Tuesday, December 2, 2014

సమాధానం తెలిశి చెప్పకపొయ్యారో!!

ప్రశ్న, ఛాలెంజి - మీకేనండి...
మిమ్మల్నే అడుగుతా!
చెప్పండి...
ఏం?

ఖాండవ దహనం ముందు అగ్ని వచ్చాడు .

ఎక్కడికి ? కృష్ణార్జునుల దగ్గరికి.

ఎందుకు ?

తిన్నదరక్క.

అదేవిటీ ?

దూర్వాసుడు ఋత్విజుడిగా సత్త్రయాగం చేసిన శ్వేతకి పోసిన నెయ్యి వల్ల అజీర్ణమెత్తిపొయ్యింది మన వాడికి.

దగ్గర్లో ఏవిటుందా అని వెతికాడు.

ఖాండవ వనమొక్కటే కనపడ్డది పచ్చగా నవనవలాడుతూ.

అజీర్ణం పోగొట్టే మూలికలు ఔషధాలూ ఉండటంతో ఇంకా ఎక్కువ్వయ్యింది మనవాడికి.

బాబూ, అయ్యా సాయం చెయ్యండి తిన్నదరగటానికి అన్నాడు.

అర్జును ఆ గోలకు తట్టుకోలేక, పోరా నాయనా పో! నేను ఈయనా చూసుకుంటాంలే అన్నాడు.

ఇంకేవుందీ? సంబరపడ్డాడు.

దోస్తు వరుణ్ ని పిలిచాడు.

అదేనండీ - వానలూ అవీ కురిపిస్తూ ఉంటాడే ఆ వరుణ్.

వరుణ్, నీ దగ్గర ఉన్నవి ఇచ్చెయ్ వీళ్ళకు అన్నాడు.

వరుణుడికి బోల్డు మొహమాటం.

ఇదెక్కడి గొడవ నా దగ్గరున్నవన్నీ ఇచ్చెయ్ అంటావ్ అని అందామనుకున్నాడు అగ్నితో.

ఇంతలో అగ్ని దొస్తు సెంటిమెంటు ఫిటింగు పెట్టాడు.

గొణిగాడు. నా దగ్గర బోల్డున్నాయిరా, ఏవిటివ్వాలి అందులో అని.

అప్పుడు అగ్ని - "ప్రతిపక్షసంక్షయకరంబు లయిన యక్షయబాణంబులు గల తూణీరంబులును వివిధాయుధభరితంబై సింహలాంగూలకపిధ్వజ విరాజమానంబై మహాంబుధరద్వానబంధురంబై మనోవాయువేగసితవాహవాహ్యమానంబై రణితరమణీయమణికింకిణీకలాపాలంకృతంబై సకలదిగ్విజయాధిష్ఠానంబై యొప్పుచున్న దివ్యరథంబు" అంటూ ఇంతబారున చదవటం మొదలుపెట్టాడు.

వరుణుడన్నాడు - కాస్త తెలుగులో చెప్పు నాయనా అని కన్నీరు మొదలెట్టగా - స్థూలంగా ఇదీనేనన్నదీ అని చెప్పాడు - "సోముడు నీకిచ్చిన గాండీవం, దానికి బ్రదర్ అయిన అక్ష్యతూణీరం, ఇవి కాక ఇంకా నీ దగ్గరున్న గాంధర్వ గుర్రాలమర్చిన రథం ఇవన్నీ ఆ అర్జునుడికిచ్చెయ్"

ఒరోరి అగ్ని, అవి సోముడు బోల్డు కష్టపడి బ్రహ్మ దగ్గరినుంచి ఎత్తుకొచ్చాడు వరం రూపంలో. అవి నేనెత్తుకొచ్చాను ఇంకో రూపంలో. అవి ఇవ్వమంటావేవిట్రానని.

అదంతే నువ్వివాల్సిందే, లేపోతే నా కడుపు బద్దలైపోతుంది. పగిలిపోయిన ఆ పొట్ట చూసి నువ్వేడుస్తావ్ అని సెంటిమెంటేసాడు వరుణుడి మీదకి.

సర్లే నాయనా, నీ కడుపు నా ఆయుధాలకొచ్చింది అని అవి రెండూ అర్జునుడికిచ్చేసాడు.

సరే నే పోతున్నా ఇంక అన్నాడు.

ఆగు, ఎక్కడికి పోతా. ఇక్కడా ఇంకో ఆయన ఉన్నాడు. ఆయనకి కూడా ఇవ్వొద్దూ ? అన్నడు అగ్ని

అనుకున్నా. ఇలా చేస్తావని అనుకున్నా. నా దగ్గరున్నవన్నీ ఊడ్చాలని ప్లానులో ఉన్నావని చిటికెనివేలి మబ్బులోంచి కన్నీళ్ళు కార్చాడు.

ఏడుపు తర్వాత కానీ, ఆ ముక్కు తుడుచుకొని నీ దగ్గరున్న చక్రం, గద ఇచ్చెయ్ ఆ పక్కనున్నాయనకు అన్నాడు.
ఇప్పుడు వేళ్ళల్లో ఉన్న అన్ని మబ్బులూ ధారగా కరుస్తూ సుదర్శనాన్ని, కౌమోదకిని కిష్టప్పకిచ్చేసి నా దగ్గరింకేవీ లేవంటూ బలుసాకును పెంచుకుంటా నీళ్ళతోనని పారిపోయాడాయన.

అవ్వన్నీ వచ్చాక ఇంకేవిటుందీ ?

అగ్ని ఖాండవాన్ని దహించెయ్యటం.

వీళ్ళిద్దరూ ఇంద్రుడితో పోట్టాట్టం....గట్రా గట్రా

ఇప్పుడు ప్రశ్నల్లోకి - సమాధానం తెలిశి చెప్పకపొయ్యారో, మీ పొట్టలో సత్రయాగం నెయ్యి నిండిపోనూ అని వరం ఒసంగబడుతుంది.

1) చక్రం వచ్చేసింది కాబట్టి, శంఖం రావాలి. అదెప్పుడు వచ్చింది కిష్టప్ప దగ్గరికి ? ఒకదాన్ని ముందు పంపించి రెండో దాన్ని ఎనకమాల ఎందుకు తెచ్చుకున్నాడాయన?
2) బ్రహ్మ గాండీవాన్ని నిర్మించి మొట్టమొదటిగా ఎవరికిచ్చాడు.
3) అది సోముడి దగ్గరకెట్లా చేరింది ?
4) సోముడి దగ్గరి నుంచి వరుణబ్బాయ్ దగ్గరికెట్లా వచ్చింది ?
5) తక్షకుడు తప్పించుకుని తర్వాతేంజేశాడు?
6) ఇంద్రుడు గోవర్ధనం దగ్గర కిష్టప్పతో ఓడిపొయ్యి, ఆయన్ని ఓడించటం వల్లకాదనీ తెలిసీ మళ్ళా ఇక్కడున్నది ఆయనేనని తెలిసీ వచ్చి ఎందుకు పోట్టాడి తన్నులు తిన్నాడు ?
7) పైగా కొడుకుతో యుద్ధమేవిటి ?
8) వీళ్ళందరిలో ఎవరు గొప్ప మీ పెకారం?
9) అగ్ని గొప్పా, సోముడు గొప్పా, బెమ్మ గొప్పా, వరుణుడు గొప్పా, అర్జునుడు గొప్పా, గాండీవం గొప్పా. ?
10) ఇవన్నీ కాక కిష్టప్ప గొప్పా?

1 comment:

 1. మీ కథనశైలి చాలా బాగుంది. దుశ్శల కథ తర్వాతి భాగాలకోసం ఎదురు చూస్తున్నా.

  1) కృష్ణుడికి శంఖం చిన్నప్పుడే వచ్చింది. సాందీపనికి గురుదక్షిణ చెల్లించడానికి సముద్రంలోకి (పాతాళానికి) వెళ్ళి పంచజనుడనే రాక్షసుణ్ణి చంపి శంఖాన్ని పొందాడని చదివిన గుర్తు. చక్రం తర్వాత ఎందుకొచ్చిందంటే మరి ఏం చెప్తాం??
  2)3)4) తెలీదు.
  5) తక్షకుడు ఏం చేశాడొ తెలీదు కానీ, ఇంద్రుడి దయవల్ల తప్పించుకున్నాడు. ఆ తర్వాత పరీక్షిత్తుని కాటేసి చంపాడు. ఆనక‌ జనమేజయుడి సర్పయాగం సందర్భంలో మళ్ళీ మూడింది వాడికి. అప్పుడు కూడా ఆస్తీకుడి దయవల్ల బయటపడ్డాడు. నాకందుకే చిన్నప్పుడు వాడంటే కోపం. ఇంకో బతికి చచ్చిన నాగుడు, 'అశ్వసేనుడు', అర్జునుడి మీద పగబట్టి, కర్ణుణ్ణి ఆశ్రయించి, కురుక్షేత్రంలో అర్జునుణ్ణి చంపలేక విఫలమౌతాడు (కిష్టప్ప దయవల్లే). మీకివన్నీ తెలిసినవే అనుకుంటా.
  6) ఇంద్రుడు చాలాసార్లే అహంకరించి దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. ఎందుకో తెలీదు.
  7) కొడుకుతో యుద్ధంలో ఓడిపొయ్యాక, తూచ్, ఇదంతా సర్దాకోసం, నీ శక్తిని పరిక్షించడానికి, అని వరాలిచ్చాడేమో ఈ సందర్భంలో...??
  8)9)10) కిష్టప్పే గొప్ప.

  ReplyDelete