Monday, July 20, 2015

స్థలము: బాహుబలి ప్రదర్శించు సినిమాహాలు - ఔరా!

బాహుబలి జిందాబాద్!
ఈ బాహుబలి పరంపరలో ఐదవ ప్రకరణము, చాప్టరు, అంకము అన్నీ...


*******************************************
స్థలము: బాహుబలి ప్రదర్శించు సినిమాహాలు
వాచకుడు: ప్రేక్షక సార్వభౌముడు
(ప్రేక్షక సార్వభౌముడు చిత్రశాలయందలి యవనిక వద్దకు యొచ్చి, కలయగ జూచి – ఆశ్చర్యానందముతో)
**********************************************


ఔరా! ఈ హాలువాని చమత్కృతి ఏమియో గాని సినీవ్యాకరణము నెల్ల యౌపోసన వట్టి ప్రేక్షకసార్వభౌముడనైన నా మానసమును సైత మాకర్షించుచున్నదే!

(వెనుక పక్కకు జూచి)

ఈ చలనచిత్రపు దర్శకులవారు నా స్వప్నములను, అనుభూతులను తస్కరించి యుండరు గదా!
(ఆశ్చర్యముతో)

ఏమి, ఈ సురూప దృశ్యాతిశయములు? ఈ సుందరవిరాజమానాకృత దృశ్యదిగ్దిగంతము లెవ్వరివై యుండును?

(కూర్చొను పీఠమును సమీపించి మెల్లగా)

ఏమీ ఈ కథోపకథనములు? ఏమి ఈ భాష? ఏమి ఈ వచనము?

(నిదానించి)

ఇది యేమి? వీనిని భవనములందురా? పిల్లవాండ్లు ఆడుకొను గుజ్జనగూడులో పిచ్చుకగూడులో అటులనున్నవేమి ? మానవనిర్మితమగునటుల కాన్పడుటలేదే?

(మరల కొంచెము బిగ్గరగా)

ఎవరక్కడ? ఎవరు వారు ఈ భవనములు కట్టినది?

(ఊరకుండి)

ఏమిది? సమాధానము లేదేమి ?

(యవనికను బాగుగ పరీక్షించి)

నేనెంత భ్రమపడితిని? నిమేషత్వమే లేదు. ఈ భవనములు చిత్తడి నేలలు. ఊహాచిత్రములవలెనున్నవి. గణనయంత్రముతో చేసినారు కాబోలును. దుర్యోధనుడి అడుగు మడుగుయందు తబ్బిబ్బు పడినటుల మయుని నిర్మాణ ప్రతిభ ఈకాలమునందు వీరు తలకెత్తుకొనినారు కాబోలును. అడుగు పెట్టిన చాలు, జలకల్కము మనసునంత తడిపివేయుచున్నది. అహో ఏమా జలపాత దృశ్యములు. అహా, ఏమి సీతాకోకచిలుకలు. అరెరే, ఏమా మీనములు. ఏమా గుహలు. ఏమి ప్రకృతి సౌందర్యము.

(ఆశ్చర్యముతో)

ఏమి యీ విచిత్ర కల్పన! ఎవరది ? శివుడా? ఎంతటి ఆజానుభావు? ఎంతటి మన్మథాకారుడు ? పురుషుడనైన నాకే ఇంత యిదిగాయున్నదే! ఆడవారు గొల్లుమనెదరేమో! ఆహ్! గొల్లేమీ, పొల్లేమి. వారి గొల్లులలో వారిని ఉండమను. గొల్లు వదిలి వాని వొళ్ళు చూడుము. ఏమా శరీర సౌష్ఠవము ? శివలింగమును ఒక్కదాటున అటుల ఎత్తి భుజాలమీద వేసుకొనినాడే? అమ్మకోసం ఎంత పని చేసినాడు. ఎంత మంచి మనసు. ఎంత వీరుడు. అరే ఆ సుందరాంగి ఎవరు ? మనసునంతా మెలిపెట్టివేయుచున్నది తన అందముతో! అవంతికయా! అహా! ఎంత చక్కని పేరు. ఎంత చక్కని పిల్ల. కనులు చాలుటలేదు. మనసు నిలుచుట లేదు.

(తలయూచి)

ఎవరది? భళ్లాలదేవుడా? అది యేమి పేరు? భళ్ళు భళ్ళున పిడిగుద్దులు గ్రుద్దుచున్నాడు? దేనిని ? ఏమది ? అది మహిషము వలె తోచుచున్నది ? ఓహో! మాహిష్మతి అను పేరు అందులకు పెట్టినారా? ఏమి ఈ సినీరచయితల ఉత్తమ కళాకౌశలము!

(ఇంకొకవైపున జూచి)

మహిషము యన్న యింత చులకనయా? ఎంతటి దౌర్భాగ్యము దాపురించినది!

(చూచుచు)

వివిధ ఫలభరానత శాఖాశిఖా తరువర విరాజితంబులు, రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్యసురభిళ పుష్పవల్లీమతల్లికా సంభాసురంబులు, భాసుర పుష్పగుచ్చ స్రవన్మధుర మధురసాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకారనినాద మేదురంబులు, మేదుర మధుకర ఘనఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృతకలాప కలాప రమణీయంబులు, రమణీయ కోమల కలాపకలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబులు, సంకీర్ణ నికుంజపుంజ సుందరంబులు నగు వనంబులయందు వెలసిన కల్పతరువుల వంటి చిత్రములతో విలసిల్లిన జగద్ధాత్రి యీరోజు ఈ చలనచిత్రమునందు యీ గణనయంత్రము జేతియందు చిక్కుపడి విలవిలలాడుచున్నది.

(తల యూచి)

ఇందలి పేకమేడల కుసుమజాలములును రోదనానందము గల్గించుచున్నవి. ఒక్కొక్కచోట ఎంత బాగున్నను, మరియొక్కచోట అంతమించిన దారుణముగనున్నవి.

(నడువ నుంకించి, చూచి)

గణనయంత్రకాసారమే ఇది! ఏమది ? ఆ మేళములేమి ? ఆ సంగీతమేమి ? హాలాహలమే ఇది. సంగీతవైయాకరణ దౌర్భాగ్యమే ఇది. ఉండి లేనట్లును, లేక యుండినట్లును గనంబడుచున్నది, వినంబడుచున్నది. సంగీతదర్శకుడు మరికొద్ది శ్రద్ధ పెట్టినయెడల యెంత హృదయోల్లాసము కలిగించును? తరువాతి భాగములో శ్రావ్యముగానుండునేమో!

(బాగుగ జూచి)

హాలాహలమథనమే కాకున్ననీ కాలకేయుడు, వాని సైన్యములు, వాని పైశాచికభాషయు నెట్లుండును? ఆ లొట్టలేమి ? వాని భాష వానిచేత లొట్టలు వేయించుచున్నదేమో! వానికెంతటి ఆనందము. ఆ కాలకేయ ప్రజలకు యెంతటి ఆనందము. ఒకని భాష వాని చేత లొట్టలు వేయించినచో అది నమ్మశక్యముకాని ఆనందము. అయ్యది వదలిన మనది యెంతటి దరిద్రము! దరిద్రమే దాపురించినది. మన భాషకు, తెలుగుభాషకు లొట్టలు వేయుననంత సామర్థ్యము లేకపోయినది. తెలుగువారు తెలుగు మాట్లాడుచూ లొట్టలెప్పుడు వేయుదురో!

(తల పంకించి)

అయ్యది అటుపెట్టిన భవద్ధృదయ సంవృత గర్వ పర్వతోన్మూలన చణ వజ్రాయుధ భవచ్చిత్తాటవీ సంచరద్దురూహ మత్తమాతంగ వక్షఃకవాటవిపాటనపాటనోదగ్ర సింహకిశోర కరాంచల నఖాంచలంబుల మారణహోమమున హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లి నలుదెసల నాక్రమించుచు మంత్రపాఠకుల దుర్వారదర్వీకర నిర్వాంత విషవహ్నికీలలకైన దాళియుండనగును గాని, ఈ చలనచిత్రములోనున్న బిజ్జలదేవుని పాత్ర యథార్ధముగా పాఠకునకర్థమగుట దుర్ఘటము. అంతకుమించి బిజ్జలదేవు ముఖాలంకరణమును, వాని అభినయాయర్థమును ప్రేక్షకు డర్థము చేసికొనుట అసంభవము.

(తల పంకించి)

ఆ శివగామిదేవినిఁ బరికింపుఁడు. అనేక సహస్రచంద్రమండల సన్నిభమైన యాస్యమండలము చేదండము వంక రవంత యొఱిఁగి యున్నది. అందుచేఁ గిరీటమునుండి వ్రేలాడుచున్న ముత్తెముల గుత్తి మేరువునొద్దనున్న కరములపై వ్రేలాడుచున్నది. బాగుగాఁ బరిశీలింపుఁడు. ఎడమమోఁకాలిపై మడఁచిన కుడిమోఁకాలి వంపు ప్రక్కను రవంత వెనుకగ దేవతాచందననిర్మితమైన అందమువలె ప్రకాశించుచున్నదే. ఎంతటి సుందరమైన దృశ్యము. ఎంతటి అభినయము. ఎంతటి సొగసు. ఎంతటి పౌరుషము. ఎంతటి రాజసము. మీకును నా దేవికి వీవనలు విసరవలె ననిపించుటలేదా?

(తల యూచుచు)

కాలకంఠ ఫాలనేత్రాభీల కీలికీలా కలాపంబునకైన నోర్చియుండనగును గాని, ఈ కట్టప్ప అని వ్యక్తి చేయు కరవాలప్రయోగములు జూచి ప్రళయసమయ సముద్దండ దండధర చండాతి చండ దండ పాతంబునకైన సిద్ధముకావచ్చును, భీషణాతిభీషణం బగు వాని అభినయాయర్థమును ప్రేక్షకు డర్థము చేసికొనుట అమృతతుల్యమే. ఎంతబాగుగా తన పాత్రకు న్యాయము చేకూర్చినాడు. భళా కట్టప్పా! భళా!

(అటునిటు కలయజూచుచు)

అవియన్నియు పక్కనపడవేసి చిత్రరాజంతమువరకు చూచినచో - సంస్పర్శమాత్ర నూత్న చైతన్య ప్రసాదిత శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు, మందపవనచాలనోద్ధూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘట్టన జాయమాన మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యంబు, కమలకోకనదాది నానావిధ జలకుసుమ రాగారుణిత శోణితంబు, ఆలోలబాలశైవాలజాల లాలిత జంగమోద్యాన శంకావహంబు ననదగిన గ్రీవాలంకృత బిససూత్ర పాళికాసందీపిత హంస హంసీగణ విభూషితంబులతో, వర్ణనకందని యనుభూతులతో కాలము గడిపిన సినీదేవి నిండు మనస్సు నేడు యీ రాజమౌళి కరములందున్న చిత్రవిచిత్రోజ్వలితమైన రాటుదెబ్బకు అఖండ దీపము వలె తిరిగి రెపరెపలాడుచున్నది. యాతనికి మనము మన:పూర్వకముగా అంజలి ఘటించవలె.

(తల యూచుచు)

యోచించినకొలది, యీచిత్రరాజము చూచుచున్నకొలది మనంబున బట్టరాని ఆనందము వెల్లివిరియుచున్నది. మరియొకసారి వచ్చి వీక్షించవలె. జై రాజమౌళి. జైజై రాజమౌళి

(నయనానంద కరవాలము చేతబట్టి ప్రేక్షకసార్వభౌముడు వీరతిలకము దిద్దుకొని నిష్క్రమించును)

1 comment: