Friday, December 19, 2014

చచ్చు పుచ్చు పీఠికలు, కొండముచ్చు ముందుమాటలు!

అన్నెం పున్నెం ఎరుగని ఒక రచయిత వద్దకు చప్పట్ల, పొగడ్తల, వెన్ను చరుపుల, భుజం తట్టుల యాచన నిమిత్తము ఒక స్వీయ బిరుదాంకిత గొప్ప పీఠికాసురుడు, ఆయనకు తోడుగా ఒక ముందుమాటాసురుడు వచ్చెను. ఆ శబ్దములు వారికివారు పెట్టుకొన్నవే కాని ముందుమాటలు, పీఠికలు వచ్చిగాదు.

ఆ రచయిత వద్దకు అంతకుముందే ఒక పాఠకసార్వభౌముడు వచ్చి యున్నాడని తెలియని ఆ ఇద్దరూ "ఒరే రచయితా మేము వమనపీఠికాశాస్త్రములో పండితులము. ముందుమాటలో హాలాహల చక్రవర్తులము. మేము రాసినది నీ పుస్తకములో వేసుకొనితివంటే, నీకు, నీ పుస్తకము చదివినవారికి ఈ ప్రపంచంలో దిక్కులు తెలీకుండా పోతాయన్న సంగతి కూడా తెలియకుండా చేసెదము. ఆలోచించే అవసరం తగ్గిపోవును, ఆ తర్వాత నిన్ను, ఆ చదివినవాడిని బాగుచేసేందుకు ఆ బ్రహ్మ తరం కూడా కాదు" అని డోక్గ్రల్భాలు పలికినారు.

ఆ అమాయక రచయిత, అయ్యా నాకంత శక్తి లేదు. మీరు ఏదన్నా మాటలాడాలనుకుంటే ఈ పాఠకాగ్రేసరునితో మాట్లాడుడి, వీరు అన్నిమాటలు చదువుటలో తలపండినవారేనని అందరూ చెప్పుచుంటిరి అని ఒకరినొకరికి పరిచయము చేసినాడు.

ఇది యేమొ వింతగా ఉన్నదనుకొని సకల పాఠక ప్రపంచము, రచయితలు , దేవ దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి చుట్టూ మూగినారు.

అంత పాఠకులవారు వీరిద్దరూ నిజముగా పండితులనుకొని, అయ్యా మీరు పీఠికలు, ముందుమాటలు రాస్తారని తెలిసినది. ఇప్పుడు వాని గురించి వాదింతము. మీరు పీఠికపూర్వపక్షము చేయుదురా? ముందుమాటసిద్ధాంతము చేయుదురా? అని అడిగెను.

ముందుమాటాసురునికి వాదము అనిన మాట వినపడినంతనే మూర్ఛ వచ్చెను. నేలకు గోడమీద బల్లివలె కరుచుకొనిపోయినాడు. పీఠికాసురుడు బీరముగా వాని జన్మలో ఈ పూర్వపక్షము, సిద్ధాంతము వంటి మాటలెన్నడు విని ఉండకపోవుట చేతను, ఈ మాటలు నోరుతిరగకపోవుట చేతనూ - మీరు అది ెయ్యండి, నేను ఇది చేస్తానూ అనినాడు. అది విని చకితుడైన పాఠకులవారు వాదము ఆరంభింపదలచి - 'అథాతో పీఠికాజిజ్ఞాసా' అని పఠనసూత్రములోని మొదటి సూత్రము చదివి దానిని పూర్వపక్షము చేసి - "ముందుమాట సిద్ధాంతము చేయుమ" ని వీడిని అడిగెను.

పీఠికాసురునకు కళ్ళు ఒకసారి తిరిగినను సంభాళించుకొని, గొంతెత్తి "అథాతో వాంతి జిజ్ఞాసా, మాట జిజ్ఞాసా, రాత జిజ్ఞాసా, మామాట జిజ్ఞాసా, సమాధి జిజ్ఞాసా, శవం జిజ్ఞాసా, ఏరు జిజ్ఞాసా, పారు జిజ్ఞాసా, చిందు జిజ్ఞాసా, పంచె జిజ్ఞాసా, గోడమీద బల్లి జిజ్ఞాసా, బుర్రబద్దలు జిజ్ఞాసా, ఊళ్ళో చెరువు జిజ్ఞాసా, చేతిలో చెంబు జిజ్ఞాసా" అని గుక్క తిరగకుండా వాడు సూత్రములు అనుకొన్న రెండు వందల యాభై ఆరు సూత్రములు అరుపులు, గావుకేకలు వేస్తూ చదివినాడు.

వాడి మాటలకు పాఠకుడు, చెట్టు, చేమ, గడ్డి, గాదం, ఆవు, దూడ, పిల్లి, కుక్క రోదనానందభరితులై రిచ్చపడితిరి. ఆ పిదప అతడు అట్లనుటకు, అరుచుటకు కారణము ఎరుగ కోరి, పాఠకుడు - "ఎందులకు అరుచుచున్నారు, మీరన్న దానికి అర్థమేమి" అని అడుగుటకు నిశ్చయించుకుని "ఎందులకు" అని అనెను.

ఆ మాట ఇంకా పూర్తి కాకమునుపే, సగములో పావు వినీ వినగానే వాడు తారాజువ్వవలె లేచి " ఎందులకు, ఎందులకు పందులకు, పందులకు సందులకు, సందులకు చిందులకు, చిందులకు ముందుమాటలకు, ముందుమాటలకు పీఠికలకు " అని ఏమేమో అనుచు మరింత బిగ్గరగా అరిచెను.

అంతే, దానితో అందరూ, దేవతలతో త్రిమూర్తులతో సహా ఒక్క పెట్టున మూర్ఛపోయితిరి.

కొసమెరుపు - ఆ అరుపులకు బడబాగ్ని జనించి దానితో ప్రపంచము, పాఠక ప్రపంచము, ఆ ప్రపంచమునకావల ఉన్న లోకములు అన్ని తగులపడిపోయినవి. పీఠికాసురుడు, ముందుమాటాసురుడు మటుకు మిగిలినారు బూడిద మీద పీఠికలు, ముందుమాటలు రాసుకుంటూ.

-- అయ్యా, ఈ మధ్య ప్రింటయిన కొన్ని పుస్తకములు చదివి, అందులోని చచ్చు పుచ్చు పీఠికలు, కొండముచ్చు ముందుమాటలు చదివి, ఒకానొకప్పుడు వచనకవాసురుల మీద రాసుకున్న దాన్ని కొద్దిగా మార్చి ఇక్కడ వేస్తిని.
-- ఏమా పుస్తకములు, ఏమా సంగతి అని అడగవద్దు.
-- మీరు అడగావద్దు, నేను చెప్పావద్దు.
-- జై ఏక్ నిరంజన్

1 comment:

  1. Hahhahahha, Nijam gaa Peethikalu, Mundu maatalu chadavaalanundandi, intha kashtapadi meeru vraasinadi chadivaaka.

    ReplyDelete