Tuesday, July 21, 2015

అయ్యా సినిమాభిమానిగారు - బాహుబలి చూచినారా?

అయ్యా సినిమాభిమానిగారు - బాహుబలి చూచినారా?

చూచామండి. బందరు ఉప్పెన చూసినతర్వాత మళ్ళీ అంత ఉప్పెన ఇదే చూట్టం.

మరి సినిమా ఎలాగున్నదండి?

ఎలాగుందని అడుగుతారేమండి ? అందులో యాక్టరందరూ చించేస్తేనూ!

చించేసారా! ఏమి చించారూ ? పంచెలా, చొక్కాలా?

ఓ పేద్ద బడాయి గాడు బయల్దేరాడయ్యా. చాలు గానీ, యాక్షను చించేసారయ్యా!

ఇంతకీ ఎవరి గురించీ నువ్వు మాట్లాడేది ?

ఆ సినిమాలో యాక్టర్లు. శివుడు, భళ్ళాలదేవుడు ఇంకా....

ఆపెయ్....శివబాహుబలిని వర్ణించు...

మనిషి ఆజానుబాహువు. స్ఫురద్రూపి. ఆయన ఎదుటికి ఆడవాళ్ళు వచ్చేరనటే మోహంలో పడిపోయారన్నమాటే. చేరడేసి కళ్ళు. జుట్టు ముడి వెయ్యలేదు కానీ, వేసుంటే పెద్ద గుమ్మడికాయంత వుండేది. జబ్బలు చూస్తే మన చావిడీ స్తంభాల్లా ఉన్నవి. ఇహ వక్షస్థలం సంగతే అడిగారూ మన మోటబండంత ఉన్నది. దబ్బపండును ఆయనముందు పెడితే వెలాతెలాపోదుటండీ ?

మరి మీరు చెప్పిందంతా నిజమైతే ఈ సినిమాలో అవంతిక ఈయన్ను చూడగానే మోహంలో పడిపోలేదే?

ఆవిడ అవంతిక అయితేగా. ఆవిడ తమన్నా కదండీ. అందుకని. అందరూ ఆవిడ వెనకాల పడాలి కానీ, ఆవిడ ఈయనెనకాల ఎందుకు పడుతుందీ?

నీ తస్సాదియ్యా! ఏం లాజిక్కురా నాయనా! సరే భళ్ళాలదేవుడి గురించి చెప్పు.

ఆయన వాళ్ళ బాబాయి కంటే ఒక మూడు మూరలు ఎక్కువ ఎత్తులోనే ఉన్నాడు కదండీ? ఆయన గుర్రమెక్కి సవారీ చేస్తే తిరిగొచ్చేప్పటికి గుర్రం నడుము విరిగిపోయిందిట. ఇహ ఆ గోలంతా ఎందుకని మహిషాన్ని తీసుకొచ్చి ఎంట్రీ ఇప్పించి, ఎలాగూ ఇప్పించాం కదాని ఆ రాజ్యాన్ని మాహిష్మతి రాజ్యం చేసేసారు. ఆతర్వాత, కనీవినీ ఎరగని రీతిలో బెల్జియన్ను బుల్లులాటి కండలుదేరిన బుల్లునొకదాన్ని కంప్యూతరులో ఇరికించి భళ్ళాలదేవుడితో యుద్ధం చేసేయించి ఆ బుల్లు భళ్ళున పడిపోయే సీను తెరకెక్కించారు. ఆయనా స్ఫురద్రూపే. బుల్లులను పడేస్తాడు కానీ దేవసేనను పడెయ్యలేడు. ఎంత విచిత్రమో!

ఎంత మాటన్నావురా నాయనా! రావణుడికి సీత పడిందా? ఇదీ అంతే! అయినా వాళ్ళకు అంతంత రూపాలు ఎలా వచ్చాయంటావు ?

ఆ! ఏవుందీ ? రోజూ మోడొందల అరిశెలు ఫలహారం కింద తినేవాళ్ళుట.

నీకరిశెలిష్టమని నాకు తెలుసులే కానీ, ఇంకో మాట చెప్పు.

మరి నాకెలా తెలుస్తుందీ వాళ్లు ఆకారాలు ఎలా పెంచుకున్నారో! వాళ్ళనే అడుగు.

సరే సినిమా మొత్తం వాళ్ళే అయినట్టు మాట్లాడతావేమిటీ ? మిగిలినవాళ్ళ సంగతి చెప్పు.

ఎవరి గురించి చెప్పమంటా?

శివగామి, భిల్లరాణి, దేవసేన, బిజ్జలుడు...

ఆపెయ్, ఆ బిజ్జలుడి పేరు నాదగ్గరెత్తమాకు. ఆ మీసాలు చూస్తే, టాం అండ్ జెర్రీలో ఉండే అంకుల్ పీకోస్ గుర్తుకొచ్చాడు.

ఎవరూ, గిటారు వాయించటానికి టం బుగ్గమీసాల్లోంచి ఒకటి పీక్కుని వాయిస్తూ ఉంటాడే వాడేనా?

అవును వాడే ఆ గిటారు వాడే! కాకపోతే ఆ పీకోస్ టెక్సాసు వాడు కాబట్టి వాడలా పెంచుకున్నాడు. మన బిజ్జలుడికేమొచ్చింది ? అలా తయారు చేశారేమిటో ఆయన్ని. ప్చ్.. ఇహ శివగామి అంటావూ? రాజమాత కాదూ ? యమా రాజసంగా చేసిందయ్యోయ్! మాతలు లేకపోతే పిల్లలు లేనట్టే, శివగామి లేకపోతే బాహువులు లేవు, బలీ లేదు, మనకు సినిమానూ లేదు. ఆడలేడీసు అంత పవరుఫుల్లు. ఇహ భిల్లరాణి భం భంలాడించింది. భిల్లులంతా భయపడ్డారు ఆవిడకు. మనం కూడా భయపడాలి ఆవిడ యాక్షనుకు. చాలా బా చేసింది. శివుడే పడిపొయ్యాడు. మనమో లెక్కా!

మరి దేవసేన...

ఆ దేవసేన! ఏవుంది కాళ్ళకు సంకెళ్ళేసుకుని చీకట్లో నుదిటి మీద జుట్టు అలా ఎగరెయ్యగానే అందరి గుండెలు ఝల్లుమన్నాయి.

నీ బొంద ఏం కాదూ ? రెండో భాగంలో సింహభాగం ఆవిడదేట.

దానికోసమే చూస్తూంటా. అమరేంద్రుడితో దేవసేన సయ్యాట ఆడుతుంటే కార్తికేయుడికి కోపం వస్తుందేమో! అందుకే కాబోలు వాణ్ణి మరణం మరణం అని సైన్యాన్ని ఉత్తేజపరిచి సొంతంగా దూసుకెళ్ళిపోయి వేటు వేసి చంపేసారు.

నిన్ను తగలెయ్య. పురాణాలూ తెలియవు. కథలూ తెలియవు. ఎలా పుట్టావురా నువ్వు ? ఆ పోయింది కాలకేయుడురా నాయనా. కాలకేయుడు. కార్తికేయుడు కాదు. కార్తికేయుడు కాదురా!

ఆ! ఏదో ఒకటిలే. పేరులే ఏముంది ? ఏదేమైనా అంతా కలిసి అగ్గి పుట్టించారు.

రాజుకుంది అందుకని రాజుకుంది.

రాజుకుంది అందుకని రాజుకుందా? అంటే ?

రాజుకు తపన అనే అగ్గి ఉన్నది కాబట్టి ఇక్కడ అగ్గి రాజుకుంది.

అంటే ఎస్.ఎస్.ఆర్ కు అగ్గిసరుకు ఉన్నది కాబట్టి అగ్గి రాజేసాడన్నమాట.

పుట్టించడమేమిటండీ ? కాల్చేశాడు. అరిపించేశాడు. అంతే ఇంకో మాట లేదు.

అంతే! అంతే! ఈ రెండో భాగం ఎప్పుడొస్తుందో ఏవిటో! అందాకా వేచి ఉండటం ఎట్లా?

ఇదే ఇంకో వందసార్లు చూడు. ఇంతలో అదొస్తుంది...అప్పుడు దాని గురించి మాట్టాడుకుందాం.

అంతేనంటావా?

అంతే..ఓం తత్ సత్!

No comments:

Post a Comment