Wednesday, February 25, 2015

సగం తురకం సగం ఆంధ్రంలో సాగి రంజుగా ఉన్నది!

శేషభట్టరంగాచార్యులవారు 1900ల్లో వ్రాసిన విరాటపర్వం నాటకం (యక్షగానం) లో పంచపాండవులు, ద్రౌపది బొమ్మలు ఇవి...

పైగా ఖావలీఖాన్ అనే వాడెవడో ఖానో/మంత్రో/పటేలో మధ్య, ఈయన మధ్య ఈ నాటక ఉద్దీపనం సగం తురకం సగం ఆంధ్రంలో సాగి రంజుగా ఉన్నది...

రంజు సంగతి పక్కన బెడితే - యక్షగానాల్లో గ్రామ్యం సాధారణమే అయినా - భీముడేమిటో నేను పిత్తినపుడు రా అని వాడెవడికో చెప్పటం, దుర్యోధనుడు బ్రాహ్మడై పుట్టటం ఇలా నానా రకాల గందరగోళ రాగవిరాగసరాగాలాతో ఉన్నది...

Tuesday, February 24, 2015

అవి చూసి మూర్చపొయ్యాడు!


కబంధుడు - అత్తగారిల్లు అని కత

కబంధుడు - తెలుసుగా, రామాయణ కాలం నాటి వాడు..

కబంధుడికి 500ల ఏళ్ళ యుక్తవయస్సొచ్చింది.

వీడు గంధర్వుడు పూర్వజనమలో, ప్రస్తుతజనమలోనూ.

వయసొచ్చాక గోరు వెచ్చగా ఎంత తానాలాడినా ఏవిటి సరిపోతుంది? సరిపోదుగా!

పైగా తల్లీ తండ్రి ఎవరూ పెళ్ళి గురించి పట్టిచుకోటల్లా.

ఆ కోపంతో వాళ్ళనేవీ అనలేక కసెక్కువై ఇంద్రుడితో గొడవెట్టుకున్నాడు.

వాడికి తిక్క రేగి ఒక్క దెబ్బేసి వొంటో భాగాలన్నీ కడుపులోకొచ్చేట్టు కొట్టి కూర్చున్నాడు.

ఇహ వీడు ఉన్నదీ ఊడి, అసలుదీ ఊడి, లేనిదీ ఊడి లబోదిబో.

ఈ లబోదిబోలను చూసి నఖనఖ అనే రాక్షసి జాలిపడి దాని కూతుర్నిచ్చి పెళ్ళి చేసింది.

వయసులో ఉంది, ఎవరైతేనేమిట్లేనని వాడూ ఒప్పుకుని పెళ్ళి చేసుకున్నాడు.

పెళ్ళైంతర్వాత కొద్దికాలానికి వాడొళ్ళు, కాలిపోయేవేడినుంచి గోరువెచ్చగా మారింది.

అలా పెళ్ళామూ, వీడు చక్కగా కాలం గడుపుతూండగా, ఓ రోజు తిండి దగ్గర గొడవొచ్చి, వాళ్ళావిడ నకనకలాడుతూ తల్లైన నఖనఖ దగ్గరికెళ్పోయింది.

పెళ్ళమొచ్చాక చక్కగా వొండిపెట్టటంతోనూ, వీడు వున్న అంత పొడుగు చేతులు వాట్టం మానేయ్యటంతోనూ వేట మర్చిపొయ్యాడు.

పెళ్ళం వెళ్ళిపోయాక వీడి కడుపులో గోరువెచ్చగా జఠరాగ్ని మొదలైంది.

తినే మార్గం కనపట్టల్లా. ఇలాక్కాదని, ఆపసోపలు పడుతు అత్తగారింటికి వెళ్పోయాడు.

అల్లుడొచ్చాడని నఖనఖ నఖాలన్నీ సాపు చేసుకోకండా ఇంత ఏపుగా వున్నవాటితోనే రకరకాల పిండొంటలు చేసిపెట్టింది.

సరే తినే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసిరా, ఆ గుండిగలో ఉన్నై పో అని పొయ్యి పక్కనే వున్న చప్టా మీదకు తోలింది.

వీడు వేట మర్చిపోటంతో తీరికెక్కువై, గోళ్ళు అవీ సాపు చేసుకుని వున్నాడు.

నఖనఖ చెప్పింది కదాని చెంబెత్తి పోసుకున్నాడు.

అంతే! ఒక్క చెంబుకే వొళ్ళంతా రక్తాలు కట్టింది.

ఆ నీళ్ళు అంత వేడిగా ఉన్నై మరి.

గోరువెచ్చన లేదు దాని శ్రాద్ధం లేదు, దీని సిగతరగా ఇంత వేడి నీళ్ళు పోసుకోమని అంటుందా అని ఓడుతున్న రక్తం మరకలతోనే వెళ్ళి

నఖనఖని నకనకలాడేలా చూసి పిచ్చపిచ్చగా మాట్టాడాడు.

నఖనఖకు అర్థం కాలా! ఏవిటీ వీడికేవయ్యిందోనని భూతరాక్షస వైద్యుణ్ణి పిలుద్దామనుకొని, సంగతి కనుక్కుందామని ఏవిటి అల్లుడుగారూ ఆ రక్తాలేవిటి , ఎందుకలా అరుస్తున్నారు నా మీదా అన్నది.

అంత వేణ్ణీళ్ళెట్టి గోరువెచ్చని నీళ్ళని చెబుతావా అని రెచ్చిపోతున్నాడు వీడు.

నా గోళ్ళు వెచ్చగా అయ్యేవరకే కాచాగా అన్నది ఇది.

ఏవీ నీ గోళ్ళు చూపిచ్చు అని, అవి చూసి మూర్చపొయ్యాడు కారణం అర్థమై.

అయ్యా అదీ సంగతి ....

గోరునఖం ఏ సైజులో ఉంటే అంత వెచ్చగా ఉంటై నీళ్ళూ....అందువల్ల :P

ఓం తత్ సత్!

Wednesday, February 4, 2015

దోశ - మనస్తత్వ శాస్త్రం - మీ పర్సనాలిటీ

దోశ - మనస్తత్వ శాస్త్రం - మీ పర్సనాలిటీ

మనస్తత్త్వ శాస్త్రవేత్తగా మారదామనుకొని అది కుదరక ఇంకో ప్రొఫెషనులోకొచ్చి పడ్డ నాకున్నూ, నాకిష్టమైన ఫలహారం దోశకున్నూ మనస్సు సంగతి బా తెలుసు.

అసలు సంగతిలోకెళ్ళబోయేముందు మనసు గురించి ఓ రెండు ముక్కలు మాట్టాడుకుందాం.

మనసు, బుద్ధి, చిత్తం ఇలా రకరకాల పేళ్ళు దానికి.

అన్ని పేళ్ళు ఒకటే అనుకుంటారు మానసికంగా గట్టిగా లేనివాళ్ళు.

కానీ తేడాలున్నయ్ వాటికి.

సపోసు, ఫర్ సపోసు ఒహ పనొచ్చి పడింది మీదకు.
ఆ పని చెయ్యాలా వద్దా అని ఊగులాడేది మనసు.
దాని సిగతరగ ఎలాగైనా పూర్తి చెయ్యాలనేది, అంటే నిశ్చయించేది బుద్ధి.
ఆ నిశ్చయించిందాన్ని శక్తి మొత్తం కేంద్రీకరించి చేసేది, చేయించేది చిత్తం.
అలా రకరకాలుగా అర్థాలున్నయ్ వాటికి, ఆ పేళ్ళకు.
అన్నీ ఒకటే అనుకుంటే ఇంతే సంగతులు చిత్తగించవలెను.

సరే మళ్ళీ మనసు గురించి మాట్టాడుకుందాం వుప్పుడు.
మనసుకి మూడుపాయల జాతర.
సార్! ఏడుపాయల జాతర విన్నాం కానీ మూడుపాయలేంటి సార్?
మూడు పాయలు నాయనా! మూడుపాయలు.
మనసంటే ఏవీ లేదు. మూడుపాయల సమాహారం అంతే.
అవ్వే సత్వ, రజో, తమో గుణాలు.
మనసుకి మూడుపాయల జాతర అనుకున్నాంగా.
అలాగే దోశకు కూడా మూడుపాయల జాతరే.
మినప్పప్పు, బియ్యం, ఉప్పునీళ్ళు.

మినప్పప్పు రుబ్బినప్పుడు మెత్తగా చక్కగా తెల్లగా స్వచ్ఛంగా చేతిలోకొస్తుంది సామాన్య జీవనానికి, జ్ఞాన, వైరాగ్య, మోక్షాల్లా - అందుకూ అది, సత్వ గుణానికి ప్రతీక.

ఇహ బియ్యం అధికారం, అహంభావం, దర్పంగా ఊగిపోయి గరగరలాడుతూ ఉంటుంది గనక అది రజోగుణానికి ప్రతీక. సోనామసూరీ అయితే ఫరవాలేదేమో కానీ, నూకైతే కష్టమే! అందువల్ల ఓం తత్ సత్!

ఉప్పునీళ్ళు అజ్ఞానం, అకృత్యం, అలసత్వం, మూఢత్వంతో జారిపోతూ అథఃపాతాళానికి తీసుకుపొయ్యే తమో గుణానికి ప్రతీక.

అలా మనసు, దోశ రెండిటికీ మూడుపాయల జాతరే నాయనా! జాతరే!.

ఆ మూడు గుణాలు మనసుకి, పప్పుదినుసుబియ్యపునీళ్ళు దోశకి చక్కగా పాళ్ళల్లో కలిసున్నప్పుడే రెండిటికీ రుచి.

పప్పెక్కువైనా, ఉప్పునీళ్ళెక్కువైనా, బియ్యమెక్కువైనా దోశకు ప్రమాదాం.

సరే అదలా పక్కనబెట్టేసి విధులు విధానాల గురించి మాట్టాడుకుందాం కాసేపు.

లేపోతే దోశలేడుస్తై.

మనసు రెండు విధాలు.

మంచి మనసు. చెడ్డ మనసు.

మంచి చెయ్యాలా వద్దా అని ఊగేది మంచి మనసు.

చెడు ఎలా చెయ్యాలి అని ఊగేది చెడ్డ మనసు.

సింపులు. చాలా సింపులు.

ఈ సింపులే చాలా కాంప్లెక్సు ఈక్వేషను.

అందుకని అది పక్కబెట్టి దోశ దగ్గరికొద్దాం.

ఇక్కడ దోశ అంటే మసాలా దోశ, కారం దోశ, కాకరకాయ దోశ కాకుండా సాదా దోశ అని అర్థం.
మరి ఆ సాదా దోశ మీ మనస్తత్వాన్ని చెప్పెస్తుంది.

ఎలా? మీరు దాన్ని నమిలి పారేసే తీరును బట్టి.

ఆ నమిలి పారేసేది ఎలానని ఊగించేది మనసు కాబట్టి అది దోశమనస్తత్వ శాస్త్రమైపోయింది.
దోశకు అష్టావతారాలున్నయ్.

అంటే తినడానికనోయ్. తినడానికి.

1. మొత్తం మడిచేసి ఒక్కసారిగా నోట్టో పెట్టెయ్యటం.
2. చిన్న ముక్క పెద్ద ముక్కల కింద పరపర చించేసి సైజుతో సంబంధం లేకుండా తినటం.
3. ఒక్కో ముక్క చేసి నింపాదిగా నోట్టో వేసుకొని ఆస్వాదిస్తూ తినటం.
4. ఆ ముక్కల్నే హడావుడిగా తినటం.
5. ఏదన్నా పులుసులో నంచుకొని తినటం.
6. లోపలివైపుకూడా ఎర్రగా కాల్పించుకొని లోపలివైపు నుంచి తినటం.
7. బయటివేపు మాత్రమే ఎర్రగా కాల్పించుకొని బయటివేపు నుంచి తినటం.
8. లావుగా వేసుకొని లావు ముక్కలు పీక్కొని తినటం

మీరు మొదటి అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- మీకు ఆబ ఎక్కువ. శక్తి ఎక్కువ. నిర్లక్ష్యం ఎక్కువ. నవ్వు పాళ్ళు 80 శాతం. ఎవడూ మిమ్మల్ని సలహాలు అడక్కూడదు. అడిగాడో వాడి జీవితం మింగుడుపాడిపోటమే.

మీరు రెండో అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- చిరు అదృష్టవంతులు. జీవితం మీ పట్ల చిన్న సంతోషాలు, పెద్ద బాధలు, పెద్ద సంతోషాలు, చిన్న బాధలు కింద పెడుతూ ఉంటుంది. నవ్వు పాళ్ళు 50 శాతం. భావాలు, ఉద్వేగాలు తక్కువ. ఊహాశక్తి అంతకన్నా తక్కువ. మిమ్మల్ని కూడా ఎవడూ సలహాలు అడక్కూడదు. అడిగాడో కందకంలో పడ్డాడన్నమాటే.

మీరు మూడో అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- అదృష్టవంతులు. చాలా పద్ధతిగా ఉంటుంది మీ జీవితం. మీ పద్ధతిలోకి రానివాణ్ణి మాడ్చేస్తారు. అదో దుర్గుణం. ట్రాఫిక్కు లైటు దగ్గర పచ్చలైటునుంచి ఆరెంజి లైటుకు మారుతుంటే మూడుకిలోమీటర్ల దూరాన్నుంచి బ్రేకేసుకుంటూ వచ్చి వెనకాల వాడికి దారివ్వకుండా చిరాకు పుట్టిస్తారు. మిమ్మల్ని సలహాలు ఎవరన్నా అడిగితే వాడి జీవితం గాడిలోనో, గోతిలోనో పట్టం ఖాయం.

మీరు నాలుగో అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- తలపెట్టిన పనులు పిచ్చి పిచ్చి వేగంతో చేసేస్తారు. అందువల్ల ఇంట్లో తలకాయనొప్పులు. ఆఫీసులో మటుకు ప్రొమోషనులు. మీ మూలాన ఇంట్లో వాళ్ళకు పిచ్చి డాక్టరు అవసరం పడుతుంది. జీవితమంతా ఏదో చెయ్యాలనే తపన మిమ్మల్ని కూర్చోనివ్వదు. నవ్వుపాళ్ళు 10 శాతం. బి.పి. ఎక్కువ. ఎవడన్నా మిమ్మల్ని సలహా అడగాలనుకుంటే ముందు పట్టాల మీద తలపెట్టి నెత్తి మీంచి ట్రెయిను వెళ్ళాక ఆ తర్వాత మీ దగ్గరికి వస్తే వాడికీ మంచిది. మీకూ మంచిది.

మీరు ఐదో అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- ముంచిన పులుసులానే మెత్తగా కారిపోతూ జనాలకు జీవితపు రాపిడి లేకుండా చేస్తారు. రుచిగా ఉంటం మూలాన మీ చుట్టూ జనాలు చేరతారు. పిక్కుతింటారు కానీ మీకు ఓపిక ఎక్కువగా ఉండటం మూలాన అన్నీ నవ్వుతూ సహించేస్తారు. నిండు కుండ. పోతే నిండుగా ఉండటం వల్ల అప్పుడప్పుడు మందు కొట్టటం అలవాటయ్యి, పిచ్చి ప్రేలాపనల్లో పొంగిపొర్లుతూ ఉంటారు. మిమ్మల్ని సలహాలు అడిగితే వాడి జీవితం పరిగెత్తి పాలు తాగటం నుంచి తప్పిపోయి నిలబడి సారానీళ్ళు తాగటానికి సిద్ధమైపోతుంది.

మీరు ఆరో అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- జీవితం లోపల, బయట ఏవిటుంది అన్న కుతూహలం మిమ్మల్ని వైరాగ్యాధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. డిప్రెషనెక్కువ. తలపెట్టిన పనులు కాకపోతే ఉరేసుకుంటారు. దేని మీద ఇష్టం దాని మీదే ఉంటుంది. అది మారదు. ఎవడన్నా మిమ్మల్ని సలహా అడిగితే వాడు సన్నాసుల్లోనో, సన్యాసుల్లోనో కలవటం తథ్యం.

మీరు ఏడో అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- వ్యాపారాలు అవీ కలిసొస్తాయ్ మీకు. పైపైన అంతా గోల్డుకవరింగిచ్చి లోపల డొల్లగా ఇనుము పెట్టి జనాల పైసలన్నీ దోచుకుని మాయమైపోతారు. పూచీ కానీ, జవాబుదారీతనం కానీ మీకు తక్కువ. అందువల్ల మీ పెళ్ళాం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ. అబద్ధాలు అవీ ఎక్కువ చెపుతూ ఉంటారు. అందువల్ల రాజకీయాల్లో బాగా పనికొస్తారు. నవ్వు పాళ్ళు 5 శాతం.

మీరు ఎనిమిదో అవతారం టైపైతే - మీ మనస్తత్వం ఇలాగుంటుంది అని పరమపిత ఉవాచ
-- చాలా తెలివి కలవారు. నేర మనస్తత్వం ఎక్కువ. పెద్ద పెద్ద స్కాములు మీ మూలానే జరుగుతై. దేశంలో మీ పేరు మారుమోగిపోతుంది. ఇంట్లో వాళ్ళకు తలవంపులు. నవ్వు శాతం 90. మిమ్మల్ని సలహాలెవరన్నా అడగాలనుకుంటే వాడి జీవితం ఇంకో చోట తనఖా పెట్టొచ్చి అడిగితే వాడు బాగుపడతాడు.

అయ్యా అలా దోశాష్తావతారాలు మీ మీ పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని బహిర్పరుస్తై కాబట్టి ఆనందంగా ఉండండి.

దీన్నే ఇంకో రకంగా మంచి ప్రవృత్తులు హైలైటు చేసి చెప్పవచ్చును. కానీ ఈ పోష్టు ఉద్దేశం అది కాదు కాబట్టి...

జై దోశెందు మాతా, రుచి ప్రదాతా, వ్యక్తిత్వ భాగ్య ప్రదాతా. జై జై!

ఏక్ నిరంజన్!