Wednesday, January 21, 2015

చెవిన పెట్టినవారు బతికినారు. చెవిన పెట్టనివారు.... ??

సోదరులారా!

నేను కవితను. కవిత్వమును. ఈ కాలములో నన్నెరగనివారుండబోరు. సర్వవ్యాపకత్వం కల్గుటవల్ల నేను విష్ణుస్వరూపం వదిలి కేవలం విస్తుస్వరూపము దాల్చినాను. విష్ణుమూర్తే దశావతారములు వెయ్యగా లేనిది నేను వెయ్యలేనానని పదిహేను అవతార మారుముఖములు నెత్తిన పెట్టుకొంటిని. అవసరానిని బట్టి ఆయా అవతారపు మారుముఖము దాల్చెదను. వచన ముఖము, పచన ముఖము, నానీ ముఖము, వమన ముఖము, వెర్రి ముఖము, విప్లవ ముఖము, నానో ముఖము, పాఠకాంతక ముఖము, దురదగొండాకు ముఖము, మతిభ్రమణ ముఖము నా దశావతార సహిత పదైదు మారుముఖనామములు. ఇప్పటికి దశావతార నామములు మాత్రము చాలును. మిగిలిన్ యైదు నామములలో అనంత శక్తి దాగియున్నది. అవి బయల్పడినచో నీవు లేవు. నేను లేను. అందువలన నావద్దనే యట్టిపెట్టుకొందును. అది యలాగుంచుము.

సమస్త జీవులు శ్రీ పరమేశ్వరుని భిన్నరూపమైనట్లు ఆదియైన కవితా ముఖస్వరూపమైన నేను కవిని బట్టి, వాని మస్తిష్కములోనున్న ఆచారమును బట్టి వివిధానేక విధాలుగా పరిణమించినాను, పరిణమించుచున్నాను. బౌద్ధావతార సిద్ధాంతమువలె జాతిభేదవివక్షతలను పాటింపక కర్మకాండయే, పాఠక ఖర్మకాండయే ముఖ్యమైనదని యెల్లరకును బోధించుచున్నాను, వ్రాయుచున్నాను. పృథివాయురాకాశములును, సత్వరజస్తమో గుణములును, మాయ, మాయారాహిత్యము, సమ్యోగ వియోగాలచేత భగవత్స్వరూపైనట్లు ప్రత్యక్షసుధాప్రపూర్ణమగు కలము, చుబ్బనచూరలాడిన అక్షరములు, పచ్చి పిచ్చి వాక్యములు, మరికొన్ని యితరవస్తువులును సమ్మిళితము చేసి మీమీదకు వదిలిన అది నాదివ్యస్వరూపమగును. సమయమును బట్టియు, సందర్భమును బట్టియు, బాజాభజంత్రీల బట్టియు నాయందు యితర వస్తుభూతప్రేతపిశాచములు కలియు వేళ కొత్త కొత్త ప్రభావములు కలిపించుకొని కొత్త కొత్త పుంతలు తొక్కుచుందును.

ఈతెలుగుదేశములో నేనాడెడిది ఆట, పాడినది పాటగను నాకవిత వేదాక్షరముగను చెల్లుచున్నది. పాఠకుడు నిదురపోక పూర్వము ఒకసారి వాని చెంత చేరితినేని బీభత్సభయము పెట్టి వానికి నిదుర కలలో కూడా రాకుండ చేసెదను. స్నానసంధ్యలకు పూర్వము, దంతధావనమునకు పూర్వము భోజనమునకు పూర్వము యిలా యిప్పుడప్పుడనకుండా కోడివలె కొక్కొరొకోవితకవితయని కూస్తూ తిరిగి రాత్రి నిదురపోయేవరకూ సర్వకాల సర్వావస్థలయందు నాన్ను సేవింపమని దండోరా వేయుచుందును. దైవప్రార్థనమును తోసిరాజను ప్రాతఃకాలమున శంకరా! నారాయణా అని కాక కవితా! ఓ కవితా! యని సకల జనులు లేవవలసిన కాలము రావలెనని నా అత్యాశ. నా దర్శనము చేయకపోయినచో ఆ దినమందు వేరొక పనికాదని శాపావకాసంబొసంగగల వరము నాకు ప్రాప్తియగుగాక. సకలజనాంధ్రమండలమున పాఠక ఆరాధనా నిమ్మిత్తముకాకుండగా భయభ్రాంతులను చేయుచు చాలమందిని వణికించుచున్నానను ఆనందము మాత్రము మిగిలినది.

నాకు భాషతో అసఖ్యము కుదిరినట్లు మరి దేనితోనూ జతకుదరకపోయినను కొన్నికారణముల వల్ల నన్నాంధ్రులు, తెలుగువారు, తెలంగాణమువారు తమ తమ యాసలతో అలంకరించిననూ ఊరకుండవలసి వచ్చినది. "రాకన్ మానదు హానిపాఠకులు మహారణ్యంబులో దాగినన్" అను నీతి నేనెరుగునట్లు వేరెవరెరుగరు. కొందరు అరస విరస సరస పనస నస శషభిష కవులతో కలిసి సఖ్యము నొసంగుచున్నాను. పాఠకులేలాగు సరిపుచ్చుకొనుచున్నారన్నది నాకు యనవసరము. నాకుగల దినదిన ప్రవర్ధమానత్వము ఈదేశములో మరిదేనికి లేదని నేను నొక్కి చెప్పగలను. ప్రతిదినమును నేను నూటికి మున్నూరు జిహ్వలలోనుందును. వార వీర నార కాంత గృహోన్ముఖుల చేతులందు తాండవమాడుచుందును. నేనాంధ్రతెలంగాణపు జిల్లాలలో మొత్తముమీద సంపూర్ణశక్తిని చూపజాలనని యనుకున్నవారందరినీ నాశనమొనరించినాను. నన్ను సేవింపనిచో ఇతరుల బ్రతుకుకూడా నంతియేనని హెచ్చరికలు చేసితిని. చెవిన పెట్టినవారు కవితాకు తిని బతికినారు. చెవిన పెట్టనివారు బలుసాకు తిని ఊర్ద్వ్హ ముఖముగా పైకి పోయినారు.

బహిర్భూమికి, బాతురూముకి తేడా తెలియని పాఠకపుంగవులు వదలకుండ ఆ సమయములో కూడా నన్ను తలచుకొని వెక్కుతూ పూజించవలెనని ఆ మాతనుండి వరమొక్కటి పొందవలె. అదియొక పని మిగిలియున్నది. శుభకార్యములందు నన్ను, నాపుత్రీపుత్రికలను జదువుట సంగతి యేమో కానీ అశుభకార్యములందునూ, తద్దినపు దినములందును, పండుగదినములందును తేడా లేకుండగా చదివెడు పురుషోత్తములను కనవలసిన అవసరము ఈజాతికి యున్నది. నాధాటికాగగలేక తలత్రిప్పట, మతిప్రోవుట, కండ్లుతేలవ్రేత జరుగగా అవుషధప్రాయమని తలచుచు ప్రాణభిక్షకొరకు ప్రార్ధించవలె. వారందరూ నాకు లొంగిన పిమ్మటనే వారికి మోక్షము. నాకటాక్షమునకు పాత్రుడైన నరుడు, పాఠకుడు రోజునకధమము మున్నూరుముమ్మారుసారులు నను సేవింతురు. మద్దెల వాయింతురు. మేళాలతో మరి తాళాలతో ఒకరి మీద ఒకరు శునకముద్రలు జవ్వాజి వలె జల్లుచూ ఊరేగుదురు. నాబరువు కుయ్యోమొర్రోమంచున్ననూ విధిలేక కర్మవశాత్తూ వారు మోసెదరు. వారిజీవితకాలములో నాసఖ్యము మానకుండుటవల్లను ప్రతిరోజు ప్రతిక్షణము తమతమ స్నేహితులను చిత్రవధ చేయుచు నలిమెల పిశాచము వలె కళ్ళురుముచూ క్రొత్తబాధితుల కొరకు ఆవురావురుమంచు వెదకుదురు.

నాబరువు సామాన్యమైనది కాదు. యిక్కడ మీకొక విశేష కథ చెప్పవలెను. మహాభారత కాలము నాటిది.

అలనాడు భీముడు నా రూపాకారములలో యొక రూపమైన ఒకానొక వచనకవితనొకటి చదివి యిటుల బ్రతుకుట కంటె దుర్యోధనుని పాదాల మీద పడి చచ్చుట నయమని అటులనే పడిపోయి పెద్దన్నా నీ గదతో నా తొడలు విరగకొట్టుమని ప్రార్థించెను. అంత దుర్యోధనుడు కూడా వెక్కుచూ నాయనా తమ్మూ నేనునూ నీవు చదివినదే చదివితిని, నేను వెళ్ళి ఎవరి వద్ద మొరపెట్టుకొనవలెను. పెద్దవాడినైనఅందువలన నాకు దిక్కుతోచుటలేదని చెప్పుటకు ఆత్మాభిమానము అడ్డువచ్చుచున్నది. అయిననూ సరే మనమిద్దరమూ ఇప్పుడే పోయి ఆ శిఖండిచే తలలు బద్దలు కొట్టించుకొందము రమ్మనుచు వాలిపోయిన భీమసేనుని భుజముమీద వేసుకొని అతికష్టము మీద జలస్తంభన చేసెను. అది చూచి కృష్ణపరమాత్మ చిరునవ్వు నవ్వి నన్ను ఆ చివర ఈ చివర పట్టుగొని పరపర చించి జరాసంధుని శరీరభాగముల వలె అటునిటు విసరినాడు. అంత నామాయ వారిద్దరి మీద తొలగిపోయి కురుక్షేత్ర యుద్ధము కొనసాగినది.

కృష్ణపరమాత్మకు చెపుదామనుకొంటిని. అయ్యా మీరు అంతమందిని అన్ని ఆయుధాలతో చంపవలసిన యవసరము లేదు, నన్నొకసారి ఆ పదునెనిమిది అక్షౌహిణుల మధ్య నిలబెట్టి యొక్కసారి చదివిన చాలునని చెపుదామనుకున్నంతలో నన్ను గింగిరాలు తిరిగేట్టు చిటికెనవేలి గోరుతో గోవర్ధనపు గీరు గీకు గీకినాడు. చచ్చినాను. ప్రాణములు కడబట్టినవి. అచ్చటినుండి ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయి వస్తిని. ఆ కసిని పిశాచ రూపములో మీయందు తీర్చుకొనుచున్నాను. మీరు ఈ కలికాలములో నానుండి తప్పించుకొనలేరు. అది బ్రహ్మలిఖితమైనట్టిది. లిఖింపకున్ననూ మీ కర్మ యంతియే అని సమాధానపడుడు. లేనిచో మీ సంగతీ చేసెదను.

ఓం తత్ సత్!

-- 2009 లో అప్పుడెప్పుడూ జంఘాల శాస్త్రిగారి కవుల చెండాట వ్యాసము వ్రాసిన తరువాతి నెలలో వ్రాసిన యొక చిన్ని పొత్తపు వ్యాసము. ఇప్పుడు మీ కొరకు యూనీకోడు రూపము దాల్పించితిని.
-- ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్!

No comments:

Post a Comment