
వెళ్ళేప్పుడు కాక వచ్చేప్పుడు దిగి ఇచ్చేసి ఆ తర్వాత బస్సెక్కుదాంలే అని విశ్వనాథుగాడు అన్నాడు.

ఇంతమంది రామకృష్ణమావయ్య వాళ్ళింటికి వంద రూపాయలివ్వటం కోసం వెళ్తే ఆయన ఖంగారు పడతాడేమో అని శంక మొదలయ్యింది.

అరే, ఆ గోలంతా ఎందుకు, ఇప్పుడిచ్చేసిపోదాం అని బస్స్టాండులో దిగేసి డ్రైవరుసాబును ఒక్క రెణ్ణిమిషాలని బతిమిలాడి ఉరుక్కుంటూ పొయ్యి ఇచ్చేసొచ్చా.

ఆయన గోల, ఒరే వచ్చినవాడివి ఒక రెండు రోజులుండేట్టు రాకుండా ఈ ఉరుకులు పరుగులేమిటని.
సరే, బస్సెక్కాం, ఊరు చేరాం.

ముప్ఫై గుడెసెల్లాటి ఇళ్ళు, ఒక బంగళా, సైకిళ్ళు అద్దెకిచ్చే షాపు, ఒక పదిహేనిరవై షెడ్లు. అంతే! ఆ ఊర్లో.

ఒకటే ఒక్క బస్సు రోజు మొత్తానికి.
మట్టిరోడ్డు మీద దుమ్ములేపుకుంటూ పొయ్యే ఒకే ఒక బస్సు.
మట్టిరోడ్డైతేనేం, ఆ మట్టిరోడ్డెమ్మటంతా చెట్లు.
తాతలకాలం నాటి చెట్లు. ఎర్రమందారాలు.
అంతా ఎరుపూ, ఆకుపచ్చాను!

ఆ పచ్చదనం, పేద్ద పేద్ద చెట్లు చూసి - కాకులు దూరని కారడివి అని చదుకున్నది గ్యాపకం వచ్చింది.
వాడితో అదే అంటే, ఓరి పిచ్చోడా అని చూసి ఇది అడివేరా అన్నాడు.
అడివి అనే మాట వినటం తప్పితే చూట్టం అదే మొదలు నాకు.
అలా రికార్డైపోయింది అడవితల్లి గ్యాపకం.

కట్ చేస్తే - విశ్వనాథు వాళ్ళమ్మ, అచ్చం సంగ లానే...

పెద్ద పెద్ద కడియాలు, బులాకీలు, చెవుల చుట్టలు, అమాయకత్వం, ప్రేమ, ఆప్యాయత - అచ్చం అమ్మలానే. అడవితల్లిలానే. చక్కగా మట్టిమూకుళ్ళలో రెండు కూరలు, పప్పు, పప్పుచారు, పెరుగు వేసి కడుపు నిండేలా ఆకలి తీర్చింది తల్లి.

మట్టిమూకుళ్ళో ఉన్న పప్పుచారు ఎంత బాగుందో!
ఆ రుచి ఇంకా తగుల్తూనే ఉన్నది నోటికి, నాలిక్కి, జ్ఞాపకాలకి.
అమ్మమ్మ పెట్టే రాచ్చిప్ప పులుసు, చారుతో సమానంగా నిలబడ్డదా పప్పుచారు.

సరే కడుపు నిండాక, అడివిలోకి పోయొద్దాం అన్నాడు ప్రవీణుగాడు.
వాడో పెద్ద లపాకీగాడు. అడవిలో కోతులన్నా చెట్ల మీద కాం గా కూర్చుంటయ్యేమోకానీ, వీడికి అదీ లేదు.
కాస్త డబ్బున్నవాడవ్వటంతో ఒక లాగూ, టీషర్టు, కళ్ళజోడులతో హంగామా చేసేవాడు.
విశ్వనాథుగాడు సరేననటంతో బయట పడ్డాం.
ప్రవీణుగాడు చొక్కా విప్పేసి నడవటం మొదలుపెట్టాడు.
అదేవిట్రా అంటే, నాకిలా మన సిటీలో తిరగాలని ఉంటుందిరా, కానీ ఇలా తిరిగితే మన్ని అక్కడ పిచ్చోడనుకుంటారు, ఆ తర్వ్తా మా నాన్న నా తాట వొలుస్తాడు.
అందుకు ఇక్కడ విప్పేసా అని వాడి దారిన వాడు ఈలలేసుకుంటూ పోతున్నాడు.

పెద్ద పెద్ద అంగలు వేసేవాడవ్వటంతో మమ్మల్ని వొదిలేసి ఒక అరకిలోమీటరు దూరంలోకెళ్ళిపోయాడు.
కానీ కళ్ళకు కనపడుతూనే ఉన్నాడు.
ఇంతలో ఆరోజటి బస్సొచ్చింది. దుమ్ము రేగింది.

వీడు విప్పిన చొక్కా ఎర్ర రంగుది.
పైగా నెత్తికి చుట్టుకున్నాడు.
మా పక్కనుంచి దుమ్ము లేపుకుంటూ పోయిన బస్సు సడనుగా ఆగింది.

అందులోంచి ఒక భారీ పర్సనాలిటీ దిగటం, ప్రవీణుగాడి మెడ మీద చెయ్యి వెయ్యటం, వీడు హాహాకారాలు చెయ్యటం అన్నీ జరిగిపోయినై.

ఆ దిగినాయన ఒక పోలీసాయన. ఆయన వీడి ఎర్రచొక్కా అదీ చూసి మావోయిష్టు అనుకున్నాట్ట.

ఏసేద్దామని దిగాడు. వీడి మెడ మీద చెయ్యేసాడు.

ఇంతలో విశ్వనాథుగాడొచ్చి సార్, మా అయ్య పేరిది, ఫారెష్టు ఆఫీసరు, మేమంతా ఊర్కే వొచ్చి ఈడ తిరుగుతున్నాం, వాడు మావోడే అని చెప్పి ఆ భారీబాబాయిని శాంతపరిచాడు.

బస్సు మళ్ళీ దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది.

అప్పట్నుంచి ప్రవీణుగాడు, ఇంకో ఇరవై ఏళ్ళదాకా ఎర్రరంగు చొక్కా వెయ్యలేదు, వేసిన చొక్కా ఎప్పుడూ బయట విప్పలేదు.

సరే, అదలా పక్కనబెడితే, ఆరోజుకి అక్కడ పారుతున్న ఏళ్ళు, సెలయేళ్ళు అన్నీ చూస్కొని సాయంత్రంకల్లా ఇంటికొచ్చి పడితిమి.

ఇంటికొచ్చి అన్నం తిన్నాక లాంతర్ల వెలుతుర్లో కూర్చొని ఆ రోజు సంగతులు నెమరేసి ప్రవీణుగాడ్ని ఆటపట్టిస్తూంటే, విశ్వనాథుగాడన్నాడు అరే ఈ పక్కన గోండులోల్ల గూడెం ఉంది. ఆళ్ళు రాత్రి చీకటిపడ్డాక నిప్పు మంటలేసి, డాన్సులు అవ్వీ చేస్తారు. పోయి చూసొద్దాం అన్నాడు.

ఇంతలో వాళ్ళ నాన్న రావటం, ఆయన దగ్గరున్న జీపెక్కి ఆ గోండు గూడేనికి పోవటం జరిగింది.
అరెరే, ఎంత అందంగా వున్నారు ఆ అడివి తల్లి బిడ్డలు.
వాళ్ళ గూడెం కూడా అంత బాగుంది.
రాత్రి పూటే ఉన్న నాలుగు సందులు శుభ్రంగా తళతళలాడిపోతూ ఉన్నవి.
అన్ని గుడిసెలకి తలుపుల్లేవి, ఉత్త నార పరదాలు ఉన్నై.

ఆ జీపుడ్రైవరు బోల్డుసార్లు వచ్చినట్టున్నాడక్కడికి, సరాసరి నెగడు దగ్గరికి తీసుకుపొయ్యాడు.
అప్పుడే చుట్టూ చేరుతున్నారంతా. రకరకాల రంగులు. ఆ ఆడపిల్లల అందం, సహజమైన అందం ముందు నగరవాసుల పిల్లలెంతయ్యా?
స్వచ్ఛమైన నవ్వులు. మళ్లీ అలాటి నవ్వులు ఎక్కదా చూడలా.

అందులో కొంతమంది చిన్నపిల్లలు ఈ మా పట్నపోళ్ళని చూసి ముసిముసి నవ్వులు.
మొత్తానికి డాన్సు మొదలయ్యింది. ఎంత బాగుందో!
చెంచులక్ష్మి సినిమాలో చెంచులు డాన్సు చేసినట్టు ఉన్నది.

కాకపోతే అంత డ్రమాటిక్ గా కాకుండా చాలా సహజంగా ఉండటంతో అది అలా జ్ఞాపకంలో నిలిచిపొయ్యింది.

ఆ నాట్యాల మధ్యలో మమ్మల్ని కూడా ఓ చిందెయ్యమన్నారు.

దరిద్రం పట్నవాసం అలవాట్ల వల్ల, నాగేశ్వర్ర్రావు, రామారావు సినిమా డాన్సులు బాగా బుర్రకెక్కినవాళ్ళమవ్వటం వల్లా పిచ్చిపిచ్చి గంతులు వేసి వాళ్ళు నవ్వుకునేట్టు చేసామనుకో! అది వేరే సంగతి. చిన్నపిల్లలైతే విరగబడి నవ్వారు మా పిచ్చి గంతులు చూసి. వాళ్ళు మాకు పంచిన ఆనందానికి అలా పిచ్చి గంతులతో రీ-పే చేసమని ఇప్పుడు అనిపిస్తుంది. అలాగన్నా వాళ్ళ రోజులో నవ్వులు పూయించాంగా. అది చాల్లే!

అప్పుడంటే వయసులో ఉన్నాం, తారలు తమ్యాలు తెలియవు కాబట్టి గడిచిపోయింది కానీ, ఇప్పుడు మళ్ళీ ఆ చిందేసే ఛాన్సొస్తే ఆ మూమెంటు చాలా జాగ్రత్తగా బంధించుకుని వుండేవాడిని.

అలా ఆ రాత్రి గడిచిపోయి రెండో రోజు పొద్దున్నే కడుపు నిండా మెక్కి, సైకిలు షాపుకెళ్ళి సైకిళ్ళద్దెక్కు తీసుకుని పోయి, కడెం ప్రాజెక్టులో గడిపి వొస్తిమి.

ఎంత బాగుందో కడెం ప్రాజెక్టు. ఇంకా అంత అందంగానూ, అంత పచ్చదనంతోనూ, అలానే ఉన్నదో లేదో తెలవదు.
ఇదంతా, ఈ అందమైన అనుభూతులు, ఆ గోండులు, అడవితల్లి బిడ్డలు, వ్యవహారాలు, జీవితం, అందాలు, అడవి ఎలా ఉంటుందో తెలుసుకున్నా క్షణాలు, వాళ్ళమ్మ కడియాలు, బులాకీ, ప్రేమ, ఆప్యాయత ఎప్పటికి మర్చిపోలేనిదయ్యా!

మళ్లీ ఆ చాన్సొతుందో లేదో తెలియదు కానీ, ఇవి మటుకు భద్రంగా ఉన్నై నా వద్దే!

ఇదంతా జరిగి దాదాపు ముప్ఫై ఏళ్ళు పైనే!

విశ్వనాథుగాడు ఎక్కడున్నాడో తెలవదు ఇప్పుడు.
వుంటే మళ్ళీ ఓ సారి వాడి ఊరికి తీసుకెళ్లమని అడగాలి.
ఒరే విశ్వనాథూ ఎక్కడున్నావురా! కనపడు ఓ సారి....
ఆ అడవి తల్లి వొడిలోకి తీసుకెళ్ళు మళ్ళీ!

జై సంగమ్మ!
జై బాహుబలి!
జై విశ్వనాథుడి తల్లి!

Sunday, August 2, 2015

అంత అందం ఈ మధ్యలో ఎక్కడా చూడలా!

బులాకీ
బాహుబలిలో బులాకీ
అదే శివగామి బులాకీ.
ఎంత బాగుందో అమ్మగారు.

నెత్తిమీద పాపిట బిళ్ల ఎంత అందమో, ముక్కుకి బులాకీ అంత అందం.
కాలికి మెట్టెలెంత అందమో, ముక్కుకి బులాకీ అంత అందం.
చెవులకి బుట్టలు ఎంత అందమో, ముక్కుకి బులాకీ అంత అందం.

ముక్కుకి పుడక ముందొచ్చి బులాకీ తర్వాతొచ్చిందిట.
కైరోలో బులాక్ అనే ప్రాంతంలో పెట్టుకునేవారనీ, అది మిగతాదేశాలకు పాకిందని వినికిడి.
వినికిడి అంటే చెవులకు సంబంధించింది.
చెవులు అన్నిసార్లూ అన్నీ సరిగ్గా వినలేవు.
అందువల్ల నేన్నమ్మను ఆ సంగతి.

బులాకీ అనేది, మన కోయమ్మలు కనిపెట్టిందని నా ఘాట్టి నమ్మకం.
పాతకాలం వాళ్ళను చూసారనుకో ముక్కుపుడక రెండు వేపులా ఉండేది.
రెండు వైపులా ఉండి మధ్యలో లేపోతే ఎట్లానని మధ్యలో దూలానికి బులాకీ కట్టేసారు.

దూలానికి తుల అన్నది పేరు.
తుల బుల అయ్యి, బుల పండితుల చేతిలో బులాకీగా మారిపోయింది.
అంతే అంత చింపులు.
అంతే కానీ బులాక్ కి బులాకీకి సంబంధం లేదయ్యా!

అది మనదగ్గరే మొదలై, ఈజిప్టులో బులాక్ ప్రాంతానికి మనవాళ్ళల్లో ఒకళ్ళు వలస వెళ్ళటంతో అక్కడ వ్యాపించిపోయింది. అదీ సంగతి.

సరే అదంతా పక్కనబెడితే ఏ గుళ్ళో అయినా అమ్మవారి విగ్రహాలు చూడండి.

మీకు బులాకీ ఖచ్చితంగా కనపడుతుంది.
ఆ అందం ఏమని చెప్పేది.

అదీ గాక లలితాసహస్రనామంలో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని ఉన్న పాదం అర్థం కూడా అదే!
బులాకీ ఉండగా నాకు తారలెందుకురా పిచ్చివాడా అని అమ్మవారు అనటం అన్నమాట.

బులాకీకి నాకు అవినాభావ సంబద్ణం ఉన్నది.
నాకంటే నాకు కాదు కానీ, నా వృత్తికి.

ఒక ఇరవై ఐదేళ్ల క్రితం చార్టర్డు అక్కవుంటన్సీ చేస్తున్నప్పుడు, జి.ఎం.ఆర్ గ్రూపు మా పెద్దాయన వెంకాటాద్రి గారి దగ్గరే ఉండేది.

దాని ఆడిట్ల కోసం నా సహాధ్యాయులంతా పోటాపోటీలు పడేవాళ్ళు.

ఆ రకంగా బయటికి పోయి, కాస్త ఊపిరి పీల్చుకుందామని.

మా వెంకటాద్రి గారు, నన్ను ఆ రాజాం రూటుకు పర్మనెంటు చేసేసి, శ్రీకంతుతోనూ, శ్రీనివాసుతోను పంపించేసేవాడు.
రాజాం అంటే మాటలా.

బొబ్బిలి దగ్గరిది.
అంతా నేలతల్లి బిడ్డలు.
మాంచి భాష.
చెవులారా, చేతులారా పలకరించే మనుషులు.
ఆప్యాయత, ప్రేమ అంటే ఆ భూమి బిడ్డల దగ్గర నేర్చుకోవాలె.
అక్కడి అమ్మలకు, ఆడవాళ్లకు ఈ బులాకీ ఎంత శోభగా ఉండేదో!
సికాకుళం నుంచి ప్రయాణాల్లో, టెక్కలికి ప్రయాణాల్లో - ఎన్నో బులాకీలూ!
ఎన్నెన్నొ బులాకీలు. ఎంతందంగా ఉండేవనీ!

బంగారు తీగల బులాకి.
రాగి చువ్వల బులాకీ.
చెట్టు తీగల బులాకీ.
ఇలా రకరకాలు.
ఆ నేలతల్లి బిడ్డల ముక్కులకు.
అచ్చు సంగమ్మలానే!
అచ్చు రోహిణిలానే.
ఆ బులాకీతోనే సంగమ్మకు అంత ఊపొచ్చింది.
ఆ పాత్ర అలా నిలబెట్టేసింది.
జై సంగమ్మా! జై జై బులాకీ!

సరే అది అలా వదిలి శివగామి అమ్మ దగ్గరకొచ్చేస్తే, ఎంత రాజసం వొచ్చేసింది ఉత్త బులాకీతో.

అలా రాజమందిరంలోకి నడుచుకుంటూ వొస్తూ వుంటే, ఆ అడుగులకు మడుగులుగా ఆ బులాకీ ఊగుతూ ఎంతందం తెచ్చిందో.

కట్టప్పా అని అరిచినప్పుడు ఆ బులాకీ కూదా ఎంత ఆవేశం చూపించిందో!

మార్తాండను వేసేసినప్పుడు ఊగిన బులాకీ ఎంత రౌద్రంగా ఉన్నదో!

బాహుబలి అని నామకరణం చేస్తున్నప్పుడు ఆ బులాకీ ఎంత ఆనందంగా ఉన్నదో!

ఇద్దరినీ ఒడి చేర్చుకున్నప్పుడు ఆ బులాకీ ఎంత మమతల తల్లిలా ఉన్నదో!

అంత అందం ఈ మధ్యలో ఎక్కడా చూడలా!

శివగామి - బులాకీ జీవితాన్ని ధన్యం చేసిన నీవు ఒక శక్తివి. ఆదిశక్తివి. పరాశక్తివి.

రాజమాత అయిపోయినాక పిల్లలు పెద్దవాళ్ళపోయినందుకు తీసేసావేమో కానీ, నే చాలా బాధపడ్డా శివగామి మాతా! అంత అందమైన బులాకీని అలా తీసేసావేమిటని!

సరే - సివరాఖరికి వొచ్చేసి - జై శివగామి. జై జై బులాకీ! అని ఇప్పటికి ఊరకుంటా.

అయ్యా, ఆ మేకపు తీసిచ్చిన, చేసిచ్చిన వారందరికీ నమస్సులతో !