Sunday, July 19, 2015

సినిమా కోసం.... (బాహుబలి హాస్య వ్యాసం - ప్రథమ భాగం)

సినిమాకోసం....
(బాహుబలి హాస్య వ్యాసం - ప్రథమ భాగం)

(ఇందులోని పాత్రలు, కథ అంతా కల్పితం. ఎవరినీ నొప్పించే ఉద్దేశం కానీ, హేళనా ఉద్దెశం కానీ లేదండీ! మీ ఇష్టం. చదువుకొని ఆనందిస్తారని) 

మహావ్యాసాలకు మరణం లేదు...

అననగ ఒక ఊరు. అందులో ఒక సినిమా పిచ్చోడు. పేరు పరంధామం. ఆరోజు బాహుబలి సినిమా విడుదల.

ఏమేవ్ పార్వతీ! ఎక్కడ ఉన్నావ్! ఇది కొంపా, శనివారం సంతా. ఒక్కటి కూడా కనపడి చావదేమే, ఎక్కడ పెట్టింది అక్కడ ఉంచకుండా ఈ తాడేపూడి తద్దినాలు ఏంటి నాకు..ఇంకోసారి నా వస్తువులు ముట్టుకున్నారో చమడాలు వలిచి పారేస్తాను. దరిద్రమానీ - దరిద్రం.

ఒరే బుజ్జిగా - నిన్ను తగలెయ్య. బాహుబలి మార్నింగుషోకు టికెట్లు తీసుకురావటానికి ఈరోజు స్కూలెగ్గొట్టి తయారు అవరా అంటే ఆ వెధవ దిక్కుమాలిన టీ.వీ చూస్తూ కూర్చున్నావ్..అసలు మార్నింగుషోకు టికెట్టెలా తీసుకురావాలన్న హోం వర్క్ చేసి చచ్చావా? ఎన్ని సారులు చెప్పాలిరా నీకు - ఆ వెధవన్నర వెధవ, ఆ సత్రకాయ సుబ్బారావు గాడి కొడుకుని చూసి బుద్ధి నేర్చుకోమని, వాడి లాగా చక్కగా ఫస్టు డే ఫష్టు వెళ్ళి కటౌట్లకు దండలూ అవీ వేసి పూజచేసి సినిమా చూసొచ్చి షోకిల్లా అని పేరు తెచ్చుకుందామని ఎప్పుడు ఉంటుంది రా నీకు.ఎన్ని సార్లు చెప్పు - ఆ దేభ్యం మొహం వేసుకుని చూడటం తప్పితే ఒక ఉలుకు పలుకూ ఉందా.అసలు నాదీ బుద్ధి తక్కువ, నీతో మాట్లాడటం. నేనే వెళ్ళిపోయి చూసుకునొస్తా.

ఒసేవ్ - ఎక్కడ తగలడ్డావు? అరగంట అయ్యింది లేచి - కొంచెం కాఫీలు, ఫలహారం నా మొహాన తగలేద్దాం అని ఏమన్నా ఉన్నదా ...మొగుడు మార్నింగుషోకు వెళ్ళాలి అన్న ఆలోచనన్నా ఉన్నదా! అసలు ఏం చేస్తుంటావే ఆ వంట గదిలో అంతంత సేపు. చేసే ఆ దిక్కుమాలిన వంటకి ఆ వడలిపోయిన కూరగాయలతొ, వన్నె తగ్గిన వంట పాత్రలతో మూడు గంటలు ముచ్చట్లు. పైనుంచి తెగ అలసిపోయినట్టు హస్షో హుస్షో అనుకుంటూ బయటికి రావటం. ఖర్మే ఖర్మ.

అహా....అసలు అయినా నాకు మంచి టిఫిను తినే ప్రాప్తం ఉండొద్దూ. ఈ పదార్ధాన్ని ఏమంటారు పార్వతిగారూ.. ఏమిటీ? ఉప్మానా, అబ్బో దస్తావేజులు బొత్తులు బొత్తులుగా ఈ జిగురు పదార్ధంతో అతికించుకోవచ్చు.. అసలు అయినా మీ అమ్మను అనాలి, నా ముద్దుల ఒక్కగానొక్క కూతురు ఎక్కడ అలిసిపోతుందో అని వంట, పెంట నేర్పించకుండా, పెళ్ళి చూపులకి వెళ్ళినప్పుడు - అహా మా అమ్మాయి వంట ముందు నల భీములు పనికి రారు అని డబ్బా కొట్టి ఊదర గొట్టారు. పైగా ఫలహారాలు అయ్యాక ఈ సున్నుండలు మా అమ్మాయి చేసినవే అని ఆ రామావతారం గాడి కొట్లోనుంచి తెచ్చిన సరుకు నా నోట్లో కుక్కి, నాకు నిన్ను తగలేశారు. సరేలే యే జన్మలో యే పాపం ఛేసుకున్నానో, మంచి వంట తినే ప్రాప్తం లేదు...

"ఒరే పరంధామం - ఎందుకురా అస్తమానూ ఎప్పుడూ అలా ఏదో ఒకటి సణుగుతూ ఉంటావు?కొత్త సినిమా వచ్చిందంటే నువ్వు ప్రశాంతంగా బతకవు, పక్కల మనుషుల్ని ప్రశాంతంగా బతకనివ్వవు. ఎందుకురా ఇలా తయారు అవుతున్నావ్. వయసు వచ్చే కొద్దీ పెడసరం మాటలు ఎక్కువ అవుతున్నాయి నీకు. తగ్గించుకోరా..."

ఊరుకో నాన్నా..నువ్వు బయటపడట్లేదు, నేను బయటపడుతున్నా అంతే తేడా....సరేలే నేను సినిమా నుంచి వచ్చేటప్పుడు నీకు ఆ దగ్గు మందు తెస్తా. అందాకా ఆ పాలల్లో, మిరియాల పొడి వేస్కుని ఆర ఆరగ తాగుతూ ఉండు. సరే మరి నే వెళ్ళొస్తా.

అవునుగానీ లక్ష్మీ - ఆ శ్యామలరావు వాళ్ళ అబ్బాయి అవేవో సినిమా పాఠాలు చెప్పడం మొదలెట్టాడుట. ఆ వివరాలు కనుక్కుని చెప్పు నాకు.సాయంత్రం వెళ్ళి శ్యామలరావుతొ మాట్లాడి వస్తా. చేరుదువు కానీ - ఈసారన్నా నాయనమ్మ కోరిక ప్రకారం ఆ సినిమాసంగీత శిరోమణి పరీక్ష ప్యాసు అయ్యి ఆవిడ మనస్సుకి కొంచెం శాంతి కలిగించవే...

పార్వతీ - తలుపు గడెట్టుకో. అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది ఈ మధ్య. ఆ గ్యాసు బండ వాడు వస్తే వాడిని ఆ వసారాలో తగలేసి పొమ్మను. లోపలికి రానివ్వబోకు. ఆ బండ నీ నెత్తి మీద వేసి ఆ వారా నగలు ఎత్తుకుపోగల...జాగ్రత్త....

ఈ వెధవ రామ్మూర్తి పీనుగ ఏమంటాడో ఏమిటో , ఆఫీసుకి రానని చెపితే. ఏదో ఒక దిక్కుమాలిన కారణం వెతుక్కుని చావాలి ఇప్పుడు.ఈ ఆఫీసులోకి వీడు మానేజరుగా వచ్చినప్పటినుంచి సంత క్షవరం లాగా అందరి తలలు నున్నగా చెక్కి పారేస్తున్నాడు,అక్షింతల కత్తెరతో వెధవ పీనుగ. సుఖంగా ఒక కాఫీ తాగనివ్వడు, ఒక హస్కు వేసుకోనివ్వడు, ఒక మార్నింగుషోకు వెళ్ళనివ్వడు - అదేం రోగమో వీడికి.

రేపన్నా ఆఫిసుకు వెళ్ళాక ఆ సుబ్బారావు గాడిని డబ్బులు అడగాలి. బట్టబుర్ర వెధవ, ఎప్పుడు చూడు ఈసురో మంటూ ఉంటాడు. క్రితం వారం నీగోల నాది, నాగోల ఎవరిదో సినిమాకు టికట్టు తీసి చచ్చానా, ఆ టికట్టు డబ్బులు ఇవ్వరా అంటే ఆ బుర్ర గోక్కుంటూ, ముక్కులో వేళ్ళు తిప్పుకుంటూ, ఆ పార పళ్ళు బయటపెట్టి "ఇదిగో రేపు ఇచ్చేస్తా అన్నయ్యా, ఈ సారి తప్పకుండా నా మాట నమ్ము" అని ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు. ఇవ్వాళ్ళ ఊరుకోకూడదు. సంగతి అటో ఇటో తేల్చి పడెయ్యాలి.

టికెట్...టికెట్...

ఇదిగో బాబూ కోనేరు సెంటరు కి ఒకటి కొట్టు...

ఇదిగో బాబూ కొంచెం తప్పుకుంటావా, నేను దిగాలి....ఓయ్ ఓయ్...ఆగవయ్యా ఇక్కడ జనాలు దిగాలేదు పెట్టాలేదు, బుర్రున తోలిపారెయ్యడమేనా. ఎవడన్నా ఆ చక్రాల కింద పడితే ఏమవును. బుద్ధుందా అసలు నీకు, ఎవడిచ్చాడయ్యా అసలు నీకు లైసెన్సు...

దిగండి మాష్టారు , అనవసరమయిన మాటలు ఎందుకు...రైట్...రైట్

హూ ....ఇంతమంది చచ్చారేవిటో లైన్లో. వీళ్ళను తగలెయ్య. సరే ఇప్పుడు ఈ చుట్ల లైన్లో ఎవడు నుంచుంతాడు ఇప్పుడు. ఈ సినిమా కోసం బస్సుల్లో ప్రయాణం ఏమిటో, ఈ ఆఫీసులో ఎక్స్క్యూజుల గొడవలేమిటో. దిక్కుమాలిన జీవితమాని దిక్కుమాలిన జీవితం.

ఏరా పరంధామం ఏమిటి సంగతి? ఇవ్వాళ్ళ ఆలశ్యంగా వచ్చినట్టున్నావు సినిమాకి...అంతా కుశలమేనా ....

ఆ...కుశలం కాకపోతే, నారాయణ నారాయణ అంటూ నీ పేరు జపిస్తూ మంచంలో తీసుకుంటూ పడి ఉండమన్నావా ఏమిటి? వెధవ ప్రశ్నాని వెధవ ప్రశ్న.. ఆ...అయినా టికెట్టు బాధలు ఉంటే మటుకు ఎవడు తీర్చొచ్చాడులే...సరే కానీ ఆ రామ్మూర్తి వచ్చాడా ? చూసావా ?

నిన్ను ఏదన్నా అడగటం తప్పురా పరంధామం, ఉరుము ఉరుమి మంగలం మీద పడ్డట్టు, నా మీద పడతావు ఏమిరా.....ఏదో చిన్ననాటి స్నేహితుడివి కదా అని ఊరుకుంటున్నా...సరే ఇక నుంచి నీ బాధలు చెప్పొద్దు, నీ సుఖాలు నాకు చెప్పొద్దు. ఆ రామ్మూర్తి గాడు ఇవ్వాళ్ళ మధ్యాహ్నం నుంచి వస్తాడుట, ఇందాకే కబురు పెట్టాడు.

హమ్మయ్య...ఒక పీడ విరగడ అయ్యింది - వాడికి ఆఫీసుకు ఫోను చేసి ఎలా చెప్పాలని చస్తున్నా ఇందాకటినుంచి. సగం రోజన్నా సంతోషంగా ఉండొచ్చు... సరే కానీ..ఒక విషయం చెప్పు నాకు

ఏమిటీ... మళ్ళీ విషయం చెప్పు, సంగతులు చెప్పు అంటూ పురాణాల్లోకి దిగావు. మొన్న అయ్యింది చాలలా?

ఒరే నారాయణా, మొన్న అయ్యింది వేరు, ఇవ్వాళ్ళ మొలిచింది చెట్టు. మెట్లెక్కి వస్తూంటే ఆ తాయరమ్మ కనపడిందిరా, మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఏం చెప్పాలో తెలియక వచ్చేశా..ఈ రామ్మూర్తి గాడి తద్దినం చెయ్య..వెధవ పీనుగ ఆ మాత్రం సాయం చెయ్యటానికి మాయ రోగమా? పెళ్ళీ పెటాకులు అయినాయి కదా వాడికి సిగ్గు ఉండఖ్ఖరలా...ఎప్పుడో వీడికి తగిన శాస్తి నేనే చేస్తాను.

ఒరే పరంధామం, మొన్ననే కాడి మెడ మీద పడకుండా తప్పించుకున్నావు. అసలే పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్ల ఉన్నది నీకు, ఏం చెయ్యాలనుకున్నా కొంచెం గోస లేకుండా చెయ్యి. ఏం చేస్తావో కొంచెం ముందే చెప్పి అఘోరించు. నాకు తగిన సాయం నేను చేస్తాను. పద ఆ వెంకట్రావుగాణ్ణి ఈ పక్కకు పిల్చి నేనెత్తుకొస్తా టికెట్లు.

సరే! ఎవరదీ సుబ్బారావు గాడేనా! వీడి తస్సాదియ్యా వీడూ వొచ్చాడూ సినిమాకు? నాయనా సుబ్బారావూ - ఇవ్వాళ్ళ డబ్బులు సర్దకపోతే తమరి బట్ట బుర్ర మీద త్యాగరాజ కీర్తనా సుస్వరాలు అందరికీ వినిపిస్తా..

అన్నయ్యా...ఒఖ్ఖ రెండు రోజులు ఆగగలవా...ఇదిగో రేపు సోమవారం నువ్వు ఆఫీసులోకి వచ్చేసరికి పువ్వుల్లో పెట్టి ఇస్తా...

ఏం పువ్వు బాబూ - అరటి పువ్వా, మొగిలి పువ్వా, తామర పువ్వా...పువ్వూ వద్దు నీ పిండాకూడు వద్దు, నా టికెట్ ధనలక్ష్మిని నావద్దకు చేరిస్తే చాలు.

ఏవండీ ఇక్కడ పరంధామంగారు ఎవరండీ?

నేనే - మీరు ఎవరు? ఏం కావాలి?

నా పేరు మిరియాల పార్ధసారధి అండి. బిక్కవోలు బ్రహ్మం గారు పొద్దున్నే నాకు ఫోను చేసి సినిమా టికెట్లిచ్చి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారండి. బ్రహ్మం గారి ఆడవాళ్ళకేదో పనొచ్చి సినిమాకు రావట్లేదుట. టికెట్లు మిగిలిపోయినయ్. అవి మిమ్మల్ని దించుకోమని చెప్పమన్నారు.

ఏమిటి దించుకునేది? వెధవ మాటలు మీరూనూ - వారేమన్నా మిరియాల బస్తాలా? దింపుడు కళ్ళాలా?

అది కాదండీ... అయినా ఆ అడావిడీ ఏమిటీ, ఆ విరుపు మాటలు ఏమిటీ. జముకు పుట్టిస్తారు మనుషుల్లో మీరు ..అయినా అంత కోపం అయితే ఎలాగండీ మీకు

ఆహా భలే చెప్పారండి పార్థసారధి గారు. మీకు ముఖవైఖరీ విద్య బాగా తెలుసనుకుంటాను. నాకు కోపం ఎక్కువ అని బాగా కనిపెట్టారు. సరేలే భాషణభూషణాలు ఆపి ఇక తమరు దయ చెయ్యండి. తమరు టికెట్లు ఇచ్చారు, ఇక మేము తన్నుకు చస్తాము.

ఈ బ్రహ్మిగాడికి ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదు..మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వనురా అంటే, బోదురుకప్పలాగా బోరుమంటూ ఉంటాడు. ఆరోనంబరు కాలువలో పరకుచ్చుకుని గేదెల్ని తోమినట్టు బర బర బరికినా ఆ తోలు మందం తగ్గదు వీడికి. ఇలా ఫ్రీ టికెట్లిస్తే అమ్మాయిని వాడింటి కోడల్ని చేస్తాననుకుంటున్నాడేమో. ఈ సత్రకాయగాడికి, వాడి పెళ్ళానికీ ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పి వదిలించుకోవాలి ఈ సారి.

ఏవండీ పరంధామం గారూ - మిమ్మల్ని నారాయణగారు హాలుగుమ్మం దగ్గర నిలబడి పిలుస్తున్నారు.

ఓరి వీడిని తగలెయ్య! సినిమాహాలు గుమ్మాలుచ్చుకుని వేళ్ళాట్టమేమిటో.  తడిమన్నూ పొడిమన్నూ అయ్యేటట్టు తిరిగే ఖర్మ రాసిపెట్టినట్టుంది నాకు వీడితో. నా టికెట్టు ఫ్రీగా దొరికిందంటే ఇప్పుడేం పితలాటకం పెడతాడో, ఏం దస్త్రం విప్పుతాడో.వీడికి టికెట్టు ఉన్నవాళ్ళు, టికెట్టు లేని వాళ్లూ, ఏదో ఒక రకంగా టికెట్టు దొరక్కపోతుందా అని చూసేవాళ్ళూ అనే తేడా లేదు. అందరినీ ఒకటే గాటన కట్టి కుళాయిల వద్దకి వచ్చిన అమ్మలక్కల శృతిలాగా, సినిమాకు రావో, నాతో సినిమాకు రావోయ్ అంటూ నెత్తిన బిందెలతో నీళ్ళోసి ఉతికి ఆరేస్తుంటాడు మహానుభావుడు. సరే చూద్దాం పద ఏమంటాడో!! శొంఠి శోధిస్తుంది అని ఊరకే అన్నారా!

ఒరే నారాయణా...

పదరా పద, ఇహ నువ్వు ఇంటికి పద. టికెట్టు తెచ్చేసా. ఒకటే దొరికి చచ్చింది. కాపోతే నువ్వు రేపు బయల్దేరి వీరంకిలాకు వెళ్తే, ఆ రామారావు వద్ద టికెట్టు ఉందిట, అక్కడి మార్నింఘు షోకు. ఇప్పటికే సమయం మించిపోయింది. నే పోతున్నా లోపలికి. నీ ఏడుపు నువ్వేడువు. పోనీ డబ్బులు ఎక్కువిస్తానన్నా నా టికెట్టు లాక్కుంటానన్నాడు వాడు. ఊరికి మోతుబరిని అయిన నాకే అల్లా చెప్పాడంటే ఇక వేరేవాళ్ళ సంగతి ఇంతే అంతే. అయినా వీడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు. రేపు తాసిల్దారు రత్తయ్యని, పోలీసులని వెంటబెట్టుకుని వీడి ఇంటికి వెళ్ళి నాకు టికెట్లు ఇవ్వనందుకు అతని పరువు వేలం వేసి ఆ డబ్బులు తీసుకుని ఇరికిస్తా వీణ్ణి. నీకు టికెట్టు తెచ్చివ్వని పాపఋణం అల్లా తీర్చుకుంటా. ఏమిటి అర్ధం అవుతోందా చెప్పింది..

ఒరే నారాయణా - నా టికెట్టు వాడి తలకొచ్చిందన్నమాట? అయినా నేను రేప్పొద్దున్న వీరంకిలాకు వెళ్ళక్కరలేదులే. బ్రహ్మిగాడి టికెట్టు నాకిచ్చాడు. పాప్కార్ను, సోడా ఖర్చులకి నీ దగ్గరి నుంచి డబ్బులు తీసుకోమన్నాడు.

ఆ వాడిదేం పొయ్యింది. వాడట్లానే అంటాడు. నాకు మూడు పాకార్నులు బాకీ ఉన్నాడిప్పటికి. కనపడనీ చెప్తా.

ఈ టికెట్ చెల్లదండి. బ్లాకులో కొన్నదిది. బ్లాకుమార్కు ఉన్నది దీనిమీద. వెళ్ళిపోతారా. పోలిసుల్ని పిలవమంటారా?

వోరి బ్రెమ్మిగా! బ్లాకులో కొన్న టికెట్టు నాకంటగట్టి సినిమా చూడనివ్వకుండా చేస్తావా? సరే రేప్పొద్దున్న వీరంకిలాకెళ్ళి చూసొచ్చి నీ సంగతి చేస్తా.

వీరంకిలాకు , వీరంకిలాకు....దిగాలి దిగాలి..... రైట్ రైట్...

హుస్షో ఈ వీరంకిలాకు ప్రయాణం సంగతేమో కానీ ఒళ్ళు హూనం అయ్యింది..ఈ రామారావు పీనుగ పిల్లికి బిచ్చం కూడా వెయ్యడు. అట్లాంటిది వీడు నాకు సినిమా టికెట్టు ఇవ్వటం ఏమిటో?

"రామారావు గారూ, రామారావు గారూ...."

అహా వచ్చారా పంతులు గారూ...వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్నట్టు సమయానికి చక్కా వచ్చారు రండి ! లోపలికి..

"వీడి పిండాకూడు, ఇంత ఆహ్వానం పలుకుతున్నాడు ఏమిటీ? ఏదో ఉంది ఇవ్వాళ్ళ" అని మనసులో అనుకుని - అయ్యా గుమ్మం దగ్గరికి వచ్చినవాణ్ణి గుమ్మం లోపలికి రాకుండా ఉంటానా? ఇంతకూ ఆలూమగలు ఏదో అనుకుంటునట్టు ఉన్నారు, అయినా ఆలూమగల అలక - అద్దం మీద ఆవగింజ కులికినంతసేపు ఉండదు అంటారు కదా..ఇట్టే అతుక్కుపోతారు లెండీ..

అది సరే కానీ పంతులు గారూ ఒక్క మాట చెప్పండి - క్షేత్రమెరిగి విత్తనం , పాత్రత ఎరిగి దానం చెయ్యాలి అని పెద్దలు అన్నారా లేదా? ఈవిడేమో మాటలు డొంకలు తిరిగితే చేతులు వంకర్లు తిరుగుతాయి అని బెదిరిస్తోంది. ఏమి చెప్పమంటారు?

మనసులో "ఇదేంటి వీడు ఇలా అర్థం పర్థం లేకుండా వాగుతున్నాడు" , రామారావు గారూ ఎద్దు లేని సేద్యం పరిస్థితి లాగా ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా నాకు ..అసలు ఏమయ్యింది చెప్పండి..

ఏమిటి అయ్యేది - లంక మేత గోదావరి ఈతకు సరి అని - మీ సినిమా టికెట్టు తీసుకెళ్ళి ఈ సుందరిగారు ఒక జెష్టా దేవి మొహాన అదృష్ట దీపం వెలిగించింది...నేనెక్కడినుంచో ఎవడి దగ్గరో అడుక్కుని తెచ్చిన టికెట్టు, ఈవిడ నేను లేని సమయం చూసి అప్పుకి ఇచ్చి, దానాలు చేసి పేరంట పెత్తనాలు చేస్తోంది..ఏదన్నా అంటే రోషాలు...ఇంకేమిటి చెప్పేది..పరంధామం గారూ ..ఇదిగో నా దగ్గర పనస తొనల్లాంటి మీ టికెట్టు లేదు ఇప్పుడు , మీరు ఉత్త చేతుల్తో దయచేయాల్సిందే...

పనసపండు తెచ్చి పళ్ళెంలో పెడితే తినలేని అల్లుడు దిక్కు దిక్కులు చూసాడట అలా ఉంది నా పరిస్థితి..ఆ పనస చెక్కులో, పనస తొనల్లాంటి టికెట్లో..నాకదంతా తెలీదండీ. ఈ సినిమాకోసం, మార్నింగుషోకోసం అంత దూరం వొళ్ళు హూనం చేసుకొస్తే టికెట్టు లేదంటారా? ఆ సంగతి మీరే ఆ నారయణగాడి కి ఒక ఫోనో ఏదో చేసి చెప్పి ఉంటే ఈ వెధవ బస్సు ప్రయాణం లో నా ఒళ్ళు హూనం అయ్యేది కాదు కదా రామారావుగారు.. ఈ పంపర పనస గోల నాకెందుకు కానీ, ఏదొ ఒకటి చేసి నా టికెట్టు నాకిప్పించండి..ఈ సినిమా చూడకుండా తిరిగి వెళ్ళేది లేదు. మరి ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఎవడి బిచ్చమో నేను ఎత్తుకోవడానికి వచ్చి చచ్చినవాడి సవారి మోసినట్టు ఉంది నా సంగతి...అయినా మీలాంటి మోతుబరికి టికెట్ల కొదవ ఏమిటండీ...కలవారికి కరుణ కలిగితే కావిళ్ళు కదులుతాయి అనే సామెత పెట్టుకుని, మీరేమో కనకమ్మ వేవిళ్ళు పడ్డట్టు టికెట్టు లేదు మహాప్రభో అంటారు ఏమిటి రామారావు గారూ? ఇదేమీ బాగాలేదు..సరే కానీ కొంచెం చల్ల ఇప్పిస్తారా? గొంతెండిపోతోంది....లేచిన వేళా విశేషం...

ఆ మోతుబరి బతుకు లాగానే ఉన్నది నా బతుకు పంతులు గారూ - బావిలో ఉన్న మోట బఱ్ఱె లాగా ఉంది..ఎవడికి చెప్పుకోవాలి? సరే కానీ ఉండండి... మా పాలేరుగాడి టికెట్టు లాక్కొని మీకిచ్చి పంపిస్తా ఒక్క నిమిషం ఆగండి...ఇదిగో ఏమేవ్..పరంధామం గారికి ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తీసుకుని రా..

ఆహా భలే ఉన్నది - అటు చూస్తే కూతురి పెళ్ళికి వెచ్చం లేదు, ఇటు చూస్తే సీతారాముల పెళ్ళికి బిచ్చం లేదు లాగా ఉన్నది...మధ్యలో విసనకఱ్ఱలాగా టికెట్ల కోసం నన్ను ఊపుతున్నారు..

ఏదోలా సర్దుబాటు చేస్తున్నానుగా..దున్నేరోజుల్లో దేశాలుచ్చుకు తిరిగి, కోసే రోజుల్లో కొడవలికి ఏమీ అందట్లేదు అనుకుంటే ఏమి లాభం...ఇలాంటి టికెట్లమ్మేసే పెళ్లాలు ఉన్నవాడి గతి ఇంతే...ఇదిగో పరంధామంగారూ టికెట్టు...పై నెలలో వచ్చి కలుస్తాను అని నారాయణకి చెప్పండి..

సరే...

ఈ బందరు బస్సు ఎప్పుడు వస్తుందో.. ఏమిటో ఖర్మ..మళ్ళీ మూడు గంటలు ఒళ్ళు హూనం..

ఇదేంటి తాయారమ్మ ఈ బస్సులో ఉంది...ఏం తాయారమ్మా? ఇలా ?

బాబుగారూ .........

No comments:

Post a Comment