Monday, July 20, 2015

బాహుబలి తీసినాడు! అందుకు .....


************************************
ఈనాటి చలనచిత్రములలో 'క్రమం' అనేది సున్న. తెలుగు సినీమాలయందు మరింత నున్నగానున్న గండుపిల్లిలాటి గుండు సున్న అనునది అందరకు తెలిసిన విషయమే. వినోదము, ఆహ్లాదము, వస్తువు అనేవి ఎండమావులు. ప్రేరణ అనేమాట పచ్చి అబద్ధం. చెప్పక తప్పదంటే తత్ క్షణ ధన నామ కండూతే తప్ప ప్రేక్షక ప్రేమ ఈ ప్రపంచంలో లేదు. చలనచిత్రం అనే మాటకి - చంపి తినడం అని అర్థమైతే, సృష్టిలో కావలసినంత, కావలసినన్ని భావప్రేరకాలున్నాయి. ఎంతసేపు ఈనాటి సినీమాకి తన నాయకుని కీర్తి, తన నాయిక భజన, ప్రేక్షకులను పీడిస్తే వచ్చే డబ్బుల ఆలోచన, ముఖస్తుతి, తనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఆలోచన. అంతకు మించి పోరు. ఇందులో కొంచెం హెచ్చుతగ్గులుండవచ్చుగాని మూలసూత్రం మాత్రం స్వార్థమే. పరోపకారం, ప్రేక్షకోపకారం అనేది ఎక్కడైనా పొరపాటున వుంటే, అది కూడా మారువేషం వేసుకున్న స్వార్థమే.

మూలకారణమైన అనిర్వచనీయమైన మహాశక్తి నుంచి అనేక అంధప్రాయాలైన శక్తులు పుట్టాయి. భావప్రేరకాలు పుట్టాయి. మనుషుల్ని, ప్రేక్షకుల్ని పునాదుల్లోకంటూ కదిలించి ఆకారణంగా మనసులను కూల్చేసే ప్రాకృతిక, సమస్త సాంస్కృతికసమస్థా శక్తులివి. ఆటలమ్మ, మశూచి వంటివి జబ్బులు కావు. ఇలాటి అకారణ, ఉన్మత్త శక్తులైన సినీమాలే జబ్బులు. భయంకర సినీమాల్ని సైతం హీరో పేర్లతో పూజిస్తాం. అయినా మనుషులకి, ప్రేక్షకులకి మతిలేదు.

** రేబీసు, అంత్రాక్సు వంటి పిచ్చివ్యాధికారక సినీమాలు వస్తున్న సమయంలో, అలాటి ఈనాటి సినీమా వ్యస్థలో, ఒకానొక వ్యక్తి, ఒక శక్తి, వ్యాధికారక క్రిములను ఎత్తవతల పారేస్తూ పాస్చరైజేషను కనిపెట్టిన లూయీ పాస్చరుకు సమానధీరుడు రాజమౌళి రూపాన ఈ సినీభువిలో స్వయంభువులా వెలిసి బాహుబలి తీసినాడు. అందుకు చలనచిత్ర పరిశ్రమ ఆతనికి ఋణపడి ఉండవలె. జేజేలు కొట్టవలె.

************************************

అసలు సంగతులకు వెళ్ళెదము

************************************

సృష్టిలోనున్న... అంత వలదనిన క్రౌంచద్వీపమందలి ఉత్తరమెరికాలోకములో నున్న యొక్కొక్క సినీమా యాకిట్లు చింప నిశ్చయించినాను. ఈ సినిమాలనంత నాశనమొనర్చుటయే మంచిది. సినీమా, పనికిమాలిన సినీమా, అర్థము లేని తెలుగు సినీమా నశించుటయే సమంజసము. ఈ సినీమాలలో నొక యుద్దేశమున్నదా? నీతి యున్నదా? శాసనమున్నదా? ప్రేక్షకప్రేమయున్నదా? ఒక క్రమమైన నున్నదా?

మన ప్రేక్షకులేమని చెప్పిరో వింటివా? ఈ సినీమాలలో సత్తు లేదు, అసత్తు లేదు, పగలు లేదు, రాత్రి లేదు, శాశ్వతత్వము లేదు, ఒక్కటియే యున్నది. వెఱ్ఱి. అది తనంత తానే కాక సినీమాయందు నిలబడుకొని యున్నది. దానికి వేరు లేదు. అయినను మహావృక్ష ముద్భవించును. ఫెళ్లున జనపదుల నెత్తిన బడుటకును, బుఱ్ఱలు బద్దలు గొట్టుటకును. ఇట్లెందులకు ఉద్భవించెనో దానికే తెలియును. అదికూడ నెఱుఁగునని చెప్పవలనుపడదు. ఆ సినీమాలలో వస్తువు యొక్క యునికి యున్నది, లేదు. వెఱ్ఱివాని మస్తిష్కమునుండి తన సృష్టి కలిగినదను సంగతి యా సినీమా ఎఱుఁగును, ఎఱుఁగదు. ఇట్టిదే ఆ సినీమాతత్త్వమనియు, స్వరూపమనియు మన ప్రేక్షకులు స్థిరపఱచినారు. ఆ తత్త్వము, స్వరూపము ప్రేక్షకునికి తెలియుటా, తెలియకపోవుటా? తెలియుట కాదు, తెలియకపోవుట కాదు. తెలియకపోవుట, తెలియుట యనఁగా నిదియే. సినీమా గూర్చి యెఱుఁగకపోవుటయే జ్ఞానము. ఎఱుఁగుట యజ్ఞానము. యీ బుద్ధి యున్నవాఁడు బుద్ధిమంతుఁడని ఎల్లరు అంగీకరించవలసిన విషయము.

మఱి ఇక్కడనున్న ప్రేక్షకుని స్థితి యెట్లున్నది? కొద్దిపాటి జ్ఞాన మున్నదనుకొందము. మంచి ఉద్దేశ మున్నదనుకొందము. బుద్ధి యున్నదనుకొందము. అట్టి సభికునికి ఈ సినీమాలు చేతి కరదండములుగఁ, గాళ్ళకు సంకెలలుగఁ, గంటికి గంతలుగ, మనస్సుకు దిగపీఁకుడుగ నుండుటచే ప్రేక్షకులు యెదుగు బొదుగులేక, శరీరమున నల్పులగుచు, బుద్ధియందు నత్యల్పులగుచు, జ్ఞానమున నంధులై, డైరెక్టరు చిత్తమను చెఱసాలలో బానిసల వలె యున్నారనియు, నీ పిశాచమునుండి యెంత త్వరగ విముక్తినొందుదుమో యంత త్వరలో దాని వలన సభికులకు సమస్తజనసోదరత్వమే కాక, సర్వజీవులయందు దయ గల్గుననియు, అట్లగుటకుఁ దగిన వీర్యము, వెన్నెముక, విదగ్ధత కలవా రగుదు రనియు, దేశమునకు, జాతికి యథార్థముగ మనుజజన్మమునకుఁ గూడ లాఘవకరమైన, లజ్జాకరమైన, బుద్ధిహీనపు, పశుప్రాయపు సినీమాలెప్పుడు పరశురామప్రీతి యగునో యప్పుడే ప్రేక్షకులకు జాత్యైక్యము సంభవించుననియు, జాత్యైక్యముతో దూరతీరముల కేఁగిన శరీరపాటవము, శరీరపాటవముతో సౌఖ్యసంపదయు, సౌఖ్యసంపదతోఁ జిత్తవికాసముఁ, జిత్తవికాసముతోఁ బిడుచగట్టుకొనిపోయిన బుద్ధిస్థైర్యము తిఱిగి వచ్చుననియు మన ముపన్యాసపీఠములపై సింహగర్జనము లొనరించవలెను.

తెల్ల సుద్ద సినీమాకి, మఱి విభూతిప్రేక్షకునికిఁ బడదు, సుద్దముక్కలు రెంటికిఁ జుక్కయెదురు; పగిలిన విభూతిపండునకు తెల్ల సుద్దకు నైధనతారవరుస; సుద్ద దారి సుద్దది విభూతి బూడిదలకు. ఇంతటితో సరిపోయినదా? లేదు. బెడ్డ వ్రేట్లను సహించినట్లు, సుద్ద వ్రేట్లను, ఆ పైని సుద్దల వారి సినీమాలను ఎనీమాలవలె సహించినను ప్రేక్షకునకుఁ దీయని ఫలము దక్కుట లేదు. పట్టు లేక గాలిలో సర్వశ్రమములఁ బొంది యల్లాడుచు మేఘములు మనకు సుధలవంటి నీరము లిచ్చుచున్నవి. కత్తికోఁతను సహించుచు మేఁకలు మన కాహార మగుచున్నవి. తమ గడ్డి తాము దినుచు గోవులు మనకుఁ గుంభవృష్టిగ మధుమధుర క్షీరముల నిచ్చుచున్నవి. పేఁడచేఁ, బెంటచే సంతుష్టినొంది సమస్తధాన్యసమృద్ధిని సర్వంసహాదేవి సమకూర్చుచున్నది. పశువులు సైతము, ప్రాణహీనములగు వస్తువులు సైతము స్వార్థపరిత్యాగ మాచరించి పదార్థసంవిధాన మొనర్చుచున్నవి. మఱి "సుద్దముక్క లేమి జేయుచున్నవి?" యని యడిగిన సమాధానము దొఱకదయ్యె! ఇంతటి దైన్యస్థితి నుపహరింపుట కెక్కడనైన యవకాశ మున్నదేమో కాని తెలుగుదేశమునందలి ప్రేక్షకవరేణ్యులకు మాత్రము లేదు. జంతువులను ప్రేమించవచ్చును, కఠినత్వమునుఁ బ్రేమించవచ్చును, పాచి మఱియు పెంటలనుఁ బ్రేమించవచ్చును గాని ఈ సుద్ద ముక్కల సినీమాలను బ్రేమించుట యసాధ్యము, దుర్లభము, దుస్సాధ్యము మఱియుఁ గాలహరణమును.

సూర్యుఁడు దాను గర్భానలజ్వాలాజాలముచే మండిపోవుచుఁ బ్రపంచమున కారోగ్యమును బ్రసాదించునట్లు సర్వకష్టనిష్ఠురతలకోర్చి జనోపకార మాచరింపవచ్చునను కొద్దిపాటి జ్ఞానము, బుద్ధియు నీ సినీమాలకు లేకపోయినదే! హతవిధీ! కూపము లేని పట్టణ మున్నది. కోమటి దుకాణము లేని పట్టణ మున్నది. బ్రాహ్మణుడు లేని పట్టణ మున్నది. సుద్దముక్క సినీమాలు లేని పట్టణ మున్నదా? లేదు. లేనే లేదు. గతించిన కాలములో నైన యీ సుద్దముక్కలు బ్రద్దలుగొట్టుటకు నవకాశముండినదేమో గాని సమకాలమునందు, భవిష్యత్ కాలమునందు నా యవకాశము లేదని నొక్కి వక్కాణించవచ్చును.

తిట్లు దీవనచే నడఁగుననియుఁ, గొట్టు పెట్టుచే శాంతించుననియుఁ, గత్తివ్రేటు కౌఁగిలిచేఁ బోవు ననియు, శత్రుత్వము మిత్రత్వముచే సడలు ననియు ననుభవైకవేద్యమే. కాని యీ సినీమాలు మంచిమాటలతో నేమి, వట్టిమాటలతో నేమి కృతార్థులు కాఁగలరా యన్నది శేషప్రశ్నయే!

జాతిద్రోహము, మిత్రద్రోహము, దేశద్రోహము, మతద్రోహము, దైవద్రోహము సినీమాలతో సమూలముగ నెగిరిపోవచ్చును. ఆ జ్ఞానమున్న సినీమాలెన్ని? పంగనామములచే భాగవతోత్తముఁడవు కాఁగలవా? ఆనపకాయచే సన్న్యాసివి కాఁగలవా? అటులనే సుద్దముక్కఁల సజ్జెక్ట్టులచే సినీమావి కాఁగలవా? అటువంటి సినీమాలయందు అధికారులు, నిర్వాహకులు, ఆంఖరులు, యాక్టరులు ఎటులుండగలరన్న విషయచింతన తలను బద్దలు గొట్టుచున్నది.

“సంఘారాధన”, “ప్రేక్షకారాధన", "వినోదారాధన" ” యని యందువు కద, ప్రేక్షకవినోదమునకు ముక్కా, నోరా? తలయా? తోఁకయా? భాషణము ననుసరించి మాటల నాచరించువాడు డైరెక్టరు. ప్రేక్షకులనే గాక సర్వభూతములను తనతో సమానముగఁ జూచుకొనునది సినీమా. తాను తన సంస్థ, తన బుద్ధి, తన సర్వస్వము సభికజనసేవ కని త్రికరణశుద్ధిగ నమ్మి ప్రతిఫలవాంఛాశూన్యుఁడై ప్రేక్షకసేవ యొనర్చునది సినీమా. అంతియ గాని ఆ ప్రేక్షకసేవ తలంపు లేని డైరెక్టరు చేతియందాడిన అర్థపర్థములేని కార్యక్రమముల వివరవిశేషములు జంకు, సిగ్గు యెగ్గు లేక ప్రేక్షకసభాపీఠమున నిలువఁబడి యసత్యము పలికినట్లు నోటియందు టెన్నీసు బంతులు గ్రుక్కుకొని పిచ్చిపలుకులు బలుకుచు నా మూల నుండి మఱియొక మూలకుఁ బనిలేక తిరుగుచు సినీమాసభికుల నల్లాడించు నద్భుతపురుషులగు మీరు డైరెక్టరు లగుదురా?

బోలు కార్యక్రమములచే తెఱచాఁపగుడ్డ సభికుల చక్షువులకు బిగించుట గాదు. వినోదసహిత కార్యక్రమములచే ప్రేక్షకుల మనస్సును బిగింపవలెను. కల్లుపాకలనుండి వెలువడిన వదరుబోతు సినీమాలెన్నున్నవో యెఱుఁగుదురా? నూటికి తొంబది శాఁతము అవియేనన్న మాఁట నిశ్చల స్థంభము. అట్టివాటిని జూచుటతోనే, వారి కార్యక్రమములు చూచుటతోనే ప్రేక్షకుని దేహము చచ్చినది. కార్యక్రమముల యందు నాసక్తి చచ్చిన దనవలయును గాదా? హీరోయని, రికార్డుయని, సినీమాయని తెగ సాఁగెద రెందులకు? ఓ సుద్దముక్క సమ్రాట్టులారా! తాడిచెట్టునెక్కి తాటికాయ లాగఁ జూచుచున్న మీకు సినీమాలెందులకు? ప్రేక్షకులెందులకు ?
తనకు ప్రేక్షకునకుఁ దత్త్వమున భేదము లేదనియు, భేదము మిథ్య, యేకత్వము సత్యమనియు నెఱిఁగి యనుభవములోనికిఁ దెచ్చుకొనని మీరు ప్రదర్శించు సినీమాలన్నియు డాంబికములు, కాలహరణములు, శ్మశానమందున్న కాష్ఠములు. చెప్పవలెననిన కాష్ఠములు ఆఱిపోకముందు వెలుగునుఁ బ్రసాదించునేమో గాని, మీ వల్ల నా యుపయోగముఁ గూడ లేఁదు.

తెలుగు ప్రపంచము సినీమామయ మైయున్న దని సభాపీఠముల బోధించు డైరెక్టరుకారివైన నిన్నును, నీతోడి సుద్దముక్కల నే మనవలయును? మోసగాఁ డనినఁ జాలునా? కటికవాఁ డన్నఁ జాలునా? లొడలొడమని యుపన్యసించువాఁడవు కదా? ఏదీ? నీ తరమగునా? అసలు సిసలు సినీమాలు చేయు సక్రమకార్యక్రమములు, నీవు నీ శబ్దజాలమునఁ జూపఁగలవా? పెద్ద నోరున్నవారికిఁ బెద్దమాట. పెద్దచేయి యున్నవానికిఁ బెద్దచేష్ట. పెద్దబుద్ధి యున్నవానికిఁ బెద్దయాశ. పెద్దకడుపున్న వానికిఁ బెద్దతిండి. పెద్దబల మున్నవానిది పెద్దపెట్టు. మఱి సుద్దముక్కలున్నవానిది? అదియే భేదము.

యీ సుద్దముక్కలలో నెంతసేపు ఒకని సినీమా చిందుల కార్యక్రమముకంటెఁ దన గంతుల కార్యక్రమము పై నున్నదను సంతోషము మిగులవలెను. ప్రేక్షకుని బాధించుటకుఁ దగిన శక్తి తన కున్నదను సంతోషము తనకు మిగులవలయును. అకాలగాఢాంధకారభయంకర యాక్టరులచేఁ బట్టపగలు కీచుకీచు మనుచు, గీరుగారు మనుచు వాచకపు రొదతో, ఆవు లంభాలతో, పందులు నెలుకలు గాడిదలు మొదలిగునవి ఘుర్ఝరించుచుఁ గిచకిచలాడుచు నోండ్రపెట్టుచున్నటుల నటునుండి యిటు నిటునుండి యటు నొడలు తెలియని యవస్థతోఁ బరుగులిడుచుంటివి సినీమాప్రపంచమునన్దు. ఆ సినీమాలు జూడలేక ఎవరిమట్టునకువారు మహాభయోద్రిక్తహృదయములతో స్వప్రాణము లెట్టులయినఁ గాపాడుకొను నాత్రముతోఁ గటికచీఁకటిలోఁ గానఁబడని యా దుర్దశలోనే యెక్కడికో యెఱుఁగకుండఁ బారిపోవఁజూచుటకు కారణము మీరు గాదా? మీ సినీమాలు గాదా?

పిచ్చియాసుపత్రి యనఁగాఁ, బిచ్చివారి రోగమును కుదుర్చు నాసుపత్రి యని యర్థము కాదు, పిచ్చి డాక్టర్లు గల యాసుపత్రి యని యర్థము చెప్పినట్లు మీ సినిమాలకు మీరే సన్మానపత్రాలిచ్చుకొనుచున్నారు. మీకుఁ బిచ్చిలేదన్నమాట ప్రేక్షకమూలమున సిద్ధాంతపడవలె గాని, మీకు మీరే నిశ్చయించుకొనిన యెట్లు?
గానుగ యెద్దుల లాగున సుద్దముక్కలందరు తిరిగిన దారులలోనే యల్లాడుచున్నారు. ముందునకుఁ బోయినవారేరి? తెన్నా? కన్నా? ఏమున్నది? పటలములు పటలములుగఁ బైకెగయుచున్న ధూమరాశిలో నుండి చిన్న చిన్న విస్ఫులింగములు చిటచిటాయమానధ్వనులతో మించి నక్షత్రముల వలె రాత్రి తమాలవృక్షమునఁ జేరిన మిడుఁగుఱుల కోటుల వలెఁ, సాలీళ్లవలె సభికుని మస్తిష్కము బూజు చేయుచుంటివి.

ప్రేక్షక్లా కాఁకకు నిలువలేక, చర్మములు బొబ్బలెక్క, దాహముచే జిహ్వలీడ్చుకొనిపోవ, నతికాంతిచేఁ గన్నులు చీఁకటులు గ్రమ్మ, దయ్యములు పట్టినవారివలెఁ బిచ్చివారివలె జుట్లు పీఁకికొనుచు గుండెలు కొట్టుకొనుచు నట్టిట్టుఁ బోవుచు నాకసము పగులున ట్లాక్రోశ మొనర్చుచున్నారు. ఈ యేడ్పులు విన్నవారెవరు? దయ యెవరికి? దాక్షిణ్య మెవరికి ?ఆహారనిద్రావ్యత్యస్తపరిస్థితులచేఁ గలిగిన వాతపిత్తశ్లేష్మదోషములకు చికిత్సలున్నవిఁ గాని మీ సినీమాలు జూచిన ప్రేక్షకుల వేదనకు చికిత్స లేదు.

కృతి పాడఁదగినది. కథ యూఁకొట్టఁదగినది. నాటక మాడఁదగినది. ఉపన్యాసము వినఁదగినది. సంప్రదాయము ఉత్సాహోల్లాసములు గలిగించునది. మఱి మీ సినీమాలు ప్రదర్శించు స్వరూపమిది - నోరార్చుకొనిపోయినప్పు డక్కలకఱ్ఱ, ముక్కులార్చుకొనిపోయినప్పుడు పొడుము వేసికొనినట్లు రూపము సంతరించికొని యున్నవి.ఈ దౌష్ట్యమునకు శిక్ష నతిత్వరితముగా నిర్ణయింపవలెనని మనసు ఉద్రేకపడుచున్నది.

కడవలంత బానలంత ద్రోణములంత చుట్టు గుడిసెలంత యెఱ్ఱగఁ గ్రాగిన ఱాలు, సలసల తెల్లగ మరిఁగిన గంధక ధారలతో ధారాపాతముగా శతకోటి శతకోటి అభిషేకములు గావింపవలెనన్న కోరిక తీవ్రమగుచున్నది. చెదలున్న పుట్టలోఁ దాటియాకు మంట పెట్టినయెడల నేమగునో యదియే యంతకంటె భయంకరముగ బీభత్సముగ మీ సంస్థలను దగులవెట్టవలెనని హృదయము గుతకుతలాడుచున్నది. వాంతులతో భేదులతో మూత్రబంధములతో, నెక్కుపట్టిన నరములతోఁ, గంటిగుంటలతో, నొడలి చలువతో, నాసన్నమరణలాంఛనమగు నాభీలశిరోవేదనతో, భరింపరాని బాధలు పెడుచున్న ఈ సుద్దముక్కల నూడ్చి పెట్టుటకుఁ దోఁకచుక్క యంత చీఁపురు చేతఁ బట్టుకొని, ముఱికి కాలువల ప్రక్కలను గోడిరెట్టగుట్టల నడుమను పారవేయవలెనన్న ఆశ నటరాజనర్తన వలెఁ దాండవించుచున్నది.

మీ బుద్ధికందని విషయములు, మీ శక్తికి మించిన సన్నివేశములుఁ బట్టుకొని, చలనచిత్రమే సంస్కృతియనుకొని, వెఱ్ఱిగంతులే సంప్రదాయములని సుద్దముక్కలు పేర్చి అవియే అత్యద్భుతములని ఢక్క కొట్టుకొనుచు, ఓ చెలరేఁగి అఖిలైకకార్యమిదియే యని ప్రేక్షకవీథులవెంట, సోషలుమీడియావీథులవెంట నోండ్రపెట్టుచు పరగడలు ద్రొక్కుచున్న మీ నాలుకఁ గోయింపవలదా? మీ అడ్వర్టైజాధికారులను తఱిమిగొట్టవలదా?

మఱి యే లాగున నుండవలెనని యడుగుచున్నారా? ఎట్టి పిచ్చిలో నే విధమైన వెగటును లేదో, ఎట్టి యున్మాదము సభికోద్ధరణపటిష్ఠమో, యెట్టి మతిమాలినతనములో జ్ఞానవిజ్ఞానములు దుర్నిరీక్ష్యమైన తేజస్సుచే వెలుగునో, యెట్టి వెఱ్ఱికి వేయివిధములు కాక కోటివిధములయ్యును సభికగ్రహణవిధాన మను నొక్కటే విధానమున్నదో, యెట్టి వెఱ్ఱి వెఱ్ఱు లన్నిటికంటె వెఱ్ఱిదో - యట్టి వెఱ్ఱిని, నట్టి వెఱ్ఱిలేని వెఱ్ఱినిఁ గలిగి తాను ధన్యతఁ జెంది సభికుల ధన్యులఁ జేయు సినీమాలే సినీమాలు. ఇప్పుడైన నట్టి పిచ్చి లక్షకుఁ గోటి కెవ్వనికైన నుండినయెడల వాఁడు ప్రేక్షకగానము చేయవచ్చును.

** ఉదాహరణముగా బాహుబలిని జూడుడు. ఎంతటి దృశ్యకావ్యము. ఎంతటి ఆహ్లాదము. ఎంతటి ఆనందము. రాజమౌళి అను దర్శకుని వలన మీ సినీమాచరిత్రలో యొకానొక అపురూప సంఘటనము జరిగినది. అయ్యది చూసి నేరుచ్కొండు. అంతేగాని మీమీ సినీమాలయందు నేదో ఘనత యున్నదని నిరూపింప నసందర్భకార్యక్రమములు సృజించి యకాలపు వెఱ్ఱులై ప్రేక్షకుల కాపత్తుఁ దెచ్చిపెట్టుట పాఁడి గాదు. వినోదము గుణములో నున్నది కాని గణములో లేదని తెలుసుకోవలె. అభిప్రాయప్రకటన సమంజసముగానుండుటయే కావలసినది.

అదియటులుంచిన ప్రేక్షకులలోఁ దక్కువవారు లేరు. నూటి కెనుబదుగురు రసగ్రహణమునఁ గేవలము మూఢులు. పామరగంతుల తయితక్కలకు బళీ యందురు కాని రసప్రాప్తి, రసాస్వాదన యొక్క ముడుల చిక్కు విప్పిన సినీమా ప్రదర్శనములు దలకెక్కవు. కుక్కగొడుగు లేవో, గులాబులేవో దెలియని సభికులు అనుచిత కరతాళధ్వనులు మాని రసప్రపంచ మనఁగనేమో ముందు తెలుసుకొనవలె. తెలిసినంత ఆలోచించవలె. ఆలోచించినంత ఆస్వాదించవలె. మామిడిపూఁత మసూచిపోఁత యొకటే యన్న, గోరంటపూవు వాసన యెట్టిదో కప్పకూఁత లట్టివి యన్న యెవరికి ముదములందును? ఆ జ్ఞానమును సంపాదించికొనవలె. అన్నియు బహిర్గతాంతసత్త్వములే. కార్యక్రమములలో మంచివానిని బహుమానింపవలెను. చెడ్డవానిని బహిష్కరింపవలయును.

సమకాలీనసినీమాలలో కొలఁదిసినీమాలు, చాలఁ గొలఁదిమంది డైరెక్టరులు శక్తివంచన లేకుండ ప్రేక్షకసంప్రదాయాదేవి పూజకై నిజమైన సినీమాలుగా, డైరెక్టరులుగా నెట్లు బాటుపడుచున్నారో చూడుడు! ఇన్ని పాటులుపడి యేమి బాధాప్రతిఫల మొందుచున్నారో యెఱుఁగుదురా? ఎందులకు? వారు ప్రదర్శించబోవు సినీమాలు, మంచివో చెడ్డవో చూచినతరువాతఁ గదా తెలియవలసినది? అట్లు చూచినవా రెవరు? చూచుట కోపిక యెవరికి? చూచుటకుఁ దీరిక యెవరికి? చూచుట కంత సాంస్కృతికాభిమాన మెవరికి? సంప్రదాయాభిమాన మెవరికి? రసానుభవ మెవరికి? చూచుటకు చక్షుర్ జ్ఞానమైన నెందఱకు?

తెలుగువారిలో, ప్రేక్షకులలో విరివిగా లెక్కచూచుకొనిన యెడల నూటికిరువదిమంది సినీమాసంప్రదాయజ్ఞాన మున్నదేమో! యా యిరువదిమందిలోఁ బదుగురకు వినోదజ్ఞాన మున్నదేమో! ఆ పదుగురిలో నిద్దఱకు క్రోఁతి గంతుల భాగవతమునందున్న ఆసక్తి గోవిందనామస్మరణ కార్యక్రమము నందు లేదు. మఱి యిద్దఱు దామే గంతుల పండితులమని విఱ్ఱవీఁగుచు మిగిలిన యాఱుగురి నెత్తిన మొట్టుచుంటిరి. ఈ పై మొట్లను దించు మిగిలిన యారుగురిలో ముగ్గురు దమక్రింది మెట్టున నున్న ముగ్గురిని మొట్టుచున్నారు. ఈ సయ్యాటలు యెప్పటికి యాగునో ఆ భగవంతునికేఁ దెలియవలె!

ఇదివఱకు మనము కాంచిన చలనచిత్రములు,యాక్టరులు గతించినారు. ఆయా సినీమా నిర్మాతలందఱు నొడలు జలదరించునట్లు, కనులు కృతార్థము లగునట్లు, మనస్సు పుష్పించునట్లు, జన్మము తరించునట్లు పాఠకులకు సాక్షాత్ శారదామాత దర్శనభాగ్యముఁ గలిగించినారు. వారి స్థాయిని అందుకొనుమని చెప్పుటలేదు, సాంస్కృతికసంస్థలన్న నామముఁ దగిలిచికొన్నందుకుఁ గనీసపు బాధ్యతగా ఆ దిశగాఁ బ్రయత్నము చేయుఁడు. మేల్కొనుఁడు సినీమాలారా, డైరెక్టరులారా! మేల్కొనుఁడు ...రాజమౌళిని జూడుడు. నేర్చుకొనుడు.

ఎవని చిందులు దుక్కు, ఎవని గంతులు ముక్కు, ఎవని చలచిత్రములు పెంట, ఎవని రాజకీయము పంట అని జుట్లు పట్టుకొను భాగ్యము నుండి ప్రేక్షకులను రక్షింపుడు. అందఱుఁ బ్రయోజకులే! అంద ఱప్రయోజకులే! మీకు బుద్ధిలేకపోవుటచేత నెప్పటి కప్పటికే పరాకు. ఆ "బుద్ధి" ప్రసాదించమని ఆ శారదమ్మను వేడుకొనుడు. మీరు మీ ఉన్మాదముతోఁ జిన్నమెదడును బెద్దమెదడుగాఁ జేయునెడల సభికునికి ఉన్మాదము, పిచ్చి హెచ్చును. బలిపశువైన ప్రేక్షకుడు "ఇటువంటి" వ్రాఁతలు వ్రాయును. కావున జాగరూకులై వ్యవహరింపుఁడు.

చూడవలయును జూడవలయున నని మనస్సు వాంచించుట చేతనే కదా ప్రేక్షకునకుఁ జలనచిత్రములు కలిగినవి! తినవలయును తినవలయునని సంతతవాంఛ కలుగుటచేతనే కదా శరీరమునకు నోరు వచ్చినది! మనస్సులోని సంచలనములవలననే కదా దేహమున కవయవవైవిధ్యము కలిగినది. అటువంటి మనసును మీ అపరిపక్వపు సినీమాలతో పారిశుద్ధ్యసంఘమువారి బండితుక్కువలెఁ బాఠకుల మీఁదికిఁ బోయక పరశురామప్రీతిఁ జేయక, జాగరూకులై వ్యవహరింపుఁడని హెచ్చరించుచు –

**మఱియొకసారి రాజమౌళికి, బాహుబలికి, అందలి యాక్టర్లకు హృదయ పూర్వక అభినందనలతో ......

శలవు .
భవదీయుడు
వంశీ

No comments:

Post a Comment