Wednesday, March 18, 2015

పుస్తకాలు - అట్టలు - రంగులు - రహస్యాలు

అట్టలు - పుస్తకాలకు అట్టలు - చూసినాక వచ్చిన చిన్న ఆలోచన.

కథలు రాసారయ్యా. అందులో ఈ నానారకపరిమళసుగంధదౌర్గంధాలు కలిపేసారు. ఇప్పుడు కథలు పుస్తకరూపంలోనికి మారినాక ఏది ఏవిటి అన్నది పాఠకుడు కష్టపడి వెతుక్కోకండా కలర్ కోడింగులా అట్టల కోడింగు చేసేస్తే పోతుందనిపించింది నిన్న మా ముసలాయన పాతపుస్తకాల కొట్టోకెళ్ళాక. ఆ ఆలోచననే ఒహ రెండు ముక్కల్లో పెడదామని ప్రయత్నం!

ఈ ప్రయత్నానికి క్రెడిటంతా మా ముసలాయన పుస్తకాల కొట్టే కాక, ఒక్కో రంగుకి ఒక్కొక్కరి మనస్తత్వం ఎలాగుంటుందోనని అంతర్జాలంలో ఉన్న కొంత సమాచారం సాయపడింది. అందుకు ఇంటర్నెట్టుకి, మా ముసలాయన కొట్టుకి కృతజ్ఞతలు. ఇహ చదూకోండి.


పుస్తకాలు - అట్టలు - రంగులు - రహస్యాలు

ఎరుపు అట్ట:

ఎరుపు అంటే ఎరుపే. ఉద్వేగోత్సాహాలు కలిగించే కథలకు, రక్తపోటు పెంచే కథలకు, సైన్సుఫిక్షను కథలకు, హీరోగారు ఒక్క బాణంతో మూడొందల పిశాచాలను స్వర్గానికి పంపించే ధైర్యసాహసాల కథలకు ఈ అట్ట అంటించాలి. ఈ అట్టను ఇష్టపడే పాఠకులు తక్కువ వారు కాదయ్యోయ్. ధైర్యసాహసాలు గల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఏదో ఒకటి చేసి సిగ తరిగేద్దామనే తాపత్రయం వీరిలో సుబ్బరంగా గమనించవచ్చు.

ఈ అట్టకు చెందిన చెందిన పాఠకులు దృఢ సంకల్పంతో పుస్తకాన్ని, అందులోని కతను చదవటం పూర్తి చెయ్యగలిగిన శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని పాఠక మనస్తత్వం కలవారై ఉంటారు. కతలో ఎలాంటి చికాకులున్నా ఎదుర్కొంటారు. అలాటివారెనకాల మీరెళ్ళి నిలబడితే మీ పని అయిపోతుంది. అటు పోటుతోనైనా, ఇటు ఆటతోననైనా...ఏదైనా వినోదమే!

చిలకాకుపచ్చ అట్ట: 

ఆకుపచ్చ రంగు ఆకుపచ్చఏ. ఈ అట్ట వెయ్యాలంటే ఆ పుస్తకం చదివినప్పుడు ప్రశాంతంగా ఉండాలె. ఆ పైన ఇంకొకడికి చెప్పి చదివించేలా ఉండాలె. కథలు సంప్రదాయబద్ధంగా ఉండాలె. అంటే ఏకాలానికి తగ్గ సాంప్రదాయం ఆ కాలానికన్నట్టన్నమాట. ఉదాహరణలు బోలెడు. సరే పాఠకులకొస్తే ఈ అట్టలున్న పుస్తకాలు ఇష్టపడేవారు గొడవలకు దూరంగా ఉంటారు. చదివాక కూడా చదవక ముందు ఎంత ప్రశాంతంగా ఉన్నాడొ అంతే ప్రశాంతంగా ఉంటారు. ఇంకోడి పని కూడా తన నెత్తి మీదేసుకుని సాయపడుతూ ఉంటారు. సంప్రదాయాలంటే ఇష్టం. సంప్రదాయం కాదని ఎవడన్నా అంటే, అంత శాంతమూర్తులు కూడా తుఫానులా మారిపోతారు. పెనుతుఫాను ప్రకృతివైపరీత్యంలా బోల్డు పాఠకవైపరీత్యాలు సంభవిస్తాయి. పుస్తకాలు చదవటం పట్ల ఒహ మాదిరి పట్టుదల ఉంటుంది. వీళ్ళు ఎరుపు అట్టవాళ్ళకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాధ్యం కాపోతే ఇక ఇక, పక పక కాకుండా ముసి ఒకటి నవ్వి ఊరకుందుకు ప్రయత్నిస్తారు.


తెలుపు అట్ట :

ఈ అట్టలెయ్యాల్సిన పుస్తకాల్లోని కతలు - ఏడుపు కతలు, సున్నితమైన కతలు, పిండేసే కతలు, అవగాహన కతలు, జటిలమైన సమస్యలు లేని కతలు, తన్నులు తిప్పులు వొయ్యారాలు వూపులు లేని కతలు వేసుకోవాలె.. ఈ తెలుపు అట్ట పాఠకులకొస్తే వీళ్లంతా సున్నిత మనస్కులు. చిన్నపిల్లోడి కతలో తోడేలుని చంపేసారంటే ఏడుపుతో టాంకుబండు నింపేసే మనుషులు. ఎవడినా నవ్వుతూ దగ్గరికి వస్తే నవ్వు మాయం చేస్తారు. అరుస్తూ వస్తే అరుపులు మాయం చేస్తారు. మాటలుండవ్ అంతే! బుద్ధావతారమని ఇందులో కొంత మందికి పేర్లు. వీరు అన్ని రంగుల వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎక్కడ ంఆసిపోతామోనని. కుదరకపోతే ఏడుస్తూనే హత్తుకుంటారు.


నలుపు అట్ట:


నలుపు అట్టలెయ్యాల్సిన పుస్తకాల్లోని కతలు గంభీరమైన కతలు, నల్ల కతలు, దుర్మార్గ కతలు, దారుణ కతలు, ఆధిపత్య కతలు, నిరంకుశ కతలు - ఇవన్నీ వేసుకోవాల్సినవి. నల్ల అట్ట పాఠకులకొస్తే కారుమబ్బుల్లా గంభీరంగా ఉంటారు. ఇతర పాఠకులెవరైనా ఆధిపత్యం చలాయించటానికి చూస్తే తోలు వలిచి కుంపట్లో వేసి మాడ్చి నల్లగా చేస్తారు. అన్ని రంగుల వాళ్ళకు దూరంగా ఉంటారు. నలుపు ఏ రంగుతో కలిసినా నాశనమే ఒక్క నలుపుతో తప్ప.


నీలం అట్ట:


నీలం అట్టలున్న పుస్తకాలు ఉండవలసిన తీరు - ఆత్మవిశ్వాసం, సెల్ఫు హెల్పు, వ్యక్తిత్వ వికాసం, శాంతిప్రబోధాలు - ఈ కథలు ఇలాటి వాటన్నిటికీ ఈ అట్టలే దిక్కు. ఈ కథల స్వరూపం అలా ఒక ప్రవాహంలా పోతూ ఉంటుంది. ఎక్కడ మునుగుతామో, ఎక్కడ తేలతామో రాసినవాడికి మాత్రమే తెలుస్తుంది. ఇహ పాఠకులకు వస్తే, ఈ అట్టల పుస్తకాలు చదివేవాళ్ళకు వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం నిల్లు. అందువల్ల చకోరపక్షిలా ఎవడేమి చెప్పినా చదువుతూ ఉంటారు. బయటికి చెప్పేస్తే అయిపోయే పనికి, గుంభనగా దాచుకొని సాయంకోసం ఎదురూచూస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఆత్మవిశ్వాసం వచ్చేసాక నీలాన్ని చించి పోగులు పెడతారు. ఆకుపచ్చవారితో స్నేహం చెయ్యటానికి తపించిపోతూ ఉంటారు.


గులాబీ అట్ట :


గులాబీల్లో బోల్డు రకాలు కానీ, పన్నీరు రంగు గులాబీ గురించి మాట్టాడుకుందాం ఇక్కడ. అలాగే ఆ అట్టల గురించి. ఈ అట్టలున్న పుస్తకాల్లో కథలెట్లాగుండాలంటే - చిలిపి కథలు, నవ్వు కథలు, తుళ్ళు కథలు - ఇలా ఈ టైపువన్నీ ఈ అట్టల కిందకొచ్చెయ్యాలె. ఇహ ఈ అట్టల పాఠకులు నవ్వుతూ, చలాకీగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా సీరియస్సుగా తీసుకునే తత్వమే కాదు. చావు వార్తలు కూడా నవ్వుతూనే చెపుతారు. ఈ అట్టకు చెందిన పాఠకులు అందరినీ కలుపుకొనిపోయే తత్వంగలవారు. పదిమంది పాఠకుల్ని చేరదీసి కలివిడిగా అందరినీ సాంబారులో గరిటలా తిప్పుతూ కతలో కొత్త విషయాలు తెలుసుకుని వాటి మీద మాటాడుకుంటూ ఉంటారు. వీరికి ఎరుపు అట్ట వాళ్ళతో విరోధం. వారికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఎందుకంటే వీరి నవ్వులు వారికి కోపం తెప్పిస్తై కాబట్టి. గూబ గుయ్యిమంటే కష్టమని దూరంగా ఉంటారు. ఆకుపచ్చ అట్టలవాళ్ళు ఫరవాలా. ఊదా అట్టలు ఓ.కె. నీలం అట్టలవాళ్ళంటే ప్రాణం.


వంగపండు లేదా ఊదా అట్ట:


ఈ రంగుల అట్టలు వేస్తే ఆ పుస్తకాలు ఎలాగుండవలెనంటే - లిబరేషన్, ఫ్రీడం, స్వేచ్ఛ, స్వాతంత్రం, దేశభక్తి, సమాన హక్కులు, చదవగానే అరటిపండు వొలిచినట్టు అర్థమైపోయే కథలు - ఇవన్నీ ఉండాలె. ఇహ పాఠకుల సంగతికొస్తే ఈ అట్టలు ఇష్టపడేవారు తమను స్వేచ్ఛగా ఉండనివ్వట్లేదని, తమకు స్వాతంత్రం లేదని, హక్కులు కావాలని, దౌర్జన్యాలు సహించమని, రెబెల్ మనస్తత్వంతో ఊగిపోతూ ఉంటారు. ఇతరు పాఠకుల స్వేచ్ఛాస్వాతంత్రాలను కూడ వీళ్ళే నెత్తినేసుకొని కాపాడుతూ ఉంటారు. తెలియని కథ గురించి మాట్లాడరు. వీరికి ఎరుపు అట్టవాళ్ళతో విరోధం. ఆకుపచ్చ అట్ట వాళ్ళంటే చిన్నచూపు. ఇద్దరూ పనికిమాలిన వాళ్ళని వీళ్ళ ఉద్దేశం. తెలుపు అట్టలు అసలు అట్టలే కాదని, నలుపు అట్టలు తలకుమాసినవని అనుకుంతూ ఉంటారు.


గోధుమరంగు అట్ట: 


గోధుమరంగు అట్టలేయాల్సిన పుస్తకాల్లోని కతలు ఆడంబరాలకు, సంబరాలకు, గాంభీర్యాలకు, దూరంగా ఉండాలె. హీరోయిను ఇంపాలాకారు, హీరో ఆడీ కారు అని వివరణిస్తే ఆ కత ఈ అట్టకు పనికిరాదు. సామాన్య జీవితానికి సంబంధించిన కతలన్నీ ఈ అట్టలేసుకోవాలె. పందులు కాచే వాడి కత నుంచి, కూరలమ్ముకునే వాడి కత దాకా ఈ అట్టే. ఇహ అట్టల పాఠకులకొస్తే చదవడానికి వీళ్ళకున్నంత ఓపిక ఇంకెవరికీ ఉండదు. బడిపిల్లలకు హోమువర్కు ఇచ్చినట్టే. ఆడంబరాలకు వీలైనంత దూరంగా ఉంటారు వీరు. ఇతర పాఠకులతో ఆత్మీయంగా మాట్లాడడంలో వీరి తర్వాతే ఎవరైనా. ఈ రంగును ఇష్టపడే వ్యక్తులను అందరూ అభిమానిస్తారు. అందరూ అభిమానించినందుకు చాలా మంది ద్వేషిస్తారు. బురద చల్లుతారు. కానీ బురద రంగే అవ్వటం వల్ల వేసిన బురద కనపడదు.


పసుపుపచ్చ అట్ట:


పసుపుపచ్చ అట్టలేయాల్సిన పుస్తకాల్లో కతలు - వంటలకు, ఆరోగ్యానికి, యోగాకు, లౌక్యానికి సంబంధించినవి, లోకంలో ఎలా బతకాలి అని వివరించేవి, సంయమనం పెంచేవి - ఇలాటి రకాలు ఈ రంగేసుకోవాలె. ఇహ ఈ అట్టల పాఠకులకొస్తే అందరితో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు. మంచి ఫుడ్డు తిను, మంచి గడ్డి తిను, చకిలం తిను, సకినాలు తిను, పూతరేకులు తిను, మట్టిబెడ్డలు తిను, వంగో , లే , నమస్కారాలు పెట్టు, పెట్టనివాణ్ణి తిట్టు - అంటూ ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించడంలో ముందుంటారు. అలా ఎల్లప్పుడూ ఆత్మైస్థెర్యంతో ముందుకు పోతూ ఉంటారు అధ్యక్షా. ఎరుపు అట్టల వాళ్ళొచ్చినప్పుడు మాత్రం సంయమనం కోల్పోతారు . అక్కుపచ్చవాళ్ళతో, ఊదావాళ్ళతో లౌక్యంగా ఉంటారు. తర్కం మాట్లాడి పన్నీరు రంగు వాళ్ళని, గోధుమరంగు వాళ్ళని కంఫ్యూస్ చేస్తూ ఉంటారు.


నారింజ లేదా కనకాంబరం రంగు అట్ట:


ఈ అట్టలెయ్యాల్సిన పుస్తకాల్లోని కతలు సంతోష కతలు, చురుకు కతలు, కౌగిలింతల కతలు, విమర్శ కతలు, లక్ష్యచేదన కతలు, త్యాగం చేసే కతలు, మాటకారి కతలు - ఇవన్నీ వేసుకోవాల్సినవి. ఈ అట్టల పాఠకుల సంగతికొస్తే ఏ త్యాగానికైనా ముందు వరసలో ఉంటారు. బ్రేవ్ హార్టులో మెల్ గిబ్సన్ యుద్ధం చెయ్యండిరా అని అరవక ముందే గుర్రమేసుకుని వెళ్ళిపోయి అవతలోడితో యుద్ధం చేసేస్తూన్నవాడిలా ఉంటారు. అవతలోణ్ణి పొడిచాక సంతోషంగా బోల్డు మాటకారితనం బయటపెడతారు. చంచల స్వభావం. గుర్రాల్లేకపోతే బల్లేలు పుచ్చుకుని పరిగెత్తే రకం. ఎరుపు రకానికి వీళ్ళకు బాగా స్నేహితం. అయితే ఒకళ్ళనొకళ్ళు కతలతో పొడి చేసుకునే ప్రమాదం ఉన్నది. ఆకుపచ్చవారంటేనూ, తెలుపు రంగువారంటేనూ యోజనం దూరంలో ఉంటారు.


ఇహ ఎన్నని , ఎన్ని రంగుల గురించని చెపుతాంలేకానీ - చివరాఖరిగా ఒక్క రంగు చెప్పి ఊరకుంటా.


ఇంద్రధనస్సు అట్ట:


ఈ అట్టలేసుకోవాల్సిన పుస్తకాల్లోని కతలు ఈపాటికి మీకు తెలిసియుండాలె. ఆయా పాఠకులు ఎట్లాంటోళ్ళో మీకు తెలిసిపోయుండాలె. అందుకు వదిలెయ్యటం..


ఆనందో అట్టల ప్రహసన ప్రశ్నా సమాప్త:


ఓం తత్ సత్!

Wednesday, March 4, 2015

అంతే, పక్షపాతులంతా అంతే!

పక్షపాతం.
ఒక బుద్ధా?
ఒక అలవాటా?
ఒక చపలత్వమా?
ఒక ఇదా?
ఒక అదా?
మీకేవిటన్నా తెలుసా?

పక్షపాతం ఒక వాతం.
కొందరికి ఆశలనిపాతం.
నిపాతమే, అవును నిపాతమంటే తొట్టె.
పశువుల నీళ్ళతొట్టె.
తొట్టి చుట్టూ పశువులు.
ఎన్ని మూతులు రాసుకుంటే అంత పసందు.
ఆ నీళ్లకోసమే పశువులు పాతం.
పాతమంటే పట్టమే.
పట్టమంటే కిరీటం కాదోయ్.
కిందపట్టం. కిందపడటం.
నల్లపశువు ఎర్రపశువు పక్షం.
ఎర్రపశువు తెల్లపశువుకు పాతం.
తెల్లపశువు పక్షం, పాతం.
వెరసి పక్షపాతం.
అది ప్రకృతి నేర్పిన పాఠం.

మానవులు.
మతిమతులు.
సుమతిమతులు.
అయినా పాతమే.
నిపాతమే.
పాతకమే.

అంతా పాతకులే.
నచ్చితే చాలు.
మనకు నచ్చితే చాలు.
ఆయన ఇంద్రుడు.
ఆవిడ రంభ.
ఆయన రాముడు.
ఆవిడ సీత.
ఆయన కాళిదాసు.
ఆవిడ మొల్ల.

గోడకేసిన వెల్ల.
సున్నమంతా తెల్ల.
పక్షపాతమంతా డొల్ల.
పక్షపాతులంతా నొల్ల.
చక్కగా కూర్పుకొచ్చే నొల్ల.
దుక్కును చదరించే నొల్ల.
తుక్కును చదరించే నొల్ల.
ఆ నొల్ల ఎత్తింది పొల్ల.
గింజపట్టని ధాన్యపు పొల్ల.
అంతే, పక్షపాతులంతా అంతే!

రాతలన్నీ రత్నాలే.
మాటలన్నీ ముత్యాలే.
పక్షపాతమంతా కాలవలే!
మురుగు కాలవలే!
అంతే! అంతే!
అంతే! అంతే!

-- ఒకానొక పక్షపాతం చూస్తూ కదలాడిన ఊహ!

అదంతా సరే కానీ, ప్రముఖ ప్రఖ్యాత మహా వగైరా వగైరాలన్నీ మనం ఈ రచయితలకే ఎందుకు అంకితం ఇచ్చామంటా? అదో ప్రశ్న! అదో ప్రశ్నా?

తెలిస్తే చెప్పు, లేకున్నా చెప్పు!

ఓం తత్ సత్!