Sunday, July 26, 2015

బాహుబలిలో అవంతిక రేప్ చేయబడిందా? ఏమా హెడింగు ?

బాహుబలిలో అవంతిక రేప్ చేయబడిందా?
ఏమా హెడింగు ?
జాటర్ ఢమాల్ డింగు ?
అన్నం తింటున్నారా ?
ఇంకేమన్నానా!
ఏం వార్తలండి అవి ? 


వార్తల్లో ఉండాలన్నప్పుడు మన వార్తలు మనమే పుట్టించుకుంటే పోతుందని అనుకున్నారు కామోసు.
ఈ లెక్కన ఈ కిందివి కూడా వార్తలవ్వాలి - ఆ పని మీద ఎవరో ఒకరు ఉండండి నాయనా, అమ్మా!
హెడింగులు మీ మీ ఇష్టం. లోపలుండాల్సిన సరుకు ఇదీ...

********************************
"శివగామి బిజ్జలుణ్ణి, తన మొగుణ్ణి - తన మాటే శాసనం అంటూ మొగుడి మీద అరుస్తూ అధికారం చలాయిస్తూ అబ్యూస్ చేసింది "

" జంతుబలి కంప్యూటర్ జెనెరేటెడ్ బొమ్మలే అయినా చాలా దారుణమైనది. జంతుబలిని ప్రోత్సహించిన మానవత్వం లేని ఈ సినిమా నశించాలి"

"సంగమ్మ ఒక్కొక్కడి గొంతు మీద కాలేసి తొక్కుతానన్నందుకు ఆవిడ మీద ఆవిడొక బుల్లీ అని కేసు పెట్టాలి"

" భళ్లాలుడు బుల్లుని కింద పడెయ్యటం వల్ల బుల్లుల మనోభావాలు దెబ్బతిన్నయ్. అణగారిన జంతు వర్గాలమీద పైతరగతి మానవ జంతువుల వికృత చేష్టలు ఖండించాలి. "

"కాలకేయుణ్ణి, వాడి జనాభాను నల్లగా చూపిచ్చి నలుపు రంగువాళ్ళమైన మా మనోభావాల మీద కోలుకోలేని దెబ్బ వేసేసారు. "

"బిజ్జలుడు అంగవికలుడు కాబట్టి అధికారం ఇవ్వనందుకు అంగసౌష్ఠవం వున్న విక్రమదేవ వర్మ సమన్యాయం పాటించనందుకు వామపక్షులమైన మా మనోభావాలు దెబ్బతిన్నై కాబట్టి న్యాయస్థానానికి లాగాలి. "

" భిల్లులందరినీ బట్టలు లేకుండా చూపించినందుకు సున్నిత మనస్కులైన పట్టణవాసుల మనోభావాలు దెబ్బతిన్నై. అనాగరీకమైన ఈ సినిమాను బాన్ చెయ్యాలి"

"అంతంత జలపాతాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవ్. అలా చూపిస్తూ, క్షామంతో రగిలిపోతున్న కాలిఫోర్నియాలో విడుదల చేసి దాహార్తిని పెంచి లొట్టలు వేయించిన ఈ సినిమా డబ్బులు చేసుకున్నందుకు ఈ సినిమాను సూ చెయ్యాలి"

"అస్లం ఖాన్ తురకాయన కాబట్టి కావాలనే ఆయన కత్తిని విరగ్గొట్టి ముస్లిము దేశాల మనోభావాలు, కత్తులున్న ముస్లిముల మనోభావాలు దెబ్బతీసారు కాబట్టి ఈ సినిమా క్షమాపణ చెప్పాలి"

"దేవసేనను అలా తిప్పుతూ కట్టెలేరుకోనిచ్చినందుకు, తమ పుల్లలు తామే ఏరుకోమని సలహా ఇస్తున్నట్టు ఉన్న ఈ సినిమా, ఏకంగా చితివ్యాపారుల, వంటచెరుకు వర్తకుల వ్యాపారం దెబ్బతినేట్టు చేసినందుకు ఈ సినిమాకొచ్చిన ప్రాఫిట్లలో భాగం ఇవ్వాలి"

"భిల్లులంతా గట్టిగా ఏ జిమ్ముకెళ్ళకుండా సహజంగా కండలు దండలతో ఉన్నందుకున్నూ, పట్టణంలో అసహజమైన నాజూగ్గానూ సహజమైన లావుగానూ ఉండి నానారకాల జిమ్ములకెళ్ళి డబ్బులు వదిలించుకుంటున్న పట్టణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నై కాబట్టి ఈ సినిమా ఏదో ఒకటి చెయ్యాలి"

"గుహలూ అవీ చూపించి, గుహోఫోబికులమైన మా ఫోబియాను పెంచినందుకు ఈ సినిమాను సూ చెయ్యాలి"

" కాలకేయులు పళ్ళు తెల్లగా చూపిచ్చి డెంటల్ హైజీను లేని వారి మనోభావాలు దెబ్బతీసినందుకు, డెంటిష్టుల వ్యాపారం దెబ్బతినేట్టు చేసినందుకు ఈ సినిమా క్షమాపణలు చెప్పాలి"

"యాక్టర్లందరికీ మంచి మంచి బట్టలేసినందుకు కట్టుకోటానికి బట్టల్లేనివాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నై కాబట్టి ఈ సినిమా మాకందరికీ బట్టలు సప్లై చెయ్యాలి"

"రాజమాత శివగామి నడిచొస్తున్నప్పుడు వెనకాల అంతంతలేసి దివిటీలు చూపించి, కరెంటు లేని మా పట్టణ పల్లె ప్రజల మనోభావాలు దెబ్బతీసారు కాబట్టి ఈ సినిమావాళ్ళు మాకు నిరంతర వెలుగునిచ్చే దివిటీలు సప్ప్లై చెయ్యాలి"

"యుద్ధ రంగంలో కాళ్ళు లేనివారిని చూపించి సున్నితమనస్కులమైన మా భయాలను రెట్టింపు చేసినందుకు, మరణం మరణం అన్న మాట పదే పదే వినిపించి మాలో సూయిసైడు థాట్స్ పెంచినందుకు ఈ సినిమాను బాన్ చెయ్యాలి"

"పెద్ద పెద్ద పళ్ళాలు పెట్టి, ఆ పళ్ళాల్లో అంతంత ముద్దలు, బ్రెడ్డు ముక్కలు, పళ్ళు చూపించి ఒక్క మెతుకుకు కూడా నోచుకోని ఆఫ్రికా దేశవాసులను, వారి దయామయ జీవితాలను గుర్తుకుతెచ్చి కించపరిచారు కాబట్టి ఈ సినిమా ఆఫ్రికనులకు ఫుడ్డు సాయం చెయ్యాలి"

***************************

ఇహ ఇక్కడికి చాలు నాయనా

ఇంకేవన్నా ఉంటే మీ మీ ఇష్టం.

సరేకానీ ఓ సందేహం - అయినా ఆ సీనులో అవంతికదే పైచెయ్యికదండీ?

చివరకు ఆవిడే ఆ మంచి మంచి బట్టలు చించవతల పారేసి ఆయన మీద వాలిపోయిందిగా! అది రేపేమిటండి ? ప్చ్చ్...

1 comment:

 1. almost anni facebook lo vachcayi
  Sivagami vishayam,
  bijjaludi avakaram
  jamtu bali.
  ballaludi bullfight.
  okkasari facebook tirageyyandi. kollalugaa unnayi

  ReplyDelete