Wednesday, January 14, 2015

అంత బూతు మాట్టాడాక ఇహ ఆగేది లేదు.

ఒక్క నిముషం ఆగండి.

అంత బూతు మాట్టాడాక ఇహ ఆగేది లేదు.

ఏవిటన్నాను నాయనా, ఆగమన్నాను. అందులో బూతేముందో నాకర్థం కాలా!

అంతే అంతే, అన్నమాటలన్నీ అనేసి తప్పుకోవటమే!

ఒరే బాబూ నీకు దణ్ణమెడతా, అసలు సంగతేవిటో చెప్పకుండా ఈ చిత్రహింస ఏవిటండీ?

ఆగు.. ఆగిపో అన్నావ్... బానే ఉంది.. దాని ముందు ఏవిటన్నావ్?

ఒహ నిముషం అన్నా! అంతే.

అదే, అదే, అదే బూతు.

అది బూతేవిటండి?

ఆ మాటని నువ్వు సీతమ్మవారిని, వారి ముత్తాతకు ముత్తాతకు ముత్తాతను అవమానించావ్

వార్నీ! ఎలా బాబూ?. కాస్త చెపితేనో భూతద్దంలో చూపిస్తేనో ఆ అవమాన బూతు భూతమేవిటో తెలుసుకుంటాం!

సీతమ్మవారి తాతల తాత ఒహాయన ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, గొప్ప తపస్వి, గొప్ప తాత్వికుడు, అంతకుమించి గొఫ్ఫ రాజుగారు. ఆయన దగ్గర వశిష్టుడు గురుగారిగా ఉండేవాడు.

బావుంది.. ఇక్కడిదాక బావుంది.. మరి బూతేది?

వస్తా...కత చెప్పొద్దూ ముందు. నీ బూతు దగ్గరికి తర్వాతొస్తా!

ఈ తాతగారు ఒహరోజు వశిష్టుణ్ని పిల్చి మనమో యజ్ఞం చేద్దాం సార్, దాంతో జనాలకు, లోకానికి కళ్యాణం జరుగుతుందని హోం మినిస్టర్ వాళ్ల మావగారు, అంటే మా నాయన గారు అన్నారు. అందువల్ల మీరా పనిలో ఉండండి అన్నాడు.

అపుడు వశిష్టుడన్నాడు ఓ బాసు గారు, మీరాగాలి, నా చేతులు ఖాళీ లేవు. కిందటి వారం గావాలు ఇంద్రుడొచ్చి నాకో యజ్ఞం చేసిపెట్టంటే ఒప్పుకున్నా. అక్కడికెళ్లొస్తా, కావాలంటే నా వెకేషను శలవలు సరిపోవంటే, వాటికి అదనంగా సిక్కు లీవులు వాడుకుంటానంజెప్పి కమండలమేస్కొని వెళ్పోయాడు.  

వెళ్పోయినవాడు ఇంద్రుడు చేసిన మర్యాదలకు పొంగిపోయి ఒహ రెణ్నెల్లు అన్నీ మర్చిపోయి ఈ భూలోకానికి రాలా. అపుడు సీత తాతగారికి కోపం వచ్చింది. వశిష్టుడు లేడు ఇంకెవరూ లేరని ఆయన ఇంకొహ ఋషిని పిల్చి పనికానిచ్చాడు. అయితే ఆ పని క్లైమాక్సులో ఉండగా పెద్దాయన గడ్డం నిమురుకుంటూ ఇంద్రుడి దగ్గరినుంచొచ్చేసాడు. రావటం, ఇది చూట్టం, అగ్గైపోటం, తాతగారిని శపించటం జరిగిపొయ్యింది.

ఏవనీ ?

నువ్వు పోతావని , ఈ క్షణమే శరీరాన్ని విడిచేస్తావని.

అది విని తాతగారికి కూడా కోపమొచ్చేసింది. ఆయనేం తక్కువ్వాడా ? ఆయనన్నాడూ, నాకిచ్చిందే నీకూ జరుగుతుందని. అంతే ఇద్దరూ కలిసి శరీరాలొదిలేసి బయటకొచ్చి నుంచున్నారు. ఏవిటి చెయ్యాలో ఎవరికీ పాలుపోవట్లా.

కుండం దగ్గర కూర్చున్నవాళ్ళకేవో రెండు శరీరాలు కట్టెపేళ్ళుగా మారిపోయి కనపడుతున్నయ్. యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. అప్పుడు యజ్ఞం చేయిస్తున్న ఋషన్నాడూ, రాజుగారిని, అదే ఆయన శరీరాన్ని ఆయిలు ఔషధాలు కలిపేసి అందులో ఉంచెయ్యండి పాడైపోకుండా! అప్పుడు రాజుగారెప్పుడన్నా తిరిగొస్తే ఆయిల్లోంచి లేచొచ్చెయ్యొచ్చు. ఇంతలో ఆ ఆయిలౌషధాల బాడీతో మనం యజ్ఞం పూర్తిచేసేద్దాం. అది శాస్త్ర సమ్మతమేనని ఆ యజ్ఞాన్ని పూర్తిచేయించేసాడు.

అది పూర్తైపోటంతో, యజ్ఞ ఫలంలో భాగంకోసం ఇంద్రుడు మిగిలిన దేవతలు అందరూ దిగొచ్చేసారు. దిగొచ్చాకా ఈ ఋషి చేసిన ఆయిలౌషధాల పన్జూసి అర్రెర్రే మాక్కూడా ఈ ఆలోచన రాలేదే అనుకోటం విని, మీకా అవసరం ఏవిటీ, ఎందుకొస్తుందీ చక్కగా అమృతం తాగున్నారు అని ఆయనో నవ్వు నవ్వి బాబూ మీ ఫలం మీరు తీసుకుపోండి, మా రాజుగారిని మేం చూస్కుంటాం అన్నాడు.

అది విని ఇంద్రుడికి అభిమానం ఆవేశరూపం దాల్చింది. ఛస్, ఇంత మంచి పని చేసి వరం వొద్దంటావా చుస్కో ఏం జేస్తానోనని ఆ తాతగారిని బతికించెయ్యటానికి రెడీ అయిపోటంతో, ఇవన్నీ ఆ శరీరాల బయట నిలబడి చూస్తున్న తాతగారు చూస్తూ నాయనా ఇంద్రా నాకు ఇహ జీవితమ్మీద ఆశ లేదు, నువ్వు ఆ జీవితం నాకిస్తే నీ వజ్రాయుధంతో నిన్నే పొడుస్తానన్నాడు. ఇంద్రుడికి మతిపోయింది. ఆయనేమో అంత పనీ చెయ్యగల సమర్థుడు. ఇదంతా ఎందుకొచ్చిన గోల, తాతా నీకేమో శరీరం వద్దు, అక్కడేమో ఆ ఋషేమో అంత మంచి పనిచేసి యజ్ఞం పూర్తిచేసాడు, మీ వాళ్ళేమో బొటబొటా ఏడుస్తున్నారు - లాభం లేదు కానీ, నువ్వు అలా కనురెప్ప పడేలోపల అలా వాళ్ళకు కనపడి, కనురెప్ప పడగానే నీ శరీరం నుంచి నువ్వు కోరుకున్నట్టుగా విముక్తి కలిగించే వరం ఇస్తా...దాంతో నీ పనీ, వాళ్ళ పనీ రెండూ గండభేరుండాల్లా అయిపోతై అని ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు.

దాంతో అప్పట్నుంచి ఆయన కనురెప్పపాటులో శరీరంలోపల, కనురెప్పపాటులో శరీరం బయట ఉంటున్నాడు.

అలాంటివాడిని పట్టుకొని నువ్వు పేరు మార్చేసి బూతులు మాట్టాడతావా? ఎంత అవమానం. ఎంత అవమానం. సీతమ్మగారి తాతకు అవమానం. సీతమ్మగారికి అవమానం.

నేను పేరు మార్చటం ఏవిటీ?

నువ్విందాక ఏవన్నావ్ ?

నిముషం అన్నా.

కాదు అది నిమిషం. ఆ తాతగారి పేరు "నిమి" ఆయన పేరు మీదా, ఆయన ఆ రెప్పపాటులో చేస్తున్న పనివల్లా, ఆ కార్యానికి "నిమిషం" అన్న పేరొచ్చింది. అంటే మనం వేసే ప్రతి కనురెప్పపాటులాంటి నిమిషంలో ఆయనున్నాడు. అలా సీతమ్మతల్లి వంశంవాళ్ళను గ్యాపకం చేసుకుంటూ ఉండు ప్రతి కనురెప్పపాటుకు, నీ జీవితం బాగుంటుంది. వచ్చే జీవితమూ బాగుంటుంది.

ఓ అర్థమయ్యింది సార్! అలా నిమిషాన్ని నిముషం అని పేరు మార్చి బూతు మాట్టాడినందుకు బోల్డు క్షమాపణలు. ఎంతైనా మన పెద్దవాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళయ్యా!

అంతే అంతే, మనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి కానీ బోల్డున్నయ్ భగవద్గీతలో!

ఓ! ఇది భగవద్గీతలో కథా?

అవును అందులో ఓ కథ! నిజమైన కథ! నిత్యజీవిత కథ!

--- 2011లో భగవద్గీత చదువుతున్నప్పుడు రాసుకున్న సంగతి....
--- మరీ, వశిష్టుడేమైపోయాడన్న అనుమానం వచ్చిందా ? You are awesome! ఆ కత తర్వాత మళ్ళెప్పుడైనా!
--- అయ్యా అదీ సంగతి, కాబట్టి - ఓం తత్ సత్!

1 comment:

  1. భగవద్గీతలో కధలెక్కడ ఉన్నాయండీ బాబు? కొంచెం ఏ అధ్యాయం, ఏ శ్లోకాలో చెబుతారా?

    ReplyDelete