Thursday, July 30, 2015

కట్టప్ప కాలానికి అది సమాజంలో ఒక భాగం.

ఒక రెండు ముక్కలు రాయాలనిపించి

కట్టప్ప సింహాసనానికి బానిసగా సినిమాలో చెప్పించారు. ప్రవేశపెట్టారు. సింహాసనానికి బానిస అంటే కౌచ్ పొటాటోస్ లా కుర్చీకి బానిస అని అనుకునే సంతకు చెప్పేదేమీ లేదు. అవసరమూ లేదు. వారి పరిధి అంతేనని అంతంతమాత్రమేనని నవ్వుకొని వదిలెయ్యటమే! ఇక్కడ బానిస అంటే విశ్వాసపాత్రుడు, విశ్వాసం వల్ల నిండిన కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్ అని మాత్రమే!

ఈరోజు సమాజంలో జరిగే సంఘటనలు, వార్తలు ప్రవహిస్తున్న తీరు చూసి ఆ వరదలో పడికొట్టుకుపోతూ బానిసత్వం, విశ్వాసం అంటే మహాపరాధం అనుకుంటుండొచ్చు గాక, కానీ కట్టప్ప కాలానికి అది సమాజంలో ఒక భాగం.

విశ్వాసానికి, బానిసత్వానికి తేడా తెలియకుండా పోతున్న అనాగరీక జనాలకోసమే సినిమాలో ఆయన చేత, ఆ మహావీరుడిచేత "ఇచ్చిన మాట నిలబడే ఉంటుంది కదానని" కూడా చెప్పిస్తాడు రాజమౌళి. ఆయన ఒక మాటకు, తన పెద్దలు ఇచ్చిన మాటకు, పెద్దల మాట జవదాటని విధేయుడిగా రాజ్యానికి, దాంతో రాజుకు కట్టుబడి ఉన్నాడు.
ఆయన స్థానంలో నేనున్నా, ఎప్పుడొ కనపడకుండా పోయిన నా రాజు రూపం, అది రాజు కానీ, రాజు రక్తం కానీ - మళ్ళీ కనపడితే అలా ఆయనలానే, కట్టప్పలానే ఆనందభాష్పాలు కారుస్తూ, ఆ కాలు నా నెత్తిన పెట్టుకుంటా. వయసుతో సంబంధం లేకుండా. అందులో తప్పేమీ లేదు. బానిసత్వమూ లేదు. విశ్వాసం మాత్రమే ఉన్నది.

అమరేంద్రుడు సింహాసనానికి రాజమాత శివగామిచేత ప్రకటించబడ్డ రాజు. ప్రజలచే సిమ్హాసనం ఎక్కించబడ్డ రాజు. ఆయన ఆ సింహాసనానికి విశ్వాసపాత్రుడు. అలా రాజుకు విశ్వాసపాత్రుడే. మామ అని పిలిపించుకుని, ఆప్యాయంగా ముద్దలు పెట్టించుకొని తిన్న అల్లుడు, కనపడని లోకాల్లో ఉన్న అమరేంద్రుడి కొడుకు, అమరేంద్రుడు కనపడకపోవటానికి తనే కారణం అయినట్టు చూపించినా, ఆ రాజు ఆ మహారాజు కొడుకు కళ్ళ ముందు నిలబడితే కళ్ళకద్దుకోక - హా, పోరా అని వెధవ్వేషాలు వేస్తారా ఎవరైనా! అలా చేస్తే విశ్వాసానికి అర్థమే లేదు. ఏం మాట్లాడతారండి?

అసలైనా విజువల్ గా చాలా ఎలివేటెడ్ షాట్ అది. సెంథిల్ చాలా బాగా పట్టాడు దాన్ని. ఆ మూమెంటును. వానలో అదీ కూడా. సత్యరాజ్ చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడో? మొదటిసారి మామా అని పిలిపించుకున్నప్పుడు, ఆ తర్వాత ఇక్కడ.

మీరు మనుషులైతే మనసులు కదిలిపోయుండాలి. ఆయనతో పాటు మీరూ బయటకు కాకపోయినా లోపలే ఏడవాలి. నేను ఏడ్చా, ఆయనతో పాటు. అంత బాగుంది విజువల్ గా! అలా ఏడవలేదంటే, మీరు సినిమా చూట్టం దండగ.

అంత కష్టమైన, ఎంతో కష్టమైన సీనును అంత అలవోకగా చేసేసిన సత్యరాజ్ కు నా నమోవాకాలు. కట్టప్ప పనికి మహేద్రుడు చలించి స్థాణువైపోయి నిలబడ్డాడు కదలలేక. శివుడు కట్టప్ప తన కాలు ఆయన నెత్తి మీద పెట్టుకున్నప్పుడు తన కళ్ళల్లో ఆ స్థాణురూపాన్ని చక్కగా చూపించాడు. అది మీకు కనపదలేదంటే, మీ కళ్ళు ఆ జడివానలో ముసుకుపోయినాయన్నమాట.

అంతకన్నా చెప్పేదేమీ లేదండి.

బానిసత్వం తప్పు కాదు. మీరు మీ ఆవిడకు బానిస. ఆవిడ మీకు బానిస - అనుకుంటే అందులో ప్రేమ, విశ్వాసం కనపడాలి తప్పితే, ఇంకో రూపం కనపడితే మీలో ఏదో తేడా ఉన్నట్టే. అది ప్రదర్శించే తీరు, ఆ ఇరువురు మనుషులకు తప్ప ఇతరులకు తెలియదన్న మాట నిజమే అయితే ఇంకో మాట మనం మాట్లాడకూడదు.

1 comment:

  1. Isn't character a bit similar to Bheeshma of Kuru dynasty?

    ReplyDelete